-ప్రతి చెరువుకూ ప్రత్యేక నంబర్ -265టీఎంసీల నీటినిల్వ లక్ష్యం -మంత్రి హరీశ్‌రావు వెల్లడి
చెరువులు, కుంటలను కబ్జాలబారి నుంచి కాపాడేందుకు ప్రజలను భాగస్వాములను చేస్తూ సోషల్ ఫెన్సింగ్ కార్యక్రమం రూపొందించనున్నట్లు నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. తెలంగాణలో చిన్ననీటివనరుల నిర్వహణ అనే అంశంపై ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ (ఐపీపీఏ), మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఎంసీహెచ్ఆర్డీ) సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన సదస్సులో ఆయన మాట్లాడుతూ దేశంలోనే అత్యధిక సంఖ్యలో చెరువులు, కుంటలు, చిన్ననీటి వనరులున్న రాష్ట్రంగా తెలంగాణ గుర్తింపు పొందిందన్నారు.
గత సమైక్య రాష్ట్ర పాలనలో చిన్న నీటి వనరుల నిర్వహణపై విపరీతమైన నిర్లక్ష్యం చూపించడంతో తీవ్ర నష్టం జరిగిందన్నారు. గతంలో తెలంగాణలో చెరువులు, కుంటలకు 265 టీఎంసీల నీటిని బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిందని, ప్రస్తుతం మిషన్ కాకతీయ ద్వారా ఆ సామర్థ్యాన్ని అందుకునే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో 46వేలకుపైగా చెరువులున్నట్లు ప్రాథమికంగా అంచనాకు వచ్చామని, ప్రతియేటా 9వేల చెరువుల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించామని మంత్రి హరీశ్‌రావు తెలిపారు.
ఈ చెరువులన్నింటి వివరాలను ఆన్లైన్లో నమోదుచేసి ప్రతి చెరువుకూ ఓ ప్రత్యేకమైన నంబర్‌ను కేటాయిస్తామని, దానివల్ల ఫుల్ట్యాంక్ లెవల్(ఎఫ్టీఎల్)ను అతిక్రమించి కబ్జాలకు పాల్పడే అవకాశముండదన్నారు. పట్టణ ప్రాంతాల్లోని చెరువుల పరిరక్షణ బాధ్యతను స్థానిక కాలనీ సంక్షేమ సంఘాలకే అప్పగించే ప్రతిపాదన పరిశీలనలో ఉందన్నారు.
చెరువుల చుట్టూ వాక్‌వేలు, గ్రీనరీని ఏర్పాటుచేయడం వల్ల కబ్జాలకు తావివ్వకుండా చేయవచ్చన్నారు. ఇప్పటికే కబ్జాలకు గురైన చెరువులను పునరుద్ధరించడంతోపాటు ప్రస్తుతమున్న చెరువులను కాపాడేందుకు ఇలాంటి సోషల్ ఫెన్సింగ్ కార్యక్రమం దోహదపడుతుందన్నారు. ఈ సదస్సులో ఎంసీహెచ్ఆర్డీ డీజీ లక్ష్మీపార్థసారథి, పర్యావరణ శాస్త్రవేత్త ప్రొఫెసర్ కే పురుషోత్తంరెడ్డి, పలువురు పర్యావరణవేత్తలు, చెరువుల రక్షణకు పాటుపడుతున్న సంఘాల నేతలు తదితరులు పాల్గొన్నారు.