Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

చీమలదండులా..

-కొంగరకలాన్ దారిపట్టిన వాహనాలు
-జిల్లాలనుంచి వేలాది ట్రాక్టర్లలో బయలుదేరిన రైతులు, ప్రజలు
-బస్సులు, లారీలు, కార్లు, బైకులపై చేరుకుంటున్న టీఆర్‌ఎస్ శ్రేణులు, అభిమానులు
-ఫ్లెక్సీలు, గులాబీజెండాలతో శోభాయమానంగా కనువిందు చేస్తున్న రహదారులు
-జెండా ఊపి లాంఛనంగా వాహనాలను ప్రారంభించిన మంత్రులు, ఎమ్మెల్యేలు
-ప్రగతి నివేదన చారిత్రక సభగా నిలుస్తుందన్న ప్రజాప్రతినిధులు

నలుదిక్కులా.. చీమలదండులా కదిలిన ప్రజా కెరటాలు! ఎటుచూసినా.. ఎక్కడచూసినా కడలి ప్రవాహం వోలే జన సవ్వడులు! కనుచూపుమేర సంతోష సాగరాలు.. గులాబీ జెండాల రెపరెపలు! దారులవెంట సమ్మక్క జాతరలు.. ప్రగతి నివేదనకు సబ్బండ వర్గాలు! పదులు.. వందలు.. వేల వాహనాలు.. లక్షల ప్రజానీకం! కొంగరకలాన్ బాటలో.. ప్రగతి నివేదన సైన్యంలో.. సృష్టించనున్నదీ సభ ప్రభంజనం! దేశచరిత్రకే తలమానికం! సీఎం కేసీఆర్‌కే అది సాధ్యం!!

నలుదిక్కుల దారులన్నీ జనజాతరను తలపిస్తున్నాయి. వాహనాల బారులు చీమలదండులా కదిలివస్తున్నాయి. తెలంగాణ నినాదాలు మిన్నంటుతున్నాయి. గులాబీ జెండాలు రెపరెపలాడుతున్నాయి. ఎటుచూసినా బారులుదీరిన వాహనాలన్నీ రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్‌కే వెళ్తున్నాయి. ఆదివారం ప్రగతి నివేదన పేరిట ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నేతృత్వంలో భారీ బహిరంగసభ జరుగనున్న నేపథ్యంలో టీఆర్‌ఎస్ శ్రేణులు, అభిమానులు, అన్నివర్గాల ప్రజలు ఇప్పటికే సభాస్థలికి చేరుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు ఆయా వాహనాలను జెండాలు ఊపి లాంఛనంగా ప్రారంభించి హైదరాబాద్‌కు సాగనంపారు. ర్యాలీలు, సన్నాహక కార్యక్రమాలు చేపట్టారు. లక్షల మంది స్వచ్ఛందంగా సభాప్రాంగణానికి బయలుదేరారు. వరంగల్ రూరల్, అర్బన్ జిల్లాల నుంచి బయలుదేరిన వాహనాల ర్యాలీని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్దేశిత లక్ష్యానికి మించి భారీఎత్తున ప్రజలు ఈ సభకు హాజరవుతున్నారని వెల్లడించారు. ప్రతీ ఇంటినుంచి సభకు తరలుతున్నారంటే సీఎం కేసీఆర్‌కు ఉన్న ఆదరణ ఏమిటో తెలిసిపోతున్నదని, ఇదిచూసి ప్రతిపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయని చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, దాస్యం వినయ్‌భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా నుంచి 500 ట్రాక్టర్లు ప్రగతి నివేదన సభకు బయలుదేరాయి. వాహన ర్యాలీని సిద్దిపేటలో భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు జెండాఊపి ప్రారంభించారు.

మంత్రి ఐదు కిలోమీటర్ల మేర ట్రాక్టర్‌ను నడిపి బహిరంగసభకు వెళ్లేవారిని ఉత్తేజపరిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముందస్తు వద్దని ప్రతిపక్షాలు తమ ఓటమిని అప్పుడే అంగీకరించాయన్నారు. గజ్వేల్ నుంచి బయలుదేరిన ట్రాక్టర్లను ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, దుబ్బాకలో ఎమ్మెల్యే రామలింగారెడ్డి, హుస్నాబాద్‌లో ఎమ్మె ల్యే సతీశ్‌కుమార్ ర్యాలీలను ప్రారంభించారు. సూర్యాపేట జిల్లా నుంచి రైతులు 680 ట్రాక్టర్లలో వెళ్తుండగా విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించి పది కిలోమీటర్ల మేర ట్రాక్టర్‌ను నడిపారు. ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి నేతృత్వంలో 2 వేల ట్రాక్టర్లు శుక్రవారం రాత్రి సూర్యాపేటకు చేరుకుని బసచేయగా, స్థానిక టేకుమట్ల వద్ద ఎంపీతో కలిసి మంత్రి జగదీశ్‌రెడ్డి ర్యాలీని ప్రారంభించి మాట్లాడారు. మేడారం, పెద్దగట్టు జాతరలకంటే రెట్టింపు జనం వస్తున్నారని, ఈ జన ప్రవాహంలో కాంగ్రెస్ కొట్టుకుపోవడం ఖాయమన్నారు. ట్రాక్టర్లపై ఓపికగా సభకు వస్తున్న రైతాంగానికి పాదాభివందనం చేస్తున్నానని చెప్పారు. ఈ ర్యాలీలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్యే వేముల వీరేశం, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ ఉన్నారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో ట్రాక్టర్లను ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ ప్రారంభించారు. ఐడీసీ చైర్మన్ ఈద శంకర్‌రెడ్డితో కలిసి ఎల్కతుర్తివరకు మంత్రి ట్రాక్టర్ నడిపారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ దేశ చరిత్రలో ప్రగతి నివేదన అద్భుతమైన సభగా నిలుస్తుందన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ములుగులో బైక్ ర్యాలీని మంత్రి చందూలాల్ ప్రారంభించారు.

ట్రాక్టర్లలో ప్రగతి నివేదన సభ బాట పట్టిన పాలమూరు బిడ్డల ర్యాలీని వైద్యారోగ్యశాఖ మంత్రి లకా్ష్మరెడ్డి ప్రారంభించారు. భూత్పూర్‌లో ఎంపీ జితేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి ప్రారంభించారు. నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌లో ర్యాలీని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు. నారాయణపేటలో ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి, ఆయ న సతీమణి స్వాతిరెడ్డి, మక్తల్‌లో ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి జెండా ఊపి ట్రాక్టర్లను సాగనంపారు. ఆదిలాబాద్‌లో వాహనాలను అటవీశాఖ మంత్రి జోగు రామన్న ప్రారంభించారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి, బాన్సువాడ, జుక్కల్, కామారెడ్డి నుంచి సభకు బయలుదేరిన 600 ట్రాక్టర్లను వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రారంభించి, కొంతదూరం ట్రాక్టర్ నడిపి, అందు లోనే హైదరాబాద్ వరకు వెళ్లారు. జుక్కల్ నియోజకవర్గం పిట్లంలో ఎమ్మెల్యే హన్మంత్ షిండే, ఎల్లారెడ్డి నియోజకవర్గం లింగంపేట వద్ద ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి వాహనాలను సాగనంపారు. నిర్మల్ జిల్లా నుంచి వెయ్యి వాహనాలను దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ప్రారంభించారు. తన రాజకీయ జీవితంలో ఇంత పెద్ద సభను ఎన్నడూ చూడలేదన్నారు. సిరిసిల్లలో వాహన ర్యాలీని ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ జెండా ఊపి ప్రారంభించారు. అసాధ్యమనుకున్న పనులను సాధ్యం చేసింది ఒక్క టీఆర్‌ఎస్ సర్కారేన న్నారు. మెదక్ జిల్లా చిన్నశంకరంపేటలో ట్రాక్టర్ల ర్యాలీని డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి ప్రారంభించారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.