Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

చీకటి నుంచి వెలుగుల్లోకి తెలంగాణ

-నాడు రోజూ కరెంటు కోతలు.. నేడు నిరంతరాయంగా సరఫరా -వచ్చే మేనాటికి రైతులకు 24 గంటలపాటు ఇస్తాం -నమస్తే తెలంగాణ ఇంటర్వ్యూలో విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి

సమైక్య పాలనలో ఉన్న చీకటి నుంచి వెలుగుల దిశగా తెలంగాణ పయనిస్తున్నదని రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి జీ జగదీశ్‌రెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అకుంఠిత దీక్ష, పట్టుదల, ఉద్యోగుల సహకారంతో ఇది సాధ్యమైందన్నారు. ఒకప్పుడు తీవ్రమైన కరెంట్ కొరత ఉన్న రాష్ర్టాన్ని మిగులు రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి సీఎం నాయకత్వంలో కృషి చేస్తున్నామన్నారు. రాష్ట్రం ఏర్పడే నాటికి 6500 మెగావాట్లున్న విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని ఇప్పుడు 11670 మెగావాట్లకు తెచ్చామని, ఇండ్లకు, పరిశ్రమలకు 24 గంటలపాటు కరెంట్ ఇస్తున్నామని, వ్యవసాయానికి కోతల్లేకుండా 9 గంటలకు పైగా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నామని తెలిపారు. మూడేండ్ల పాలన పూర్తయిన సందర్భంగా మంత్రి జగదీశ్‌రెడ్డి నమస్తే తెలంగాణకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు విషయాలు వివరించారు.

ఈ మూడేండ్లలో విద్యుత్‌శాఖ ఏం సాధించింది? ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో తెలంగాణ విద్యుత్‌శాఖ అద్భుతమైన ప్రగతి సాధించింది. కరంట్ కోతల నుంచి రాష్ర్టాన్ని తప్పించింది. సీఎం ఎంతో పట్టుదలతో, దీక్షతో మొదటి ఆరు నెలల్లోనే ఈ ఘనత సాధించాం. విద్యుత్‌శాఖ సాధించిన ఈ విజయం ప్రభుత్వంలో ఆత్వవిశ్వాసాన్ని పెంచింది. ప్రజలకు పాలనపై విశ్వాసాన్ని పెంచింది. రాష్ర్టానికి మంచిపేరు తెచ్చింది.

రాష్ట్రం ఏర్పడేనాటికి విద్యుత్ రంగంలో నెలకొన్న పరిస్థితులు ఏమిటి? తెలంగాణ ఏర్పడక ముందు నాటికి పట్టణాల్లో గంటల తరబడి, గ్రామాల్లో రోజుల తరబడి విద్యుత్ సరఫరా ఉండేది కాదు. ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా పారిశ్రామికవేత్తలు కూడా రోడ్లమీదికి వచ్చి ధర్నా చేసే వారు. ఇక రైతులు, ప్రజల కష్టాలు సరేసరి. కరంట్ లేక పంటలు ఎండి పోయేవి. అన్నదాతల గోడు నాటి పాలకులు పట్టించుకునేవారు కాదు. రాష్ట్రం ఏర్పడ్డప్పుడు మన మొత్తం విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం సుమారు 6500 మెగావాట్లు కాగా, 2014 మార్చి నాటికి గరిష్ఠ డిమాండ్ 6660 మెగావాట్లు ఉండేది. అంటే ఉత్పత్తి తక్కువ డిమాండ్ ఎక్కువ. దీంతో అప్పుడు 50 శాతం విద్యుత్ కోతలు విధించేవారు. ఇటువంటి సకల సమస్యలకు పరిష్కారం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటేనని కేసీఆర్ పోరాడి సాధించారు.

సమస్యను ఎట్లా అధిగమించారు? ఇప్పటి పరిస్థితి ఏమిటి? ప్రత్యేక రాష్ట్రమైతే తెలంగాణ అంధకార బంధురం అవుతుందని ఆనాటి సీమాంధ్ర పాలకులు ప్రజలను భయపెట్టాలని చూశారు. కానీ ప్రజలు, ఉద్యమ నేతలు వారి మాటలు నమ్మక పోరాడి స్వరాష్ట్రం సాధించుకున్నారు. ఆ ఉద్యమ స్ఫూర్తితోనే సీఎం కేసీఆర్ ఈ అంశాన్ని సవాలుగా తీసుకొని ప్రత్యేక శ్రద్ధ వహించి ఆరు నెలల్లోనే విద్యుత్ పరిస్థితిని చక్కదిద్దారు. మూడేండ్లలో విద్యుత్ సామర్థ్యాన్ని పెంచుకున్నాం. నేడు 9400 మెగావాట్లు డిమాండ్‌ను కూడా తట్టుకోగలిగే స్థాయికి చేరాం. రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఇప్పుడు 11670 మెగావాట్లు. ఇప్పుడు 24 గంటలపాటు కరెంట్ ఇస్తున్నాం. వ్యవసాయానికి కోతల్లేకుండా సరఫరా చేస్తున్నాం.

ఇంత తక్కువ సమయంలో ఇది ఎలా సాధ్యమయ్యింది? వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ ఎప్పుడిస్తారు? కరంట్ లేక ఒక్క మోటార్ కాలిపోవద్దు.. ఒక్క ఎకరం పంట కూడా ఎండి పోవద్దన్నది సీఎం కేసీఆర్ ఆశయం. ఈ ఆశయాన్ని నెరవేర్చడానికి సీఎంతోపాటు, విద్యుత్‌శాఖ అధికారులు, సిబ్బంది, పాలకగణం రేయింబవళ్లు కష్టపడి పని చేశారు. అనుకున్నది సాధించారు. రాష్ట్రం ఏర్పడిన కొద్ది నెలల్లోనే 6 గంటల విద్యుత్‌ను అదికూడా పగటిపూటే వ్యవసాయానికి నిరంతరాయంగా ఇచ్చాం. తరువాత 9 గంటల విద్యుత్‌ను ఇవ్వడం మొదలుపెట్టాం. వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ కోసం పక్కా కార్యాచరణతో ముందుకు వెళుతున్నాం. 2018 మేనెల నాటికి ఇది సాధిస్తాం.

ఛత్తీస్‌గఢ్ నుంచి ఎక్కువ ధరకు విద్యుత్ కొంటున్నట్లు ప్రతిపక్షాలు అంటున్నాయి కదా? ప్రతిపక్షాలది అవగాహనలేని, అర్థంలేని ఆరోపణ. ఛత్తీస్‌గఢ్‌తో ఒప్పందం రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరిగింది. అనాటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి అప్పటి అవసరాలను పట్టించుకోకుండా.. ఉత్తర, దక్షిణ గ్రిడ్‌లో భాగస్వామ్యం తీసుకోలేకపోవడం వల్ల మనకు ఇబ్బందులు ఎదురయ్యాయి. తెలంగాణ ఏర్పడగానే సీఎం కేసీఆర్‌వెయ్యి మెగావాట్ల కొనుగోలు చేశారు. రెండు రాష్ర్టాల ఈఆర్సీలు ధర నిర్ణయించాయి. ఇది తెలంగాణకు భవిష్యత్తులో కూడా ఎంతో ఉపయోగకరం.

సౌరశక్తి వినియోగంలో కార్యక్రమాలు చెప్పండి? సోలార్ పవర్ విషయంలోనూ వినూత్నంగా ముందుకు సాగుతున్నాం. సబ్‌స్టేషన్ వారీగా కొత్త విధానాన్ని అమలు చేస్తున్నాం. గడిచిన మూడేండ్లలో దాదాపు 2,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సాధిం చాం. ఇప్పటి వరకు సౌరవిద్యుత్‌లో అగ్రస్థానంలో ఉన్న గుజరాత్, రాజస్థాన్ తదితర రాష్ర్టాలను దాటి తెలంగాణ నంబర్ వన్ స్థానానికి వచ్చింది. 2019 నాటికి రాష్ట్రంలో సౌర విద్యుత్ ఉత్పత్తి 5 వేల మెగావాట్లకు చేరుకుంటుంది.

విద్యుత్‌శాఖలో ఉద్యోగాల కల్పన ఎంతవరకు వచ్చింది? జెన్‌కో, ట్రాన్స్‌కో, ఎస్‌పీడీసీఎల్, ఎన్‌పీడీసీఎల్‌లలో చాలా కాలంగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులుగా ఉన్న సుమారు 24 వేల మందిని రెగ్యులరైజ్ చేసే ప్రక్రియ చేపట్టాం. దీంతోపాటు సుమారు 16,000 మందికి కొత్తగా ఉద్యోగాలు ఇచ్చాం. అంటే తెలంగాణ వచ్చిన తరువాత సుమారు 40 వేల మందికి ఉద్యోగావకాశం కల్పించినట్టయ్యింది.

భవిష్యత్ ప్రణాళికలు ఏమిటి? నీటిపారుదల ప్రాజెక్టులు పూర్తి అయితే ఏర్పడే డిమాండ్‌తోపాటు, ప్రతి ఏటా సాధారణంగా పెరిగే వినియోగం, పారిశ్రామిక అవసరాలు.. ఇలా అన్నిటికీ కలిసి దాదాపు 24వేల నుంచి 25వేల మెగావాట్లు అవసరమవుతుందని అంచనా. అదే స్థాయిలో ఉత్పత్తి చేసి తెలంగాణ మిగులు విద్యుత్ రాష్ట్రంగా మారాలని సీఎం కేసీఆర్ కల. ఇందుకు అనుగుణంగానే చర్యలు తీసుకుంటున్నారు. ఎన్టీపీసీ ద్వారా 4000 మెగావాట్ల ఉత్పత్తిలో భాగంగా మొదటి విడుత కింద 1600 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం పనులు రామగుండంలో జరుగుతున్నాయి. నల్లగొండలో యాదాద్రి విద్యుత్ కేంద్రం ఏర్పాటుకు అన్ని అనుమతులు వచ్చాయి. అక్కడ మరో 4 వేల మెగావాట్లు, మణుగూరులో 1020 మెగావాట్లు, సింగరేణి మూడో ఫేజ్‌లో 800 మెగావాట్లు, కొత్తగూడెంలో 800 మెగావాట్లు ఉత్పత్తి చేస్తాం. ఛత్తీస్‌గఢ్ నుంచి 1000 మెగావాట్లు తెస్తాం. 1000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేస్తాం. ఇట్లా మొత్తం ఉత్పత్తి సామర్థ్యం 27,790 మెగావాట్లకు చేరేలా ప్రణాళికలు రచించాం. ఆ దిశగా దూసుకుపోతున్నాం.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.