-ఇది ఆరంభమే -షాబాద్‌లో అతి పెద్ద పారిశ్రామిక పార్కు -స్థానికులు సహకరిస్తే మరిన్ని పరిశ్రమలు -రంగారెడ్డి జిల్లాకు మరో 50 కంపెనీలు రాక -పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ -చందన్వెల్లిలో వెల్స్పన్ కంపెనీ ప్రారంభం -1100 కోట్లతో ఫ్లోరింగ్ పరిశ్రమ ఏర్పాటు కేటీఆర్ వల్లే తెలంగాణకు: వెల్స్పన్ చైర్మన్ బీకే గోయెంక

రంగారెడ్డి జిల్లా చందన్‌వెల్లికి అనతికాలంలోనే అనేక పరిశ్రమలు రానున్నాయని, తద్వారా ఈ ప్రాంత రూపురేఖలు మారిపోతాయని రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. శనివారం చందన్వెల్లి పారిశ్రామికవాడలో ప్రపంచప్రసిద్ధి చెందిన వెల్స్పన్ ఫ్లోరింగ్ పరిశ్రమ టైల్స్ విభాగాన్ని మంత్రి కేటీఆర్.. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి ప్రారంభించారు. టెక్స్టైల్స్ ఉత్పత్తుల విభాగానికి భూమిపూజచేశారు. పరిశ్రమల స్థూపం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి వెల్స్పన్ లోగోను ఆవిష్కరించారు.
వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య పూర్ణకుంభంతో మంత్రుల బృందానికి నిర్వాహకులు స్వాగతం పలికారు. అనంతరం హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. చందన్వెల్లి పారిశ్రామిక పార్కులో రూ.1100 కోట్లతో వెల్స్పన్ ఫ్లోరింగ్ పరిశ్రమ ఏర్పాటైంది. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా పేరెన్నిక కలిగిన కంపెనీ తెలంగాణకు రావటం, గుజరాత్ తర్వాత తెలంగాణలోనే పెట్టుబడులు పెట్టడం సంతోషంగా ఉన్నదని పేర్కొన్నారు. వింబుల్డన్‌లో వాడే టవళ్లు ఇక్కడ ఉత్పత్తి అవుతాయని, ఈ పరిశ్రమలో తయారైన టవల్ చందన్వెల్లి టు సిలికాన్ వ్యాలీలో కూడా కనిపిస్తుందని చెప్పారు.

ఏడాది లోగానే వెల్స్పన్ గ్రూపు దాదాపు రూ.2 వేల కోట్లు పెట్టుబడులు పెట్టనున్నదని పేర్కొన్నారు. ‘ఈరోజు ప్రారంభించిన కంపెనీ ఇక్కడి ప్రగతికి ఆరంభం మాత్రమే. ఇంకా అనేక కంపెనీలు చందన్‌వెల్లికి రాబోతున్నాయి. ఇన్ని కంపెనీలలో స్థానిక యువతకు ఉపాధి వచ్చేలా కృషిచేస్తాం. ఇందుకోసం స్కిల్‌డెవలప్‌మెంట్ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటుచేస్తాం. ఈ ప్రాంతంలో మరో 3600 ఎకరాల పారిశ్రామిక పార్కును ఏర్పాటుచేసేందుకు అవకాశమున్నది. దీంతో ఈ ప్రాంతం రూపురేఖలు మారిపోతాయి’ అని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. చందన్వెల్లి పారిశ్రామికపార్క్కు అవసరమైన మౌలిక వసతులు, మరిన్ని రోడ్డు రవాణా సౌకర్యాలను కల్పించేందుకు, రోడ్డు విస్తరణ పనులు చేపట్టడానికి ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందన్నారు.
రైతులకు ధన్యవాదాలు చందన్వెల్లిలో పరిశ్రమల ఏర్పాటుకు స్థల సేకరణలో సహకరించిన రైతులు, నేతలకు మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. కొందరు రైతుల త్యాగం ఎంతోమందికి ప్రత్యక్షంగా, మరికొంతమందికి పరోక్షంగా ప్రయోజనం చేకూరుస్తుందని పేర్కొన్నారు. చందన్వెల్లి పారిశ్రామికవాడలో ప్రస్తుతం నాలుగు కంపెనీలు నిర్మాణంలో ఉన్నాయని, మరో నాలుగు పరిశ్రమలు ఇక్కడ కంపెనీలు ప్రారంభించడానికి ఇక్కడ స్థలాన్ని కోరుతున్నాయని తెలిపారు. భవిష్యత్తులో 40 నుంచి 50 కంపెనీలు ఇక్కడికి వచ్చే అవకాశం ఉన్నదని తెలిపారు.
ఇక్కడి ప్రాంత ప్రజలు సహకరిస్తే మరో 3600 ఎకరాల్లో దేశంలోనే అతిపెద్ద పారిశ్రామికవాడగా ఈ ప్రాంతం అవతరిస్తుందన్నారు. దీని అభివృద్ధికి ప్రత్యేకంగా ‘ఐలా’ను ఏర్పాటుచేయనున్నామని తెలిపారు. ఉద్యోగాల్లో స్థానిక యువతకు ప్రాధాన్యం కల్పించేలా చర్యలు చేపడుతున్నామని చెప్పారు. అడ్వాన్స్డ్ ఎలక్ట్రికల్ కంపెనీలు ఈ ప్రాంతానికి రాబోతున్నాయని వెల్లడించారు. ఇక్కడ 220 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణానికి రూ.54 కోట్ల వ్యయంతో నిర్మాణంచేయనున్నట్లు ప్రకటించారు. వికారాబాద్ జిల్లాలోని అనంతగిరిని పర్యాటక కేంద్రంగా మారుస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులతోపాటు ఎంపీ రంజిత్‌రెడ్డి, పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, పరిశ్రమల శాఖ ఎండీ నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
హైదరాబాద్ నలుదిశలా అభివృద్ధి: మంత్రి సబితా ఇంద్రారెడ్డి
సీఎం కేసీఆర్ నేతృత్వంలో యువనాయకుడు, రాష్ట్ర మంత్రి కేటీఆర్ మార్గదర్శకత్వంలో హైదరాబాద్ నలుదిక్కులా అభివృద్ధికి బాటలు పరిచినట్టు విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి వెల్లడించారు. హైదరాబాద్‌ను ప్రపంచశ్రేణి ఉత్తమ నగరంగా తీర్చిదిద్దేందుకు మంత్రి కేటీఆర్ నిర్విరామ కృషిచేస్తున్నారని ప్రశంసించారు. కేటీఆర్ చొరవతో చందన్వెల్లిలో ఇంత పెద్ద సంస్థ ఏర్పాటు అయ్యిందన్నారు. మంత్రి కేటీఆర్ ఎక్కడికెళ్లినా తెలంగాణకు పరిశ్రమలు వచ్చేలా కృషి చేస్తున్నారన్నారు.
ప్రపంచ ఖ్యాతి కంపెనీ
దాదాపు 2.7 బిలియన్ల వార్షిక టర్నోవర్ కలిగిన వెల్స్పన్ గ్రూప్ ప్రపంచంలోని అతి పెద్ద గృహ వస్త్ర తయారీదారుల్లో ఒకటి. ఇందులో పూర్తి ఇంటిగ్రేటెడ్, ఇండిపెండెంట్ ఫ్లోరింగ్ వర్టికల్ విభాగం ప్రత్యేకమైంది. ప్రత్యేకమైన ఇతివృత్తాలు, ఉత్తేజకరమైన నమూనాలు, సాంకేతిక ఆవిష్కరణలు దీని సొంతం. ఫ్లోరింగ్ సొల్యూషన్స్ భవిష్యత్తును మార్చే లక్ష్యంతో తయారీప్లాంట్ను రూ.1100కోట్ల పెట్టుబడితో హైదరాబాద్‌లో ప్రారంభించింది. 2018లో ఫ్లోరింగ్ విభాగంలోకి ప్రవేశించిన కంపెనీ.. కార్పెట్ టైల్స్, గ్రీన్స్ (కృత్రిమ గడ్డి), బ్రాడ్‌లూమ్ తివాచీ (వాల్ టు వాల్ కార్పెట్) వంటి విభిన్న, వినూత్న ఉత్పత్తుల తయారీపై దృష్టిసారించింది. ఏడాదికి 40 మిలియన్ చదరపు మీటర్ల ఉత్పత్తి సామర్థ్యం దీనికి ఉన్నది. ప్రస్తుతం రూ.1100 కోట్ల పెట్టుబడితో సంస్థ ప్రారంభమైంది. 1600 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. ప్రస్తుతం ప్రారంభమైన విభాగానికి దగ్గర్లోనే అడ్వాన్స్డ్ టెక్స్టైల్ తయారీ కర్మాగారాన్ని కూడా ఏర్పాటుచేస్తున్నది. దీని ప్రధాన ఫోకస్ మార్కెట్ భారతదేశం కాగా, యూరప్, అమెరికా, ఆస్ట్రేలియా, ఆగ్నేయాసియాదేశాలకు ఉత్పత్తులను ఎగుమతి చేస్తుంది.
ఎంతో సంతోషం

ఈరోజు ప్రారంభించిన కంపెనీ ఇక్కడి ప్రగతికి ఆరంభం మాత్రమే.. ఇంకా అనేక కంపెనీలు చందన్‌వెల్లికి రాబోతున్నాయి.. ప్రపంచవ్యాప్తంగా పేరెన్నిక గల కంపెనీ మన ప్రాంతానికి రావటం, గుజరాత్ తర్వాత తెలంగాణలోనే పెట్టుబడులు పెట్టడం ఎంతో సంతోషం. వింబుల్డన్‌లో వాడే టవళ్లు ఇక్కడ ఉత్పత్తి కానున్నాయి. ఈ పరిశ్రమలో తయారైన టవల్ సిలికాన్ వ్యాలీలో కనిపిస్తుంది.
-కేటీఆర్, పరిశ్రమలశాఖ మంత్రి
కేటీఆర్ వల్లే హైదరాబాద్‌కు

‘మేము గుజరాత్లో ప్లాంట్ ఏర్పాటు చేయాలనుకున్నాం. ఈ మేరకు పనులు కూడా ప్రారంభించాం. ఆ దశలో కేటీఆర్ మమ్మల్ని సంప్రదించారు. తెలంగాణకు రావాల్సిందిగా కోరారు. నాతోపాటు వెల్స్పన్ బృందంలోని ప్రతి ఒక్కరితో ఒకటికి నాలుగుసార్లు మాట్లాడారు. తెలంగాణకు వస్తే కలిగే లాభాలను వివరించారు.
– బీకే గోయెంక, వెల్స్పన్ చైర్మన్