Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

చెప్పేది గాంధీ సూక్తులు.. కొలిచేది గాడ్సేను

‘‘దేశంలో ఎవరైనా నోరు తెరిస్తే.. వారిపై మతం పేరిట ఎదురుదాడులు, అణచివేతకు ప్రధాని మోదీ పూనుకుంటున్నారు. తెలంగాణ మంత్రిగా, టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా చెప్తున్నా.. నరేంద్ర మోదీ గాడ్సే వర్షిపర్‌ (గాడ్సే ఆరాధకుడు). చెప్పేది గాంధీ సూక్తులు, కొలిచేది గాడ్సేను. నాపై కేసులు పెడతారా పెట్టండి. దేశ స్వాతంత్య్రం తర్వాత మొదటి తీవ్రవాది నాథూరామ్‌ గాడ్సే. అలాంటి గాడ్సేను బీజేపీ ఎంపీలు పొగుడుతుంటే మోదీ నోరు మూసుకుంటారు. అలాంటి గాడ్సే భక్తులు గాంధీ సూక్తులు వల్లె వేస్తున్నారు.


ఏడేళ్లలో దేశంలో ఏం చేశారో చెప్పకుండా.. హిజాబ్, హలాల్‌ అంటూ ఏ బట్టలు వేసుకోవాలి, ఏం తినాలి అని చెప్తారా? దేశంలో వేరే సమస్యలు లేవా? జిగ్నేష్‌ మేవానీని జైల్లో పెట్టినట్లు.. కేసీఆర్‌ను తూలనాడితే మేమూ జైల్లో పెట్టలేమా..? మేవానీపై పెట్టినట్లు నాపైనా కేసులు పెట్టండి’’ అని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు సవాల్‌ చేశారు. ఈ నెల 27న టీఆర్‌ఎస్‌ 21వ వ్యవస్థాపక దినోత్సవం నేపథ్యంలో కేటీఆర్‌ ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ వివరాలివీ..


సాక్షి: టీఆర్‌ఎస్‌ 21 ఏళ్ల ప్రస్థానంలో మీకు సంతృప్తి ఇచ్చిందేమిటి?
కేటీఆర్‌: ఉద్యమ పార్టీగా రాష్ట్రాన్ని సాధించడంతోపాటు ప్రజల ఆశీర్వాదంతో కేసీఆర్‌ ముఖ్యమంత్రి కావడం చాలా అరుదైన విషయమని గతంలో మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ అన్నారు. మంచి ఉద్యమకారులు.. మంచి పాలకులు ఒకరే కావడం అరుదైన అంశమని అరుణ్‌ జైట్లీ కూడా కితాబునిచ్చారు. కేసీఆర్‌ పేరు ఉద్యమ నాయకుడిగా చరిత్రలో నిలిచిపోయింది. తెలంగాణ సాధనతో పోలిస్తే మిగతావన్నీ చిన్నవే. ఇన్నేళ్ల ప్రస్థానంలో అనేక ఎత్తుపల్లాలు చూశాం.


విభజన హామీల విషయంలో కేంద్రం వైఖరిపై ఏమంటారు?
– విభజన హామీలను నెరవేర్చడంలో పెద్దన్న పాత్ర పోషించాల్సిన కేంద్రం చేష్టలుడిగి చూస్తోంది. రెండు (తెలంగాణ, ఏపీ) రాష్ట్రాలకూ ఎలాంటి ప్రోత్సాహకాలు ఇవ్వలేదు. హామీల అమలు ఊసే లేకపోవడంతో రెండు రాష్ట్రాలు ఇబ్బంది పడుతున్నాయి. నదీ జలాల వివాదాలను పరిష్కరించకపోవడంతో అనవసర ఘర్షణ తలెత్తుతోంది. కేంద్రం తీరుతో ఇరు ప్రభుత్వాలు, రైతులు గోస పడుతున్నారు.


జాతీయ రాజకీయాల్లో టీఆర్‌ఎస్‌ పాత్ర ఏంటి?
– సీఎం కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయాలు దేశానికి దిక్సూచిలా మారాయి. అనేక రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం మన పథకాలను కాపీ కొట్టడమే దీనికి ఉదాహరణ. ఇలా దేశ రాజకీయాల్లో ఇప్పటికే ముద్ర వేసిన టీఆర్‌ఎస్, కేసీఆర్‌.. భవిష్యత్తులో జాతీయస్థాయిలో ఏ తరహా పాత్ర పోషించాలో చాలా విస్తృతంగా చర్చించాం. 2014కు ముందు మోదీ ఎవరో దేశానికి తెలియకున్నా ‘గుజరాత్‌ మోడల్‌’ను దేశమంతా అమలు చేస్తామంటూ బీజేపీ అధికారంలోకి వచ్చింది. కానీ ఈ ఎనిమిదేళ్లలో నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, గ్యాస్, పెట్రో ధరలు 30, 40 ఏండ్లలో ఎన్నడూ లేనంతగా పెరిగాయి. ఇప్పుడు కావాల్సింది ‘గోల్‌మాల్‌ గుజరాత్‌ మోడల్‌కాదు.. గోల్డెన్‌ తెలంగాణ మోడల్‌’. రాష్ట్రంలో విద్యుత్, తాగునీరు, పారిశ్రామీకరణ, వ్యవసాయం, ఐటీ, పర్యావరణం వంటి అనేక రంగాల్లో సాధించిన సమగ్రాభివృద్ధి నమూనాను దేశానికి పరిచయం చేయాలని నిర్ణయించాం.


కేసీఆర్‌ను కలుపుకొని పోయే పార్టీల సంగతేంటి?
– దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ పార్టీలకు స్థానిక ఎజెండా ఉంది. కలుపుకొని వెళ్లేందుకు, కలిసి వచ్చేందుకు చాలా పార్టీలు సిద్ధంగా ఉన్నా.. ఎవరి ఇబ్బందులు, పరిస్థితులు, ఎజెండా వారికి ఉన్నాయి. అందరం ఏ తరహాలో కలిసి పనిచేయాలనే దానిపై గతంలో చర్చ జరిగింది, భవిష్యత్తులోనూ జరుగుతుంది. అయితే సమయం, సందర్భం రావాలి.


కేసీఆరే వ్యూహకర్త అన్నప్పుడు.. ప్రశాంత్‌ కిషోర్‌ ఎందుకు?
– కేసీఆర్‌ను మించిన వ్యూహకర్త దేశంలోనే ఎవరూ లేరు. ఆయనకు ఎవరూ అవసరం లేదు. ప్రశాంత్‌ కిషోర్‌ ఎన్నికల్లో గెలిపించలేరు, ఓడించలేరు. కానీ తన శక్తిని జోడించగలరు. 2014లో మేం అధికారంలోకి వచ్చేనాటికి పదేళ్ల వయసున్న పిల్లలు ఇప్పుడు ఓటర్లు అయ్యారు. వారికి కేసీఆర్‌ సీఎంగానే తెలుసు. ఉద్యమకారుడిగా తెలంగాణ ఎలా సాధించారో తెలియదు. మారుతున్న కాలం, సమాజం, తరానికి అనుగుణంగా సామాజిక మాధ్యమాల్లో వారిని ఆకట్టుకునేందుకు ప్రశాంత్‌ కిషోర్‌ వంటి వ్యక్తులు అవసరమని భావిస్తున్నాం. పార్టీలో సరుకుంటేనే ఏదైనా చేయొచ్చు. ప్రజలు తిరస్కరించే మూడ్‌లో ఉంటే ఎవరూ కాపాడలేరు. ఏపీలో జగన్‌ సీఎం కావాలనే భావన ప్రజల్లో ఉంది. పీకే దానికి కొంత జోడించారు. పీకే కాంగ్రెస్‌లో చేరుతున్న విషయం మీడియాలో చూశా.


బీజేపీ జైశ్రీరాం, హిందూత్వ నినాదాల మీద మీ అభిప్రాయమేంటి?
– దేశంలోని 28 రాష్ట్రాల్లో సీఎం కేసీఆర్‌ తరహాలో యాగాలు చేసినవారు, గుడులు కట్టినవారు, హైందవ ధర్మాన్ని ఆచరించే వారు ఎవరైనా ఉన్నారా? మేం హిందువులం కాదా? మాకు భద్రాచల రాముడు లేడా? భద్రాచలం సహా రాష్ట్రంలోని ఏ ఒక్క ప్రధాన ఆలయానికి నిధులు తేలేని బీజేపీకి.. తెలంగాణలో జైశ్రీరాం నినాదం ఇచ్చే హక్కు ఉందా? రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎంపీలు పూజకు పనికిరాని పూల వంటివారు. వాళ్లు జైశ్రీరాం అనగానే గందరగోళం చెందాలా? దేవుళ్ల పేరిట ఓట్లు అడగటం, హైందవ ధర్మాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయం చేయడం మా పద్ధతికాదు. హిందూత్వ అనేది ఒక జీవన విధానం. అది ఒక పార్టీకో, సంస్థకో సంబంధించిన విషయం కాదు. ప్రజల సమష్టి పోరాటంతో సాధించిన తెలంగాణ ఏ ఒక్క వ్యక్తితో, వర్గానికో, కులానికో, మతానికో పరిమితం కాదు. రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో బీజేపీకి వందకుపైగా సీట్లలో డిపాజిట్లు కూడా రావు. ఆ పార్టీ సమాజంలో తక్కువ, సామాజిక మాధ్యమాల్లో ఎక్కువగా ఉంటోంది. వాపును చూసి బలుపు అనుకుంటోంది.


అక్రమ కేసులు పెట్టారన్న బండి సంజయ్, రేవంత్‌ల ఆరోపణలపై స్పందన?
– వారు సక్రమ వ్యక్తులు అయితే అక్రమ కేసులు ఎందుకు పెడతాం. ఒకాయన ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికారు. మరొకరు తంబాకు నములుతూ కరీంనగర్‌ గల్లీలో తిరిగి, అకస్మాత్తుగా అదృష్టవశాత్తూ ఎంపీ అయ్యారు. మేం వ్యవస్థను దుర్వినియోగం చేస్తే వీళ్లు బయట తిరుగుతారా? ప్రజాస్వామ్యంలో ప్రజలే చూసుకుంటారు. బండి సంజయ్‌ పాదయాత్ర అసమర్థుని పాదయాత్ర, సన్నాసుల పాదయాత్ర.


సోషల్‌ మీడియాలో ప్రచారాలపై ఏమంటారు?
– సోషల్‌ మీడియాలో కొన్ని అసాంఘిక శక్తులు దూరి.. కేసీఆర్‌ ఒక్కరనే కాదు, తమకు ఇష్టంలేని వారిపై బురద చల్లుతున్నాయి. వాటిని నియంత్రిస్తే నియంత అని విమర్శిస్తారు. సామాజిక మాధ్యమాల్లో స్వీయ నియంత్రణ అవసరం. ఉన్న చట్టాలతోపాటు కొత్త చట్టాలతో ఇలాంటి అసాంఘిక శక్తులను నియంత్రించాల్సి వస్తుందేమో!


ఖమ్మం ఘటన, బీజేపీ వైఖరిపై మీ స్పందన ఏంటి?
– ఖమ్మంలో బీజేపీ బలమెంత? ఎందుకు రెచ్చగొడుతున్నారు? వాళ్ల ఎజెండా ఒక్కటే.. రెచ్చగొట్టి, శాంతిభద్రతల సమస్య సృష్టించి శవ రాజకీయం చేయడమే. వరి కొనుగోళ్ల విషయంలోనూ రైతులను రోడ్ల మీదకు తెచ్చి శవ రాజకీయాలు చేయాలని బీజేపీ కుట్ర పన్నింది. రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్‌ ఇచ్చిన రీతిలో రైతాంగాన్ని కాపాడుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేస్తోంది. మిల్లర్లతో కలిసి కుంభకోణం చేస్తున్నామంటూ ఆరోపణలు చేస్తున్న కిషన్‌రెడ్డికి విషయ పరిజ్ఞానం లేదు. ఆదానీ, అంబానీ కలిస్తే ప్రధాని అనే ఆరోపణలు వస్తున్నాయి. రఫేల్‌ కుంభకోణంలో మోదీ లక్షల కోట్లు తిన్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఇలా ఎన్నైనా చేయొచ్చు. బీజేపీ, మోదీ తెలంగాణ వ్యతిరేకులు.

కేసీఆర్‌ను జైల్లో పెడతామని వారు వ్యాఖ్యలు చేస్తున్నారు. మోదీని జైల్లో పెడతామని మేమూ అనాలా?
కుటుంబ పాలన ఆరోపణల సంగతేమిటి?

– మమ్మల్ని విమర్శించేందుకు విపక్షాలకు అంశాలేవీ లేవు. రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత కరెంటు, ఇంటింటికి తాగునీరు వంటివి మేం ఒక్కరమే అనుభవిస్తున్నామా? మీడియా కోసమే విమర్శలు, ఆరోపణలు. బీజేపీలో వారసులు లేరా? అమిత్‌షా కొడుకు జైషా బీసీసీఐ కార్యదర్శి ఎలా అయ్యాడు? బీజేపీలో వారసుల జాబితా చాలా పెద్దది. మేం ఉద్యమంలో రోడ్ల మీద కొట్లాడాం, జైలుకు వెళ్లాం. ప్రజల ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాం.


గవర్నర్‌ తమిళిసైని అవమానిస్తున్నారనే ఆరోపణలపై వివరణ
– గౌరవ మర్యాదలు పరస్పరం ఇచ్చిపుచ్చుకోవాల్సినవి. గవర్నర్‌ తమిళిసై రాష్ట్రాన్ని, ప్రజలను అవమానిస్తున్నారు. రాష్ట్రానికి మోదీ ఇవ్వని మెడికల్‌ కాలేజీలను ఇచ్చినట్టు గవర్నర్‌ మాట్లాడుతున్నారు. 105 మంది ఎమ్మెల్యేలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని 15 రోజుల్లో పడగొడతానని మాట్లాడటం తెలంగాణ ప్రజలను అవమానించడం కాదా? గవర్నర్‌ వ్యవస్థలో రాజకీయేతరులు ఉండాలని గుజరాత్‌ సీఎంగా ఉన్నప్పుడు మోదీ అన్నారు. ఇప్పుడు తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలిని తెలంగాణ గవర్నర్‌గా నియమించారు. ప్రత్యర్థి పార్టీలున్న చోటే గవర్నర్‌ వ్యవస్థతో విరోధం ఎందుకు వస్తోంది? పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర ఇలా రాజకీయ ప్రత్యర్థులు అధికారంలో ఉన్నచోట గవర్నర్, దర్యాప్తు సంస్థలను అడ్డుపెట్టుకుని బీజేపీ డ్రామాలు ఆడుతోంది.


111 జీవో రద్దు అంశంలో ఆరోపణలపై సమాధానం?
– ఈ జీవో రద్దుకు సంబంధించి 2014 ఎన్నికల్లో అన్ని పార్టీలు హామీ ఇచ్చాయి. మేం ఇచ్చిన హమీ మేరకు 80 గ్రామాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని రద్దు చేశాం. నాకు అక్కడ భూములు ఉంటే ఆధారాలు ఇవ్వండి.


కొత్త సచివాలయంలో కేటీఆర్‌ను కొత్త సీఎంగా చూడవచ్చా?
– నాకు అలాంటి పెద్ద ఆశలు లేవు. మంత్రి అవుతా అనుకోలేదు. సిరిసిల్ల ప్రజల ఆశీస్సులతో మంత్రినయ్యా. మంచి మెజారిటీతో టీఆర్‌ఎస్‌ మూడోసారి అధికారంలోకి రావాలి. దేశంలో తెలంగాణ అగ్రశ్రేణి రాష్ట్రంగా వెలుగొందాలన్నదే నా కోరిక.


మోదీ–ఈడీ.. జుమ్లా–హమ్లా..
► సీబీఐ, ఈడీ తదితరాలన్నీ ప్రధాని మోదీ జేబుసంస్థలుగా మారిపోయాయి. ప్రతిపక్షాల ప్రభుత్వాలు ఉన్నచోట వీటిని మోదీ కనుసన్నల్లో వేటకుక్కల్లా ఉసిగొల్పుతారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దాడులు జరగకపోవడం.. బీజేపీలో చేరిన తర్వాత సుజనా చౌదరి, సీఎం రమేశ్‌ వంటి వారిపై దాడులు ఆగడం దీనికి ఉదాహరణ. ‘మోదీ–ఈడీ, జుమ్లా– హమ్లా..’ ఇదీ మోదీ మార్కు డబుల్‌ ఇంజిన్‌ గ్రోత్‌. మోదీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించిన ఆకార్‌ పటేల్, ఎమ్మెల్యే జిగ్నేష్‌ మేవానీ అరెస్టు వంటివి బీజేపీ బెదిరింపులకు అద్దంపడుతున్నాయి.


డ్రగ్స్‌కే కాదు.. ఏ టెస్టుకైనా రెడీ
► పాశ్చాత్య సంస్కృతిలో భాగంగా పబ్, క్లబ్‌ కల్చర్‌ విస్తరిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఈ సమస్యను ఎదుర్కొనాలి. నేను మంత్రిని, సీఎం కొడుకును కావ డంతో నోటికొచ్చినట్టు ఆరోపణలు చేస్తు న్నారు. నేను డ్రగ్‌ టెస్ట్‌కే కాదు.. ఏ తరహా పరీక్షకైనా సిద్ధం. రేవంత్‌రెడ్డి సీరియల్‌ కిల్లర్‌ అని, బండి సంజయ్‌ బ్యాంకులను ముంచాడని ఆరోపిస్తే సరిపోతుందా? నేను డ్రగ్‌ టెస్ట్‌లో కడిగిన ముత్యంలా బయటికొస్తే నాపై ఆరోపణలు చేస్తున్నవారు బహిరంగ క్షమాపణ చెప్తారా?

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.