Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

చేనేతల ప్రభుత్వం

-నేతన్న కష్టం తెలిసిన సీఎం కేసీఆర్ -చేనేతమిత్ర, నేతన్నకు చేయూత అద్భుతమైన పథకాలు -త్వరలో గద్వాలలో హ్యాండ్‌లూమ్ పార్కు -ఈ కామర్స్ ద్వారా విక్రయాలు -జాతీయ చేనేత దినోత్సవంలో మంత్రి కే తారకరామారావు

తెలంగాణ ఏర్పాటు తర్వాత చేనేతరంగం పురోగమిస్తున్నదని, దేశంలో ఏ రాష్ట్రం కేటాయించని విధంగా ఈ రంగానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తున్నదని చేనేత, జౌళిశాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు. బహుముఖ వ్యూహంతో చేనేత కళాకారుల ఆదాయం పెంచి, గౌరవం కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళ్తున్నట్లు చెప్పారు. తమది చేతల ప్రభుత్వమని, చేనేతల ప్రభుత్వమని కేటీఆర్ అభివర్ణించారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా మంగళవారం నెక్లెస్‌రోడ్డులోని పీపుల్స్ ప్లాజాలో తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మహిళా ఆర్థిక సహకార సంస్థ అధ్యక్షురాలు గుండు సుధారాణి, టెక్స్‌టైల్, హ్యాండ్లూం ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, హ్యాండ్లూం అండ్ టెక్స్‌టైల్ కమిషనర్ శైలజారామయ్యర్, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ తదితరులతో కలిసి చేనేత వస్త్ర ప్రదర్శనను లాంఛనంగా ప్రారంభించారు. చేనేత రంగంలో విశిష్ట సేవలందించినవారికి, పద్మ, జాతీయ సంత్ కబీర్ అవార్డుల గ్రహీతలకు, 29 మంది కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డుల గ్రహీతలకుఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ సన్మానం చేశారు. చేనేతమిత్ర, నేతన్నకు చేయూత పథకాల లబ్ధిదారులకు, రుణ మాఫీకి సంబంధించిన రూ. 20 కోట్ల చెక్కును అందజేశారు. అనంతరం మంత్రి కేటీఆర్ ప్రసంగిస్తూ.. తెలంగాణ ప్రభుత్వం చేనేతరంగం సంక్షేమంకోసం అమలు చేస్తున్న పథకాల గురించి వివరించారు. మంత్రి కేటీఆర్ ప్రసంగం ఆయన మాటల్లోనే చేనేత రాత మారింది

1905 ఆగస్టు 7న ప్రారంభమైన స్వదేశీ ఉద్యమానికి గుర్తుగా 2015 నుంచి జాతీయ చేనేత దినోత్సవాన్ని ఇదే రోజున కేంద్రం ప్రకటించింది. రాష్ట్రం ఏర్పడిననాటి నుంచి చేనేత రంగాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకున్నది. చేనేత ఉత్పత్తుల ప్రాధాన్యం, ఆదరణ, ప్రోత్సాహం అనే లక్ష్యాలతో ముందుకు పోతున్నాం. మనిషికి నాగరికత నేర్పిన నేతన్నకు గౌరవం కల్పించాలనే సంకల్పంతో ప్రభుత్వం ఉంది. 29 రాష్ర్టాల్లో చేనేత రంగానికి కేటాయిస్తున్న బడ్జెట్‌తో పోల్చితే, బడ్జెట్‌లో రూ.1200 కోట్ల నిధులు కేటాయించిన ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానికే దక్కుతుంది. రాష్ట్రంలో ఉన్న మగ్గాలు.. వాటి సంఖ్య, పరిస్థితులు తెలుసుకోవాలన్న ఉద్దేశంతో మగ్గాలకు జియోట్యాగింగ్ చేశాం. దీని ఆధారంగా రాష్ట్రంలో మొత్తం 40వేల మంది చేనేత కళాకారులు ఈ వృత్తి మీద ఆధారపడి ఉన్నట్లు గుర్తించాం.

గతంలో ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు చేనేత రంగానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇస్తున్న ప్రోత్సాహం గతంలో ఎన్నడూ లేదు. ఎవరూ ఇవ్వలేదు. ఒక్కొక్క చేనేత కళాకారుడి స్థితిగతిని అర్థం చేసుకొని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం. వివిధ రాష్ర్టాలు మన వద్దకు వచ్చి ఇక్కడి పథకాల గురించి ఆసక్తికరంగా తెలుసుకొని, అక్కడ అమలు చేస్తున్నాయి. 10 రోజుల కిందట ఒడిశా చేనేత ముఖ్య కార్యదర్శి వచ్చారు. ఇక్కడి పథకాల గురించి అధ్యయనం చేశారు. బాగున్నాయని చెప్పి, తమ రాష్ట్రంలో కూడా అమలుచేస్తామని అన్నారు.

నేతన్న కష్టాలు కండ్లనిండా చూశారు.. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతన్న కష్టాలను కండ్లనిండా చూశారు. ఆయన సిద్దిపేటలోని చింతమడక గ్రామంలో జన్మించారు. ఆ ఊర్లో హైస్కూల్ లేదు. ఏడెనిమిది కి.మీ దూరంలో ఉండే దుబ్బాకకు కాలినడకన వెళ్లివచ్చేవారు. రోజు ఇలా పోవడం, రావడం, ఇబ్బంది అవుతుందని గమనించి దుబ్బాకలో ఉండేవిధంగా తల్లిదండ్రులు ఏర్పాటుచేశారు. అలా దుబ్బాకలోని ఓ పద్మశాలి ఇంట్లో ఉండి చదువుకున్నారు. దీంతో సీఎం కేసీఆర్‌కు నేతన్న కష్టాలను కండ్లనిండా చూశారు. వారు ఎప్పుడు మాకు చెప్తుంటారు. ఆ ఇంట్లో ఉండే పురుషుడు మగ్గం ఆడిస్తూ చేనేత ఉత్పత్తి చేస్తే మహిళలు బీడీలు చుట్టేవారు అని. అందుకే చేనేత, బీడీ కార్మికుల కష్టాలు సీఎంకు బాగా తెలుసు. కాబట్టే అద్భుత కార్యక్రమాలు ప్రారంభించాలని మా శాఖను ఆదేశించారు. 2002లో భూదాన్ పోచంపల్లిలో వారంలో 8 మంది చనిపోతే అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదు. జోలెపట్లి ప్రతి ఇల్లు తిరిగి నిధుల సేకరించి కుటుంబాలకు రూ.50 వేల చొప్పున సాయం చేశారు. 20017లో సిరిసిల్లలో ఆత్మహత్యల నేపథ్యంలో ప్రత్యేకనిధి ఏర్పాటుచేసి రూ.50 లక్షలు వారి సంక్షేమంకోసం అందించారు. చిన్ననాటి నుంచి నేతన్న కష్టాల పట్ల అవగాహన ఉన్న నేత ముఖ్యమంత్రిగా ఉండటం అదృష్టం.

అద్భుతమైన పథకాలు చేనేత మిత్ర, నేతన్నకు చేయూత పథకాలు అద్భుతమైనవి. చేనేత మిత్ర కింద 50శాతం సబ్సిడీ మీద నూలు రసాయనాలు, అద్దకాలు వంటివి ఇస్తున్నాం. ఈ పథకంలో ఇప్పటి వరకు 18, 623 మంది నమోదు చేసుకున్నారు. రూ.20 కోట్లు ప్రభుత్వ నుంచి విడుదలచేశాం. నేతన్నకు చేయూత అనేది మరొక అద్భుతమైన పథకం. ఒక రూపాయి కళాకారులు చెల్లిస్తే, ప్రభుత్వం తరుపున రెండు రెట్లు అంటే రెండు రూపాయలు చెల్లిస్తుంది. మూడేండ్లకుగాను రికరింగ్ డిపాజిట్ చేస్తున్నాం. మూడేండ్ల తర్వాత డబ్బు నేరుగా చేతికి వస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా 19,125 మంది ఈ పథకంలో చేరారు. దీనికి కోసం రూ.60 కోట్లను ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం కేటాయించింది. ఈ రెండు పథకాల ద్వారా ప్రతి కళాకారుడి కుటుంబానికి రూ.6 నుంచి 8 వేల అదనపు ఆదాయం రావాలని ఆశిస్తున్నాం.

సమంత స్వచ్ఛందంగా వచ్చారు సినీనటి సమంత చేనేత కోసం రూపాయి తీసుకోకుండా ప్రచారం చేస్తా అని ముందుకు వచ్చారు. అందుకే బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించాం. సిద్దిపేట, దుబ్బాక, పోచంపల్లి, గద్వాల ఇలా అన్ని ప్రాంతాలు తిరిగి చేనేత గురించి తెలుసుకున్నారు. కొంతమంది డిజైనర్లతో కలిసి ప్రచారంచేసేందుకు వారు ప్రయత్నంచేస్తున్నారు. ప్రతి సోమవారం చేనేత వస్త్రాలు ధరించాలని పిలుపునిస్తే, ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో ఉన్న వారు ముందుకొచ్చారు. నేటి ఫ్యాషన్ ప్రపంచానికి అనుగుణంగా ఉత్పత్తులు రావాల్సిన అవసరం ఉంది. అందుకే ప్రముఖ డిజైనర్లతో ప్రభుత్వం కలిసి పనిచేస్తున్నది. చేనేత వస్త్రాలను ఏదో దాతృత్వ బుద్ధితో కొనుగోలుచేస్తున్నట్లు కాకుండా నచ్చి కొనుగోలుచేసేలా ప్రోత్సహించాలన్నదే లక్ష్యం. ఈ ఆలోచనతో పోచంపల్లిలో మైక్రోసాఫ్ట్ సహకారంతో ఒక కేంద్రాన్ని ఏర్పాటుచేశాం.

కేంద్ర నిధులను వదలిపెట్టం కేంద్రం నుంచి వచ్చే నిధులను మేం వదలడం లేదు. రాష్ట్రంలో కొత్తగా 18 బ్లాక్ లెవల్ క్లస్టర్లు కావాలని కేంద్ర జౌళి మంత్రి స్మృతి ఇరానీని కోరాం. ఇప్పటికే రూ.10 కోట్ల 20 లక్షలతో 8 క్లస్టర్లు పలు చోట్ల ఏర్పాటు చేశాం. పోచంపల్లిలో క్లస్టర్ పునరుద్ధరణ కోసం రూ.15 కోట్లు మంజూరు చేశాం. గద్వాలలో కామన్ ఫెసిలిటీ సెంటర్‌ను రూ.14 కోట్లతో ఏర్పాటుచేస్తాం.

ఈ కామర్స్ ద్వారా అమ్మకాలు సాంకేతిక పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతున్న నేపథ్యంలో దాన్ని అందిపుచ్చుకుంటున్నాం. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, స్నాప్‌డీల్, టెస్కో వెబ్‌సైట్ ద్వారా విక్రయాలు జరిగేలా సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడిస్తున్నాం. టెస్కో షోరూంలను పెంచడంతో పాటు, షాపింగ్‌మాల్స్, మల్టిప్లెక్స్‌లు, ఇతర వస్త్ర దుకాణాల్లో చేనేత వస్త్రాలను అందుబాటులో ఉంచుతాం. ప్రతి ఏటా ప్రముఖ డిజైనర్లతో ఫ్యాషన్ షోలు ఏర్పాటు చేస్తు న్నాం. ఇలాంటి ఆలోచనలు చాలా ఉన్నాయి. సీఎం కేసీఆర్‌తో చర్చించి త్వరలో అమలుచేస్తాం.

రుణ మాఫీ చేశాం.. తెలంగాణ వస్తే లాభం జరుగుతుందని నేతన్నలు నమ్మారు. వారికి ఉపశమనం కల్గిస్తూ రుణ మాఫీ నిర్ణయం తీసుకున్నాం. 12వేల మంది నేతననల కుటుంబాలకు రుణమాఫి చేశాం. 2014 జూన్ 2 నుంచి రుణమాఫీ చేయాలని మొదట నిర్ణయించినప్పటికీ, నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు, దుబ్బాక ఎమ్మల్యే రామలింగారెడ్డి, ఇతర మిత్రుల కోరిక మేరకు 2010 నుంచి మాఫీ చేశాం. ఎప్పుడైనా రుణం కట్టనోళ్లకు మాఫీ చేస్తరని ప్రచారంలో ఉంది. అయితే ఈసారి రుణం కట్టిన వాళ్లకు కూడా వాపస్ ఇచ్చాం. ఈ మేరకు రూ. 20 కోట్ల చెక్కును అందించాం. సిద్దిపేట గొల్లభామ చీరలు, గద్వాల చీరలు, పోచంపల్లి ఇక్కత్.. ఇలా రాష్ట్రవ్యాప్తంగా ఉత్పత్తయ్యే విభిన్న వస్త్రాలను టెస్కో ద్వారా కొనుగోలు చేసి మార్కెట్లోకి పంపే ప్రయత్నం చేస్తున్నాం. కమిట్‌మెంట్‌తో ప్రభుత్వం పని చేస్తున్నది. మార్కెట్ పరిస్థితుల నేపథ్యంలో నేతన్నలు చితికి పోవద్దని సీఎం కేసీఆర్ ఆలోచనతో వస్త్రాలు కూడా కొనుగోలు చేస్తున్నాం.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.