Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

చెత్తను తరిమేద్దాం

హైదరాబాద్‌లో చెత్త దరిద్రాన్ని తరిమేద్దామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు. ఇందుకోసం స్వచ్ఛ హైదరాబాద్‌లో నగర ప్రజలందరూ భాగస్వాములు కావాలని అన్నారు. ముఖ్యంగా మహిళలు భాగస్వాములైతే చెత్త సమస్యను నిర్మూలించవచ్చునని చెప్పారు. నేను కోరేది ఒక్కటే. పట్టుబట్టినం.. పని మొదలుపెట్టినం.. సాధించాలె. మంచి ఉద్దేశంతో చేసే పని ఏదైనా సరే తప్పకుండా విజయం సాధిస్తాం. అందరం కలిసి ముందుకు పోదాం. విజయం సాధిద్దాం అని కేసీఆర్ పిలుపునిచ్చారు. బుధవారం హైదరాబాద్ పార్సీగుట్టలో జరిగిన స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం స్థానిక బస్తీ ప్రజల వద్దకు వెళ్లారు.

CM KCR addressing in Swach Hyderabad Programme at Parsigutta

-దరిద్రం వదలాలని పట్టుబట్టినం..పని మొదలుపెట్టినం.. -అందరం కలిసి సాధించాలె -పార్సీగుట్ట పేదలకు రైల్వే భూముల్లో ఇండ్లు -రైల్వేశాఖకు ప్రత్యామ్నాయ భూములు ఇస్తాం -హైదరాబాద్ అభివృద్ధిపై రేపు మరోసారి సమావేశం -స్వచ్ఛ హైదరాబాద్‌లో సీఎం కేసీఆర్ వారు ఇచ్చిన విజ్ఞప్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరాన్ని పట్టి పీడిస్తున్న చెత్త సమస్యను పరిష్కరించడానికి శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు నగర ప్రజాప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నామని తెలిపారు. నగరంలో పేదలకు డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లను నిర్మిస్తామని సీఎం పునరుద్ఘాటించారు. పార్సీగుట్ట, బౌద్ధనగర్‌లలో నాలాల విస్తరణలో ఇండ్లు కోల్పోయినవారికి, ఇక్కడ ఇండ్లు లేనివారికి ఖాళీ జాగాలో ఇండ్లు కడతానంటే కొన్ని పార్టీలు రాద్ధాంతం చేస్తున్నాయని సీఎం విమర్శించారు. ఇక్కడి ప్రజల కోసం చిలకలగూడలోని రైల్వే స్థలాలను తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు.

CM KCR

ఒక్క పది ఎకరాల జాగా దొరికితే చాలు.. ఐదారు అంతస్తుల భవనాలు కట్టిస్తానన్నారు. ఈ మేరకు రైల్వే అధికారులతో చర్చలు జరుపుతున్నామని వెల్లడించారు. పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను కట్టించడానికి ఎకరానికి ఐదు కోట్ల రూపాయలు ఖర్చు అయినా సరే వెనక్కు తగ్గేది లేదని కేసీఆర్ స్పష్టంచేశారు. పార్సీగుట్టను అందమైన నగరంగా తీర్చి దిద్దుదామన్నారు. హైదరాబాద్‌ను ఏ విధంగా అభివృద్ధి చేయాలన్నదాని పై సీఎం కేసీఆర్ మాట్లాడారు. అవి ఆయన మాటల్లోనే.. మొన్న మనం ఐదురోజులపాటు స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమాన్ని తీసుకొని బస్తీలన్నీ తిరిగి ఎక్కడ ఏ పరిస్థితి ఉందో తెలుసుకున్నాం. నిర్ణయానికి వచ్చాం.

దేశంలో, ప్రపంచంలో గొప్పగా ఉన్న జంటనగరాలు మన హైదరాబాద్, సికింద్రాబాద్.. అభివృద్ధిలో ఉన్న హెచ్‌ఎండీఏ ఏరియా కచ్చితంగా బాగుండాలె.. అభివృద్ధి అంతా క్రమపద్ధతిలో జరుగాలె.. ఇండ్లులేని పేదలందరికీ కచ్చితంగా ఇండ్లు కట్టాలె.. చక్కని పద్ధతిలో మంచినీళ్లు రావాలె.. అని నిర్ణయాలు తీసుకున్నాం. జీహెచ్‌ఎంసీ పరిధిలో 23మంది ఎమ్మెల్యేలు, ఐదారుగురు ఎంపీలున్నరు. వాళ్లందరు కూడా చాలావరకు ఈ కార్యక్రమంలో పాల్గొన్నరు. వాళ్లు కూడా చూసి పరిస్థితులు తెలుసుకున్నరు.

వాళ్లకు అన్ని విషయాలు అర్థమైనయి. వాళ్లతో దాదాపు రెండుసార్లు కలిసి ఐదారుగంటలు సమావేశాలు నిర్వహించి చర్చించా. ఏమి చేయాలె, ఎట్ల చేయాలె.. మన భారతదేశంలో వేరే సిటీలల్లో ఎట్ల చేస్తున్నరు… చర్చించినం. మనం అనుకున్నట్లు రోజువారీగా ఇండ్లనుంచి వచ్చే చెత్త సరైన పద్ధతిలో పోయి, మన బస్తీ, మన నగరం, మనరోడ్లు చెత్త లేకుండా చేయాలె. నాలాలు పూడిపోయాయి. మురికినీళ్లు పారుతున్నాయి. దుర్గంధం వచ్చి ముక్కుపుటాలు అదిరిపోతున్నాయి. దానికి ఏమి చేయాలె? అలాగే చిలకలగూడ నాలాపై ఇండ్లు కట్టారు. కబ్జా అయింది. నాలాల మీద కబ్జాలు తొలగిస్తే చాలా మంది పేదల ఇండ్లు పోతాయి. ఏమి చేయాలి? అట్లనే మంచినీరు కూడా సరఫరా చేయాలి. మన నగరానికి కృష్ణా, గోదావరి నుంచి నీళ్లు వస్తున్నాయి. అయినా సరిపోవడం లేదు.

Public

నగరానికి కావాల్సిన నీళ్లు ఎంత? వచ్చే నీళ్లు ఎంత? ఇంకా ఎంత నీళ్లు కావాలి? నీళ్ల సరఫరాకోసం అధికారులు తీసుకున్న చర్యలు ఏమిటి? ఇంకా మనం ఏమి చేయాలి? అనేది అవగాహనకు వచ్చినం. దేశరాజధాని ఢిల్లీలో, మనపక్కన ఉన్న మహారాష్ట్రలోని నాగపూర్‌లో చెత్తనుంచి కరెంటు ఉత్పత్తి చేస్తున్నరు. ఢిల్లీలో చెత్తనుంచి ఇసుక, కంకరకూడా తయారు చేస్తున్నరు. ఢిల్లీ అన్నింటికంటే పెద్ద పట్టణం కాబట్టి ప్రజాప్రతినిధుల బృందం వెళ్లి చూసిరావాలని నిర్ణయం చేసినం. మన కమిషనర్, నగర ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అందరు మొన్న ఢిల్లీలో ఉన్నరు.

నిన్న దినమంతా నాగ్‌పూర్‌లో ఉన్నరు. చెత్త ఎలా సేకరిస్తున్నరు? ఎన్ని రిక్షాలుండాలె? ఎన్ని ఆటోరిక్షాలు ఉండాలె? వీటిని తీసుకుపోవడానికి ఎన్ని లారీలు ఉండాలె? ఎట్ల చేయాలె? వాళ్లు ఎట్ల చేస్తున్నరనేది పరిశీలించారు. బాగా అధ్యయనం చేసి, నిన్న రాత్రి 12 గంటలకు హైదరాబాద్‌కు చేరుకున్నరు. హైదరాబాద్‌ను స్వచ్ఛ హైదరాబాద్‌గా చేయాలని పట్టుదలతో నిర్ణయించుకున్నం. ప్రతినెల 17వ తారీఖున సమావేశం కావాలె. ఇన్‌చార్జిగా ఉన్న వాళ్లు రావాలె. మొత్తంగా భవిష్యత్‌కోసం ప్రిపేర్ కావాలె. ఇప్పుడు ఇక్కడకు వచ్చేటప్పుడు కమిషనర్‌తో మాట్లాడాను. స్వచ్ఛ హైదరాబాద్, హైదరాబాద్ అభివృద్ధికి ఏమేం జరిగింది? ఏమి చేయాలనేదానిపై నెల 19న మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో మధ్యాహ్నం 2గంటల నుంచి మీటింగ్ పెట్టుకొని కచ్చితమైన నిర్ణయాలు తీసుకుంటం.

దయచేసి మీ అందరికీ మనవి చేసేది ఏమిటంటే.. గతంలో మీకు ఏమి చెప్పిననో చెత్తబుట్టలు మున్సిపాలిటీ వాళ్లే మీకు సరఫరా చేస్తరు. మీరు చెత్తబుట్టలో చెత్త వేసి, వాటిని బయట పెడితే ఆటోరిక్షాల వాళ్లు తీసుకొని వెళతరు. వాటిని సిటీలో అక్కడక్కడ ఉంచిన లారీల్లో నేరుగా వేస్తరు. లారీలు నేరుగా ఎక్కడైతే సాఫ్ చేస్తరో అక్కడకు వెళతయి. ఒకటి ఎరువు తయారైతది, ఒకటి విద్యుత్ తయారైతది. చక్కటి పద్ధతులలో చెత్త అనేది లేకుండా తయారైతది. మనమందరం చూస్తున్నం.. వస్తుంటే నేను కూడా చూసిన. పాత ఇండ్లు కూలగొట్టి కొత్త ఇండ్లు కడుతున్నరు. కూలగొట్టిన దాన్ని ఎక్కడ పోయాలో అర్థంకాదు. అది ఎవడినో తీసి వేయమని నాలుగు డబ్బులు ఇస్తం. వాడు తీసుకుపోయి ఆయింత ఖాళీగా ఉన్న స్థలంలో పోస్తడు. అక్కడ కూడా గుట్టల్లా పేరుకుపోతున్నది.

దీనిని నిర్మూలించడానికి కూడా మిషన్లు వచ్చినయి. ప్రజలకు పైస ఖర్చు కూడా లేకుండా ఒక్క ఫోన్ చేస్తే మున్సిపాలిటీ వాళ్లే దాన్ని తీసుకువెళ్లే విధంగా వ్యవస్థను తయారు చేస్తున్నం. 19వ తేదీనాడు ఈ నిర్ణయాలన్నీ జరుగుతయి. ఈ నాలాల సంగతి చూస్తే చిన్నవి, పెద్దవి కలిపి 373 కిలోమీటర్ల నాలాలు ఉన్నయి. ఆ నాలాల్లో పాపం పేదవాళ్లు ఇండ్లు కట్టుకున్నరు. వాళ్లకు ప్రత్యామ్నాంగా ఇండ్లు కట్లాలి. ప్రత్యామ్నాయం లేకుండా తొలగిస్తే వాళ్ల బతుకులు ఆగమవుతయి. వాళ్లకు కూడా ప్రత్యామ్నాయంగా స్థలం చూపించి, మంచి డబుల్‌బెడ్‌రూమ్ ఇండ్లు కట్టించి దాన్ని చేయాలె. ఆ విధంగా నాలాలపై కార్యక్రమం మొదలైతది. అది ఒక్కసారి అయ్యేది కాదు. ఏడాది రెండేండ్లు పడుతుంది. ఐదారువేల కోట్ల రూపాయలు ఖర్చుపెడితే ఆ బాధ శాశ్వతంగా పోతుంది. దీనిని ప్రభుత్వం రెడీగా ఉంది. కార్యక్రమాలు చేస్తాం.

మీకోసం తిట్లు పడత ఈ ప్రాంతం వాళ్లకు ఇండ్లు కట్టిస్తానని చెప్పిన. మీకు ఇచ్చిన మాటకు నేను తిట్ల పడతా ఉన్న. అయినా ఫర్వాలేదు.. మీ కోసం ఆ మాత్రం తిట్ల పడతా. ఇండ్లు కట్టించాలె.. అది నా బాధ్యత. రైల్వే డిపార్ట్‌మెంటు వాళ్లతో కూడా మాట్లాడడం జరిగింది. చిలకలగూడ సమీపంలో రైల్వే డిపార్ట్‌మెంట్‌కు సంబంధించిన జాగాలున్నయి. వాళ్లకు కావాలంటే వేరేతాన మంచి జాగా ఇస్త. ఇక్కడి వాళ్లకు 10 ఎకరాలు చాలు. అందులో ఆరు అంతస్తుల భవనాలు కట్టిస్తా. భూమి దొరికినంక నేనే వచ్చి శంకుస్థాపన చేస్త. త్వరలో ఇండ్లు స్టార్ట్ చేస్త. అందరికీ ఇండ్లు వస్తయి.

ఇండ్లులేని వారికి ఇండ్లు ఇస్త. నూటికి నూరు శాతం చేయిస్త. ఇక్కడ మీ ఎమ్మెల్యే ఉన్నడు. ఆయన రాష్ట్రంలో ప్రముఖ మంత్రి కూడా. ఆయనకు చాలా పలుకుబడి ఉన్నది. కచ్చితంగా మీ పనులు జరుగుతయి. సత్యనారాయణ వాటర్ వర్క్స్ ఈఎన్‌సీ ఇక్కడ ఉన్నరు.. జీహెచ్‌ఎంసీ ఇంజినీర్ కూడా ఇక్కడ ఉన్నరు. వారిని నేను అడిగిన.. అమ్మాయి వచ్చింది ఐఏఎస్ అధికారి.. వారినీ అడిగిన. అన్ని ఒకేసారి చేయలేము.. వాహనాలు లేవు.. అన్నరు. అందరికీ ఒక్కటే చెప్పిన.. 19వ తేదీనాడు కచ్చితంగా దీనిమీద నిర్ణయాలు జరుగుతయి.

దాని తరువాత చాలా కొత్తగా నిర్వహించే విధానాలు మీరు చూడబోతున్నారు. వస్తుంటే చూసిన.. రోడ్డుమీద డస్ట్‌బిన్‌ వద్ద మొత్తం బ్లీచింగ్ పౌడర్ చల్లారు. దాని దగ్గరకు వెళ్లిచూస్తే మాత్రం పొట్టపేగులు బయటపడతయి. అదిపోవాలంటే దారిలేదు. ఎక్కడెక్కడి చెత్త తెచ్చి అక్కడ వేస్తరు. ఇది లేకుండా చేయాలి. నాగపూర్‌లో 1100 డస్ట్‌బిన్‌లు ఉండేవి. అవన్నీ తీసేసుకుంటూ పోతావున్నరు. బుట్టలు తెచ్చి ఇచ్చిన తరువాత చెత్తను బయట వేసే అవసరం ఉండదు. ఇప్పుడు నాగపూర్‌లో డస్ట్‌బిన్‌లు 1100నుంచి 150కు తగ్గిపోయినయి. అవి కూడా కొన్ని ఏరియాలకే పరిమితమైనయి. వాళ్లకు పట్టణం మంచిగ కనిపిస్తా ఉంది. మన హైదరాబాద్ కూడా మంచిగ కనపడాలి.

మంచిగ కనపడాలంటే డస్ట్‌బిన్‌లు వచ్చి, ఆటోరిక్షాలు వచ్చి, లారీలు వచ్చి, ఒక్క చెత్త కాగితం కూడా బజారున పడకుండా చేసుకుంటే నగరం అందంగా తయారవుతుంది. ఒక్క బౌద్ధనగర్ కాదు.. పార్సీగుట్ట కాదు.. మొత్తం హైదరాబాద్ సిటీ మీద 2500 ట్రాలీ ఆటోలు రాబోతున్నయి. దీంతో అంతా సక్రమంగా జరుగుతుంది. అంతా ఏక్ దమ్ కావాలంటే కాదు. అన్నం వండుకొని తినాలన్నా గంట సమయం పడుతుంది. దీనికి కొంత సమయం పడుతుంది. చేసుకుంటూ పోతుంటే మూడు నాలుగు నెలల నాటికి బ్రహ్మాండంగా ఉంటుంది. అధికారులు కూడా చేస్తా ఉన్నరు.

త్వరలో 45 ఎంజీడీల నీళ్లు మంచినీళ్ల సమస్య కూడా తీరుతా ఉంది. కృష్ణానది నీళ్లు ఇంకా రాబోతున్నాయి. 45 ఎంజీడీల నీళ్లు త్వరలో రాబోతున్నాయి. అవి వస్తే గంట ఇచ్చే బదులు ఇంకో అరగంట ఎక్కువ నీళ్లు ఇచ్చే ఆస్కారం ఉంటది. చేస్తమంటే తప్పకుండా చేయాలి. నీళ్లు ఇస్తామంటే ఇస్తాము. అయితే అవి తెల్లారేవరకు రావు. పైప్‌లైన్లు వేయాలి.. టెండర్లు పిలవాలి.. దానికి సమయం పడుతుంది. ఇదే ప్రాంతంలో కూరగాయల మార్కెట్‌కు కూడా ప్లాన్ చేస్తా ఉన్నా. వీటన్నింటికీ ప్లాన్ చేసి, వచ్చేనెల మీ దగ్గరకు వచ్చేనాటికి ఈ కార్యక్రమాలు మొదలైతయి పనులకు నాలుగు వేల కోట్ల రూపాయలు కేటాయించినం. గవర్నమెంటు పని ఏమిటంటే టైమ్ పడుతది. మళ్లా మీకు చెపుతున్నా.. ఈ పనులు కావాలంటే అక్క చెల్లెళ్లు కూడా భాగసామ్యం కావాలె.

బౌద్ధనగర్ బస్తీకి కమిటీవేస్తం ఇక్కడ బౌద్ధనగర్ బస్తీకోసం ఒక కమిటీ వేయమని చెప్పిండ్రు! మీ ముందరనే కమిటీ వేస్తం. జరిగే పనుల్లో కూడా భాగసామ్యం చేస్తం. దీంతో రాజకీయాలు వద్దని చెపుతున్న. రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి కమిటీ వేస్తున్న. (కమిటీ సభ్యుల పేర్లు సీఎం చదివి వినిపించారు. ఆ తరువాత కమిటీలో మహిళలు ముగ్గురే ఉండడంతో మరో ఇద్దరిని కమిటీలోకి తీసుకోవాలని సూచించారు) కమిటీ సభ్యుల్లో ఇంటి పేర్లు లేవు.. భర్త పేరు లేదు.. ఫోన్ నంబర్ లేదు. అన్నీ రాసి నాకు అప్పగించాలె. మాజీ కార్పొరేటర్ సత్యనారాయణను కూడా కమిటీలోకి తీసుకుందాం.

రేషన్ కార్డులు లేకుంటే చెప్పండి.. రేషన్ కార్డులు లేని వాళ్లుంటే పేర్లు చెప్పండి. రేపటికల్లా కార్డులు ఇప్పిద్దాం. అలాగే నేను మీ దగ్గరకు వస్తున్నా. పింఛన్లు రాని వృద్ధులు, వితంతువులు ఎవరైనా ఉంటే ఇవ్వండి. మళ్లీ 15 రోజులలో మీ దగ్గరకు వస్తాను. మొత్తం మీద నేను కోరేది ఒక్కటే! పట్టుబట్టినం.. మొదలు పెట్టినం.. సాధించాలె! మంచి ఉద్దేశంతో చేసే పని ఏదైనా సరే తప్పకుండా విజయం సాధిస్తాం. అందరం కలిసి ముందుకు పోదాం. విజయం సాధిద్దాం జై తెలంగాణ.. అంటూ సీఎం తన ఉపన్యాసాన్ని ముగించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే, మంత్రి పద్మారావుగౌడ్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్, బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, సీఎం కార్యాలయ కార్యదర్శి రాజశేఖర్‌రెడ్డి, జీహెచ్‌ఎంసీ జోనల్ కమిషనర్ దాసరి హరిచందన తదితర అధికారులు, స్థానిక టీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.