అదో చారిత్రక నేల! వందల ఏండ్ల క్రితం కాకతీయ పాలకులు తవ్వించిన చెరువుల్లో ఒకటైన రా సముద్రం చెరువు అక్కడే ఉంది! అంతకు మించి.. అదే కాకతీయ పాలకుల్లో మణిరత్నం.. రాణీ రుద్రమదేవి వీరమరణం పొందింది కూడా ఆ ప్రాంతంలోనే! తెలంగాణలో అంతటి చారిత్రక ప్రాశస్థ్యం కలిగిన ఆ నేలపై.. నాటి కాకతీయ పాలకులకు నిజమైన వారసుడిగా.. తెలంగాణకు కొత్త చారిత్రక ప్రాముఖ్యం కల్పించేందుకు కంకణబద్ధులైన ముఖ్యమంత్రి అడుగుపెట్టారు! పెద్ద చెరువుగా కూడా పిలిచే ఉన్నరా సముద్రం చెరువు పునరుద్ధరణ పనుల్లో స్వయంగా పాల్గొన్నారు! ఎడ్లబండిపై ఊరేగింపుగా వెళ్లి.. గడ్డ పలుగు చేతబట్టి.. పూడిక మట్టిని తవ్వి.. స్వయంగా తట్ట మోశారు! రాణిరుద్రమదేవి అమరత్వం పొందిన విషయాన్ని ప్రకటించే శాసనాన్ని పరిశీలించి.. ఈ నేలకున్న చారిత్రక ప్రఖ్యాతిని స్మరించుకుంటూ.. కాకతీయ, రెడ్డిరాజుల సాగునీటి ప్రణాళికలు వివరిస్తూ.. వాటిని ఆంధ్ర రాజులు నిర్వీర్యం చేసిన తీరును తేటతెల్లం చేశారు. ఆనాటి వైభవాన్ని.. చరిత్రను మళ్లీ వెలుగులోకి తెస్తామని ప్రతినబూనారు! మిషన్ కాకతీయతో చెరువులకు పట్టిన దరిద్రం దెబ్బకు పోవాలని పిలుపునిచ్చారు!

-నల్లగొండ జిల్లా చందుపట్లలో సీఎం కేసీఆర్ పర్యటన.. -పెద్ద చెరువు పునరుద్ధరణకు శ్రీకారం -చెరువు అభివృద్ధికి అదనంగా 1.5 కోట్లు .. -రాష్ర్టాభివృద్ధిని ఆంధ్ర రాజులు ఆగం చేశారని ఆగ్రహం -రాణీ రుద్రమ మరణ శాసనాన్ని పరిశీలించిన కేసీఆర్ -రాష్ర్టాన్ని నం.1గా నిలపడమే సీఎం లక్ష్యం: మంత్రి జగదీశ్‌రెడ్డి మిషన్ కాకతీయ పథకంలో భాగంగా నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలం చందుపట్ల గ్రామంలోని పెద్ద చెరువు (రా సముద్రం) పునరుద్ధరణ పనులను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆదివారం స్వయంగా ప్రారంభించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. కాకతీయులు, రెడ్డి రాజులు 11వ శతాబ్దంలోనే తెలంగాణ ప్రాంతంలో వాటర్‌షెడ్ నిర్మాణం చేపట్టారని చెప్పారు. ఆ తర్వాత వచ్చిన ఆంధ్ర రాజులు అలనాటి చెరువులను ఆగం చేశారని అన్నారు. తెలంగాణకు సాగునీటిని పరిచయం చేసిన కాకతీయులు తవ్వించిన చారిత్రక పెద్ద చెరువులో మనం ఉన్నామని చెప్పిన కేసీఆర్.. రాణీ రుద్రమదేవీ సేనాని మల్లికార్జునుడు ఈ చందుపట్ల ప్రాంత వాసి అని తెలిపారు.
ఇక్కడ కాయస్త అంబదేవుడితో జరిగిన యుద్ధంలోనే రుద్రమ వీర మరణం పొందారని వివరించారు. ఇంతటి చరిత్ర కలిగిన ప్రాంతం గొప్పతనం ఆంధ్ర పాలనలో మనకు తెలియలేదని సీఎం అన్నారు. హైదరాబాద్‌కు సమీపంలో ఉన్నా ఇలాంటి చారిత్రక ప్రాంతాన్ని వెలుగులోకి రానివ్వలేదని విమర్శించారు. ఈ చెరువు మధ్యలో పెద్ద గుండు ఉండేదని.. వర్షం వచ్చినప్పుడు దాని కింద తలదాచుకునే వాళ్లమన్న ఎమ్మెల్యే వీరేశం మాటలు ప్రస్తావిస్తూ.. ఆంధ్రా పాలకులు ఇప్పుడు ఆ గుండు కనపడకుండా గుండు కొట్టారని దుయ్యబట్టారు.

పెద్ద చెరువు పనులకు మరో రూ.1.5 కోట్లు మంజూరు రెండున్నర కిలోమీటర్ల పొడవైన కట్టతో అతి విశాలంగా కనిపిస్తున్న చెరువు చిన్నపాటి ప్రాజెక్టును తలపిస్తున్నదని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. చెరువుకు ఎగువన ఏఎమ్మార్పీ కాల్వ వెళ్తున్నా.. అక్కడినుంచి నీళ్లు తేవాలనే సోయి గత పాలకులకు లేకపోయిందని ఎద్దేవా చేశారు. ఇప్పటికే ఈ చెరువు పునరుద్ధరణకు కేటాయించిన రూ.54 లక్షలతో 110 ఎకరాల విశాలమైన శిఖం తవ్వడం సాధ్యం కాదని.. అందుకే అదనంగా మరో రూ.1.5 కోట్లు మంజూరు చేస్తున్నానని సీఎం ప్రకటించారు.
మొత్తం రెండు కోట్లతో జూలై వరకు పునరుద్ధరణ పనులు పూర్తిచేయాలని ఆదేశించారు. దెబ్బకు చెరువు దరిద్రం పోవాలని కాంక్షించారు. పనులు విజయవంతం చేస్తే నకిరేకల్ నియోజకవర్గ అభివృద్ధికి మరో రూ.5 కోట్లు ప్రత్యేక బహుమతిగా ఇస్తానని సీఎం ప్రకటించారు. స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి, నాయకులు దగ్గరుండి పనులు పూర్తి చేయించాలని చెప్పారు. పూడికతీత తర్వాత ఫీడర్ చానల్ ద్వారా నీళ్లు తీసుకొస్తామన్నారు.
1974 బచావత్ ట్రిబ్యునల్ తీర్పును ప్రస్తావించిన సీఎం.. నల్లగొండ జిల్లాలో మొత్తం 4,762 చెరువులు ఉన్నాయని చెప్పిన కేసీఆర్.. తుంగుతుర్తి ప్రాంతంలోని పెద్ద పెద్ద చెరువులను, శాలిగౌరారం చెరువునూ ప్రత్యేకంగా ప్రస్తావించారు. కాకతీయుల నుంచి అసఫ్‌జాహీల కాలం వరకూ ఉన్న ప్రాజెక్టులను అంచనాలో ఉంచుకుని, 1974లో బచావత్ ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చిందని తెలిపారు. గోదావరి బేసిన్‌లో 175 టీఎంసీలు, కృష్ణా నుంచి 93 టీఎంసీలను తెలంగాణ ప్రాంతానికి కేటాయించిందని అవి మన ఆస్తి అయినా రాకుండా తన్నుకుపోయారని కేసీఆర్ తెలిపారు. 265 టీఎంసీల నీరు తెలంగాణకు దక్కితే.. వరుసగా మూడేండ్లు కరువు వచ్చినా మన ప్రాంతంలో పంటలకు కొదవ ఉండేది కాదని అభిప్రాయపడ్డారు. అతి త్వరలోనే మరోసారి నకిరేకల్ నియోజకవర్గంలో ఒకరోజు పూర్తిస్థాయి పర్యటనకు వస్తానని చెప్పారు.
చందుపట్లను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతా.. చారిత్రక నేపథ్యం ఉన్న చందుపట్ల గ్రామాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతానని సీఎం హామీ ఇచ్చారు. కాకతీయ వీరవనిత రుద్రమదేవి యుద్ధం చేసిన ఈ ప్రాంతంలో ఆ పోరాటం స్ఫురించేలా విగ్రహం ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రతి ఏటా ఉత్సవాలు నిర్వహిస్తామన్నారు. కాకతీయ రాజులను స్మరించుకుందామని, గ్రామంలో కాకతీయ ఆర్చీని నిర్మించేందుకు చర్యలు తీసుకుంటానని చెప్పారు.
ఉత్సాహంగా సాగిన కేసీఆర్ ప్రసంగం.. మిట్ట మధ్యాహ్నం వేళ చారిత్రక చెరువులో సీఎం కేసీఆర్ ప్రసంగం ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. సీఎం ప్రసంగిస్తుండగా.. దూరాన ఒక వ్యక్తి ఏదో మాట్లాడుతున్నట్లు గమనించిన సీఎం నేనిక్కడ అరుస్తుంటె. నువ్వక్కడ అరవబడితివి. జనం ఎవల్ది వినాలె అంటూ చురకంటించారు. వెంటనే ఆయన మా దోస్తే.. ఇసుంట తీస్కరండి అని పోలీసులను ఆదేశించారు. ఎంత దోస్తులమైనా సభల మాట్లాడుకుంటమా.. కాసేపు కూసో మాట్లాడుత అని సభా వేదికపై ఆయనను తన సీట్లో కూర్చోబెట్టిన కేసీఆర్.. మీటింగ్ ముగిసిన తర్వాత అతనితో ప్రత్యేకంగా సంభాషించారు.
రాష్ర్టాన్ని నం.1గా నిలపడమే సీఎం లక్ష్యం: మంత్రి జగదీశ్‌రెడ్డి రాష్ర్టాన్ని అన్ని రంగాల్లోనూ ముందుకు నడిపి, దేశంలో నం.1గా నిలిపి, బంగారు తెలంగాణగా మలచాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని విద్యుత్ శాఖ మంత్రి జీ జగదీశ్‌రెడ్డి అన్నారు. ఆయన ప్రయత్నానికి మనమంతా మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉందని చెప్పారు. వెయ్యేండ్ల క్రితమే కాకతీయులు తవ్వించిన చెరువులను ఇప్పుడు పునరుద్ధరించే కార్యక్రమంలో చారిత్రక ప్రదేశానికి వచ్చిన సందర్భాన్ని గుర్తు చేసిన మంత్రి.. రైతులు పెరుగన్నం తిని, ఇంటి ముందు మంచం మీద నిద్రించే చేసే దిశగా కేసీఆర్ పాలన సాగుతున్నదని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వంపై అవాకులు పేలిన వాళ్లంతా.. విద్యుత్, నీటిపారుదల, అన్ని రంగాల్లోనూ జరుగుతున్న అభివృద్ధి గురించి ఏమీ మాట్లాడలేకపోతున్నారని అన్నారు.
ముఖ్యమంత్రికి కళారూపాలతో ఘన స్వాగతం.. నల్లగొండ నుంచి నకిరేకల్‌కు హెలికాప్టర్‌లో మధ్యాహ్నం 1.20 నిమిషాలకు చేరుకున్న సీఎంకు మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎంపీ బూర నర్సయ్యతోపాటు పలువురు నాయకులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. తర్వాత చందుపట్ల పెద్ద చెరువు పునరుద్ధరణ పనులు ప్రారంభించేందుకు చెరువు వద్దకు వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కాన్వాయ్ దిగగానే మహిళలు పూల వర్షం కురిపించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మహిళా కోలాట బృందాలు, బోనాలతో పెద్ద ఎత్తున స్వాగతం పలికారు.
చిందు కళాకారుల నృత్యాలు, చిరుతలు, డప్పు కళాకారులు, పీర్లు, కాటికాపరులు, మత్స్యకారులు వలలతో, ఎడ్లబండ్లతో ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు. కట్ట ప్రారంభం నుంచి చెరువు మధ్య వరకు ఎద్దుల బండిపై మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యే వీరేశంతో కలిసి ప్రయాణించిన ముఖ్యమంత్రి తలపాగా చుట్టి.. గడ్డపారతో పూడిక మట్టిని తవ్వి పనులను ప్రారంభించారు. అనంతరం గంపలతో మట్టిని ట్రాక్టర్‌లోకి ఎత్తిపోశారు. కార్యక్రమంలో పార్లమెంటరీ కార్యదర్శి గాదరి కిశోర్‌కుమార్, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్, జడ్పీ చైర్మన్ బాలునాయక్, ఎమ్మెల్యేలు వేముల వీరేశం, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, పైళ్ల శేఖర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు పూల రవీందర్, యాదవరెడ్డి, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు బండా నరేందర్‌రెడ్డి, కలెక్టర్ సత్యనారాయణరెడ్డి పాల్గొన్నారు.
రుద్రమ మరణ శాసనాన్ని పరిశీలించిన సీఎం.. నకిరేకల్ నుంచి రోడ్డు మార్గాన చందుపట్లకు బయల్దేరిన కేసీఆర్.. గ్రామ శివారులో ఉన్న రాణి రుద్రమదేవి మరణ శాసనాన్ని, బయల్పడిన రాతి విగ్రహాలను, శిల్పాలను పరిశీలించారు. శిలా శాసనానికి పూలమాలలు వేశారు. వివరాలు అడిగి తెలుసుకున్న ముఖ్యమంత్రి.. వెలికి తీసిన వివేకానంద యువజన మండలి ప్రతినిధులను అభినందించారు. సీఎంకు యువకులు వినతిపత్రం అందజేయగా.. పర్యాటకంగా, చారిత్రకంగా అభివృద్ధి చేసే అంశాన్ని ఇక మీరు మరిచిపోవచ్చని.. ప్రభుత్వం అన్నీ చూసుకుంటుందని హామీ ఇచ్చారు.
నీలాంటి వనితలు ఊరికిద్దరుంటే ఎవరితోనైనా పోరాడత : కేసీఆర్ చందుపట్ల పెద్ద చెరువుకు ఫీడర్ చానల్ ద్వారా నీటిని తీసుకొచ్చే అంశాన్ని సీఎం ప్రస్తావిస్తున్న సమయంలో పుట్ట జానకమ్మ అనే మహిళ గట్టిగా మాట్లాడారు. దీనికి సీఎం స్పందిస్తూ.. ఏందమ్మా.. ఏమో అంటున్నవ్ అన్నారు. దీనికి ఆమె మాట్లాడుతూ ఆంధ్రకు పోయే నీళ్లు మలుపుకొస్తెనే మా శెరువు నిండుతది సార్ అని చెప్పారు. ఆ మాట విన్న కేసీఆర్ నీలాంటి వీర వనితలు ఊరికి ఇద్దరుంటే నేను ఎవ్వరితోనైనా పోరాడత అని చెప్పారు. అప్పుడే ఆమెను కూడా సభా వేదికపైకి పిలిపించారు. ఆమె వివరాలు, ఫోన్ నంబర్ తీసుకోమని అధికారులను ఆదేశించారు.