Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

చెరువులే మన భాగ్యవనరులు

నీరు, చెట్లు, ఇతర ప్రకృతి వనరులను పరిరక్షించే పురాతన జ్ఞానం తెలంగాణ సమాజానికి అనాదిగా ఉన్నది. తెలంగాణ ప్రభుత్వం ఆ సాంప్రదాయాన్ని సమున్నతంగా కొనసాగిస్తున్నది. నాలుగు నెలలు మాత్రమే నదుల్లో ప్రవహించే నీటిని ఒడిసిపట్టి నిల్వ చేసేందుకు చెరువుల పునరుద్ధరణ, దానితోపాటు వీలయినన్ని చోట్ల పెద్ద జలాశయాలని కూడా నిర్మించడానికి ప్రణాళికలు తయారు చేసింది. రాబోయే రోజుల్లో తెలంగాణలో నీటి కరువు లేని ప్రాంతంగా తీర్చిదిద్దబోతున్నాం.

నీటిని సంరక్షించుకోవడం మనందరి కర్తవ్యం. నీరు విస్తారంగా, అపరిమితంగా దొరికే వనరు కాదు. ఋతుపవనాల మీద ఆధారపడే భారత దేశం లాంటి దేశాల్లో వానాకాలం నాలుగు నెలల్లో కురిసే వర్షాన్ని ఒడిసిపట్టుకొని మన తాగు నీటి, సాగునీటి, పారిశామిక, ఇతర అవసరాలకు వాడుకోవడం తప్ప మరో మార్గం లేదు. మనం 65% నీరు వ్యవసాయానికి, 15% నీరు గృహావసరాలకు, 15% నీరు పారిశ్రామిక అవసరాలు, మిగిలిన నీరు ఇతర అవసరాలకు వినియోగిస్తాం.రోజు రోజుకు పెరుగుతున్న జనాభా అవసరాలకు ఈ నీటినే మనం వినియోగించుకోవాల్సి ఉన్నది. నాలుగు నెలల్లో కురిసే వాన నీటిని ఒడిసి పట్టి చెరువుల్లో నిల్వ చేసుకునే పద్ధతి పురాతన కాలం నుంచే తెలంగాణ సమాజానికి తెలుసు. దక్కన్ పీఠభూమిలో ఉన్న తెలంగాణ ఎగుడు దిగుడు ప్రాంతం కావడం, గోదావరి కృష్ణా నదులు తక్కువ ఎత్తులో ప్రవహిస్తున్నందున తెలంగాణలో చెరువుల నిర్మాణం అనివార్యంగా మారింది.

దేశంలోనే అత్యధిక చెరువులున్న ప్రాంతం తెలంగాణ. తెలంగాణలో చెరువులు లేని గ్రామాలు లేవంటే అతిశయోక్తి కాదు. ఒకటి కంటె ఎక్కువ చెరువులు ఉన్న ఊర్లు ఎన్నో. ఒక ఊరి నుంచి మరో ఊరికి, ఒక చెరువు నుంచి మరో చెరువుకి నీరు ప్రవహించే గొలుసుకట్టు చెరువుల నిర్మాణం తెలంగాణలో అనాదిగా ఉన్న వ్యవస్థ. ఇంత పెద్ద సంఖ్యలో చెరువుల నిర్మాణం తెలంగాణలో ఎందుకు సాధ్యమైంది? సాధ్యమైంది అనే కంటే వ్యవసాయ విస్తరణకు చెరువు నిర్మాణం అనివార్యమైంది అని చెప్పాలి. వాగుకు ఎగువన గ్రామాల పొందిక, వాగుపై చెరువు నిర్మాణం, చెరువు కింద వ్యవసాయం, చెరువు చుట్టూ ఒక సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక వికాసం తెలంగాణలో సాధ్యపడింది అంటే దానికి కారణం తెలంగాణ ప్రాంతం భౌగోళిక స్థితిగతులు దోహదం చేసినాయి. దక్కన్ పీఠభూమి మధ్యలో తెలంగాణ ఉన్నది. పీఠభూమి కనుక ఎత్తుపల్లాలు, కొండలు, గుట్టలు, వాటి నుంచి వాగులు, వంకలు పుట్టి దిగువకు ప్రవహించి, నదులుగా మారి సముద్రానికి దారిని వెతుక్కున్నాయి.

దక్కన్‌ను పాలించిన పాలకులకు అనుకూలంగా కనిపించిన తెలంగాణ భౌగోళికత ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్ర పాలకులకు ఒక అననుకూల పరిస్థితిగా కనిపించింది. నీరు పల్లమెరుగు అనే నీతిని అనుసరించి మీరు ఎత్తు గడ్డ మీద ఉన్నారు, మేము పల్లానికి ఉన్నాము కాబట్టి నీరు సహజంగా పల్లానికి ప్రవహిస్తుంది, మేము చేయగలిగింది ఏమీ లేదు అని మన వాళ్ళ నోళ్ళు మూయించినారు. తెలంగాణ నేల మీద పడిన ప్రతి నీటిబొట్టును ఒడిసి పడుతున్న ఈ చెరువుల వ్యవస్థను పట్టించుకోక వాటి సహజ మరణానికి కారణమయినారు. నీరు పల్లానికి ప్రవహించాలంటే చెరువులు విధ్వంసం కాక తప్పదు. వారు అనుసరించిన సాగునీటి పాలసీ అంతా మైదాన ప్రాంత అవసరాలకు అనుగుణంగా పెద్ద ప్రాజెక్టులు, కాలువల వ్యవస్థను అభివృద్ధి పరచడానికి పనికి వచ్చింది. తెలంగాణ వ్యవసాయానికి, సామాజిక, ఆర్థిక జీవనానికి అధరువులుగా ఉన్న చెరువులు వారి కంటికి ఆనలేదు. తెలంగాణ వారికి వలస ప్రాంతం కనుక తెలంగాణ అవసరాలు వారి అవసరాలు కాలేకపోయినాయి. అసలు తెలంగాణ వారికి అర్థం కాలేదు. బ్రిటిష్ ప్రభుత్వంలో ఆర్థర్ కాటన్ తీరాంధ్ర కష్టాలను చూసి చలించి పోయి తీరాంధ్ర రూపురేఖలు మార్చే బ్యారేజీలు, డెల్టా కాలువల వ్యవస్థను నిర్మించినాడు. 1956 దాకా హైదరాబాద్ రాజ్యంలో కూడా సాగునీటిరంగ అభివృద్ధి జరిగింది. అటు చిన్న చెరువుల నిర్మాణం, ఇటు నిజాంసాగర్, కడెం, ఘన్పూర్ ఆనకట్ట లాంటి భారీ, మధ్యతరహా ప్రాజెక్టుల నిర్మాణం కొనసాగింది. 1956కు ముందు హైదరాబాద్ రాజ్యంలో ఉన్న నవాబ్ అలి నవాజ్ జంగ్ బహాద్దూర్ లాంటి ఇంజనీరింగ్ నిపుణులు 1956లో ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఎవరూ లేకపోవడం చేత తెలంగాణకు ప్రాణాధారమైన చెరువులను పట్టించుకోలేదు. గోదావరి, కృష్ణా నీళ్ళు తెలంగాణకు అందలేదు. ‘‘నీరు కోస్తానెరుగు, నిజం దేవుడెరుగు, తెలుగు తల్లి కలశాన్ని తెలంగాణలో ఒంపనే లేదు, ఓ నీటి పారుదలా నీ రస్తా కోస్తాకే’’ అని తెలంగాణ నినదిస్తే గాని తెలంగాణకు ఎత్తిపోతల పథకాలు రాలేదు. అంతవరదాక నీరు పల్లమెరుగు సిద్ధాంతాన్నే వారు అనుసరించి తెలంగాణను ఆగం చేసినారు.

86 భారీ మధ్య తరహా ప్రాజెక్టులను ప్రతిపాదించిన జలయజ్ఞం సిద్ధాంతకర్తలు తెలంగాణలో చెరువుల పునరుద్ధరణను మాత్రం మర్చిపోయినారు. తెలంగాణ ఆత్మ వారికి అర్థం అయి ఉంటే చెరువులను మర్చిపోయి ఉండేవారు కాదు. 60 ఏండ్ల ఉమ్మడి రాష్ట్రంలో చెరువుల విధ్వంసం ఒక అంశం కాగా అది మొత్తం తెలంగాణని రైతుల ఆత్మహత్యల నేలగా, వలసల దేశంగా, కరువు పీడిత, ఫ్లోరైడ్ పీడిత ప్రాంతంగా మార్చివేసింది. తెలంగాణ ఉద్యమ కాలంలో సాగునీటి రంగంలో తెలంగాణకు ఉమ్మడి రాష్ట్ర పాలకులు చేసిన అన్యాయం, చూపిన వివక్ష గురించి చాలా చర్చించాం. ఆ చర్చలో ఉమ్మడి పాలకుల నిర్లక్ష్యం కారణంగా చెరువుల విధ్వంసం గురించి మధన పడ్డాం. చెరువుల విధ్వంసం వలన తెలంగాణ గ్రామీణ జనజీవితం ఏ విధంగా విధ్వంసం పాలయ్యిందో వలపోసుకున్నాం. తెలంగాణ ఏర్పడితే చెరువుల పునరుద్ధరణ జరగాలని కోరుకున్నాం.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే తెలంగాణ ఉద్యమ ఆకాంక్ష అయిన చెరువుల పునరుద్ధరణ కార్యక్రమాన్ని మిషన్ కాకతీయ పేరుతో, మన ఊరు మన చెరువు ట్యాగ్‌లైన్‌తో బృహత్తరమైన ఫ్లాగ్ షిప్ ప్రోగ్రాంని ప్రకటించింది. ఆ ప్రోగ్రాంని కేవలం ప్రభుత్వ కార్యక్రమంగా కాక ప్రజల ప్రత్యక్ష భాగస్వామ్యంతో నడిచే ఒక ప్రజా ఉద్యమ కార్యక్రమంగా జరగాలని ప్రభుత్వం భావించింది. చెరువులు రెండు విలువైన ప్రకృతి వనరులని కాపాడే పనిచేస్తున్నాయి. ఒకటి ఎక్కడ పడిన వాన నీటిని అక్కడనే ఒడిసి పట్టి అక్కడ ప్రకృతి సమతుల్యతను కాపాడుతాయి. రెండోది పోషక విలువలు కలిగిన ఓండ్రు మట్టిని తిరిగి వినియోగించుకునేందుకు వీలుగా చెరువుల్లో నిలువ చేస్తున్నాయి. చెరువులే లేకపోయి ఉంటే నీరు, ఈ విలువైన ఓండ్రు మట్టి నదుల్లోకి, నదుల నుంచి సముద్రాలకి తరలిపోయేవి. అందుకే చెరువులు మన మెట్ట ప్రాంతాల మనుగడకు అధరువులుగా ఉన్నాయి. చెరువుల్లో పూడిక మట్టిని ఏండ్ల తరబడి తొలగించకపోవడం చేత చెరువుల నిల్వ సామర్థ్యం తగ్గిపోయింది. తెలంగాణ రాష్ట్రానికి చెరువుల కింద గోదావరి, కృష్ణ బేసిన్లలో మొత్తం 255 టీఎంసీల కేటాయింపులు ఉన్నాయి.

ప్రస్తుతం మనం 90 టీఎంసీలకు మించి చెరువుల కింద నీటిని వాడుకోలేకపోతున్నాము. కారణం చెరువుల్లో పూడిక పేరుకుపోవడం. ఉద్యమం సందర్భంగా అనేక సార్లు ముఖ్యమంత్రి కే‍సీఆర్ ఉటంకించిన మాట – గంగాళంలా ఉండే చెరువులు తాంబాళంలా మారినాయి. పూడికలు తీసి వాటిని తిరిగి గంగాళంలా మార్చాలి. ఓండ్రుమట్టి మొక్కల పెరుగుదలకు అనుకూలమని రైతులకు వేల సంవత్సరాల అనుభవ జ్ఞానం ద్వారా తెలుసు. ఆ అనుభవ జ్ఞానంతోనే చెరువుల నుంచి మట్టిగొట్టుకపోయే సాంప్రదాయం తెలంగాణలో రైతులు అమలుపరిచేవారు. అయితే ఆధునిక వ్యవసాయ పరిశోధనలు పూడిక మట్టిలోని పోషక విలువలు, పూడిక మట్టి వలన ఒనగూరే ప్రయోజనాలను శాస్త్రీయంగా పరిశోధించి నిర్ధారించినాయి. కాబట్టి నీరు, చెట్లు, ఇతర ప్రకృతి వనరులను పరిరక్షించే పురాతన జ్ఞానం తెలంగాణ సమాజనికి అనాదిగా ఉన్నది. తెలంగాణ ప్రభుత్వం ఆ సాంప్రదాయాన్ని సమున్నతంగా కొనసాగిస్తున్నది. నాలుగు నెలలు మాత్రమే నదుల్లో ప్రవహించే నీటిని ఒడిసిపట్టి నిల్వ చేసేందుకు చెరువుల పునరుద్ధరణ, దానితోపాటు వీలయినన్ని చోట్ల పెద్ద జలాశయాలని కూడా నిర్మించడానికి ప్రణాళికలు తయారు చేసింది. రాబోయే రోజుల్లో తెలంగాణలో నీటి కరువు లేని ప్రాంతంగా తీర్చిదిద్దబోతున్నాం.

నీటి సంరక్షణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నది. మేఘాల్ని చల్లబరిచి వానలు కురిసేందుకు వీలుగా గ్రీన్ కవర్ ని ౩౩% పెంచేందుకు తెలంగాణాకు హరిత హారం కార్యక్రమం తీసుకున్నది. రాబోయే 5 సంవత్సరాల్లో 240 కోట్ల మొక్కలని నాటాలని ప్రభుత్వం సంకల్పించింది. ఇది మానవ చరిత్రలో మూడవ అతి పెద్ద ప్రయత్నం. ఈ ప్రయత్నం సఫలం కావాలంటే ప్రజలందరి సహకారం అవసరం. మిషన్ కాకతీయ ప్రజల భాగస్వామ్యంతో అద్భుతంగా సఫలం అయ్యింది. రెండు దశల్లో 17 వేల చేరువులని పునరుద్ధరించాం. 5 దశల్లో మొత్తం 46,500 చెరువులని పునరుద్ధరించాలని మా సంకల్పం. ప్రజలు స్వచ్ఛందంగా నీటిని పొదుపుగా వాడుకునే పద్ధతులని అవలంభించవలసి ఉన్నది. ప్రతీ ఇంట్లో తప్పని సరిగా ఇంకుడు గుంత నిర్మించి తీరాలి. ప్రతీ గ్రామంలో వాన నీరు చెరువుల్లోకి, కుంటల్లోకి ప్రవహించేందుకు కట్టు కాలువలని ధ్వంసం కాకుండా కాపాడుకోవాలి. చెరువుల్లో నిండిన పూడికని రైతులు ఎప్పటికప్పుడు తరలించుకపోయినట్లయితే ఎక్కువ నీటిని చెరువుల్లో నిల్వ చేసుకోవచ్చు. రైతులు సాగునీటి వినియోగం తగ్గించడానికి ఆరు తడి పంటలని వేసుకోవాలి. స్ప్రింక్లర్, డ్రిప్ పద్ధతులని అవలంభించాలి. నీటి దుబారాని అరికట్టాలి. నీటి వినియోగ సామర్థ్యం పెంచుకోవాలి. అత్యంత పరిమిత నీటి వనరులున్న ఇజ్రాయిల్ దేశాల్లో నీటి వినియోగ సామర్థ్యం 74% ఉంటే మన దేశంలో 40% ఉన్నది. మనం కూడా ఆ స్థాయికి చేరుకునే ప్రయత్నం చెయ్యకపోతే భవిష్యత్తులో కష్టాలని ఎదుర్కోక తప్పదు. ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా ప్రతీ మండలంలో ఒక చెరువు వద్ద జల జాతర కార్యక్రమాన్ని ఏర్పాటు చేయమని సాగునీటి శాఖ ఇంజనీర్లకు ఆదేశాలిచ్చాం. ఈ సందర్భంగా చెరువులు, కుంటలు, జలాశయాలను కాలుష్యం బారిన పడకుండా కాపాడుకోవాల్సిన అవసరం, మనమందరం సమష్టిగా తీసుకోవాల్సిన చర్యల గురించి, గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో మెరుగైన, సురక్షితమైన నీటి సరఫరా, భూగర్భ జలాల రీచార్జ్ గురించి అర్థవంతమైన చర్చలు జరగాలని ఆశిస్తున్న. చెరువుల వద్ద నీటిని పొదుపుగా వాడతామని, నీటి వనరులని రక్షించుకుంటామని ప్రజలు ప్రతిజ్ఞ చేయాలని విజ్ఞప్తి చేస్తున్న. సాగునీటి శాఖ, వాక్ ఫర్ వాటర్ సంస్థ సంయుక్తంగా నిర్వహిస్తున్న జలజాతర కార్యక్రమం జయప్రదం కావాలని ఆశిస్తున్నాను. తన్నీరు హరీష్ రావు సాగునీరు, మార్కెటింగ్, శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి (నేడు ప్రపంచ నీటి దినోత్సవం)

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.