– పునరుద్ధరణతో పల్లె ప్రగతి.. పూడికతో పంటలకు మేలు – చెరువు పనుల ప్రారంభోత్సవంలో ప్రజాప్రతినిధులు గురువారం పలుచోట్ల చెరువుల పునరుద్ధరణ కార్యక్రమంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, జర్నలిస్టులు తదితరులు పాల్గొని పనులను ప్రారంభించారు. పూడిక మట్టితో పంటలకు మేలు కలుగుతుందని, రైతులు మట్టిని పొలాలకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.

ఉమ్మడి రాష్ట్రంలో చెరువుల విధ్వంసం ఉమ్మడి రాష్ట్రంలో చెరువుల విధ్వంసం జరిగిందని, అప్పటి ప్రభుత్వాలు అన్నిరంగాల్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం చేశాయని అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవెందర్‌రెడ్డి పేర్కొన్నారు. మెదక్ జిల్లా సంగారెడ్డి మండలం కవలంపేటలోని ఓదాన్ చెరువులో పూడికతీత పనులను ప్రెస్ అ కాడమీ చైర్మన్ అల్లం నారాయణతో కలిసి ఆమె ప్రారంభించారు. చెరువు పనుల పర్యవేక్షణ బాధ్యతలను టయూడబ్ల్యుజే తీసుకోవడానికి ముందుకురావడం సంతోషకరమన్నారు. సమైక్య ప్రభుత్వాలు తెలంగాణకు ప్రాణాధారమైన చెరువులను విధ్వంసం చేసి పల్లె ప్రగతిని నాశనం చేశారని ఆందోళన వ్యక్తం చేశారు.
ఉద్యమించి సాధించుకున్న రాష్ట్రంలో ధ్వంసమైన చెరువులను పునరుద్ధరించడానికి ప్రభుత్వం మొదటి ప్రాధాన్యం ఇచ్చిందన్నారు. దీంతో భూగర్భజలాలు పెరిగి బోరుబావుల్లోకి నీరొస్తుందన్నారు. చెరువు మట్టిని పొలాలకు తరలించుకోవడం ద్వారా భూములు సారవంతమవుతాయన్నారు. ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ మాట్లాడుతూ ఊరి జలవనరు చెరువని, పల్లె ప్రగతికి ప్రాణాధారమన్నారు. ఉద్యమ సమయంలో చెరువుల గురించి మాట్లాడుకున్నామని, విధ్వంసంపై విస్తృతంగా చర్చ జరిగేలా చూశామన్నారు. తెలంగాణ ప్రాంత ప్రాజెక్టులు పూర్తికాకుండా గత పాలకులు మోసం చేశారని మండిపడ్డారు. మేజర్ ఇరిగేషన్ మనకు చెరువులేనని, ఊరి జలవనరులైన చెరువును నాటి పాలకులు పూర్తిగా ధ్వంసం చేశారన్నారు. చెరువుల మరమ్మతు ద్వారా గ్రామాలకు పూర్వవైభవం రానున్నదని ఆనందం వ్యక్తం చేశారు. దేశంలో ఇప్పటికి 60శాతం మంది వ్యవసాయంపైనే ఆధారణపడి జీవిస్తున్నారన్నారు. ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ కవలంపేట ఓదాన్ చెరువు అభివృద్ధికి నిధులు అందించడానికి పూర్తి సహకారం అందిస్తానన్నారు. తెలంగాణను సస్యశ్యామలం చేయాలనే లక్ష్యంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్‌బొజ్జా, ఇరిగేషన్ ఎస్‌ఈ సురేంద్ర, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు మురళీయాదవ్, టీ న్యూస్ ఇన్‌పుట్ ఎడిటర్ పీవీ శ్రీనివాస్, టీయూడబ్ల్యుజే నాయకులు పల్లె రవి, జిల్లా అధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి, వెంకటేశ్వర్లు, యాదగిరి, వేణుగోపాల్‌రెడ్డి, జానకీరాం, విష్ణు జర్నలిస్టులు, గ్రామ ఇన్‌చార్జి సర్పంచ్ రవికుమార్, ఎంపీటీసీ తదితరులు పాల్గొన్నారు.

నల్లగొండ జిల్లా కట్టంగూర్ పెద్దచెరువు మరమ్మతుల పనులను ఎమ్మెల్యే వీరేశం, డిండి మండలం సింగరాజుపల్లి పంచాయతీ పరిధిలోని లింగాల చెరువు పూడికతీత పనులను జెడ్పీ చైర్మన్ బాలూనాయక్, డీఎస్పీ చంద్రమోహన్‌తో కలిసి ప్రారంభించారు. నిజామాబాద్ మండలం నర్సింగ్‌పల్లి, భైరాపూర్ గ్రామాల్లోని చెరువు పనులను రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, నందిపేట మండలం బాద్గుణలోని మల్లప్పకుంట, షాపూర్‌లో జంగంకుంట, మారంపల్లిలోని సత్తర్‌కుంటల్లో పనులను ఆర్మూర్ నియోజకవర్గ టీఆర్‌ఎస్ వ్యవహారాల ఇన్‌చార్జి, జిల్లా అడ్‌హక్ కమిటీ సభ్యుడు ఆశన్నగారి రాజేశ్వర్‌రెడ్డి ప్రారంభించారు.
జోరుగా లోకిరేవు పెద్దచెరువు పనులు
మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేట మండలం లోకిరేవులోని పెద్ద చెరువు పనులు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటీకే సుమారు 85 ఎకరాలకు ఒండ్రుమట్టిని తీసుకెళ్లారు. 110 ఏండ్ల చరిత్ర ఉన్న చెరువు సీమాంధ్ర పాలకులు పట్టించు కోకపోవడంతో పూడిక నిండి పిచ్చి మొక్కలు పెరిగాయి. దీంతో వర్షాలు కురిసినా నీరు నిలిచేది కాదు. 160 ఎకరాల ఆయకట్టు ఉన్న ఈ చెరువు పనులను మంత్రి డాక్టర్ సీ లకా్ష్మరెడ్డి ప్రారంభించారు. చెరువు అభివృద్ధికి ప్రభుత్వం రూ.35.35 లక్షలు మంజూరు చేసింది. పనులు పూర్తయితే ఆయకట్టు 250 ఎకరాలకు పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు.