
-కులాలు, మతాలమధ్య చిచ్చుపెట్టి రెచ్చగొట్టేవారిని తిప్పికొట్టండి -ఎన్నికలొస్తే బీజేపీకి మసీద్, మందిర్ గుర్తుకొస్తాయి -టీఆర్‌ఎస్ 16 సీట్లు గెలిస్తే ఢిల్లీ మెడలు వంచుదాం -తెలంగాణ అభివృద్ధికి నిధులు సాధించుకుందాం -మీ భవిష్యత్తును నిర్ణయించేది మీ ఓటే -మోదీ మళ్లీ ప్రధానమంత్రి అయ్యేదిలేదు -బీజేపీకీ 150, కాంగ్రెస్‌కు 100 సీట్లు మాత్రమే -16 సీట్లలో టీఆర్‌ఎస్, ఒక స్థానంలో ఎంఐఎందే గెలుపు -కేసీఆర్‌తో టచ్‌లో కాంగ్రెసేతర,బీజేపీయేతర పార్టీలు: కేటీఆర్ -రాజధానిలో ఆరునెలల్లో డబుల్ బెడ్రూం ఇండ్లు -మెట్రోరైల్‌ను 200 కిలోమీటర్లకు పెంచుకుందాం -దక్షిణాసియా సినీపరిశ్రమకు హైదరాబాద్ కేంద్రంకావాలి -టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు -జూబ్లీహిల్స్, నాంపల్లి నియోజకవర్గాల్లో రోడ్‌షోలు
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ హైదరాబాద్ నగరానికి చేసిందేమీలేదని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు విమర్శించారు. ఎన్నికలు రాగానే బీజేపీకి మసీద్, మందిర్ గుర్తుకువస్తాయని, హిందూ, ముస్లింల మధ్య విభేదాలు సృష్టిస్తుంటారని, రాజకీయ లబ్ధికోసం ఇండియా- పాకిస్థాన్ అంశాన్ని తెరపైకి తెస్తారని మండిపడ్డారు. చెప్పేందుకు ఏమీలేక ప్రజలమధ్య చిచ్చుపెట్టి, చలిమంటలు కాచుకునే పార్టీ బీజేపీ అని విమర్శించారు. కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టి, రెచ్చగొట్టేవారిని లోక్‌సభ ఎన్నికల్లో తిప్పికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మోకా చూసి దెబ్బ కొట్టాలె. ఇప్పుడు మీ ఓటుతో మీ భవిష్యత్తును నిర్ణయించుకునే అవకాశమొచ్చింది. తెలంగాణ ప్రజల ప్రయోజనాలకోసం రాజీలేని పోరాటంచేసే టీఆర్‌ఎస్ అభ్యర్థులందరినీ గెలిపించుకోవాలి అని పిలుపునిచ్చారు.
శనివారం జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని శ్రీరాంనగర్, యూసుఫ్‌గూడ, ఇందిరానగర్‌తోపాటు నాంపల్లి నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి తలసాని సాయికిరణ్‌కు మద్దతుగా కేటీఆర్ రోడ్‌షోలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో శాంతిభద్రతలు సుస్థిరంగా ఉన్నాయన్నారు. కానీ.. భావోద్వేగాలు రెచ్చగొట్టి పబ్బం గడుపుకొనేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నదని విమర్శించారు. ఐదేండ్లలో ప్రధాని నరేంద్రమోదీ వేషం మారింది కానీ.. దేశం మారలేదన్నారు. చాయ్‌వాలా నుంచి ప్రమోషన్ పొందిన మోదీ ఇప్పుడు చౌకీదార్ అంటున్నాడని, మరోవైపు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ టేకేదార్ అంటున్నాడని పేర్కొన్న కేటీఆర్.. ఈ దేశానికి చౌకీదార్, టేకేదార్ అవసరంలేదని, ప్రజలకు దమ్‌దార్, ఇమాన్‌దార్, జోర్‌దార్, వఫాదార్, హస్సర్‌దార్, జిమ్మేదార్ కేసీఆర్ కావాలని చెప్పారు. ఫానూస్ బన్‌కే జిస్‌కీ హవా ఇఫాదత్ కరే, ఓ షమా క్యా ముఝే జిస్‌కో ఖుదా రోషన్ కరే అనే మాట మరిచిపోవద్దని కేటీఆర్ కోరారు. గాలిలో బాణాలు వేయడంలేదు.. గాల్లో మాటలు చెప్పడం లేదన్నారు. ఓట్లకోసం చెప్పే మాటలుకావని స్పష్టంచేశారు.

హైదరాబాద్ అభివృద్ధికి మోదీ చేసిందేంటి? హైదరాబాద్ అభివృద్ధికి మోదీ ఏం పనిచేశారో దమ్ముంటే రాష్ట్ర బీజేపీ నేతలు, సికింద్రాబాద్ నుంచి పోటీచేస్తున్న కిషన్‌రెడ్డి చెప్పాలని కేటీఆర్ సవాలు విసిరారు. ఏ పనీ చేయకుండా ఇప్పుడు ఏం ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారని నిలదీశారు. హైదరాబాద్‌కు రాజ్యాంగబద్ధంగా రావాల్సిన నిధులు మాత్రమే వచ్చాయని స్పష్టంచేశారు. ఎల్బీ స్టేడియానికి వచ్చిన మోదీ ఐదేండ్లలో చేసిన అభివృద్ధిని చెప్పకుండా, మళ్లీ గెలిస్తే ఏం చేస్తారో చెప్పకుండా కేసీఆర్‌పై వ్యక్తిగత విమర్శలతో సరిపెట్టారని ఆగ్రహం వ్యక్తంచేశారు. బీజేపీ అభ్యర్థి కిషన్‌రెడ్డికూడా నగరానికి ఏంచేశారో చెప్పకుండా.. గెలిస్తే కేంద్రమంత్రి అవుతానంటూ ప్రచారం చేసుకుంటున్నాడని ఎద్దేవాచేశారు. అసలు దత్తాత్రేయను కేంద్రమంత్రి పదవినుంచి ఎందుకు తీసేశారో చెప్పాలన్నారు. అమ్మకు అన్నంపెట్టనోడు చిన్నమ్మకు బంగారం పెడతానన్న చందంగా అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయనోడు మళ్లీ అధికారం ఇస్తే చేస్తానంటే నమ్ముదామా? మరోసారి మోసపోదామా? అని ప్రజలను ప్రశ్నించారు. సాయికిరణ్‌ను గెలిపిస్తే కేసీఆర్ తరఫున సైనికుడిగా ఢిల్లీలో పనిచేస్తాడన్నారు. సారు, కారు, పదహారు, ఢిల్లీలో సర్కారు అనే నినాదాన్ని గుర్తుపెట్టుకోవాలని విజ్ఞప్తిచేశారు.
పదహారు సీట్లతో కేంద్రం మెడలు వంచుతాం నగరంలో ఒక బీజేపీ నాయకుడు టీఆర్‌ఎస్ 16 సీట్లు గెలిస్తే చేసేదేమీలేదని అంటున్నాడన్న కేటీఆర్.. పదహారు మంది టీఆర్‌ఎస్ ఎంపీలను కేసీఆర్‌కు ఇస్తే.. తెలంగాణ అభివృద్ధికోసం ఢిల్లీ మెడలు వంచుతారని చెప్పారు. ఇద్దరు ఎంపీలతోనే కేసీఆర్ తెలంగాణ సాధించారని గుర్తుచేశారు. రానున్న ఎన్నికల్లో బీజేపీకి 150, కాంగ్రెస్‌కు 100కు మించి స్థానాలు లభించే అవకాశం లేదని చెప్పారు. తెలంగాణలో పదహారు స్థానాల్లో టీఆర్‌ఎస్, ఒక స్థానంలో ఎంఐఎం నేత అసదుద్దీన్ గెలువబోతున్నారని ధీమా వ్యక్తంచేశారు. కాంగ్రెస్, బీజేపీ అంటే ఇష్టంలేని పార్టీలు, ఎంపీలు కేసీఆర్‌తో టచ్‌లో ఉన్నారని చెప్తూ.. 17 సీట్ల నుంచి ఎంపీల సంఖ్య పెరుగుతుందని వెల్లడించారు.
కేంద్రంలో ఎవరు మంత్రి పదవుల్లో ఉంటారో వారి రాష్ర్టాల్లోనే అభివృద్ధి జరుగుతుందన్నారు. మమతాబెనర్జీ, లాలూప్రసాద్‌యాదవ్ రైల్వే మంత్రులుగా ఉన్నప్పుడు వారి రాష్ర్టాలకే కొత్త రైళ్లు వేసుకున్నారని ఉదహరించారు. మోదీ కూడా కొత్తగా వేసిన బుల్లెట్ రైలును గుజరాత్‌కు తీసుకెళ్లారని గుర్తుచేశారు. ఎన్డీయే ప్రభుత్వంలో మోదీ చంకనచేరిన చంద్రబాబు తనకున్న ఎంపీల బలంతో ఏడు తెలంగాణ మండలాలను ఆంధ్రలో కలుపుకొన్నారని అన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రయోజనాలను సాధించుకోవాలంటే ఢిల్లీలో కీలకపాత్ర పోషించాల్సిన అవసరం ఉందని చెప్పారు. కానీ.. కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు గెలిస్తే ఢిల్లీలో మోదీ, రాహుల్ ఉస్కో అంటే ఉస్కో, డిస్కో అంటే డిస్కో అంటారని కేటీఆర్ ఎద్దేవాచేశారు. రాష్ట్రవ్యాప్తంగా గులాబీ ప్రభంజనం కనిపిస్తున్నదని చెప్తూ.. జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి కోడెద్దు గోపీనాథ్‌ను గెలిపించారని, జోడెద్దుగా సాయికిరణ్‌ను ఎంపీగా గెలిపించుకోవాలని కోరారు.
హైదరాబాద్ మెట్రోకు మోదీ అన్యాయం హైదరాబాద్ మెట్రోరైలుకు నిధుల విషయంలో మోదీ అన్యాయంచేశారని కేటీఆర్ విమర్శించారు. ముంబై మెట్రోకు రూ.18 వేలకోట్లు ఇచ్చిన కేంద్రం.. హైదరాబాద్ మెట్రోరైలుకు తూతూమంత్రంగా రూ.1200 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకొన్నదని మండిపడ్డారు. మెట్రోరైలు ప్రస్తుతానికి 56 కిలోమీటర్లు ప్రారంభించామని, భవిష్యత్తులో 200 కిలోమీటర్ల మేర విస్తరిస్తామని హామీ ఇచ్చారు. అతి త్వరలో పాతబస్తీకీ మెట్రోరైలు వస్తుందని చెప్పారు.
ఆరునెలల్లో డబుల్ బెడ్రూం ఇండ్లు నగరంలోని పేద కుటుంబాలకు ఆరునెలల్లో డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి ఇస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. అర్హులైన లబ్ధిదారులను తామే వెతికి ఇండ్లను అందజేస్తామని, ఈ విషయంలో ఎవరూ అందోళనపడాల్సిన అవసరంలేదన్నారు. నగరంలో ఇప్పటికే 24 గంటల విద్యుత్ ఇస్తున్నామని, రోడ్లు అభివృద్ధి చేసుకున్నామని తెలిపారు. 14 వేల కిలోమీటర్ల డ్రైనేజీ నిర్మాణం పూర్తిచేసుకున్నామని, 10 లక్షల సీసీ కెమెరాలు ఏర్పాటుచేశామని చెప్పారు. రాష్ట్రంలో అనేక సంక్షేమపథకాలు అమలుచేస్తున్నామని, 600 గురుకులాలు ఏర్పాటుచేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు ఉచితవిద్య అందిస్తున్నామని గుర్తుచేశారు. టీఆర్‌ఎస్ ఎవరికీ బీ-టీమ్ కాదన్న కేటీఆర్.. తమది తెలంగాణ అభివృద్ధికోసం పనిచేస్తున్న టీం అని ప్రకటించారు. ప్రతిసీటు కీలకం కానున్న నేపథ్యంలో ఓటు అత్యంత ముఖ్యమైనదని చెప్పారు. ఈ రోడ్‌షోల్లో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, నాంపల్లి ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్, ఎమ్మెల్సీ ప్రభాకర్‌రావు, జీహెచ్‌ఎంసీ మేయర్ బొంతు రామ్మో హన్, డిప్యూటీ మేయర్ బాబాఫసియుద్దీన్, ఎంబీసీ చైర్మన్ తాడూరి శ్రీనివాసరావు, టీఆర్‌ఎస్ నాయకుడు, డాక్టర్ ఎం ప్రభాకర్‌రెడ్డి చిత్రపురిహిల్స్ తెలుగు ఫిల్మ్‌ఇండస్ట్రీ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు కొమర వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.

పదికోట్ల ఉద్యోగాలేవి? పేదల అకౌంట్లో 15 లక్షల డబ్బులేవి? బీజేపీని గెలిపిస్తే ఐదేండ్లలో పదికోట్ల ఉద్యోగాలిస్తానని గత ఎన్నికల్లో మోదీ చెప్పిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. పదికోట్ల ఉద్యోగాలు ఎక్కడిచ్చారో చెప్పాలని కేటీఆర్ డిమాండ్‌చేశారు. ప్రతి పేదవారి ఖాతాలో రూ.15 లక్షలు డిపాజిట్ చేస్తామన్న హామీ ఇప్పటికీ నెరవేరలేదన్నారు. పైగా పెద్దనోట్ల రద్దు పేరుతో మహిళలకు అన్యాయంచేశారని, వారి పోపుడబ్బాల్లోని డబ్బులు సైతం లాక్కున్నారని విమర్శించారు. విద్య, వైద్యం, రోడ్లు, సాగునీరు, తాగునీరు, ఉపాధి అవకాశాల కోసం ఆలోచించాల్సిందిపోయి, సంబంధంలేని విషయా లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ యజ్ఞాలు, యాగాదుల గురించి మోదీ మాట్లాడుతున్నారన్న కేటీఆర్.. ప్రధాని మాట్లాడాల్సిన మాటలు ఇవేనా? అని నిలదీశారు.
దక్షిణాసియా సినీపరిశ్రమకే హైదరాబాద్ కేంద్రం కావాలి తెలుగు సినిమాలకే కాకుండా మొత్తం దక్షిణాసియా చలనచిత్ర పరిశ్రమకే హైదరాబాద్ కేంద్రం కావాలని ఆలోచిస్తున్నామని కేటీఆర్ వెల్లడించారు. తెలుగు సినీపరిశ్రమలోని 24 క్రాప్ట్స్‌లో పనిచేస్తున్న వేలమంది కార్మికులకు, కళాకారులకు, సాంకేతిక నిపుణులకు తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తున్నదని చెప్పారు. భవిష్యత్తులో హిందీ, బెంగాలీతోపాటు అనేకభాషల సినిమాలు షూటింగ్ జరుపుకొనేలా హైదరాబాద్ పరిశ్రమను తీర్చిదిద్దాలనే ఆలోచనతో సీఎం కేసీఆర్ ఉన్నారని తెలిపారు. హైదరాబాద్ భౌగోళికంగా ఎన్నో అనుకూలతలు కలిగి ఉన్నదని, దీనిని ఉపయోగించుకుని సినీ పరిశ్రమను మరింత అభివృద్ధిచేస్తామని సినీ కార్మికులకు భరోసానిచ్చారు.