Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

చిన్ననీటి వనరులకు పెద్దపీట

-గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణకు ప్రాధాన్యం -ఆన్‌లైన్‌లో చెరువుల సమాచారం – 20-25లక్షల ఎకరాలకు సాగునీరందించడమే లక్ష్యం -నిర్లక్ష్యపు కాంట్రాక్టర్లను బ్లాక్‌లిస్టులో పెట్టండి -భారీ నీటి పారుదల శాఖమంత్రి హరీశ్‌రావు

Harish Rao

రాష్ట్రంలో చిన్న నీటిపారుదల వ్యవస్థను పటిష్ఠపరిచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణకు అధిక ప్రాధాన్యమిస్తోందని భారీనీటిపారుదల శాఖ మంత్రి టీ హరీశ్‌రావు అన్నారు. ప్రస్తుతం చిన్న నీటి వనరుల కింద కనీసం 10లక్షల ఎకరాలకు కూడా సాగునీరు అందడం లేదని, వీటికింద ఆయకట్టును 20-25లక్షల ఎకరాలకు పెంచడానికి ప్రణాళికబద్ధంగా పనులు చేపడతామని ఆయన ప్రకటించారు. చిన్ననీటి వనరులు, గొలుసుకట్టు చెరువుల వ్యవస్థపై మంత్రి హరీశ్‌రావు నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు, అన్ని జిల్లాల అధికారులతో సోమవారం సమీక్ష నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ పనులను పూర్తి చేయడంలో నిర్లక్ష్యం చేసే కాంట్రాక్టర్లను ఉపేక్షించే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు.

ప్రభుత్వ నోటీసులకు స్పందించని కాంట్రాక్టర్లను బ్లాక్‌లిస్ట్‌లో పెడతామని హెచ్చరించారు. చిన్న నీటి వ్యవస్థను పటిష్ఠం చేసే పనులు వేగవంతం చేయడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రత్యేకించి గొలుసుకట్టు చెరువులకు అధిక ప్రాధాన్యమిస్తున్నట్లు చెప్పారు. ప్రపంచబ్యాంక్, ఆర్‌ఆర్‌ఆర్ పథకం, జైకా నిధులతో చేపడుతున్న పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.

రిపేర్, రినోవేషన్ అండ్ రిస్టోరేషన్ (ఆర్‌ఆర్‌ఆర్)పథకం కింద చెరువుల పునరుద్ధరణ, ఆధునీకరణ, మరమ్మతు పనులను వెంటనే పూర్తిచేయాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. రెండోదశ పనులు సెప్టెంబర్ 30లోపు పూర్తిచేసి, మూడో దశ పనులకు కేంద్రం నుంచి నిధులు తెచ్చుకునేలా ప్రతిపాదనలను సిద్ధ్దం చేయాలని నిర్ణయించామన్నారు. జైకా, ప్రపంచబ్యాంక్ నిధులతో ఆదిలాబాద్ లో చేపడుతున్న పనులను మార్చి 31, 2015లోపు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. సమైక్య రాష్ట్రంలో చిన్ననీటి వనరులు నిర్లక్ష్యానికి గురికావడం వల్ల 10లక్షల ఎకరాలకు కూడా సాగునీరందడం లేదని, ఈ వనరుల కింద సాగువిస్తీర్ణాన్ని 20-25లక్షల ఎకరాలకు పెంచడానికి నిర్ధిష్టప్రణాళికతో పనులు చేపడతామని వివరించారు. చిన్ననీటి వనరుల అభివృద్ధి , చెరువుల పునరుద్ధరణపై ప్రతి మూడునెలలకోసారి రాష్ట్ర స్థాయి సమీక్ష నిర్వహిస్తామని చెప్పారు. అదే తరహాలో నెలకోసారి జిల్లా స్థాయిలో సమీక్షలుంటాయని మంత్రి హరీశ్‌రావు వివరించారు.

జిల్లా స్థాయిలో కలెక్టర్లు, ఇంజినీర్లు సమీక్ష నిర్వహించి నివేదికలు తయారుచేయాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని చెరువుల వివరాలను ఆన్‌లైన్‌లో ఉంచాలనే ప్రతిపాదన చర్చకు వచ్చిందని చెప్పారు. దీని కోసం ప్రత్యేకంగా వెబ్‌సైట్‌ను రూపొందించి ప్రతి చెరువు వివరాలు, చరిత్రను అందులో పొందుపరుస్తామని వివరించారు. ఏ గ్రామంలో ఏ చెరువుకు ఎన్ని నిధులు ఖర్చయ్యాయి? అసలు పనులు జరిగాయా? లేదా? అన్న విషయాల్లో పారదర్శకత కోసమే వెబ్‌సైట్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. గ్రామాలు, పట్టణ ప్రాంతాలలో చెరువులకు ఆక్రమణల నుంచి విముక్తి కలిగించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. గ్రేటర్ హైదరాబాద్, హెచ్‌ఎండీఏ పరిధిలో చెరువులను కబ్జాల నుంచి కాపాడడంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్టు చెప్పారు. హైదరాబాద్ శివార్లలోని చెరువులను గ్రీన్‌బెల్టులుగా అభివృద్ధి చేస్తామన్నారు. ఆకస్మిక తనిఖీలు చేస్తా..

చెరువుల పునరుద్ధరణ పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తానని, అవసరమైతే ఆకస్మిక తనిఖీలు చేస్తానని భారీనీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు సమీక్షా సమావేశంలో అధికారులతో అన్నారు. రోజుకు పన్నెండు గంటలు ఇంజినీర్లు, అధికారులు అందుబాటులో ఉండాలని పేర్కొన్నారు. చిన్న నీటి వనరుల అభివృద్ధి పై మంత్రి దాదాపు ఐదుగంటలపాటు సమీక్ష నిర్వహించారు. జిల్లాలవారీగా చెరువుల పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.

తెలంగాణ వచ్చింది కాబట్టి తమకెంతో మేలు జరుగుతుందని ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ప్రభుత్వం కూడా బంగారు తెలంగాణ కోసం కృషి చేస్తోంది. ఈ దశలో ప్రభత్వ అంచనాలను, ప్రజల ఆశలను వమ్ము చేయకుండా పనిచేయాల్సిన బాధ్యత అధికారులపై ఉంది అని ఆయన చెప్పారు. చెరువుల పునరుద్ధరణ కోసం కష్టపడే అధికారులకు తగిన ప్రోత్సాహం ఉంటుందని తెలిపారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యాన్ని ఏమాత్రం సహించేంది లేదని ఆయన స్పష్టం చేశారు. కాంట్రాక్టర్ల కోసం కాకుండా చెరువుల కోసం, ప్రజల కోసం పనిచేయాలని కోరారు. చాలా మంది కాంట్రాక్టర్లు మధ్యలోనే పనులను ఆపేశారని, నోటీసులిచ్చినా స్పందించటం లేదని అలాంటివారి వివరాలతో జాబితా తయారుచేయాలని మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. సాధ్యమైనంత వరకు ఉన్న కాంట్రాక్టర్లతోనే పనులు చేయించాలని, వినకపోతే కొత్తవారికి అప్పగించాలని అధికారులకు సూచించారు. గొలుసుకట్టు చెరువులపై సమగ్రవివరాలను అందించిన వరంగల్ ఎస్‌ఈని మంత్రి అభినందించారు. సమీక్షలో నీటిపారుదలశాఖ ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్‌రావు, నీటిపారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ అరవింద్‌రెడ్డి, ఇంజినీర్-ఇన్-చీఫ్‌లు మురళీధర్, నారాయణరెడ్డి, మంత్రి ఓఎస్డీ శ్రీధర్‌దేశ్‌పాండే తదితరులు పాల్గొన్నారు. ఏపీఈఆర్సీలో టీ ఉద్యోగుల భద్రత మా బాధ్యత

-భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ (ఏపీఈఆర్సీ)లో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగుల భద్రతకు తెలంగాణ ప్రభుత్వం భరోసా ఇస్తుందని భారీ నీటిపారుదల, మార్కెటింగ్, శాసనసభావ్యవహారాల మంత్రి టీ హరీశ్‌రావు హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014 ప్రకారం ప్రస్తుత ఏపీఈఆర్సీ స్థానంలో తెలంగాణ రాష్ర్టానికి కొత్త ఈఆర్సీ ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం త్వరితగతిన చర్యలు తీసుకుంటుందని చెప్పారు.

సచివాలయంలో సోమవారం మంత్రి హరీశ్‌రావును కలిసిన ఏపీఈఆర్సీలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగుల ప్రతినిధులు వీ నాగరాజు, విల్మాసామెన్, దామోదరరావు, అన్సారీ, బీ శ్రీనివాస్, పీ అమర్‌నాథ్ తదితరులు తమ సమస్యలను ఆయనకు వివరించారు. ఏపీఈఆర్సీ ఆవిర్భావం నుంచి నేటివరకు అక్కడ పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులకు అన్యాయం జరుగుతూనే ఉందని, సంస్థలో 95 శాతం సీమాంధ్రులే ఉన్నారని మంత్రికి తెలిపారు. తెలంగాణ ఉద్యోగుల పట్ల వివక్ష కొనసాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. వారి సమస్యలు సావధానంగా విన్న హరీశ్‌రావు తెలంగాణ ఉద్యోగులకు భద్రత కల్పించే బాధ్యత తమది అని భరోసా ఇచ్చారు. తెలంగాణ ఈఆర్సీ ఏర్పాటుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారని, టీఈఆర్సీ చైర్మన్, మెంబర్ల ఎంపిక కోసం త్వరలో ప్రభుత్వం నోటిఫికేషన్ ఇస్తుందని తెలిపారు. ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగులందరినీ తెలంగాణ ఈఆర్సీలోకి తీసుకుంటామని మంత్రి హరీశ్‌రావు వారికి హామీ ఇచ్చారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.