Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

చంద్రబాబు ఏనాడైనా ఆంధ్రాబాబే

-మన ప్రాజెక్టులపై ఫిర్యాదులను బాబు ఉపసంహరించుకుంటారా?
-ఈ విషయాల్లో చంద్రబాబుతో కాంగ్రెస్ ఏమైనా హామీ పొందిందా?
-12 ప్రశ్నలతో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కు మంత్రి హరీశ్‌రావు బహిరంగలేఖ
-టీడీపీతో షరతులతో కూడిన పొత్తా? బేషరతు పొత్తా? బేషరం పొత్తా?
-తెలంగాణ-ఏపీ మధ్య వివాదాల్లో చంద్రబాబు ఎటు? పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కు మంత్రి హరీశ్‌రావు బహిరంగలేఖ
-రాష్ర్టాన్ని నిలబెట్టేది కేసీఆర్.. పడగొట్టేది చంద్రబాబు.. మేం గతంలో షరతులతోనే పొత్తులు పెట్టుకున్నాం
-టీఆర్‌ఎస్‌కు సీట్లు, ఓట్లు కాదు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం.. జేఏసీ బహిష్కరించిన వారితో కోదండరాం పొత్తా!
-విలేకరుల సమావేశంలో మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం

చంద్రబాబు ఆనాడైనా, ఈనాడైనా, ఏనాడైనా ఆంధ్రాబాబేనని రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి టీ హరీశ్‌రావు విమర్శించారు. తెలంగాణను ఆపడానికి చివరివరకు ప్రయత్నించారని గుర్తుచేశారు. తెలంగాణ వ్యతిరేకి చంద్రబాబుతో కాంగ్రెస్ ఏ ప్రాతిపదికన పొత్తు పెట్టుకున్నదని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని హరీశ్ సూటిగా ప్రశ్నించారు. అది షరతులతో కూడిన పొత్తా? బేషరతు పొత్తా? లేక బేషరం పొత్తా? అని నిలదీశారు. తెలంగాణ వ్యతిరేకతను వదులుకునేలా చంద్రబాబు నుంచి ఏమైనా హామీ పొందారా? తెలంగాణ, ఏపీ మధ్య వచ్చే వివాదాల్లో చంద్రబాబు ఏ పక్షాన నిలుస్తారు? అని ప్రశ్నించారు. ఈ మేరకు 12 ప్రశ్నలతో ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి ఒక బహిరంగ లేఖ రాశారు. ఈ ప్రశ్నలకు సమాధానాలను కూటమి కనీస ఉమ్మడి కార్యక్రమంలో పొందుపర్చాలని, దానిపై చంద్రబాబు, మీరు (ఉత్తమ్) సంతకం చేయాలని డిమాండ్‌చేశారు.

మంగళవారం టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో మండలి చీఫ్ విప్ పాతూరి సుధాకర్‌రెడ్డి, విప్ బీ వెంకటేశ్వర్లు, టీఆర్‌ఎస్ అభ్యర్థులు చింత ప్రభాకర్, మదన్‌రెడ్డిలతో కలిసి మంత్రి హరీశ్ మాట్లాడుతూ ఇరు రాష్ట్రాల మధ్య అనేక విభజన అంశాలు పరిష్కారం కాలేదన్నారు. రాబోయేకాలంలో వాటి పరిష్కారంలో చంద్రబాబు ఏ రాష్ట్రం వైపు నిలబడుతారు? గోదావరి, కృష్ణానది జలాల పరిష్కార సమయంలో చంద్రబాబు ఏ రాష్ట్రం వైపు మాట్లాడుతారు? అని ప్రశ్నించారు. రాబోయే ఎన్నికల్లో మహాకూటమి పేరుతో పొత్తుకు సిద్ధమైన కాంగ్రెస్.. రాష్ట్ర ప్రయోజనాలకన్నా, రాజకీయ ప్రయోజనాలే ముఖ్యంగా వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. తెలంగాణ వ్యతిరేకి అయిన చంద్రబాబు ఆధ్వర్యంలోని టీడీపీతో పొత్తు పెట్టుకుంటున్న కాంగ్రెస్‌పై ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయని అన్నారు. 2009లో టీడీపీతో షరతులతో కూడిన పొత్తు పెట్టుకున్నామని, సమైక్యవాద పార్టీగా ఉన్న టీడీపీ మెడలువంచి పొలిట్‌బ్యూరోలో తెలంగాణకు అనుకూలంగా తీర్మానం చేయించామని హరీశ్‌రావు గుర్తుచేశారు. ఇప్పుడు ఎలాంటి షరతులతో టీడీపీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకున్నదో చెప్పాలన్నారు. అప్పట్లో ఆ రెండు పార్టీలు షరతులు ఉల్ంలఘిస్తే తెగదెంపులు చేసుకోవడమే కాకుండా మంత్రి, ఎమ్మెల్యే పదవులను గడ్డిపోచల్లా త్యజించిన విషయాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు. మీ పొత్తులు రాజకీయ ప్రయోజనాల కోసమా? తెలంగాణ ప్రయోజనాల కోసమా? అని హరీశ్ నిలదీశారు.

తెలంగాణ ప్రజలపై పగ తీర్చుకునేందుకు వస్తున్న బాబు తెలంగాణలో టీడీపీ పత్తాలేకుండా పోయింది కాబట్టే చంద్రబాబు ఇక్కడి ప్రజలపై పగ తీర్చుకునేందుకు కాంగ్రెస్ ముసుగులో వస్తున్నారని మంత్రి హరీశ్ మండిపడ్డారు. బాబు కుట్రలను ఛేదించడానికి తెలంగాణ సమాజం అప్రమత్తంగా ఉండాలన్నారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీకో, అమరావతికో తాకట్టు పెట్టే మహాకూటమి కుతంత్రాలను అడ్డుకొని తీరుతామని స్పష్టంచేశారు. తెలంగాణను నిలబెట్టేది కేసీఆర్ అయితే, పడగొట్టాలని కుట్రలు చేస్తున్నది చంద్రబాబు అని హరీశ్ నిప్పులు చెరిగారు. కేసీఆర్.. చావు నోట్లో తల పెట్టి, తెలంగాణ సాధిస్తే.. మహాకూటమి నేతలు మాత్రం మళ్లీ పరాయిపాలన వైపు మొగ్గుచూపడం దారుణమన్నారు.

ఉత్తమ్‌కు హరీశ్‌రావు సంధించిన 12 ప్రశ్నలు.. 1.తెలంగాణ ఏర్పడకుండా అన్ని ప్రయత్నాలుచేసిన చంద్రబాబు.. విభజిత ఏపీ సీఎంగా మనరాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడానికి అనేక ప్రయత్నాలు చేశారు. ఇంకా చేస్తూనే ఉన్నారు. తెలంగాణ వ్యతిరేక వైఖరిని బాబు మార్చుకున్నారా? ఆయనలో ఏం మార్పు వచ్చిందని మీరు భావిస్తున్నారు? టీడీపీలో చర్చించి తెలంగాణ అంశాలపై స్పష్టత ఇస్తారా?

2.సాగునీటి ప్రాజెక్టులు, ఉద్యోగుల విభజన, విద్యుత్, పోలవరం, ప్రభుత్వ సంస్థల విభజన, హైకోర్టు విభజన తదితర అంశాలలో తెలంగాణ, ఏపీ మధ్య వివాదాలున్నాయి. చంద్రబాబు ఈ అంశాల్లో ఏపీ పక్షాన నిలబడి తెలంగాణకు వ్యతిరేక వాదనలు చేస్తున్నారు. ఇకపై తెలంగాణకు వ్యతిరేకంగా వాదించనని, అనుకూలంగా వ్యవహరిస్తానని ఆయన నుంచి హామీ తీసుకున్నారా? తెలంగాణపట్ల తన వైఖరేమిటో చంద్రబాబు బహిరంగంగా చెప్పగలరా? తెలంగాణకు వ్యతిరేకంగా కోర్టులో ఆయన వేసిన అన్ని కేసులను ఉపసంహరించుకుంటారా?

3.చట్టంలో లేకున్నా కేంద్రాన్ని బ్లాక్‌మెయిల్ చేసి పోలవరం పరిధిలోని మన ఏడు మండలాలను గుంజుకున్నారు. వాటిని తిరిగి ఇచ్చేయాలని కోరుతూ తెలంగాణ ప్రజలంతా రాష్ట్రబంద్ కూడా పాటించారు. ఇవ్వటానికి చంద్రబాబు సిద్ధమా? ఏడు మండలాలను తిరిగి తెలంగాణలో కలపడానికి కాంగ్రెస్ అంగీకారం కుదుర్చుకున్నదా?

4.150 మీటర్ల ఎత్తులో, 50 లక్షల క్యూసెక్కుల ప్రవాహసామర్థ్యంతో పోలవరం డ్యామ్ ప్రతిపాదించారు. దీనివల్ల భద్రాచలం రామాలయం మొదలుకొని తెలంగాణలోని లక్షల ఎకరాలు ముంపునకు గురవుతాయి. ప్రస్తుత డిజైన్ మార్చాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. అందుకు చంద్రబాబు సిద్ధమా? పోలవరంపై కాంగ్రెస్, చంద్రబాబు వైఖరేమిటి?

5.పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించవద్దని చంద్రబాబు ఇప్పటికే కేంద్రానికి, వివిధ సంస్థలకు 30 లేఖలు రాశారు. పాలమూరు ప్రాజెక్టులవల్ల మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాలకు మేలు జరుగుతుంది. ఇప్పుడు పొత్తు నేపథ్యంలో పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు కట్టడానికి తమకు అభ్యంతరం లేదని చంద్రబాబుతో చెప్పిస్తారా? అసలు పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుపై చంద్రబాబు వైఖరేమిటి? ఆయన వైఖరి చెప్పకుండా కాంగ్రెస్ టీడీపీతో పొత్తుపెట్టుకుంటే అది తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కాదా?

6.కాళేశ్వరం, తుమ్మిడిహట్టి, సీతారామ, తుపాకులగూడెం, దేవాదుల, పెన్‌గంగ, రామప్ప- పాకాల లింకేజీ తదితర ప్రాజెక్టులపై చంద్రబాబు కేంద్రానికి ఫిర్యాదులుచేశారు. వాటిని ఉపసంహరించుకోవడానికి ఒప్పుకొన్నారా? ఆ ప్రాజెక్టులు నిర్మిస్తే తమకు అభ్యంతరం లేదని చంద్రబాబుతో చెప్పించగలరా?

7.పోలవరం నిర్మించి గోదావరి నీటిని కృష్ణాబేసిన్‌కు తరలిస్తున్నందున నాగార్జునసాగర్ ఎగువ రాష్ర్టాలకు కృష్ణానదిలో 80 టీఎంసీల వాటా ఇవ్వాలని ట్రిబ్యునల్ తీర్పు చెప్పింది. దీని ప్రకారం తెలంగాణకు 45 టీఎంసీలు, కర్ణాటకకు 21, మహారాష్ట్రకు 14 టీఎంసీలు రావాలి. కానీ తెలంగాణకు రావాల్సిన 45 టీఎంసీల విషయంలో కొర్రీపెట్టారు. దీంతో కృష్ణానీటిలో మన వాటా పెరుగడంలేదు. ఫలితంగా మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాలు నష్టపోతున్నాయి. కృష్ణానదిలో అదనంగా మరో 45 టీఎంసీలు కేటాయించడానికి తమకు అభ్యంతరం లేదని చంద్రబాబుతో చెప్పించగలరా? మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల ప్రజల మేలుకోసం ఈ మాత్రమైనా సాధించలేరా?

8.హైదరాబాద్‌సహా తెలంగాణలోని అన్ని ప్రాంతాలకు మంచినీళ్లు ఇవ్వడానికి ప్రభుత్వం మిషన్‌భగీరథను చేపట్టింది. గోదావరి, కృష్ణా నీళ్లను ఇందుకోసం వినియోగిస్తున్నది. తెలుగుజాతి అని మాట్లాడే చంద్రబాబు ఇది తప్పు అని ఫిర్యాదు చేసిండు. ప్రజలకు తాగునీరిచ్చే ప్రాజెక్టుకు కూడా ఇబ్బందులు కలిగిస్తున్న చంద్రబాబుతో ఎలా పొత్తు పెట్టుకుంటున్నారు? మిషన్‌భగీరథపై ఫిర్యాదు తప్పేనని బాబు పశ్చాత్తాపం వ్యక్తంచేశారా?

9.460 మెగావాట్ల సీలేరు పవర్ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకొని ఏపీ లాక్కున్నది. దీనివల్ల తెలంగాణ కరంటు కోతలు అనుభవించింది. రూ.5 వేల కోట్ల విలువైన ఈ పవర్ ప్రాజెక్టును లాక్కున్న ఏపీ.. తెలంగాణకు రూపాయి కూడా పరిహారం ఇవ్వలేదు. 365 రోజులూ విద్యుత్ ఉత్పత్తి చేసే సీలేరు నుంచి వచ్చే కరంటును పూర్తిగా ఏపీ వాడుకుంటున్నది. తెలంగాణ ఈ కరంటును కోల్పోవడంవల్ల రోజుకు కోటి రూపాయలు నష్టపోతున్నది. సీలేరు ప్రాజెక్టును తిరిగి తెలంగాణకు ఇచ్చేందుకు, కనీసం ప్లాంట్‌ను తీసుకున్నందుకు నష్టపరిహారం ఇచ్చేందుకు చంద్రబాబుతో ఏమైనా ఒప్పందం కుదిరిందా?

10.ఆంధ్రకు చెందిన 1200మంది విద్యుత్ ఉద్యోగులను తెలంగాణ విద్యుత్ సంస్థలు రిలీవ్‌చేశాయి. అయినా వారిని ఏపీ ప్రభుత్వం జాయిన్ చేసుకోవడంలేదు. కోర్టుల్లో కేసులువేశారు. ఆంధ్ర ఉద్యోగులను విధుల్లో చేర్చుకుంటామని, తెలంగాణపై ఆర్థికభారం తొలిగిస్తామని చంద్రబాబుతో చెప్పించి, కేసులను ఉపసంహరించుకునేందుకు ఏమైనా ఒప్పం దం చేసుకున్నారా?

11.నిజాంకాలంనుంచి తెలంగాణలో ఉన్న ప్రభుత్వ ఆస్తుల్లో వాటాకోసం ఏపీ ప్రభుత్వం కేసులు వేసింది. నిజాం కాలంనాటి ఆస్తులపై తెలంగాణ రాష్ర్టానికే తప్ప ఏపీకి వాటా ఉండదన్న సత్యాన్ని చంద్రబాబు అంగీకరిస్తారా? కేసులు ఉపసంహరించుకుంటామని చంద్రబాబుతో చెప్పించగలరా?

12.హైకోర్టు విభజనతోపాటు ఇతర ప్రభుత్వరంగ సంస్థల విభజన విషయంలో ఏపీ ప్రభుత్వం సహాయ నిరాకరణ అవలంబిస్తున్నది. హైకోర్టు విభజనకు, ప్రభుత్వరంగ సంస్థల విభజనకు ఎలాంటి అవరోధాలు కల్పించబోమని చంద్రబాబు నుంచి హామీ తీసుకున్నారా? మహాకూటమిని ఏర్పాటుచేసుకొని, కామన్ మినిమం ఎజెండా రూపొందిస్తామని మీరు ప్రకటించారు. అందులో పైన పేర్కొన్న అంశాలుంటాయా? ఉండవా? వీటి పట్ల స్పష్టమైన వైఖరిని వ్యక్తపరుస్తూ పీసీసీ అధ్యక్షుడిగా మీరు, టీడీపీ అధ్యక్షుడిగా చంద్రబాబు సంతకాలు చేస్తారా?

కోదండరాం పొత్తుకు ప్రాతిపదిక ఏంది? కోదండరాం ఏ ప్రాతిపదికన కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంటున్నారో చెప్పాలని మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. తెలంగాణ ప్రకటనను వెనక్కి తీసుకున్నాక ఎమ్మెల్యేలందరూ రాజీనామా చేయాలంటే కాంగ్రెస్ జేఏసీ నుంచి వెళ్లిపోయిందని, టీడీపీని కోదండరామే బహిష్కరించారని ఆయన గుర్తుచేశారు. ఆ రెండు పార్టీలు ఉన్న కూటమిలో ఏ విధంగా ఉంటారని నిలదీశారు. కోదండరాం చర్యలతో అమరుల ఆత్మలు ఘోషిస్తున్నాయన్నారు. మూడు నాలుగు సీట్ల కోసం సిద్ధాంతాలను, రాష్ట్ర ప్రయోజనాలను ఫణంగా పెడుతారా అంటూ ప్రశ్నించారు. ఓట్ల కోసం కాకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడితే ఆ పార్టీలతో పొత్తు పెట్టుకోరని వ్యాఖ్యానించారు. స్వీయ ఆస్తిత్వం ముఖ్యమని చెప్పారు. ఈ అక్రమ పొత్తులపై తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.