Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

చింతమడకకు కొత్తనడక

-పుట్టిన ఊరికి ముఖ్యమంత్రి వరాల జల్లు
-చింతమడక.. బంగారు తునక కావాలి
-అంతా ఐక్యంగా ఊరును బాగుచేసుకోవాలి
-ఇతర గ్రామాలకు ఆదర్శంగా తీర్చిదిద్దుకోవాలి
-ప్రతి కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున లాభం చేకూరాలి
-ఎలా బాగుపడతారో గ్రామస్థులే నిర్ణయించుకోవాలి
-సొంతూరి ప్రజలతో ఆత్మీయ అనురాగ సమ్మేళనంలో సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు

KCR announces Rs 10 lakh aid to every family in native village

తనకు జన్మనిచ్చి ఇంతటివాడినిచేసిన పురిటిగడ్డ చింతమడక బంగారుతునకలా తయారుకావాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆకాంక్షించారు. గ్రామాభివృద్ధికి ఏదికావాలన్నా ఇవ్వటానికి సిద్ధమన్న సీఎం.. చింతమడక కొత్త నడక నడిచేందుకు పెద్దఎత్తున వరాల జల్లు కురిపించారు. నిధులను సద్వినియోగం చేసుకోవటానికి గ్రామపెద్దలంతా ఐక్యంకావాలన్నారు. ఇక్కడి ప్రజలతో మమేకమై బతికినం. ఊరి చెరువుల్లో ఈతకొట్టిన. ఇంటిముందు ఊటలుగా జాలువారే నీటిలో కాగితపు పడవలువేసి ఆడుకున్న. అప్పటి ఊటలులేవు. జాలువారే ఆ నీళ్లులేవు. మళ్ళీ ఆ రోజులు చింతమడకకు రాబోతున్నాయి. దేవుడి దయతో ఏడాదిలోనే చింతమడక సస్యశ్యామలం కాబోతున్నది. కాళేశ్వరగంగ ఊరి పంటపొలాలను తడుపనున్నది. ఊరు రూపురేఖలు కూడా మారిపోనున్నాయి అని సీఎం చెప్పారు. ఊరిబిడ్డగా గ్రామాభివృద్ధికి రూ.200 కోట్లు మంజూరు చేస్తున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించారు. 1500 నుంచి రెండు వేల డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణం చేపడుతామని చెప్తూ.. వచ్చే కార్తీకమాసంలో పండుగ వాతావరణంలో ఇండ్లలోకి పోవాలని ఆకాంక్షించారు.

గుడి, బడి, రోడ్లు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, ఫంక్షన్ హాళ్ల నిర్మాణం జరుగాలని, అందుకు నిధులు ఇవ్వడానికి సిద్ధమని చెప్పారు. సోమవారం సిద్దిపేట జిల్లా చింతమడక గ్రామస్థులతో నిర్వహించిన ఆత్మీయ అనురాగ సమ్మేళనంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొన్నారు. గ్రామంలోని చిన్ననాటి మిత్రులను ఆత్మీయంగా పలుకరించారు. వారితో ఊరిలో కలియతిరిగారు. గ్రామస్థుల ఇండ్లలోకి వెళ్లి, వారితో మాట్లాడారు. గ్రామంలో ఏర్పాటుచేసిన ఆత్మీయ అనురాగ సమ్మేళనంలో అందరితో కలిసి భోజనంచేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. తనను కని పెంచి ఈ స్థాయికి తీసుకొచ్చి, రాష్ట్ర ప్రజలకు అప్పజెప్పిన ఊరి ప్రజలకు కృతజ్ఞతలు చెప్పారు. మీ చేతుల్లో పెంచి, ఇంతటివాడిని చేశారంటూ నా తల్లులు, తండ్రులకు, ఊరందరికీ కృతజ్ఞతలు అని సీఎం అనగానే ప్రజలు చప్పట్లతో హోరెత్తించారు. సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు అభ్యర్థనమేరకు నియోజకవర్గంలోని గ్రామాలకు, మున్సిపాలిటీకి ముఖ్యమంత్రి పెద్దఎత్తున నిధులు మంజూరుచేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే..

KKP

చింతమడకలో పుట్టడం నా అదృష్టం
చింతమడక మంచిఊరు. అద్భుతమైన వాస్తు ఉన్నది. దక్షిణాన దమ్మచెరువు, ఉత్తరాన పెద్దచెరువు, పడమట కోమటిచెరువు, తూర్పున సింగం చెరువు ఉన్నయి. నాలుగు మూలల్లో అద్భుతమైన తటాకాల(చెరువులు)తో ఊరును ఎవరు నిర్మించారోకానీ ఈ గడ్డమీద పుట్టినందుకు నా అదృష్టం. చాలాకాలం తర్వాత నా కోరిక నెరవేరుతున్న రోజు ఇది. చింతమడక చనుబాలు ఇచ్చి పెంచి పెద్దచేస్తే, సిరిసిల్లలోని గూడూరులో పెద్దబాలశిక్ష చదువుకున్న. అప్పట్లో చింతమడకలో పాఠశాల లేదు.. బస్సులేదు.. అసలు దారేలేదు. దర్శనబాయికాడ దిగి నడిచి వచ్చేవాళ్లం. బాలకిషన్ సర్పంచ్ అయిన తర్వాత ఊరికి రోడ్డువేసి బస్సు కూడా తీసుకువచ్చిన సంగతి మీకు తెలుసు. బాలకిషన్ సర్పంచ్ అయ్యేవరకు ఊరికి ఏదీ లేకుండే.

ఎల్లమ్మగుడి కాడ మోకాళ్లలోతు నీళ్లలోంచి నడిచివచ్చేటోళ్లం. ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. చిన్నప్పుడు మా ఇంటిముందు నీళ్లు రెండుమూడు నెలలు జాలువారుతుండే. మా ఇంటి పాటకి (గేటు) ముందు నీళ్లలో కాగితపు పడవలు వేసి ఆడుకునేవాళ్లం. ఆ నీళ్లు, ఆ జాలు ఎటుపోయిందో. ఇప్పుడు కాళేశ్వరం గంగ దుంకుతున్నది. భగవంతుని దయతో ఏడాదిలో సస్యశ్యామలమైన పంటలు పండే చింతమడకను చూడబోతున్నం. ఇప్పుడే హెలికాప్టర్ నుంచి చూసుకుంటూ వచ్చిన. దమ్మచెరువు మీదనుంచే కాల్వ వస్తుంది. మళ్లీ ఊరిలో అప్పటి ఊటలు, ఆ జాలు వస్తయి. ఎటువంటి చింతలేకుండా రాష్టం బతికే పరిస్థితి వస్తుంది. అందులో మన చింతమడక కూడా ఉంటది. చాలా పనులు చేస్తుంటాం. మంచిపనులు చేసినప్పుడే అవి గుర్తుండిపోతాయి. రైతుబంధు, రైతుబీమా సౌకర్యం కల్పించిన రోజు జీవితంలో గొప్పపని చేసిన అని ఎంతో సంతోషపడిన. దేశంలో ఎక్కడా రైతుల గురించి శ్రద్ధ చూపించడం లేదు. రైతుబీమా దేశంలో ఎక్కడా లేదు. గుంట భూమి ఉన్న రైతు అకాల మరణం చెందితే పదిరోజుల్లో రూ.5 లక్షలు ఇంటికి అందుతున్నాయి. పేదరైతుల కుటుంబాలకు అండగా నిలుస్తున్నాయి.

GSR

చింతమడక నుంచే తెలంగాణ హెల్త్ ప్రొఫైల్
అమెరికాలాంటి దేశాల్లో అమలవుతున్న హెల్త్ ప్రొఫైల్ ఇక్కడ కూడా తీసుకురావాలని అనుకుంటున్నం. భగవంతుని దయతో తెలంగాణ హెల్త్ ప్రొఫైల్ తయారుకావాలని కోరుకుంటున్న. అందుకు చింతమడక నుంచే నాంది పలుకుతున్నం. త్వరలోనే చింతమడకలో ఉచిత కంటి వైద్యశిబిరం పెట్టాలి. ఊరందరికీ కంటిపరీక్షలు చేయించాలి. ఉచిత వైద్యశిబిరం కూడా పెట్టాలి. కార్పొరేట్ దవాఖానలవారికి చెప్తం. అందరు వచ్చి క్యాంపులు పెట్టి ఆరోగ్య పరీక్షలు చేస్తారు. ఊరందరికీ ఎటువంటి జబ్బులున్నా, ఎంత ఖర్చువచ్చినా ప్రభుత్వం తరఫునే వైద్యం చేయిస్తం. ఆరోగ్యబాధలు లేని చింతమడక తయారుకావాలి. గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు అందరూ కలిసి ప్రతి ఒక్కరికీ పరీక్షలు చేయించి సమగ్ర చింతమడక హెల్త్ ప్రొఫైల్ తయారుచేయించాలి. చింతమడక స్ఫూర్తిగా తర్వాత సిద్దిపేట నియోజకవర్గంలో ఇదే కార్యక్రమం చేపడుదాం. రోడ్డు ప్రమాదాలు జరిగిన సందర్భంలో బటన్‌నొక్కితే ప్రొఫైల్ రావాలి. దానికనుగుణంగా ట్రీట్‌మెంట్ అందించడం సాధ్యమవుతుంది.

Harish-Rao2

ఎర్రవల్లిలా తయారు కావాలి
చింతమడక కూడా గజ్వేల్‌లో నేను దత్తత తీసుకున్న ఎర్రవల్లిలా తయారుకావాలి. మీ బిడ్డనే రాష్ర్టాన్ని పాలించేది. మొదటి టర్మ్‌లోనే చేస్తే అంతా ఊరికే చేస్తుండని పేరొచ్చేది. ఈ ఐదేండ్లలో కరంట్, మంచినీళ్ల బాధలు పోగొట్టుకున్నం. సాగునీళ్లు తెచ్చుకున్నాం. అప్పటి పరిస్థితులు ఇప్పుడు ఊరిలో లేవు. ఇంకా బాగాకావాలి. డబ్బుల మంజూరీకి బాధలేదు. కానీ అనుకున్నది అనుకున్నట్టు జరుగాలి. అలా జరుగాలంటే ఊరిలో ఒకరిని ఒకరు ప్రేమించుకునే ఐకమత్యం ఉండాలి. ఇండ్ల నిర్మాణ సమయంలో కొంత స్థలాలు పోతుంటే ఓర్చుకోవాలి. ఎర్రవల్లి ఆదర్శంగా తయారైనట్లే చింతమడక కావాలి. ఎర్రవల్లిని హైదరాబాద్‌తోపాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చి చూసివెళుతున్నారు. ఎర్రవల్లిలో 24 గంటల కరంటు ఉంటున్నది.

ప్రతి ఇంటిమీద సోలార్‌సిస్టం అమర్చారు. కరంటు కోసం బిల్లు కట్టుడు ఉండదు. నేరుగా గోదావరి నీళ్లు ఎల్లంపల్లి నుంచి ఎర్రవల్లి వాటర్‌ట్యాంకు, అక్కడినుంచి కొత్త డబుల్ బెడ్‌రూం ఇండ్లపైన అమర్చిన సింటెక్స్ ట్యాంకుల్లోకి వచ్చి చేరుతున్నాయి. ప్రత్యేక వాల్వు ఏర్పాటుచేయడంతో నిండగానే అదే ఆగిపోతుంది. 24 గంటలు నీళ్లు ఉంటున్నాయి. కలెక్టర్ వెంకట్రామ్‌రెడ్డి దగ్గరుండి ఇవన్నీ చేయించారు. చింతమడకలోకూడా ఆయనే అన్నీ చేయిస్తారు. నేను పుట్టిన ఊరు చింతమడక బంగారు తునకకావాలి. సీసీ రోడ్లు, రోడ్లు అన్నీ చేసుకోవాలి. అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాటుచేసుకోవాలి. పాడిపశువులు, దేశీకోళ్లను పెంచుకోవాలి. ఇక్కడ ఉత్పత్తిచేసిన పాలను ఇక్కడే విక్రయించేందుకు చిల్లింగ్ సెంటర్ మంజూరు చేస్తున్నా. ప్రతి ఇంటి ఆవరణలో మొక్కలు నాటాలి. గ్రామానికి సమీపంలో ఉన్న 98 ఎకరాల (అటవి) టేకుల్ల భూమిలో అటవీస్థలాన్ని పార్కులా అభివృద్ధి చేయాలని కలెక్టర్‌ను ఆదేశిస్తున్న.

GSR1

ఆ రోజుల్లోనే భాగవతం నేర్పిండు
నేను చదువుకునే రోజుల్లో గొప్ప ఉపాధ్యాయులుండేవారు. కిష్టారెడ్డి, సంజీవరెడ్డి నా క్లాస్‌మేట్లుగా ఉండేవాళ్లు. దుబ్బాకలో రాఘవరెడ్డి సారు ఇంట్లో ఆశ్రయం పొంది విద్య నేర్చుకున్నం. చింతమడక, గూడూరు, తోర్నాల, దుబ్బాక, పుల్లూరులో గురువులు విద్యాబుద్ధులు నేర్పారు. గూడూరులో అక్క చేత గోరుముద్దలు తిని పంట పొలాల్లో గట్ల పొంటి నడుసుకుంటూ సర్కారు బడికి పోయేటోన్ని. మృత్యంజయశర్మ ఎంతో గొప్ప గురువు. పద్యం, తాత్పర్యం చెప్పి, కంఠస్తం చేసి దోషంలేకుండా అప్పజెప్పినవారికి నోట్‌పుస్తకం ప్రైజ్‌గా ఇచ్చేవారు. ఉత్తరగోగ్రహణం అనే పాఠం చెప్పిండు. అ పద్యం జర గొట్టు ఉంటది. నాలుక తిరుగటం కష్టం. ఆ పద్యం అప్పజెప్పినవారికి 200 పేజీల నోట్ పుస్తకం ఇస్తానన్నడు. అప్పుడే బట్టీ పట్టుడు అలవాటు ఉండే. అనుమతిస్తే ఇప్పుడే అప్పజెప్తానంటే సారు నమ్మలేదు. తర్వాత పద్యం అప్పజెప్పితే సరస్వతీ అమ్మవారి అనుగ్రహం ఉన్నదని మెచ్చుకున్నడు. రోజూ ఉదయం ఐదుగంటలకు వెళితే సారు పూజచేసుకున్న తర్వాత విద్యనేర్పేవాడు. అప్పుడే పరవస్తు చిన్నయసూరి వ్యాకరణం నుంచి భాగవతం వరకు నేర్పిండు. పదోతరగతి వచ్చేసరికే దుబ్బాక రామసముద్రం చెరువు కట్టపై కూర్చొని పద్యాలు రాసేవాడిని. అలాంటి గొప్ప గురువులు బుద్ధి చెప్పిన జాగ ఇది.

KKP1

ప్రజలతో మమేకమై బతికిన
సిద్దిపేట, చింతమడక ప్రజలతో మమేకమై బతికిన. ఇప్పుడు ఉన్నడో లేడోగానీ.. చెప్యాల నర్సయ్యతో మోటకొట్టి పాటలుపాడిన. కోమటి చెరువు, దమ్మచెరువు ఒందురుబాయి కాడ ఈత కొట్టిన. మత్తడిదాక ఈదిన. పడిగె కిష్టన్న, ఆనందం ఉండే. ఒందురుబాయి కాడ మర్రిచెట్టు ఊడలు పట్టుకుని బాయిలో దుంకి ఈతకొట్టిన. అప్పుడు ముదిరాజ్ పిలగాడు ఉండే. అతని పండ్లు దిగి నా నెత్తికి బర్ర (గాయం మరక) అయ్యింది. అందరం కలిసిమెలిసి బతికినం. అద్భుతమైన బతుకు చూసినం. చంద్రన్న, అంకంపేట మల్లన్న, మాజీ సర్పంచ్ రామచంద్రం, శేషన్న సభలో కనిపిస్తున్నరు. మన ఊరు బాగుకోసం వచ్చిన అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి. ఊరిని ఏకతాటిపై నడిపించే బాధ్యత మీరు తీసుకోవాలి. బూడిదగుండ్ల నుంచి చెల్లాపురం మీదుగా రాజక్కపేటకు పోయే రోడ్డు కావాలని అడిగిన్రు. ఆ రెండు రోడ్లకు వెంటనే నిధులు మంజూరు చేస్తున్న. సింగం చెరువు నుంచి రాఘవపూర్ వరకు రోడ్డు మంజూరు చేస్తున్న. రోడ్డు మధ్యలో మత్తడి పోతది. శ్రీనివాస్‌రావు కాక కూడా ఈడనే ఉన్నడు. ఆ మధ్యలో మంచి బ్రిడ్జీ కట్టి బాగా ఉండేటట్టు చూడాలి. మూడునాలుగు నెలల్లో ఈ పనులు అయిపోవాలి.

చింతమడక నుంచే తెలంగాణ హెల్త్ ప్రొఫైల్
-గ్రామాభివృద్ధికి రూ.200 కోట్లు
-అదనంగా కలెక్టర్‌కు రూ.50 కోట్లు
-1500 నుంచి 2వేల డబుల్ ఇండ్లు
-కార్తీకమాసంనాటికి నిర్మాణం పూర్తి
-సిద్దిపేట మున్సిపాలిటికీ రూ.25కోట్లు
-దుబ్బాక మున్సిపాలిటీకి రూ.10 కోట్లు
-రంగనాయకసాగర్ అభివృద్ధికి 5 కోట్లు
-సిద్దిపేట నియోజకవర్గంలోని 81 గ్రామాలకు రూ.50 లక్షల చొప్పున నిధుల మంజూరు
-గూడూరు, తోర్నాల, పుల్లూరుకు కోటి చొప్పున: కేసీఆర్

KKP2

రూ.200 కోట్లతో అభివృద్ధి చేసుకుందాం
చింతమడకతోపాటు మదిర గ్రామాలైన అంకంపేట, దమ్మచెరువులతోపాటు ఇటీవలే చింతమడక నుంచి వేరు పంచాయతీలుగా ఏర్పడిన సీతారాంపల్లి, మాచాపూర్ గ్రామాల అభివృద్ధికి రూ.200 కోట్లు మంజూరుచేస్తున్న. నువ్వు పుట్టినప్పుడు మా దగ్గరనే ఉన్నవు.. ఇప్పుడు మా ఊర్లు పంచాయతీలుగా కావచ్చు కానీ మమ్మల్ని విస్మరించొద్దు.. అని మాచాపురం, సీతారాంపల్లి గ్రామాల ప్రజలు అన్నరు. చింతమడక, ఉప్పలవాని కుంట, దమ్మచెరువు, అంకంపేట, సీతారాంపల్లి, మాచాపురం ఇవన్నీ నేను పుట్టిన గ్రామాలే. చింతమడకలో ఏం జరిగితే వాటిలోనూ అవే జరుగాలి. చింతమండకలో 904, సీతారాంపల్లి, మాచాపురంలలో 900 కుటుంబాలు ఉన్నయి. రెండు కలిపితే 1804 కుటుంబాలు అయితున్నయి. ఊరిలో బతుకులేక.. ఇతర ప్రాంతాలకు బతుకపోయినవాళ్లు వచ్చినా వారికీ అవకాశం ఇవ్వాలి. (సిద్దిపేట, దుబ్బాక, ముస్తాబాద్, ముంబైవంటి ప్రాంతాల్లో ఉంటున్న ఈ ఊరికి చెందిన అందరికీ ఈ స్కీం వర్తింపజేయాలని జిల్లా కలెక్టర్ వెంకట్రామ్‌రెడ్డి, ఎమ్మెల్యే హరీశ్‌రావుకు సీఎం కేసీఆర్ సూచించారు) రూ.1.80 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టిన రాష్ట్రం మనది.

పుట్టిన ఊరికి కొంత పెట్టుకుంటే దానికి ఎవరూ అడ్డుచెప్పరు. అలా చెప్పినా పట్టించుకోను. నా పురిటిగడ్డకు వెళుతున్నా.. ఎంత మేరకు నిధులు ప్రకటించవచ్చు? అని ఫైనాన్స్ సెక్రటరీతో మాట్లాడితే రూ.400 కోట్లవరకు అని చెప్పారు. నన్ను కనిపెంచి ఇంతటివాడిని చేసిన సిద్దిపేటకు ఎంత ఇచ్చినా తక్కువే. ఈ గడ్డ ఇచ్చిన బలంతోనే తెలంగాణ ఉద్యమాన్ని మొదలుపెట్టి రాష్ర్టాన్ని సాధించిన. సిద్దిపేట నియోజకవర్గంలో 85 గ్రామ పంచాయతీలుండగా సిద్దిపేట మున్సిపాలిటీ, మండల కేంద్రాలుపోతే మిగతా 81 గ్రామ పంచాయతీలకు రూ.50 లక్షల చొప్పున నిధులు మంజూరుచేస్తున్న. సిద్దిపేట మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.25 కోట్లు, కోమటిచెరువు తరహాలో రంగనాయకసాగర్‌ను పర్యాటకప్రాంతంగా అభివృద్ధి చేయడానికి రూ.5 కోట్లు మంజూరుచేస్తున్న. దుబ్బాక మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.10 కోట్లు ఇస్తున్న. నేను చదువుకున్న సిరిసిల్ల జిల్లా గూడూరు, సిద్దిపేటలోని తోర్నాల, పుల్లూరు గ్రామాలకు రూ.కోటి చొప్పున మంజూరుచేస్తున్న. ఇవికాకుండా చింతమడక అభివృద్ధికి ప్రత్యేకంగా కలెక్టర్‌కు రూ.50 కోట్లు మంజూరుచేస్తున్న. ఇతర నియోజకవర్గాలతో పోల్చితే సిద్దిపేట అభివృద్ధిలో ముందున్నది. సిద్దిపేట బంగారు తునకలా తయారవుతున్నది. ఇక్కడ కష్టపడే రైతాంగం ఉన్నది. సిద్దిపేటకు తెచ్చిన మంచినీళ్ల పథకమే మిషన్‌భగీరథ రూపంలో రాష్ట్రవ్యాప్తంగా అమలవుతున్నది. భవిష్యత్తులో సిద్దిపేట మోడల్‌గానే రాష్ట్రం తయారుకాబోతున్నది.

sdp

ప్రతి ఇంటికి రూ.10 లక్షల లాభం జరుగాలె
ప్రతి కుటుంబానికి రూ.10 లక్షల లాభం జరుగాలే. ఒక్క రూపాయి తక్కువ కావద్దు. ఏం చేయాలో నిర్ణయించుకోవడం మీ ఇష్టం. పౌల్ట్రీ, డెయిరీ ఫామ్స్, హార్వెస్టర్లు, ట్రాక్టర్లు కొనుక్కోవాలి. వరినాటు మిషన్లకు మంచి గిరాకీ ఉన్నది. నంగునూరు మండలంలో ఎక్కడినుంచో వచ్చి మిషన్లతో నాట్లు వేస్తున్నారు. యువకులు ఆ మిషన్లు కొనాలి. ఆటోరిక్షాలు, ట్రాలీలు, డీసీఎంలు, వరికోత మిషన్లు కొనాలి. లేదంటే ఇండస్ట్రీ పెట్టుకున్నా సరే. ఉదాహరణకు ఒకాయనకు రూ.9 లక్షలు నిండితే ఇంకో లక్ష బాకీ ఉంటుంది. అప్పుడు రెండు బర్రెలు, లేదా ఆవులు కొనియ్యాలే. 1500 నుంచి 2వేల ఇండ్లు మంజూరు చేస్తున్నం. ఆరునెలల్లో ఇండ్ల నిర్మాణం పూర్తికావాలే. ఇతర ప్రాంతాల వారు గ్రామాన్ని చూసిపోవడానికి రావాలే. యువకులు, మహిళలు సంఘాలుగా ఏర్పడాలి. ఇండ్లు, రోడ్ల నిర్మాణంపై చర్చించుకోవాలి. అందరూ స్నేహపూర్వక వాతావరణంలో ఉండాలి. వచ్చే కార్తీకమాసంలో ఇండ్లలోకి పోయే పరిస్థితి రావాలే. ఇప్పుడే ఊరందరితో కలిసి వంటలకు (వనభోజనాలు) పోదాం అనుకున్నాం. అయితే వర్షాకాలంకావడంతో ఇప్పుడొద్దనుకున్నాం. కార్తీకమాసంలో అందరం కలిసి పండుగ చేసుకుందాం. అప్పుడు భార్యాపిల్లలతో కలిసి వస్తా. ఊరుకు ఏం కావాలో అన్నీ రేపు, ఎల్లుండి మంజూరుచేస్తం. చింతమడకతోపాటు మిగతా గ్రామాలన్నింటిలో సకల హంగులతో మంచి ఫంక్షన్ హాళ్లు నిర్మించాలి.

MLA-Harish-Rao

ఆ రోజు చింతమడక తల్లడిల్లింది..
-ఒక్క ఇంట్లోనూ పొయ్యి వెలుగలేదు
-కేసీఆర్ నిరాహార దీక్షను గుర్తుచేసుకున్న
-సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు
-సీఎం రాకతో ఇక చింతల్లేని చింతమడక
తమ ఊరి బిడ్డ కేసీఆర్ నిమ్స్ దవాఖానలో మంచంపై పడి తెలంగాణకావాలని కొట్లాడిన రోజున చింతమడక ఊరుఊరే తల్లడిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు గుర్తుచేసుకున్నారు. చింతమడకలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో హరీశ్ మాట్లాడుతూ తెలంగాణకోసం కేసీఆర్ దీక్షచేస్తూ నిమ్స్‌లో ఉన్నప్పుడు చింతమడక నుంచి జిట్టని పోశవ్వ, నారాయణరెడ్డితోపాటు చాలామంది స్వయంగా నాకు ఫోన్ చేశారు. సార్ గురించి ఎంతో ఆందోళన చెందారు. కేసీఆర్‌ను దవాఖానలో చూస్తే ఊరిలో ఒక్కరి ఇంట్లో పొయ్యి వెలుగుతలేదు.. కండ్లల్లో నీళ్లు ఆగుతలేవు.. ఊరు నోట్లో ముద్ద పెడుతలేదని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ రోజు గుర్తొస్తే ఇప్పటికీ కన్నీళ్లు వస్తున్నాయి అని హరీశ్ చెప్పారు. ఊరి బిడ్డ తెలంగాణకోసం కొట్లాడుతున్నడని ఊరంతా కేసీఆర్‌కు అండగా నిలిచిందని అన్నారు.

చింతమడకలో ప్రతి అంగుళం భూమి, చెరువు, కుంట, ప్రతి మనిషి పేరు కేసీఆర్‌కు తెలుసని హరీశ్‌రావు చెప్పారు. ఈ మట్టిబిడ్డ ఊరికి రావడంతో గ్రామస్థుల సంతోషం చూస్తుంటే బతుకమ్మ, దీపావళి, దసరా.. అన్ని పండుగలు ఒకేసారి వచ్చినట్లు ఉన్నదన్నారు. సీఎం కేసీఆర్ రాకతో చింతమడక ఇక చింతలులేని గ్రామంగా తయారవుతుందని చెప్పారు. రైతుబిడ్డ అయిన కేసీఆర్ రైతుల కండ్లల్లో ఆనందం చూడటానికి కాళేశ్వరం లాంటి గొప్ప ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారని, ఇతర ప్రాజెక్టులను, చెరువులను బాగు చేయించారని అన్నారు. ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే అన్నట్లు ఐదారేండ్లు రాష్ట్రంకోసం కృషిచేసి ఇప్పుడు పుట్టిన ఊరితో ఆత్మీయత పంచుకోవడానికి వచ్చారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా చింతమడకలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలను సీఎంకు హరీశ్‌రావు వివరించారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.