-కేసీఆర్‌కు అధికారమిస్తే వారంలో అంతా సరి చేస్తారు
-నూకలు తినమన్న కేంద్రానికి నూకలు లేకుండా చేస్తాం
-సిరిసిల్ల మహాధర్నాలో బీజేపీపై మంత్రి కేటీఆర్ ఫైర్
-నేడు రైతుల ఇండ్లపై నల్ల జెండాలు ఎగరేయాలని పిలుపు

నూకలు తినాలంటూ తెలంగాణ ప్రజలను అవహేళన చేసిన కేంద్ర ప్రభుత్వానికి నూకలు లేకుండా చేస్తామని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కే తారకరామారావు హెచ్చరించారు. దేశానికి బీజేపీ ప్రభుత్వం గుదిబండలా తయారైందని ఆరోపించారు. ప్రభుత్వాన్ని నడిపించడం చేతగాకపోతే సమర్థుడైన తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుకు అప్పగించాలని, ఒక్క వారంలో వ్యవస్థనంతా మార్చివేస్తారని ప్రధాని మోదీకి సవాల్ విసిరారు. ధాన్యం సేకరణపై కేంద్రం వివక్షకు వ్యతిరేకంగా సిరిసిల్లలోని అంబేద్కర్ చౌరస్తాలో టీఆర్ఎస్ గురువారం చేపట్టిన మహాధర్నాలో కేటీఆర్ పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు తోట ఆగయ్య అధ్యక్షతన జరిగిన ధర్నాలో కేటీఆర్ మాట్లాడుతూ నమో అంటే నమ్మించి మోసం చేసే నరేంద్రమోదీ అని ధ్వజమెత్తారు. కేంద్రంపై ఉద్యమంలో భాగంగా శుక్రవారం రాష్ట్రంలోని ప్రతి రైతు ఇంటిపై నల్ల జెండాలు ఎగురవేసి, కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలు తగులబెట్టాలని పిలుపునిచ్చారు.

కిషన్‌రెడ్డి, బండి సంజయ్ ఎటు పోయారు?
రాష్ట్ర ప్రభుత్వం, సీఎం కేసీఆర్ ప్రమేయం లేకుండా కేంద్రంతో ప్రతి గింజనూ కొనిపించే బాధ్యత తీసుకొంటామని చెప్పిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇప్పుడు ఎటు పోయారని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలను పదేపదే అవమానిస్తున్న కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌ను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. యూపీఏ హయాంలో పెట్రోలు ధరలు పెరిగితే నాడు ప్రతిపక్షంలో ఉన్న స్మృతి ఇరానీ, నిర్మలా సీతారామన్, నరేంద్రమోదీ చేసిన విమర్శల వీడియోలను దీక్షా శిబిరంలో కేటీఆర్ ప్రదర్శించారు. నాటి ప్రధాని మన్మోహన్ సింగ్‌పై దుమ్మెత్తిపోసిన బీజేపీ నేడు పెట్రోల్, డీజిల్ ధరలను ఎలా పెంచుతుందని నిలదీశారు. మతవాద బీజేపీ దేశానికి అరిష్టమని ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు విమర్శించారు.బీజేపీని అధికారం నుంచి తొలగించి దేశాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి, నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ తదితరులు పాల్గొన్నారు.

న.మో. అంటే నమ్మించి మోసం
-రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానని నిండా ముంచాడు
-వడ్లు కొనేవరకు కేంద్ర ప్రభుత్వంపై యుద్ధం ఆగదు
-కేసీఆర్ నుంచి రైతులను విడదీయాలని కేంద్రం కుట్ర
-మోదీ సర్కారుపై నిప్పులు చెరిగిన రాష్ట్ర మంత్రులు
-టీఆర్ఎస్ నిరసన దీక్షలతో హోరెత్తిన జిల్లా కేంద్రాలు
రైతుల ఉసురు తగుల్తది
తెలంగాణ రాకమునుపు కరెంట్, నీళ్లు లేక పంట పండక ఉరేసుకున్న రోజులున్నయి. తెలంగాణ వచ్చినంక ఫ్రీ కరెంట్, మంచి ఎరువులతో ఐదు ఎకరాల్లో 10 పుట్ల వడ్లు పండించుకుంటున్నం. అది ఎవరి పుణ్యం.. కేసీఆర్ పుణ్యం వడ్లను బీజేపోళ్లు కొనమని ఎట్లంటరు? బీజేపోళ్లకు ఏం తెలుసు? వాళ్లేం చేసిండ్రు? రైతుల ఉసురు తగలి వాళ్లు కొట్టుకుపోతరు.
– కేతమ్మ, మహిళా రైతు, మేడ్చల్
నమో అంటే నమ్మించి మోసం చేయడమని టీఆర్ఎస్ మండిపడింది. అధికారంలోకి వస్తే రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానన్న మోదీ.. వారిని నిండా ముంచారని మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం కొనాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ చేపట్టిన ఉద్యమంలో భాగంగా గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో మహాధర్నాకు మంత్రి కేటీఆర్ విచ్చేసి ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వాన్ని నడిపించడం చేతగాకపోతే సమర్థుడైన సీఎం కేసీఆర్‌కు అప్పగించాలని, వారంలోనే వ్యవస్థనంతా మార్చి వేస్తామని ప్రధానికి సవాల్ చేశారు. సిద్దిపేటలో నిరసన దీక్షలో పాల్గొన్న మంత్రి హరీశ్.. మోదీ అంటే మోదుడు.. బీజేపీ అంటే బాదుడు అని ఆరోపించారు.
సీఎం కేసీఆర్ నుంచి రైతులను విడదీయాలని కేంద్రం కుట్ర చేస్తున్నదని మంత్రి ప్రశాంత్‌రెడ్డి ఫైర్ అయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ చేపట్టిన నిరసన కార్యక్రమాల్లో భాగంగా గురువారం జిల్లా కేంద్రాలన్నీ ఉద్యమ వేదికలయ్యాయి. తమ ప్రజల కోసం కేంద్రంతో యుద్ధానికి సిద్ధమని టీఆర్ఎస్ స్పష్టమైన హెచ్చరికలు జారీ చేసింది. తమ రైతులు పండించిన వడ్లు కొనకుంటే కేంద్రానికి గుణపాఠం తప్పదని హెచ్చరించింది. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో మంత్రి కేటీఆర్ మార్గదర్శకత్వంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని స్థాయిల టీఆర్ఎస్ శ్రేణులు తమ పూర్వపోరాట రూపాన్ని ప్రదర్శించారు. ఈ నిరసన దీక్షల్లో మంత్రులందరూ పాల్గొన్నారు.
వనపర్తిలో నిరంజన్‌రెడ్డి, నల్లగొండలో జగదీశ్‌రెడ్డి, మహమూద్ అలీ, మహబూబ్‌నగర్‌లో శ్రీనివాస్‌గౌడ్, నిర్మల్‌లో వేముల ప్రశాంత్‌రెడ్డి, కరీంనగర్లో గంగుల కమలాకర్, వరంగల్, జనగామలో ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఖమ్మంలో పువ్వాడ అజయ్, మహబూబాబాద్, ములుగులో సత్యవతి రాథోడ్, వికారాబాద్‌లో సబితాఇంద్రారెడ్డి, సంగారెడ్డిలో తలసాని శ్రీనివాస్‌యాదవ్, నిర్మల్‌లో ఇంద్రకరణ్‌రెడ్డి.. ఇలా మంత్రులంతా నిరసన దీక్షల్లో పాల్గొని రైతులకు తామున్నామనే భరోసానిచ్చారు. వరి గొలుసులు, ధాన్యాన్ని రాశులుగా పోసి తూర్పారబట్టారు. మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు ప్లకార్డులు పట్టుకొని కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపారు. మంచిర్యాలలో ప్రభుత్వ విప్ బాల్క సుమన్ రోడ్డు మీదే కాంటా పెట్టారు. నిరసన దీక్షల్లో రైతులు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని తెలంగాణ ఏ స్థాయిలో ఎండగడుతున్నదో జిల్లా కేంద్రాల్లోని దీక్షా శిబిరాలు రుజువు చేశాయి. కేంద్ర ప్రభుత్వాన్ని దున్నపోతుతో పోలుస్తూ (దున్నపోతు మీద వానపడ్డట్టు).. వానకాదు, అనేక పైపులతో నీళ్లు కొట్టినా కేంద్రం కదలటం లేదన్న రీతిలో కరీంనగర్ దీక్షా శిబిరంలో వినూత్న ప్రదర్శన నిర్వహించారు.
నేడు నల్లజెండాలతో నిరసన
-కేంద్రం దిష్టిబొమ్మల దహనం
వడ్లు కొనని కేంద్రంపై టీఆర్ఎస్ చేపట్టిన పోరాటాల్లో భాగంగా శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా మంత్రుల నుంచి అన్ని స్థాయిల ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు ఇండ్లపై నల్లజెండాలు ఎగురవేసి నిరసన వ్యక్తం చేయనున్నారు. 12,769 గ్రామ పంచాయతీల్లో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలు దహనం చేయాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. ఈ నేపథ్యంలో గ్రామ గ్రామాన పెద్దఎత్తున నిరసనలు చేపట్టేందుకు టీఆర్ఎస్ శ్రేణులు సన్నద్ధం అయ్యాయి.
కేసీఆర్ రైతు పక్షపాతి..
టీఆర్ఎస్ సర్కారు ప్రవేశపెట్టినన్ని పథకాలు ఇప్పటివరకు ఏ గవర్నమెంటూ పెట్టలేదు. కేసీఆర్ వచ్చినప్పటి నుంచి నీళ్లు ఫుల్లు, కరెంటు ఫుల్లు. నాకు 25 ఎకరాల భూమి ఉన్నది. 2 లక్షల 50 వేల రైతుబంధు ఇత్తుండు. ఇంతకంటే రైతుగా నాకు ఇంక ఏం గావాలె. పండించినన్ని వడ్లు, మక్కలు, కూరగాయలు. కరెంటు మోటర్ పెడితె నీళ్లు దంగకుంట మూడ్రోజుల దాకా పోత్తనే ఉంటది. ఆయన ఇచ్చే పథకాలతోని నేను చెప్తున్న కేసీఆర్ రైతు పక్షపాతి అని. నిజంగా రైతులు ఈ గవర్నమెంటుకే సపోర్టు చేయాలే. రానున్న రోజుల్లో కూడా ఇదే సర్కారు ఉండాలె. ఎనుకటి సర్కార్లు రైతులను ముంచినయి. ఇప్పుడు రైతులను డెవలప్ చేసింది కేసీఆరే. ఇది మన రాజ్యం, మన ఇష్టం వచ్చినంత పని చేసుకోవచ్చు. మల్ల వేరే గవర్నమెంటును తెచ్చుకుంటిమా మన రక్తం పీల్చుకుంటరు.
– పులిచెర్ల లక్ష్మీనర్సయ్య, రైతు, గంగాధర, కరీంనగర్ జిల్లా