Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

చెరువుల నిండుగా.. చేపలు పండగ!

-రాష్ట్రంలో విస్తరించిన నీలి విప్లవంచెరువులు,
-రిజర్వాయర్ల నిండుగా మత్స్యసంపద
-ప్రభుత్వమే ఉచిత చేపపిల్లల పంపిణీ
-వందశాతం సబ్సిడీపై వలలు, వాహనాలు
-మత్స్యకారుల ఇంట వెలుగుల పంట
-మొగులుకు వాన పుట్టింది.. వానకు చేప పుట్టింది.. చేపకు పిల్ల పుట్టింది.. మిషన్‌కాకతీయ చెరువులల్ల మీనం రాశుల ఊట పుట్టింది.. మత్స్యకారుల ఇంట ధనసిరుల పంట పుట్టింది. చెరువులు, రిజర్వాయర్లలో నాచుమాటున నీలివిప్లవం రాష్ట్రవ్యాప్తమయింది.

‘పల్లెసీమలే దేశానికి పట్టుకొమ్మలు’ అన్న నానుడిని నిజంచేస్తూ గ్రామీణప్రాంతాల్లో కులవృత్తులను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపట్టింది. అందులోభాగంగా చేపలను దిగుమతిచేసుకునే స్థితినుంచి ఎగుమతిచేసే స్థాయికి ఎదుగాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ మత్స్యకారుల కోసం అమలుచేస్తున్న పథకాలు సత్ఫలితాలిస్తున్నాయి. మృగశిర మొదలైన వేళ ఏ చెరువు గట్టు చూసినా.. ఏ ప్రాజెక్టు ఒడ్డుచూసినా చేపల రాశులే.. జాలర్ల నవ్వులే!ఈ ఏడాది ప్రభుత్వం 64 కోట్లకు పైగా చేపపిల్లలను చెరువులు, జలాశయాల్లోకి వదిలింది. తెలంగాణ నీటిప్రాజెక్టులు మొత్తం పూర్తయి, రాష్ట్రంలోని 48వేల మిషన్‌ కాకతీయ చెరువుల్లో నీటిని నింపుకోగలిగితే.. ఏటా 100 కోట్ల పిల్లలను వేయవచ్చు. దీంతో ఇప్పుడున్న 3 లక్షల టన్నుల ఉత్పత్తి రెండేండ్లలో 5 లక్షల టన్నులకు చేరుకుంటుంది.

ఒకవైపు మిషన్‌ కాకతీయ చెరువులు.. మరోవైపు కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో తెలంగాణలో వ్యవసాయరంగంతోపాటు మత్స్యరంగం ముఖచిత్రమూ మారిపోయింది. పచ్చనిపైరుల హరితవిప్లవానికి సమాంతరంగా.. చెరువులు, కుంటలు, రిజర్వాయర్లలో నీలివిప్లవం రాష్ట్రవ్యాప్తమయింది. చెరువుల పునరుద్ధరణ మత్స్యకారులకు ఆసరా అయింది. ప్రభుత్వం మిషన్‌కాకతీయ కింద పునరుద్ధరించిన 46 వేలపైచిలుకు చెరువులు.. కాళేశ్వరం ప్రాజెక్టు, పాలమూరులోని ప్రాజెక్టుల ద్వారా నిండుకుండలుగా మారి వారిజీవితాన్ని మార్చేశాయి.

పెరిగిన చేపల వినియోగం
మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే తలసరి రోజుకు 50 నుంచి 70 గ్రాముల చేపలను ఆహారంలో తీసుకోవాలని అధ్యయనాలు చెప్తున్నాయి. గుండె ఆరోగ్యాన్ని పెంచే ఒమెగా-3 ఫ్యాటీ ఆసిడ్స్‌ చేపల్లో పుష్కలంగా ఉండటం, ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన పెరుగడంతో చేపల కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నారు. గతంలో ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, పశ్చిమబెంగాల్‌ నుంచి చేపలను భారీగా దిగుమతి చేసుకునేవారు. తెలంగాణ ఏర్పడ్డాక చెరువుల పునరుద్ధరణ, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, జలాశయాలు నిండటం, పిల్లకాల్వల్లో నీళ్లు ఊరడంతో చేపల పెంపకానికి మెరుగైన అవకాశాలు ఏర్పడ్డాయి. చేపల దిగుమతి నుంచి ఎగుమతి చేసే సామర్థ్యానికి మత్స్యరంగం ఎదగడంలో ప్రభుత్వానిదే పెద్దన్న పాత్ర. వందశాతం గ్రాంటుతో ఉచితంగా చేపపిల్లలను పంపిణీ చేస్తున్నది. హోల్‌సేల్‌, రిటైల్‌ చేపల మార్కెట్ల నిర్మాణం, 75 శాతం రాయితీతో నాణ్యమైన వలలు, పుట్టీలు, చేపలు అమ్ముకోవడానికి టాటా ఏస్‌వాహనా లు, సంచార విక్రయవాహనాలు, చేప పిల్లల హేచరీలు, దాణా మిల్లులు, ఐస్‌ప్లాంట్లు, ప్రాసెసింగ్‌ యూనిట్లు అందించడంతో మత్స్యకారులకు ఆసరా పెరిగింది. చేపలవేటలో చనిపోయిన మత్స్యకారుల కుటుంబాలకు రూ.4 లక్ష ల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వడంతో వారికి భరోసా పెరిగింది. దీంతో చేపల పెంపకానికి అనువైన వాతావరణం ఏర్పడింది.

మత్స్యసహకార సంఘాలకు వెయ్యికోట్లు
రాష్ట్రంలో నాలుగురకాల మత్స్యసహకార సంఘాలున్నాయి. వీటిలో 18 ఏండ్లు నిండిన మత్స్యకారులకు సభ్యత్వం కల్పిస్తారు. 3,859 ప్రాథమిక మత్స్యసహకార సంఘాలు (2,66,935 మంది సభ్యులు), 502 ప్రాథమిక మహిళా మత్స్యశాఖ సహకార సంఘాలు (27,809), 11 మత్స్య మార్కెటింగ్‌ సహకార సంఘాలు (6,482), 70 చేపలుపట్టే లైసెన్స్‌డ్‌ మత్స్యసహకార సంఘాలు (4,408) ఉన్నాయి. వీటితోపాటు 10 జిల్లా మత్స్య పారిశ్రామిక సహకారసంఘాల్లో 2,736 మంది సభ్యులున్నారు. తెలంగాణలో మత్స్యరంగ అభివృద్ధికి జాతీయ సహకార అభివృద్ధి కార్పొరేషన్‌ (ఎన్సీడీసీ) తెలంగాణ మత్స్యసహకార సంఘాల సమాఖ్యకు రూ.వెయ్యి కోట్ల సాయం మంజూరుచేసింది. దీనికింద అన్ని మత్స్యసహకారసంఘాలు ప్రయోజనం పొందుతున్నాయి.

మత్స్యరంగానికి వరం కాళేశ్వరం
కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని రిజర్వాయర్లలో 1.24 కోట్ల చేపపిల్లలు, 25 లక్షల రొయ్యపిల్లలను వదిలేందుకు మత్స్యశాఖ ప్రణాళికలు సిద్ధంచేసింది. రిజర్వాయర్లలో ఎన్ని కిలోమీటర్ల మేర నీరు అందుబాటులో ఉంటుంది, ఎక్కడెక్కడ చేపపిల్లలు అవసరమవుతాయి? తదితర విషయాలపై బేస్‌లైన్‌ సర్వే నిర్వహించింది. మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల, ఎల్లంపల్లి రిజర్వాయర్ల పరిధిలో ఏ రకమైన చేపల పెంపకానికి అవకాశం ఉన్నదనే దానిపై నివేదిక తయారుచేసింది. 10 శాతం కొర్రమీనును వేయాలని నిర్ణయించడంతోపాటు కేజ్‌కల్చర్‌, పెన్‌కల్చర్‌ను ప్రోత్సహించాలని మత్స్యశాఖ భావిస్తున్నది. మూడు జిల్లాల పరిధిలో వెయ్యిమంది జాలర్లు లైసెన్సు తీసుకున్నారు. కాళేశ్వరంలో ఏడాదిలో రెండుసార్లు చేపలు పెంచేందుకు అవకాశం ఉన్నది. కాళేశ్వరం పరిధిలో మత్స్యశాఖ చేపడుతున్న చర్యలతో ఏడాదికి 3లక్షల టన్నుల చేప దిగుబడి వస్తుంది.

మంచినీటి రొయ్యల సాగు తెలంగాణ మత్స్యశాఖ నీలకంఠ రొయ్యల సాగును పైలట్‌ ప్రాజెక్టుగా చేపట్టింది. దేశంలోనే తొలిసారిగా 2017-18లో 11 నీటివనరుల్లో 1.08 కోట్ల నీలకంఠ రొయ్య పిల్లలను విడుదలచేసింది. పెరుగుదల బాగా ఉండటం, ఇతరరాష్ర్టాల్లో వీటికి డిమాండ్‌ ఉండటంతో మంచి ఆదాయం లభించింది. 2018-19లో మరో 13 నీటివనరులకు దీనిని విస్తరించి.. మొత్తం 24 నీటివనరుల్లో 3.19 కోట్ల రొయ్య పిల్లను విడుదల చేశారు. 2019-20లో 95 నీటి వనరుల్లో దాదాపు 5 కోట్ల రొయ్యపిల్ల వేశారు.

స్థానికంగానే ఉత్పత్తి కేంద్రాలు
చేప పిల్లల ఉత్పత్తికి ప్రభుత్వం స్థానికంగానే కేంద్రాలను ఏర్పాటుచేసింది. శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు వద్ద 35 ఎకరాల్లో 135 నర్సరీలను ఏర్పాటుచేశారు. బ్రూడింగ్‌కూల్‌, తల్లి చేపల కోసం కొత్తగా ఐదు చెరువులను ఎంపికచేశారు. ఖమ్మం జిల్లా వైరా, రంగారెడ్డి జిల్లాలో ఇబ్రహీంపట్నం మండలం శేరిగూడ తదితర ప్రాంతాల్లో చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాలు ఉన్నాయి.

2015-16లో 598 నీటివనరులు ఉంటే.. నేడు వాటిసంఖ్య 15,525కు పెరిగింది. ఫలితంగా చేపపిల్లల సామర్థ్యం 5.33 కోట్ల నుంచి 64 కోట్లకు పెరిగింది. దీంతో రాష్ట్ర అవసరాలకు సరిపోయే చేపలను ఉత్పత్తి చేసుకోవడంతోపాటు ఎగుమతిచేసే స్థాయికి చేరుకుంటున్నాం. 2019-20 సంవత్సరానికి రాష్ట్రంలోని 75 పెద్ద రిజర్వాయర్లన్నింటిలో కలిపి 9.55 కోట్ల చేపపిల్లలను వదిలారు. వందకు ముప్పై చేపపిల్లలు చనిపోతాయనుకున్నా.. సగటున చేపబరువు 750 గ్రాములు వేసుకుంటే రిజర్వాయర్లలో 50 వేల టన్నుల పైచిలుకు చేప ఉత్పత్తి అయ్యే అవకాశం ఉన్నది.

గ్రామస్థాయి మత్స్యకార సొసైటీలకు బలమైన నాయకత్వం ఉంటే ఆ సహకార సంఘాలు విజయపథంలో ఎలా ముందుకుపోతాయో చెప్పడానికి కరీంనగర్‌ జిల్లా వీణవంక మండలం ఎలబాక చేపలచెరువు ఉదాహరణ. ఎలబాక చెరువులో రెండేండ్ల క్రితం సొసైటీ తరపున రెండున్నర లక్షల చేపపిల్లలను పోశారు. రాష్ట్రప్రభుత్వం ఉచిత చేపపిల్లల పంపిణీలో భాగంగా అదనంగా మరో 50 వేల పిల్లలను వదిలింది. దీంతో ఈ చెరువులో మొత్తం మూడులక్షల చేపవిత్తనాలు వేయగా.. 2018 జూన్‌ 10న చేపలు పట్టారు. మొత్తం 26 టన్నులు ఉత్పత్తి జరిగింది. చెరువుగట్టు మీదనే కిలో రూ.65 చొప్పున మొత్తం రూ.16 లక్షలకు హోల్‌సేల్‌గా ఓ వ్యాపారికి అప్పజెప్పారు. దీంతోపాటు, ఐదు క్వింటాళ్ల కొర్రమట్ట, రెండు క్వింటాళ్ల గురిజెలు మత్స్యకారులు పట్టుకున్నారు.

-రాష్ట్రంలో 2016లో 3,939 నీటి వనరుల్లో చేపలు పెంపకం చేపట్టగా.. 2020 నాటికి అది 15,525 వనరులకు పెరిగింది. నాలుగేండ్లలో 294 శాతం పెరిగింది.
-చేప పిల్లల నిల్వ పరిమాణం 27.85 కోట్ల నుంచి 63.38 కోట్లకు పెరిగింది. ఈ పెరుగుదల 127.5 శాతం.
-2016-17లో 1.93 లక్షల టన్నులు ఉన్న చేపల ఉత్పత్తి 2019-20 నాటికి 47 శాతం పెరిగి 2.84 లక్షల టన్నులకు చేరుకున్నది.
-రొయ్యల ఉత్పత్తి ఏకంగా 92 శాతం పెరిగి 5,189 టన్నుల నుంచి 9,998 టన్నులకు చేరింది.

మత్స్యకార జీవితాలకు ఆర్థిక భరోసా
సీఎం కేసీఆర్‌ చేపట్టిన పథకాలతో మా కుటుంబాలకు ఆర్థికభరోసా కలిగింది. మండల పరిధిలోని బైరవాన్‌, నాగూల్‌ చెరువుల్లో గతేడాది చేపపిల్లలు వేసినా నీరు లేకపోవడంతో అంతగా లాభం రాలేదు. తర్వాత మిషన్‌కాకతీయతో చెరువుల్లో పూడికతీయడంతోపాటు, సాగర్‌నుంచి నీళ్లు నిపడంతో ఈసారి 3.20 లక్షల చేపపిల్లలు వేశాము. మంచి ఆశాజనకంగా ఉన్నది. వేసవికాలంలో చేపలు పడుతాము. సంఘంలో 200మంది సభ్యులు ఉండగా.. 41 టీవీఎస్‌ వాహనాలు, రెండు టాటా ఏస్‌లు, వలలు, ఐస్‌బాక్సులు ఇచ్చారు.
– బుడిగ లక్ష్మయ్య, మత్య్సకార్మిక సంఘం సభ్యుడు, దామరచర్ల, నల్లగొండ జిల్లా

మత్స్య సొసైటీలకు నూతన ఒరవడి
ఉమ్మడి రాష్ట్రంలో మత్స్యసొసైటీలకు, కార్మికులకు ఎలాంటి సహకారం అందలేదు. తెలంగాణలో ఉచిత చేపపిల్లల పంపిణీతో చేతినిండా పనిదొరికింది. చేపలు పోసుకునేందుకు పెట్టుబడి అవసరం లేకుండాపోయింది. ప్రభుత్వమే మార్కెటింగ్‌ చేసుకునేందుకు వాహనాలు, వలలు అందివ్వడంతో లాభం చేకూరుతున్నది. దీంతో అన్ని మత్స్యసొసైటీలు మంచిలాభాల బాటలో ఉన్నాయి. మూడేండ్లుగా సంఘాలు ఆడిట్‌ చేసుకోవడం, విధిగా ఎన్నికలు నిర్వహించుకుంటున్నాం.
– ఎడవల్లి చంద్రయ్య,జిల్లా మత్స్యపారిశ్రామిక సొసైటీ అధ్యక్షుడు, ఖమ్మం జిల్లా

కేసీఆర్‌కు రుణపడి ఉంటాం
చేపలు పట్టే వాళ్ల మంచికోసం ఆలోచనచేసిన మొదటిసీఎం కేసీఆర్‌. సాక్షాత్తూ అసెంబ్లీలో మా బతుకుల గురించి మాట్లాడిన కేసీఆర్‌కు ఎప్పటికీ రుణపడి ఉంటాం. చెరువుల పూడికతీతతో మూడుకాలాలు చెరువుల్లో నీళ్లు ఉంటున్నాయి. ఆపదలో ప్రాణంపోతే బీమా పరిహారం ఇచ్చి ఆదుకుంటున్నారు. ఊరినుంచి వలసపోయిన వాళ్లుకూడా తిరిగి వచ్చి చేపల పెంపకం చేపడుతున్నారు.
– ఎం నాగేశ్వరరావు, చిమ్మపుడి సొసైటీ చైర్మన్‌, ఖమ్మం

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.