Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

చెరువులను దత్తత తీసుకోండి

-మిషన్ కాకతీయకు సహకరించండి.. చెరువుకు మీరు కోరుకున్న పేరు -జనవరిలో మీతో టెలీ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతా -తెలంగాణ ఎన్నారైలకు లేఖలో మంత్రి హరీశ్‌రావు

Harish-Rao

రాష్ట్రంలో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చెరువుల పునరుద్ధరణ కార్యక్రమాన్ని ప్రజాభాగస్వామ్య ఉద్యమంగా మలిచేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. అందులోభాగంగా ముందు తెలంగాణ ప్రవాస భారతీయులను ఈ మహోద్యమంలో భాగం చేయాలని నిర్ణయించింది. ఒక్కో ఎన్నారై ఒక్కో చెరువును దత్తత తీసుకొని ఈ బృహత్తర కార్యక్రమానికి సహకరించాలని భారీనీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు విజ్ఞప్తిచేశారు.

ఈ మేరకు ఆదివారం ఎన్నారైలకు ఆయన లేఖ రాశారు. సొంత ఊరికి, స్వదేశానికి దూరంగా ఉన్నప్పటికీ రాష్ట్రం ఏర్పడేందుకు ఎన్నారైలు అందించిన ప్రత్యక్ష, పరోక్ష సహకారాన్ని తెలంగాణ సమాజం మరచిపోదని హరీశ్‌రావు కొనియాడారు. తెలంగాణ ఉద్యమ భావజాలాన్ని ప్రపంచవ్యాప్తం చేయడానికి అమెరికా, కెనడా, ఇంగ్లండ్, దుబాయ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, సింగపూర్, మలేషియాల్లోని ఎన్నారైలు చేసిన కృషి అభినందనీయమన్నారు. రాష్ట్ర ఆకాంక్ష సిద్ధించిన నేపథ్యంలో రాష్ట్ర పునర్నిర్మాణం కోసం ప్రభుత్వం నడుం బిగించిందని వివరించారు.

ఇందులో చెరువుల పునరుద్దరణ ఒక ప్రాధాన్యం కలిగిన అంశమని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో 60 ఏండ్లపాటు సాగునీటిరంగంలో తెలంగాణ అనుభవించిన వివక్షను, జరిగిన నష్టాన్ని పూరించవలసిన ఆవశ్యకతను నొక్కిచెప్పారు. చెరువులను పునరుద్ధరించి వాటి నిల్వ సామర్థ్యాన్ని పూర్తిస్థాయికి పెంచడానికి మిషన్ కాకతీయ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపడుతున్నదని తెలిపారు. ఇప్పటికే ముగ్గురు ఎన్నారైలు వారి ఊరి చెరువులను దత్తత తీసుకోవడానికి సంసిద్ధత వ్యక్తంచేశారని లేఖలో వివరించారు. ఎన్నారైలకు హరీశ్‌రావు రాసిన లేఖలోని ముఖ్యాంశాలు..

తెలంగాణ ప్రభుత్వం మిషన్ కాకతీయ పేరిట చెరువుల పునరుద్ధరణ కార్యక్రమాన్ని చేపడుతున్న సంగతి మీకు ఎరుకే. దక్కన్ పీఠభూమిలో ఉన్న తెలంగాణ.. చెరువుల నిర్మాణానికి అనువైన ప్రాంతం. ఇక్కడ చెరువుల నిర్మాణం శాతవాహనుల కాలం కంటే ముందు నుంచి కొనసాగుతున్నట్లుగా చారిత్రక ఆధారాలు ఉన్నాయి. కాకతీయుల కాలంలో అత్యున్నత ప్రమాణాలతో చెరువులను నిర్మించారు. వారు నిర్మించిన వాటిలో రామప్ప, పాకాల, లక్నవరం, ఘణపురం, బయ్యారంవంటి సముద్రాలను తలపించే చెరువులు ఇప్పటికీ సేవలందిస్తున్నాయి.

కాకతీయుల తర్వాత తెలంగాణను పాలించిన కుతుబ్‌షాహీలు, అసఫ్‌జాహీలు, సంస్థానాధీశులు కూడా తెలంగాణలో చెరువుల నిర్మాణాన్ని కొనసాగించి వ్యవసాయ విస్తరణకు తోడ్పాటునందించారు. పటంచెరువు, హుసేన్‌సాగర్, ఇబ్రహీంపట్నం, ఉదయసముద్రం, పానగల్లు, ధర్మసాగరం, శనిగరం చెరువుల్లాంటివి తెలంగాణలో ఎన్నో ఉన్నాయి. ప్రతి ఊరికి కనీసం ఒక్క చెరువన్న ఉండేది. ఒకటి కన్న ఎక్కువ చెరువులు ఉన్న ఊర్లు కూడా తెలంగాణలో ఎన్నో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణలో అనాధిగా ఉన్న గొలుసుకట్టు చెరువుల వ్యవస్థను నిర్లక్ష్యం చేసి విధ్వంసానికి గురిచేశారు.

60 ఏండ్ల ఉమ్మడిరాష్ట్ర పాలనలో తెలంగాణలో గుణాత్మకమైన పరిణామాలు చోటుచేసుకున్నాయి. తెలంగాణ ఆర్థిక, సాంస్కృతిక జీవనానికి అనాది ఆధారాలుగా ఉన్న గొలుసుకట్టు చెరువుల వ్యవస్థ విధ్వంసం జరిగింది. వాటి నిర్వహణను సీమాంధ్ర వలస ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేయడంతో పూడికలతో నిండిపోయి నిరుపయోగంగా మారాయి. తెగిపోయిన మట్టికట్టలను పునరుద్ధరించలేదు, కూలిపోయిన తూములకు మరమ్మతులు చేయలేదు. అనేక చెరువులు కనుమరుగయ్యే దశకు చేరుకున్నాయి. చెరువులకు నీటిని తీసుకువచ్చే కాలువలు, వాగులు ఆక్రమణలకు గురయినా పట్టించుకోలేదు.

సీమాంధ్ర ప్రభుత్వాల సాగునీటి విధానం అంతా ఆంధ్ర ప్రాంత ప్రయోజనాలను నెరవేర్చేందుకు ఉద్దేశించినదే. భారీ, మధ్యతరహా ప్రాజెక్టుల నిర్మాణానికే పెద్దపీట వేసి తెలంగాణ భౌగోళిక పరిస్థితులకు అనుగుణమైన చిన్న నీటిపారుదలను నిర్లక్ష్యం చేశారు. తెలంగాణకు మైనర్ ఇరిగేషనే మేజర్ ఇరిగేషన్ అన్న సృ్పహ సీమాంధ్ర పాలకులకు లేనేలేదు. చెరువుల వ్యవస్థ విధ్వంసం వల్ల స్వయంపోషక గ్రామాలుగా విలసిల్లిన తెలంగాణ గ్రామాలు.. కరువు పీడిత గ్రామాలుగా మారినాయి. వలసలకు, ఆత్మహ్యతలకు నిలయమైనాయి. వేల మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు.

లక్షల మంది ప్రజలు పొట్ట చేత పట్టుకొని.. ముంబై, బివండి, అహ్మదాబాద్, సూరత్, గల్ఫ్ దేశాలకు వలస పోయారు. తెలంగాణకు న్యాయంగా దక్కవలసిన కృష్ణా, గోదావరి జలాలు దక్కి ఉంటే చిన్న నీటి వనరుల నిర్వహణ, అభివృద్ధి సక్రమంగా జరిగి ఉంటే తెలంగాణ బతుకు చిత్రం భిన్నంగా ఉండేది. ఫజల్ అలీ కమిషన్ సిఫారసుల మేరకు తెలంగాణ ఒక రాష్ట్రంగా కొనసాగి ఉంటే నదీ జలాల్లో తన వాటాను తనే వినియోగించుకొని ఉండేది. చిన్న చెరువులను మరింత అభివృద్ధి పరుచుకొని ఉండేది.

చెరువుల పునరుద్ధరణతో పునర్నిర్మాణం మొదలు సాగునీటి రంగం అభివృద్ధి మీదనే తెలంగాణ పునర్నిర్మాణం ఆధారపడి ఉన్నది. రాష్ట్రంలో వ్యవసాయభివృద్ధి జరిగితే వలసలు ఆగిపోతాయి. రైతుల ఆత్మహత్యలు ఆగుతాయి. గ్రామాల్లో అనేక కులవృత్తులు బతుకుతాయి. వ్యవసాయాభివృద్ధికి చెరువుల పునరుద్ధరణ ప్రధాన చోదకశక్తిగా పనిచేస్తుందని ప్రభుత్వం భావిస్తున్నది. తెలంగాణకు గోదావరి బేసిన్‌లో 175 టీఎంసీలు, కృష్ణా బేసిన్‌లో 90 టీఎంసీలు, మొత్తం 265 టీఎంసీల చిన్ననీటి వనరుల కేటాయింపులు ఉన్నాయి. కానీ తెలంగాణలో చిన్ననీటి వనరుల వినియోగం 90 టీఎంసీలకు మించిలేదు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆదేశాల మేరకు జూలై నెలలో తెలంగాణలో చెరువుల సమగ్ర సర్వే చేపట్టగా మొత్తం చెరువుల సంఖ్య 46,531 అని, ఇందులో గొలుసుకట్టు చెరువులు నాలుగు వేలు అని తేలింది.

ప్రతి ఏడాది 20 శాతం అంటే 9,306 చెరువులను పునరుద్ధరించాలని ప్రభుత్వం భావిస్తున్నది. దీనికోసం అక్టోబర్16న ప్రభుత్వం ఏర్పాటుచేసిన మంత్రివర్గ ఉపసంఘం స్పష్టమైన కార్యాచరణను సిద్ధంచేసింది. ఈ ఏడాది డిసెంబర్ 30కల్లా చెరువుల ఎంపిక, సర్వే, అంచనాల తయారీ, టెండర్ ప్రక్రియ, కాంట్రాక్టర్లతో ఒప్పందాలు తదితర పనులన్నీ పూర్తిచేసి జనవరి మొదటి వారంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేతులమీదుగా చెరువుల పునరుద్ధరణ కార్యక్రమాన్ని ప్రారంభించాలని నిశ్చయించాం.

ఈ కార్యక్రమం వల్ల చెరువు మీద ఆధారపడ్డ రజకులు, కుమ్మరులు, బెస్త, కల్లుగీత, గొర్ల కాపరులు, తెనుగోల్లు, వడ్రంగులు, కమ్మరులు తమ జీవనాన్ని గ్రామంలోనే కొనసాగించేందుకు అవకాశాలు మెరుగుపడతాయి. బతుకమ్మ, కట్టమైసమ్మ బోనా లు, బంజారాల తీజ్, శ్రావణమాసంలో సామూహిక వనభోజనాలు, బెస్తల గంగ జాతర తదితర పం డుగలకు చెరువు ఆదరువుగా ఉంటుంది.

చెరువులో నీరు నిలువ ఉండ టం వల్ల భూగర్భజలాలు పెరిగి బోర్ల కింద వ్యవసాయం కూడా పెరుగుతుంది. ప్రజల, పశువుల తాగునీటి అవసరాలు తీరుతాయి. చెరువు పూడిక మట్టి 50% రసాయనిక ఎరువుల (యూరియా, డీఏపీ) వాడకాన్ని తగ్గిస్తుంది. పంట దిగుబడి 15-20% పెరుగుతుందని పరిశోధనలు తెలియజేస్తున్నాయి. ఈ మేరకు రైతులకు ఆదా యం పెరుగుతుంది.

చెరువుకు మీరు కోరుకున్న పేరు మీ ఊరి చెరువు పునరుద్ధరించాలని మీరు కోరుకుంటున్నారని నాకు తెలుసు. అందువల్ల మీ ఊరి చెరువును దత్తత తీసుకొని నిధులు సమకూర్చగలిగే అవకాశాన్ని పరిశీలించాలని వినమ్రంగా కోరుతున్నాను. మీరు దత్తత తీసుకున్న చెరువుకు మీరు కోరుకున్న పేరు పెట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. వ్యక్తిగతంగా సాధ్యం కాకపోతే మీ సంఘం/సంస్థ తరఫున చెరువులను దత్తత చేసుకోగలిగే అవకాశాన్ని పరిశీలించాలని కోరుతున్నా.

కాకతీయ మిషన్‌కు ఇతరత్రా రూపాల్లో నిధులు సమకూర్చగలిగే అవకాశాన్ని కూడా పరిశీలించగలరు. జనవరిలో కార్యక్రమం ప్రారంభమైన తర్వాత మీతో టెలీకాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడాలని అనుకుంటున్నాను. మన ఊరు-మన చెరువు కార్యక్రమం మనందరి కార్యక్రమం. ఈ కార్యక్రమం జయప్రదమయ్యేందుకు సమష్టిగా కృషిచేయాలి. మీ అభిప్రాయాలు, సలహాలు, సూచనలు, సహకారాన్ని అందించండి అని ఆ లేఖలో మంత్రి హరీశ్‌రావు కోరారు.

చెరువుల పునరుద్ధరణ కార్యక్రమంలో చేపట్టే పనులు -పూడికలు తీసి చెరువులు, కుంటల నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచడం -చెరువుకట్టను బలోపేతం చేయడం.. ఇందుకోసం మొరం పూడికమట్టిని వాడుకోవడం -చెరువు అలుగు, తూములను మరమ్మతు చేయడం -క్రాస్ డ్రైనేజ్ స్ట్రక్చర్‌లను మరమ్మతు చేయడం -చెరువుల్లో పెరిగిన తుమ్మచెట్లను నరికివేయడం.. గుర్రపుడెక్క, ఇతర మొక్కల తొలగింపు -గొలుసుకట్టు చెరువులను బాగుచేసుకోవడం -తొలగించిన పూడికను రైతుల పంట భూముల్లో పోయడం -అవసరమైన చోట్ల ఫీడర్ చానెళ్లను రీసెక్షన్ చేయడం, పూడిక తీయడం -చెరువు శిఖం భూములను కబ్జాలు, కాలుష్యం బారిన పడకుండా చేయడం -మొదటిదశలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గకేంద్రంలో ఒక పట్టణ చెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా అభివృద్ధి పరచడం

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.