Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

చైనా కంపెనీల ఆసక్తి

-రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకొస్తున్న సంస్థలు -చైనా పారిశ్రామికవేత్తలతో సీఎం కేసీఆర్ చర్చ.. ఎల్‌ఈడీ టీవీ యూనిట్‌పై ఎంవోయూ -రాష్ట్రంలో ప్లాంట్ ఏర్పాటుకు షాంఘై ఎలక్ట్రిక్ కార్పొరేషన్ సంసిద్ధత -రాష్ట్రంలో పర్యటించాలని ఆహ్వానించిన ముఖ్యమంత్రి కేసీఆర్ -బ్రిక్స్ బ్యాంక్ ప్రతినిధులతో భేటీ.. ఆర్థికసాయానికి వినతి -గంటకు 300 కి.మీ. వేగంతో దూసుకెళ్లే బుల్లెట్ ట్రైన్‌లో కేసీఆర్ బృందం ప్రయాణం

తెలంగాణలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు చైనా కంపెనీలు ముందుకు వస్తున్నాయి. చైనా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావును కలుస్తున్న పలు ప్రముఖ కంపెనీల అధిపతులు, ప్రతినిధులు తమ ఆసక్తిని తెలియజేస్తున్నారు. షాంఘై పర్యటనలో భాగంగా గురువారం సాయంత్రం సీఐఐ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో చైనాకు చెందిన 65మంది పారిశ్రామికవేత్తలనుద్దేశించి సీఎం కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ పారిశ్రామిక విధానం, పెట్టుబడులకు ఉన్న అవకాశాలను సీఎం కేసీఆర్ వారికి వివరించారు.

తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన పారిశ్రామిక విధానం టీఎస్‌ఐపాస్ ప్రపంచంలోనే అత్యద్భుతమైన విధానమని సీఎం పేర్కొన్నారు. తెలంగాణలో పరిశ్రమలు స్థాపించేందుకు అనువైన వాతావరణ పరిస్థితులు, అవసరమైన ల్యాండ్‌బ్యాంక్ అందుబాటులో ఉన్నట్లు చెప్పారు. అవినీతికి తావులేకుండా రూపొందించిన నూతన పారిశ్రామిక విధానంలో పెట్టుబడిదారులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని అనుమతులు పొందే వీలుందని వివరించారు.

దరఖాస్తు చేసుకున్న 15 రోజుల్లోనే అన్ని ప్రభుత్వ విభాగాల నుంచి అనుమతులు ఇచ్చేలా చర్యలు తీసుకునేందుకు ముఖ్యమంత్రి కార్యాలయంలో ప్రత్యేకంగా చేజింగ్ సెల్‌ను ఏర్పాటు చేసినట్టు సీఎం కేసీఆర్ వివరించారు. తెలంగాణలో పెట్టుబడి పెట్టేందుకు రావాల్సిందిగా చైనా పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు. ఇందుకు పారిశ్రామికవేత్తలు సానుకూలంగా స్పందించారు. పలు ప్రముఖ కంపెనీల ప్రతినిధులు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు.

హైదరాబాద్ పరిసర ప్రాంతంలో 20 మిలియన్ యూఎస్ డాలర్ల (సుమారు రూ.133 కోట్లు) పెట్టుబడితో ఎల్‌ఈడీ టీవీల తయారీ యూనిట్ నెలకొల్పేందుకు సెల్‌కాన్, మెకాన్ సంస్థలు ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. వీటితోపాటు సెల్‌ఫోన్ విడిభాగాల, హెడ్‌ఫోన్స్ తయారీకి సంబంధించిన మరో రెండు కంపెనీలు హైదరాబాద్‌లో తమ యూనిట్లు నెలకొల్పేందుకు ఆసక్తి కనబర్చాయి. 40 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువ కలిగిన షాంఘై ఎలక్ట్రిక్ కార్పొరేషన్ ఉపాధ్యక్షుడు షావ్ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో భేటీ అయ్యారు. హైదరాబాద్‌లో తమ కంపెనీకి చెందిన హై పవర్డ్ పంప్స్, ఎలక్ట్రికల్ పరికరాల తయారీ యూనిట్లను నెలకొల్పేందుకు ఆసక్తి తెలిపారు. తెలంగాణలో పర్యటించాల్సిందిగా కార్పొరేషన్ ప్రతినిధులను సీఎం కేసీఆర్ వారిని ఆహ్వానించారు.

Celkon-and-Makeno-sign-MoU-in-the-presence-of-KCR-to-setting-up-TV-unit-in-Hyderabad

బ్రిక్స్ బ్యాంకు ప్రతినిధులతో భేటీ తెలంగాణ రాష్ట్రంలో చేపట్టనున్న పట్టణాభివృద్ధి ప్రాజెక్టులు, వ్యర్థాలనుంచి విద్యుత్ తయారీ ప్లాంట్ల ఏర్పాటు, ఇరిగేషన్ తదితర ప్రాజెక్టులకు ఆర్థిక సాయం అందించాలని న్యూడెవలప్‌మెంట్ బ్యాంక్ (బ్రిక్స్ బ్యాంక్) ప్రతినిధులను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు కోరారు. చైనాలోని డాలియన్‌లో బుధవారం జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి కేసీఆర్, గురువారం ఉదయం తన ప్రతినిధి బృందంతో కలిసి చైనాలోని అతిపెద్ద నగరం, ప్రపంచ ఆర్థిక హబ్ అయిన షాంఘై వెళ్లారు. అక్కడి ఎయిర్‌పోర్టు నుంచి గంటకు 300 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే మాగ్లేవ్ హైస్పీడ్ రైలులో షాంఘై నగరానికి చేరుకున్నారు.

Chief-Minister-K-Chandrashekar-Rao-met-NDB-President-K-V-Kamat

అనంతరం అభివృద్ధి చెందుతున్న దేశాల మౌలిక సదుపాయాల కల్పనకు ఆర్థికసాయం అందిస్తున్న న్యూడెవలప్‌మెంట్ బ్యాంకు (బ్రిక్స్ బ్యాంక్) ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. బ్యాంక్ అధ్యక్షుడు కేవీ కామత్, ఉపాధ్యక్షుడు జియాంఝాతో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ పలు అంశాలపై వారితో దాదాపు 40 నిమిషాలకుపైగా చర్చించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ, నీటిపారుదల ప్రాజెక్టులు, పట్టణాభివృద్ధి ప్రాజెక్టులకు, చెత్తనుంచి విద్యుత్ తయారీ ప్రాజెక్టులకు ఆర్థికసాయం అందించాల్సిందిగా కోరారు. కేసీఆర్ విజ్ఞప్తిపై బ్యాంకు ప్రతినిధులు సానుకూలంగా స్పందించారు. సాయంత్రం సీఐఐ, తెలంగాణ ప్రభుత్వ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో చైనాకు చెందిన 65మంది పారిశ్రామికవేత్తలతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై వారితో చర్చించారు. దీనికి ముందు పారిశ్రామికవేత్తలకు తెలంగాణ ప్రభుత్వం తరఫున విందు ఏర్పాటు చేశారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.