Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

చరిత్రాత్మక రైతుబీమా

-నా జీవితంలో చేసిన అతి గొప్పపని ఇదే -అన్నదాతకు బీమా కల్పించిన తొలిరాష్ట్రం మనదే -ఆగస్టు 15 నుంచి రైతులకు సర్కారు భరోసా -రైతులకోసం ఎంత ఖర్చయినా వెనుకాడబోం -రైతుబంధు పెట్టుబడిసాయం నేను తీసుకోలేదు.. -కానీ.. బీమా పథకంలో తప్పకుండా చేరుతాను -రాష్ట్రంలోని రైతులందరూ తప్పకుండా చేరాలి -భవిష్యత్తులో యాంత్రీకరణ ద్వారానే వ్యవసాయం -రైతులందరికీ సబ్సిడీపై యంత్రాల సరఫరా -తెలివైన రైతులు తెలంగాణలో ఉన్నారనిపించుకోవాలి -రైతుబంధు బీమా అవగాహన సదస్సులో సీఎం శ్రీ కేసీఆర్ -రైతుబంధు అమలుతో కొన్ని పార్టీలు దివాళాతీశాయని వ్యాఖ్య -ఎల్‌ఐసీతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంవోయూ

నా జీవితంలో చేసిన అతి గొప్పపని రైతులందరికీ రైతుబంధు జీవితబీమా పథకం కల్పించడమే అని ముఖ్యమంత్రి శ్రీ కే చంద్రశేఖర్‌రావు చెప్పారు. రాష్ట్రంలో 57 లక్షల మంది పట్టాదారు రైతులున్నారని, ఏదైనా ప్రమాదంలో లేదా సహజంగా చనిపోయినా వర్తించేలా 18 నుంచి 60 ఏండ్లలోపు వయసున్న రైతులందరికీ ఆగస్టు 15 నుంచి రైతుబీమా ప్రారంభమవుతుందని తెలిపారు. రైతుల కోసం ఎంత ఖర్చయినా వెనుకాడబోమని నొక్కిచెప్పారు. వ్యక్తిగతంగా రైతుబంధు పెట్టుబడిసాయం తాను తీసుకోలేదని, బీమా పథకంలో మాత్రం తప్పకుండా చేరుతానని అన్నారు. రైతులందరూ తప్పకుండా చేరాలని పిలుపునిచ్చారు. రైతాంగానికి ప్రతీయేటా రెండుపంటలకు పెట్టుబడి సాయం తప్పకుండా చెల్లిస్తామని స్పష్టంచేశారు. రైతుబంధు బీమా పథకంపై సోమవారం హైదరాబాద్ హెచ్‌ఐసీసీలో తెలంగాణ ప్రభుత్వం, ఎల్‌ఐసీ మధ్య ఎంవోయూ కుదిరింది. ముఖ్యమంత్రి కేసీఆర్, వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, రైతుసమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గుత్తా సుఖేందర్‌రెడ్డి సమక్షంలో వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి సీ పార్థసారథి, ఎల్‌ఐసీ చైర్మన్ వీకే శర్మ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసి, పత్రాలను మార్చుకున్నారు. అనంతరం రైతుబంధు జీవిత బీమా పథకంపై జిల్లా రైతు సమన్వయసమితి కో-ఆర్డినేటర్లు, జిల్లా వ్యవసాయాధికారులు, మండల రైతు సమన్వయ సమితి కో-ఆర్డినేటర్లు, మండల వ్యవసాయ విస్తరణాధికారులకు నిర్వహించిన అవగాహన సదస్సును ఉద్దేశించి సీఎం ప్రసంగించారు.

ఇంటలెక్చువల్ వ్యవసాయం ద్వారా పట్టణాల సమీపంలోని రైతులు కూరగాయలు పండించి ధనికులుగా మారవచ్చన్నారు. సీఎం కేసీఆర్ ప్రసంగ విశేషాలు ఆయన మాటల్లోనే.. రాష్ట్ర చరిత్రలోనే కాదు.. దేశ చరిత్రలోనే రైతులకు జీవిత బీమా కల్పించిన తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తున్నది. 60 ఏండ్ల సమైక్యపాలనలో ఎందరో వ్యవసాయశాఖ మంత్రులుగా పనిచేశారు. కానీ, రైతుల సమస్యలు పరిష్కారం కాలేదు. వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో రైతులకు ఎన్నో విలువైన పథకాలను ప్రభుత్వం అమలుచేస్తున్నది. రైతులకు మేలు జరుగుతున్నది. ప్రపంచలోనే అతిపెద్ద బీమా కంపెనీ ఎల్‌ఐసీ ద్వారా జీవితబీమా కల్పిస్తున్నాం. రాష్ట్రంలో ఆగస్టు 15వ తేదీలోగా రైతుబంధు జీవితబీమా క్లెయిమ్ ప్రీమియంలను చెల్లించాలని అధికారులకు ఇప్పటికే సూచనలు ఇచ్చాం. ఆగస్టు 15 నుంచి ఈ పథకం అమలులోకి వస్తుంది.

పత్రాలు నింపే బాధ్యత అధికారులదే క్షేత్రస్థాయిలో రైతులబీమా పత్రాలు నింపే బాధ్యత వ్యవసాయ విస్తరణాధికారులదే. బీమా పత్రాలలో రైతు పూర్తిపేరు, తండ్రి లేదా భర్త పేరు, నామినీ పేరు, మొబైల్ నంబరు కచ్చితంగా రికార్డు చేయాలి. నామినీగా రైతు సూచించినవారి పేర్లనే రాయాలి. ఆగస్టు 15 నుంచి ఈ పథకం అమల్లోకి రావాలి. బీమా క్లెయిమ్‌లను రైతు కుటుంబాలకు 10 రోజుల్లోనే అందజేస్తామన్న ఎల్‌ఐసీకి రాష్ట్ర రైతుల తరపున కృతజ్ఞతలు. రాష్ట్రంలోని 57 లక్షలమంది రైతుల్లో 18 నుంచి 59 సంవత్సరాల వయస్సువారికి బీమా వర్తిస్తుంది. ఏ కారణంతోనైనా రైతు చనిపోతే రూ.5 లక్షల బీమా మొత్తం రైతు కుటుంబానికి అందుతుంది. రైతు మరణ ధ్రువీకరణ పత్రాన్ని గ్రామ పంచాయతీలోనే ఇచ్చే ఏర్పాటుచేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలతో దేశం అంతా తెలంగాణ వైపు చూస్తున్నది.

జీవిత బీమాను కచ్చితంగా తీసుకుంటా.. అందరూ తీసుకోవాలి రైతుబంధు జీవితబీమా చిన్న, సన్నకారు రైతుల్లో ధీమా కల్పిస్తుంది. రైతు క్షేమంగా ఉంటేనే లోకం క్షేమంగా ఉంటుంది. వ్యవసాయమంటే వైకుంఠపాళిగా మారింది. పేరుకు పెద్దరైతు.. వెనక్కి చూస్తే అన్ని అప్పులే. వ్యవసాయమంటేనే నామోషి అని భావించే పరిస్థితులు పోవాలి. రైతుబంధు సాగుపెట్టుబడి నేను తీసుకోలేదు. కానీ. జీవితబీమాను మాత్రం కచ్చితంగా తీసుకుంటా. అందరూ జీవితబీమా తీసుకోవాలి. రాష్ట్రంలో ఒకటిరెండు ఎకరాల లోపు ఉన్న రైతులే దాదాపు 42 లక్షల మంది ఉన్నారు. వారు పెట్టుబడి సాయం కింద దాదాపు రూ.4,956 కోట్లు పొందారు. రైతుబంధు పెట్టుబడి సాయం తీసుకున్న 89% మంది రైతులు చాలా సంతోషంగా ఉన్నట్టు ఓ జాతీయ పత్రిక రాసింది. పెట్టుబడి సాయంతోపాటు, చిన్న, సన్నకారు రైతులందరికీ జీవితబీమా ధైర్యాన్ని ఇస్తుంది. రైతులకోసం అనేక కార్యక్రమాలు చేస్తుంటే.. కొందరు అనవసర విమర్శలు చేస్తున్నారు. తెల్వక వారిని మనుషులనుకుంటున్నాం. వారి విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. రామాయణంలో రాక్షసుల మాదిరిగా రాష్ట్రంలో కొందరు నాయకులు వ్యవహరిస్తున్నారు. రైతుబంధు పథకం అమలు తర్వాత రాష్ట్రంలో కొన్ని రాజకీయపార్టీలు దివాళా తీశాయి. రాజకీయపార్టీలు విమర్శించడం తప్పు కాదు. కానీ దేనిని విమర్శించాలి? దేనిని విమర్శించకూడదో తెలుసుకోవాలి. టీఆర్‌ఎస్ ప్రభుత్వం పక్కా రైతు పక్షపాత ప్రభుత్వం. నా జీవితంలో నేను చేసిన అతి గొప్ప పని రైతుబీమా పథకం. తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న రైతుబంధు, రైతుబీమా పథకాలతో దేశంలోని ఇతర రాష్ర్టాల ప్రభుత్వాలపై రైతుల నుంచి ఒత్తిడి పెరుగుతున్నది.

కౌలు రైతులకు పెట్టుబడి సాయం ఇవ్వడం కుదరదు రైతుబంధు కింద కౌలు రైతులకు పెట్టుబడి సాయం అదించడంలో కొన్ని సమస్యలున్నాయి. అందువల్లే భూమి యజమానికి మాత్రమే పెట్టుబడి అందిస్తున్నాం. కౌలు రైతులకూ ఇవ్వాలని కొందరు మాట్లాడుతున్నారు. టీఆర్‌ఎస్‌ను ఎలా ఎదుర్కోవాలో తెలియక ఎదో ఒకటి మాట్లాడుతున్నారు. కౌలు రైతులకు పెట్టుబడి సాయం ఎలా ఇవ్వాలి? ఏ పద్ధతిలో ఇవ్వాలి? రైతు భూమి మీద ఇతరులకు హక్కులు కల్పించడం రైతుగా నాకు ఇష్టం లేదు. రైతులకు ఎలాంటి నెత్తినొప్పి ఉండకూడదన్నదే ప్రభుత్వ విధానం. అందుకే పాసుబుక్కులో కూడా అనుభవదారులు అనే కాలాన్ని తీసివేయించాం. పట్టణాలలో ఎంతోమంది అద్దె ఇండ్లలో ఉంటున్నారు. లక్షలు ఖర్చు పెట్టి యజమానులు కట్టుకున్న భవనాలను తమ పేరున రిజిస్టర్ చేయాలని కిరాయిదారులు అనడం ఎంతవరకు సమంజసం? కౌలు అనేది రైతుకు, రైతుకూలీలకు సంబంధించిన అంశం. రైతుభూమి మీద ఇతరులకు అధికారం కల్పించడం కుదరదు.

వాతావరణ స్థితిగతులకు అనుగుణంగా పంటల సాగు రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ స్థితిగతుల ఆధారంగా వ్యవసాయ శాస్త్రవేత్తల సూచనల మేరకు పంట కాలనీలను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాం. మన అవసరాలకు తోడు దేశంలో ఉన్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని పంటలు పండించాలన్నదే నా సూచన. రైతుల అభిప్రాయాలను పరస్పరం పంచుకోవడానికి వీలుగా రైతు వేదికల నిర్మాణాలను వీలైనంత త్వరగా పూర్తిచేయాలి. రాష్ట్రంలోని 2,500 వ్యవసాయ క్లస్టర్లలోని వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా యంత్ర పరికరాల అవసరాలను, స్థితిగతులను వ్యవసాయ విస్తరణాధికారులు వెంటనే తెలియజేయాలి. ఉత్పత్తులను అమ్ముకోవడానికి రైతులు ఇబ్బందులు పడకుండా తగిన ప్రణాళిక రూపొందించాలి. రైతులకోసం ప్రత్యేక మార్కెటింగ్ వ్యవస్థ ఏర్పాటుపై వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి దృష్టిసారించాలి. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితే తెలంగాణ రైతులు మొగులుకు ముఖం పెట్టిచూసే అవసరం ఉండదు. అందరికీ అన్నం పెట్టే రైతు సల్లంగుంటే అందరూ క్షేమంగా ఉంటారు.

రైతుల బీమా కోసం ఎంత ఖర్చయినా చెల్లిస్తాం వ్యవసాయ పెట్టుబడి కోసం, నాణ్యమైన విద్యుత్తు, సాగునీళ్లు, రైతుల బీమా కోసం ఎంత ఖర్చయినా రైతాంగానికి ప్రతి ఏటా చెల్లిస్తాం. సాగుకు పెట్టుబడి కోసం ఇప్పటికే రైతులకు రూ.5,000 కోట్లు అందాయి. వ్యవసాయ విస్తరణాధికారులు ఎక్కడికక్కడ రైతాంగాన్ని సేంద్రియ వ్యవసాయం వైపు మళ్లేలా ప్రోత్సహించాలి. రైతు సమన్వయ సమితి సభ్యులు భూముల ఏకీకరణకు రైతులను ప్రోత్సహించాలి. వేర్వేరు చోట్ల ఉన్న భూములను ఒకేవైపు సమీకరించుకునేలా సహకరించాలి. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఆయా పంటల ప్రాసెసింగ్ యూనిట్లు నెలకొల్పి, వ్యవసాయ ఉత్పత్తులకు విలువ పెంచేలా రాష్ట్ర ప్రభుత్వం కృషిచేస్తుంది.

దేశంలో తెలివైన రైతులుగా తెలంగాణ రైతులుండాలి దేశంలో తెలివైన రైతులు ఎక్కడున్నారంటే.. తెలంగాణలో ఉన్నారనే విధంగా తయారుకావాలి. పంటల విక్రయంలో మండల రైతు సమితులు కీలకపాత్ర పోషించాలి. తెలంగాణలో రైతుల అభివృద్ధికి ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నాం. నేను తెలంగాణ రైతుని అని సగర్వంగా చెప్పుకునే స్థితికి అన్నదాతలు చేరాలన్నదే నా ఆకాంక్ష. సాగుకు పెట్టుబడి, రైతుకు బీమా, సాగుకు నీళ్ళు, నిరంతర విద్యుత్తు అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందు సాగుతున్నది. ఇక రైతులు కష్టాల నుంచి బయటపడతారు. రైతు క్షేమంతోనే మనందరి క్షేమం ముడిపడి ఉన్నది. రైతుల బాధలు చూసి ఎన్నోసార్లు ఏడ్చినం. మరో ఏడాదికాలంలో ప్రాజెక్టులు పూర్తయితవి. ఎస్సారెస్పీవంటి ప్రాజెక్టుల కింద అద్భుతమైన పంటలు పండిస్తాం. విద్యుత్ సమస్యను అధిగమించినం. రాష్ట్రంలో నిమిషం కూడా కరంటు పోదు. 24 గంటలు విద్యుత్ సరఫరా చేస్తున్నం. ప్రభుత్వ చర్యలతో జనరేటర్లు, ఇన్వర్టర్ల దుకాణాలు మూతపడ్డయి. మిషన్‌కాకతీయతో చెరువులను బాగుచేసుకున్నం. చెరువుల్లో 365 రోజులు నీళ్లు ఉండే పరిస్థితులను చూడాలనేది లక్ష్యం. ప్రతి ఏటా చెరువులను నింపుతం. రైతులకు ఎలాంటి కష్టాలు ఉండవు. రైతుల బాధలు పోవాలి. పెట్టుబడికోసం వెతికే పరిస్థితులు పోవాలి.

మద్దతు ధర నిర్ణయం కేంద్రానిదే పండిన పంటకు మద్దతు ధర కల్పించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే. కానీ కేంద్రం పట్టించుకోవడం లేదు. పండిన పంటకు గిట్టుబాటు ధర లభించాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం డిమాండ్‌కు అనుగుణంగా పంటలు పండించేందుకు పంట కాలనీలను ఏర్పాటుచేయాలి. నియంత్రిత విధానంలో పంట విక్రయాలు జరిగేలా రైతు సమన్వయ సమితులు వ్యవహరించాలి. రైతులు సంఘటితంగా ఉంటేనే ఎదైనా సాధించవచ్చు. వాతావరణానికి అనుకూలంగా పంటలు పండించేలా శాస్త్రవేత్తల సూచనలు పాటించాలి. రైతులు ఎలాంటి పంటలు సాగుచేయాలో శాస్త్రవేత్తలు రాబోయే రోజుల్లో నిర్ణయిస్తారు. తెలంగాణ రైతాంగ పక్షాన మార్కెట్ ఏర్పాటుచేసుకోవాలి. రాబోయే రోజుల్లో నాట్లు వేయడానికి మహిళలు దొరకరు. అందుకోసం గ్రామాలవారీగా వరినాటు యంత్రాలను సబ్సిడీపై అందజేస్తాం. ఇందుకోసం మండలాలవారీగా వ్యవసాయ యంత్రాలకు సంబంధించిన వివరాలను ఏఈవోలు సేకరించాలి.

వ్యవసాయ విస్తరణాధికారులు తమ క్లస్టర్ పరధిలో ఎన్ని యంత్రాలు ఉన్నాయో 10 రోజుల్లో తేల్చాలి. ట్రాక్టర్లు ఉండి పరికరాలు లేకుంటే పరికరాలను సబ్సిడీపై అందిస్తాం.. అని సీఎం కేసీఆర్ చెప్పారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గుత్తా సుఖేందర్‌రెడ్డి, మిషన్ భగీరథ చైర్మన్, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి, వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి సీ పార్థసారథి, వ్యవసాయ కమిషనర్ డాక్టర్ ఎం జగన్‌మోహన్, సీఎం కార్యాలయ కార్యదర్శి స్మితాసబర్వాల్, పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్, విత్తన ధృవీకరణ సంస్థ డైరెక్టర్ డాక్టర్ కే కేశవులు, విత్తనాభివృద్ధి సంస్ధ చైర్మన్ కొండబాల కోటేశ్వర్‌రావు, ఉద్యానశాఖ కమిషనర్ ఎల్ వెంకట్రామిరెడ్డి, మార్క్‌ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ లోక భూమారెడ్డి, ఖనిజ అభివృద్ధి సంస్థ చైర్మన్, సీఎం రాజకీయ సలహాదారులు శేరి సుభాష్‌రెడ్డి, ఆగ్రోస్ చైర్మన్ లింగంపల్లి కిషన్‌రావు, వివిధ జిల్లాల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు పాల్గొన్నారు.

ప్రతీరైతు బీమా తీసుకోవాలి: మంత్రి పోచారం ప్రతీ రైతు తప్పనిసరిగా పంట బీమా తీసుకునే విధంగా వ్యవసాయశాఖ అధికారులకు అవగాహన కల్పించాలని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డి సూచించారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు రైతు సమన్వయ సమితులు, వ్యవసాయాధికారులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రతీ సీజన్‌కు ఎకరాకు రూ.50 వేలు రైతుకు మిగిలితే ఏడాదిలోగా రాష్ట్రంలోని కోటిన్నర ఎకరాలలో మొత్తం పంట ఆదాయం ఏడాదికి లక్షా యాభై వేల కోట్లవుతుందని తెలిపారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం నేడు సాగునీటి ప్రాజెక్టుల మీద ఖర్చు చేస్తున్న మొత్తం ఒక ఏడాది పంట దిగుబడితో వెనుకకు వచ్చేస్తుందన్నారు. సోమవారం మాదాపూర్ హైటెక్స్ కన్వెన్షన్‌లో జరిగిన రైతుబంధు జీవిత బీమా పథకం అవగాహన సదస్సులో మంత్రి పోచారం మాట్లాడుతూ, దేశంలో ఏ రాష్ట్రం కొనుగోలు చేయనంతగా అన్ని పంటల ఉత్పత్తులను మద్దతుధరకు కొనుగోలు చేస్తున్నామన్నారు. భవిష్యత్తులో వ్యవసాయ కూలీల కొరత ఏర్పడే అవకాశం ఉన్నందున వచ్చే ఏడాది బడ్జెట్‌లో యాంత్రీకరణకు రూ.3,000 కోట్లు కేటాయిస్తామన్నారు.

సేంద్రియ సాగును ప్రోత్సహించాలి: గుత్తా రాష్ట్రంలో రసాయనిక ఎరువుల వినియోగంపై రైతులకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత రైతు సమన్వయ సమితి సభ్యులు, వ్యవసాయ విస్తరణాధికారులపై ఉన్నదని రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. నేడు మార్కెట్‌లో సేంద్రియ ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉందన్నారు. గ్రామాలలో వ్యవసాయాధికారులు, రైతు సమన్వయ సమితి సభ్యులు సమన్వయంతో పనిచేస్తూ రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. ఆగస్టు 15 నుంచి అమలులోకి రానున్న రైతుబంధు జీవిత బీమాను విజయవంతం చేసే బాధ్యత వ్యవసాయ విస్తరణాధికారులు, రైతు సమన్వయ సమితి సభ్యులపై ఉందన్నారు. బీమా పత్రాలను నింపేటప్పుడు వ్యవసాయాధికారులు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. నామినీగా రైతులు సూచించిన పేరునే పొందుపరచాలని సూచించారు. రైతుల బీమాకి సంబంధించి రైతుబంధు పోర్టల్‌లో అదనపు ఫీచర్ ఏర్పాటుచేస్తామన్నారు.

లంకలో రాక్షసులు.. సీఎం పిట్టకథ రైతుబంధు బీమా పథకం అవగాహన సదస్సులో ప్రసంగిస్తూ సీఎం కేసీఆర్ ఓ పిట్టకథ చెప్పారు. సీతమ్మను రావణుడు లంకకు ఎత్తుకెళ్లినప్పుడు రాముడు కోతుల సైన్యంతో రెండుమూడు సార్లు రావణుడిపై యుద్ధానికి వెళ్లి చివరికి రామబాణం ప్రయోగిస్తే అర్ధాయుష్షుతో రాక్షసులు చనిపోతారు. సీతను రక్షించి అరణ్యం నుంచి తీసుకొస్తుండగా.. కొందరు రాక్షసులు ఇదేమి న్యాయం రామా అని అడుగుతరు. కలియుగంలో మీరంతా అక్కడక్కడ గ్రామాలలో ఊరికొకరు మళ్లీ పుడుతరని రాముడు చెప్పిండు. అలాంటి వాళ్లే ఇప్పుడు ప్రభుత్వ పథకాలను విమర్శిస్తున్నారు అని సీఎం కేసీఆర్ రామాయణ కథను ఊటంకించారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.