– ఔషధ రంగం విస్తరణలో ముందడుగు – హైదరాబాద్ ఔషధ హబ్‌గా మారనుందన్న మంత్రి జూపల్లి

ఔషధ రంగంలో చైనా ప్రభుత్వ సంస్థ చైనా మెడిసిటీ, తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (టీఎస్ఐఐసీ) మధ్య కీలకమైన ఒప్పందాలు కుదిరాయి. క్లినికల్ రీసెర్చ్, ఫార్మాస్యూటికల్ రెగ్యులేషన్స్, మాన్యుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ తదితర అంశాల్లో విజ్ఞాన మార్పిడికి వీలుగా మంగళవారం పరస్పర అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకున్నాయి. మాదాపూర్‌లోని హెచ్ఐసీసీలో మంగళవారం రెండోరోజు కొనసాగిన బయో ఏషియా సదస్సులో పరిశ్రమలశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సమక్షంలో చైనా మెడిసిటీ ప్రతినిధి లియూ లూ, టీఎస్ఐఐసీ మేనేజింగ్ డైరక్టర్ జయేష్‌రంజన్‌లు ఒప్పంద పత్రాలపై సంతకాలుచేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నూతన ఔషధాల ఆవిష్కరణలను తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సహింస్తుందన్నారు. ఔషధరంగానికి హైదరాబాద్ హబ్‌గా మారనున్నదని, అందుకు అనుగుణంగా యువత నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలన్నారు. ఈ రంగంలో ఉత్తమ పరిశోధనలు చేసిన రష్యన్ ప్రొఫెసర్ మార్క్కాలిఫైడ్కు జీనోంవ్యాలీ అవార్డును, భారత శాస్త్రవేత్త నటాషా పూనంవాలాకు జీనం వ్యాలీ స్పెషల్ ఎక్సలెన్సీ అవార్డును మంత్రి జూపల్లి ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో బ్రిటిష్ హై కమిషనర్ అండ్రూమాక్ ఆలిస్టర్, పరిశ్రమలశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కే ప్రదీప్‌చంద్ర, ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ ఎం వెంకటనర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.