Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

సిటీకి 5000 కోట్లు

-137మిలియన్‌ లీటర్ల రిజర్వాయర్లు
-2,093 కిలోమీటర్ల పైప్‌లైన్ల నిర్మాణం
-2,00,000 ఇవ్వాల్సిన నీటి కనెక్షన్లు
-1,50,000 స్థిరీకరించేవి
-20 లక్షల జనాభాకు లబ్ధి
-తాగునీటికి 1,200 కోట్లు
-మురుగునీటి శుద్ధికి3,866 కోట్లు
-జీవోలు విడుదల చేసిన మంత్రి కేటీఆర్‌
-హైదరాబాద్‌ సిటీకి కరెంటు సమస్యలేదు
-తాగునీటి సమస్య 95 శాతం పరిష్కారం
-వందశాతం మురుగునీటి శుద్ధికి ప్రణాళిక
-శుద్ధిచేసిన నీటి పునర్వినియోగంపై కసరత్తు
-పదేండ్ల అవసరాల మేరకు సీవరేజి ప్లాంట్లు
-రెండేండ్లలో 62 ఎస్టీపీల నిర్మాణం పూర్తి
-హైబ్రిడ్‌ యాన్యుయిటీ పద్ధతిలో ఎస్టీపీలు
-15 ఏండ్లపాటు నిర్వహణ కన్సల్టెన్సీలకే

రాజధాని హైదరాబాద్‌లో మౌలిక వసతుల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.5,066.21 కోట్లు మంజూరుచేసింది. ఇందుకు సంబంధించిన జీవోలను పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు గురువారం మర్రి చెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి కేంద్రంలో విడుదలచేశారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా మార్చడం కోసం మౌలిక వసతులు కల్పిస్తున్నామని ఈ సందర్భంగా కేటీఆర్‌ తెలిపారు. మురుగులేని స్వచ్ఛమైన నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దేందుకు గతంలో ఎన్నడూ లేనివిధంగా పెద్ద ఎత్తున సీవరేజ్‌ ప్లాంట్ల నిర్మాణం చేపడుతున్నామని వెల్లడించారు. ఇందుకోసం రూ.3,866.21 కోట్లను విడుదల చేసినట్టు తెలిపారు. మరోవైపు ఔటర్‌ రింగ్‌రోడ్డు చుట్టూ ఉన్న ప్రాంతాలకు తాగునీరు అందించేందుకు రూ.1,200 కోట్లతో పనులు చేపడుతున్నట్టు పేర్కొన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 90 శాతం తాగునీటి సమస్య లేకుండా చేశామని చెప్పారు. జలమండలి సమర్థమైన పనితీరు వల్లనే హైదరాబాద్‌ నగరానికి వాటర్‌ ప్లస్‌ సిటీ హోదా దక్కిందని హర్షం వ్యక్తంచేశారు. రాజధానిలో విద్యుత్‌ సమస్యలను పరిష్కరించామని గుర్తుచేశారు. జంటనగరాల్లో ప్రస్తుతం ఉత్పత్తి అవుతున్న మురుగునీటిని శుద్ధిచేసేందుకు ప్రణాళికలను రూపొందించామన్నారు. నగరంలో ప్రతిరోజు 1,650 ఎంఎల్‌డీల మురుగునీరు ఉత్పత్తి అవుతున్నదని, అందులో 25 ఎస్టీపీల ద్వారా 772 ఎంఎల్‌డీలను (48.78%) మాత్రమే శుద్ధి చేస్తున్నామని వివరించారు. దానిని వందశాతానికి పెంచడంతోపాటు, రాబోయే పదేండ్లకాలంలో ఉత్పత్తి అయ్యే 2,184 ఎంఎల్‌డీల మురుగునీటిని సైతం పరిగణనలోకి తీసుకొని, అందుకు అనుగుణంగా సీవరేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లను నిర్మించాలని ప్రతిపాదించామన్నారు.

హైబ్రిడ్‌ యాన్యుయిటీ మోడల్‌లో నిర్మాణం
హైదరాబాద్‌లోని సీవరేజ్‌ సమస్యలపై రెండేండ్లుగా షా టెక్నాలజీస్‌ సంస్థతో అధ్యయనం చేయించామని మంత్రి కేటీఆర్‌ వెల్లడించారు. వందశాతం మురుగునీటి శుద్ధికి 62 ఎస్టీపీలను నిర్మించాలని ఆ సంస్థ సిఫారసు చేసిందన్నారు. తొలివిడుతగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 31 ప్లాంట్ల నిర్మాణానికి ప్రభుత్వం 3,866.21 కోట్లను విడుదల చేసిందని తెలిపారు. ఓఆర్‌ఆర్‌లో దశలవారీగా మరో 31 ఎస్టీపీలను నిర్మించాల్సి ఉంటుందని వివరించారు. వీటన్నింటినీ హైబ్రిడ్‌ యాన్యుయిటీ మోడల్‌లో, మూడు ప్యాకేజీల్లో నిర్మించడంతోపాటు, 15 ఏండ్లపాటు వాటి నిర్వహణ బాధ్యతలను కూడా కన్సల్టెన్సీ చూసుకుంటుందన్నారు. ఇందులో ప్రభుత్వం 40%, నిర్మాణ సంస్థ 60% నిధులను వెచ్చిస్తుందని పేర్కొన్నారు.

మురుగునీటి శుద్ధి ద్వారా ఆదాయం

మురుగునీటి శుద్ధిద్వారా చెరువులు, కుంటల్లో కాలుష్యాన్ని తగ్గించడంతోపాటు ఆదాయాన్ని ఆర్జించవచ్చని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. ఇప్పుడు శుద్ధిచేస్తున్న మురుగునీటిలో 20% మాత్రమే గార్డెనింగ్‌, మొక్కల పెంపకానికి పునర్వినియోగిస్తున్నామని, వందశాతం శుద్ధి జరిగితే రోజుకు సుమారు 2 వేల ఎంఎల్‌డీల నీరు అందుబాటులోకి వస్తుందన్నారు. ఈ నీటిద్వారా పలు నగరాలు ఆదాయాన్ని పొందుతున్నాయని చెప్పారు. అదేతరహాలో జీహెచ్‌ఎంసీ కూడా ఆదాయం పొందవచ్చన్నారు. ఇందుకోసం పలు సంస్థలతో ఒప్పందాలు చేసుకోవాలని యోచిస్తున్నట్టు వెల్లడించారు. అందుకు ప్రత్యేకంగా కాలుష్య నియంత్రణ మండలి, జీహెచ్‌ఎంసీ తదితర శాఖలతో కమిటీని వేయాలని భావిస్తున్నామన్నారు.

ఓఆర్‌ఆర్‌ గ్రామాల తాగునీటికి రూ.1200కోట్లు
రూ.756.56 కోట్లతో 164 రిజర్వాయర్లను అభివృద్ధిచేసి 1,600 కిలోమీటర్ల పైపులైన్‌ నెట్‌వర్క్‌ ఏర్పాటుచేశామని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. 2019 నాటికే 70 మిలియన్‌ లీటర్ల మంచినీటిని సరఫరా చేస్తున్నామన్నారు. ఇందులో ఓఆర్‌ఆర్‌ పరిధిలోని పలు కాలనీలు, గ్రామాలకు తాగునీటి సౌకర్యాన్ని కల్పించలేదని చెప్పారు. ఈ ప్రాంతాల్లో తాగునీటి సౌకర్యాన్ని విస్తరించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందించిందన్నారు. ఇందుకోసం రూ.1,200 కోట్లను మంజూరుచేసిందని తెలిపారు. వచ్చే రెండేండ్లలో పనులన్నీ పూర్తిచేసి తాగునీటిని అందిస్తామని తెలిపారు.

ముఖ్యమంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు
హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దడానికి జీహెచ్‌ఎంసీ ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నదని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ఇందుకు సీఎం కేసీఆర్‌ అన్ని విధాలా అండగా నిలుస్తున్నారని చెప్పారు. మూసీ నదిని, నాలాలను ప్రక్షాళన చేయాలన్నదే సీఎం సంకల్పమన్నారు. తాము కోరిన వెంటనే మురుగునీటి శుద్ధికోసం, శివారు గ్రామాల తాగునీటికోసం ఒకేరోజు రూ.5 వేల కోట్ల నిధులను కేటాయించిన చరిత్ర గతంలో ఎన్నడూ లేదని వివరించారు. హైదరాబాద్‌ నగరానికి ఇంత భారీ ఎత్తున నిధులను సమకూర్చిన కేసీఆర్‌కు హైదరాబాద్‌ నగర ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
కంటోన్మెంట్‌ విలీనాన్ని ప్రజలే కోరుకొంటున్నారు.

కంటోన్మెంట్‌ ప్రాంతాన్ని జీహెచ్‌ఎంసీలో విలీనం చేయాలని అక్కడ నివసిస్తున్న మెజార్టీ ప్రజలు కోరుతున్నారని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. గతంలో కంటోన్మెంట్‌ ఏరియా నగరానికి దూరంగా ఉండేదని, ప్రస్తుతం నగరం మధ్యలోకి వచ్చిందని అన్నారు. పెరిగిన జనాభా అవసరాలకు అనుగుణంగా ఎలాంటి అభివృద్ధి పనులనూ అక్కడ చేపట్టలేకపోతున్నామని, కనీసం ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న అన్నపూర్ణ క్యాంటిన్లను కూడా అక్కడ పెట్టలేని పరిస్థితి ఉన్నదని పేర్కొన్నారు. రోడ్ల వెడల్పు మాటెలా ఉన్నా.. ఉన్న రోడ్లను కూడా మూసివేస్తున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలోనే కంటోన్మెంట్‌ విలీనంపై అభిప్రాయం చెప్పాలని సోషల్‌ మీడియా వేదికగా నగరవాసులకు విజ్ఞప్తి చేస్తే.. 70% పైగా ప్రజలు విలీనాన్ని కోరుతున్నారని వెల్లడైందని తెలిపారు.

హైదరాబాద్‌ నగర సీవరేజ్‌ మాస్టర్‌ ప్లాన్‌
రోజూ ఉత్పత్తి అవుతున్న మురుగునీరు జీహెచ్‌ఎంసీలో 1,650 ఎంఎల్‌డీలు.. ఓఆర్‌ఆర్‌లో 300 ఎంఎల్‌డీలు..
శుద్ధి చేస్తున్నది 772 ఎంఎల్‌డీలు (48.78%).. శుద్ధి చేయని మురుగునీరు 878 ఎంఎల్‌డీలు
ప్రస్తుతం ఉన్న సీవరేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లు 25, ప్రతిపాదించినవి 62 (జీహెచ్‌ఎంసీలో 31, ఓఆర్‌ఆర్‌ పరిధిలో 31)
2036 నాటికి రోజూ ఉత్పత్తి అయ్యే మురుగునీరు 2,184 ఎంఎల్‌డీలు
ప్యాకేజీ 1 (మూసీ ఉత్తర భాగం) 402.5 మిలియన్‌ లీటర్ల శుద్ధి కోసం రూ.1,230.21 కోట్లతో 8 ఎస్టీపీల నిర్మాణం
ప్యాకేజీ 2 (మూసీ దక్షిణ భాగం) 480.5 మిలియన్‌ లీటర్ల శుద్ధికోసం రూ.1,355.13 కోట్లతో 6 ఎస్టీపీల నిర్మాణం
ప్యాకేజీ 3 (కూకట్‌పల్లి లేక్‌ క్యాచ్‌మెంట్‌) 376.5 మిలియన్‌ లీటర్ల శుద్ధి కోసం రూ.1,280.87 కోట్లతో 17 ఎస్టీపీల నిర్మాణం

ఓఆర్‌ఆర్‌ గ్రామాలకు తాగునీటి సౌకర్యం విస్తరణ ప్రాజెక్టు..
కేటాయించిన నిధులు రూ.1,200కోట్లు
137మిలియన్‌ లీటర్ల సామర్థ్యంతో రిజర్వాయర్లు, 2,093 కిలోమీటర్ల పైప్‌లైన్ల నిర్మాణం
ఇవ్వాల్సిన నీటి కనెక్షన్లు 2 లక్షలు.. స్థిరీకరించనున్నవి 1.50 లక్షలు
లబ్ధి పొందనున్న జనాభా 20 లక్షలు
2036 నాటికి ఓఆర్‌ఆర్‌ గ్రామాల్లో పెరగనున్న జనాభా 33.92 లక్షలుహైదరాబాద్‌ ఏర్పాటైన సంవత్సరం – 2007 మౌలిక వసతుల కల్పన – 2014 వరకు శూన్యం

తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత..
రూ.1,900 కోట్లతో గ్రేటర్‌లో విలీనమైన 12 శివారు మున్సిపాలిటీల పరిధిలో 2,100 కిలోమీటర్ల తాగునీటి పైప్‌లైన్‌ నిర్మాణం
96 శాతం ప్రాంతాలకు రక్షిత మంచినీటి సౌకర్యం.
ఓఆర్‌ఆర్‌ లోపల 190 గ్రామాలకు తొలి విడత కింద రూ.755 కోట్లతో తాగునీటి వ్యవస్థ ఏర్పాటు
తాజాగా 190 గ్రామాల పరిధిలో 2,036 దాకా సమస్య రాకుండా రూ.1200 కోట్లతో తాగునీటి వ్యవస్థ ఏర్పాటు చేయనున్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో శివారు మున్సిపాలిటీల్లో భూగర్భ డ్రైనేజీ లేక.. కాలుష్య కాసారాలుగా మారిన మూసీ, ఇతర చెరువులు
ప్రస్తుతం రూ.3,866.21 కోట్లతో 1,260 ఎంఎల్‌డీ సామర్థ్యంతో మురుగునీటి వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.