-ఉత్సాహంగా తరలివస్తున్న ఆడబిడ్డలు.. -మూడు రోజుల్లో 70.46 లక్షల చీరెల పంపిణీ
జయశంకర్ భూపాలపల్లిలో శాసనసభ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి చీరెలు పంపిణీ చేసి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రతి ఇంటికీ పెద్దకొడుకులా మారి ఆడపడుచులకు చీరెలు పంపిణీ చేస్తున్నారన్నారు. నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గం కేతేపల్లి మండలం చెరుకుపల్లిలో శాసనమండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, ఎమ్మెల్యే వేముల వీరేశం, దేవరకొండలో ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్, నాంపల్లి మండలంలో ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి చీరెలు పంపిణీచేశారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్‌లో మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, చిగురుమామిడి మండలం ముదుమాణిక్యంలో హుస్నాబాద్ ఎమ్మెల్యే ఒడితెల సతీశ్‌కుమార్ పంపిణీ చేశారు. సూర్యాపేట జిల్లా పాతర్ల పహాడ్‌లో మహిళలు చీరెల కోసం బారులుతీరారు.
బతుకమ్మ చీరెల పంపిణీకి విశేష స్పందన లభిస్తున్నది. మూడో రోజైన బుధవారం కూడా మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి చీరెలు అందుకున్నారు. రాష్ట్రంలోని అన్ని పంపిణీ కేంద్రాల వద్ద మహిళలు బారులు తీరారు. బుధవారం ఒక్కరోజే రాష్ట్రంలో 17.18లక్షల చీరెలను పంపిణీ చేశారు. మూడురోజుల్లో 70.46 లక్షల చీరెలను అందజేశారు. 34.11 లక్షలు పంపిణీ చేయాల్సి ఉందని చేనేత, జౌళీశాఖ అధికారులు తెలిపారు. హైదరాబాద్ ముసారాంబాగ్ డివిజన్లోని శ్రీపురం కాలనీలో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ బుధవారం బతుకమ్మ చీరెలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కులమతాలకతీతంగా సీఎం కేసీఆర్ చీరెలు పంపిణీ చేస్తుంటే ఎంఐఎం మినహా ప్రతిపక్షాలు చౌకబారు ప్రకటనలు చేయడం వారి అవివేకానికి నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమంలో మలక్‌పేట ఎమ్మెల్యే అహ్మద్ బలాల, కార్పొరేటర్ తీగల సునరితారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లాకేంద్రంలో వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి చీరెలు పంపిణీ చేశారు. బతుకమ్మ పండుగను బతికించిన ఘనత నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవితకే దక్కుతుందని పోచారం అన్నారు.
దుష్ప్రచారానికి ఆడబిడ్డల నవ్వులే సమాధానం మంత్రి కేటీఆర్. బతుకమ్మ చీరెల పంపిణీపై తెలంగాణలోని ఆడబిడ్డలు సంతోషంగా ఉన్నారని మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా బుధవారం మూడోరోజూ పెద్దఎత్తున చీరెల పంపిణీ జరుగుతున్న సందర్భంగా పలువురు తెలంగాణవాదులు మంత్రి కేటీఆర్‌కు ట్విట్టర్ ద్వారా ఫొటోలు పంపారు. ఈ సందర్భంగా వాటిని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ప్రతిపక్షాల గగ్గోలు, కొన్ని మీడియా సంస్థల దుష్ప్రచారం ఎలా ఉన్నా.. బతుకమ్మ చీరెల పంపిణీ క్షేత్రస్థాయిలో విజయవంతంగా సాగుతున్నది. చీరెలు పొందుతున్న అక్కాచెల్లెళ్లు ఆడబిడ్డలు, అవ్వలలో కనిపిస్తున్న సంతోషాలే ఇందుకు నిదర్శనం అని మంత్రి ట్విట్టర్లో పేర్కొన్నారు.