-ఐటీ, పంచాయితీరాజ్‌శాఖ మంత్రి కేటీఆర్ -నెక్లెస్ రోడ్డులో వికలాంగ సైక్లిస్ట్ ఆదిత్య యాత్రకు సంఘీభావ ర్యాలీ

హైదరాబాద్‌ను క్లీన్ అండ్ గ్రీన్, పర్యావరణ అనుకూల నగరంగా మారుస్తామని రాష్ట్ర ఐటీ, పంచాయితీరాజ్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. వికలాంగ సైక్లిస్టు ఆదిత్య మెహతా మనాలి నుంచి జమ్ముకశ్మీర్‌లోని ఖర్దుంగ్ లా వరకు చేపట్టిన సైకిల్ యాత్ర విజయవంతం కావాలని కాంక్షిస్తూ ఆదివారం నెక్లెస్ రోడ్లో సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని ప్రారంభించిన కేటీఆర్ మాట్లాడుతూ ఆదిత్య ఇప్పటికే కృత్రిమ కాలుతో ఎన్నో సాహసోపేతమైన యాత్రలను పూర్తిచేసి యువ సైక్లిస్టులకు ఆదర్శంగా నిలిచారని ప్రశంసించారు. ప్రభుత్వం ఆదిత్యకు అన్ని విధాలా సహకరిస్తుందన్నారు.
హైదరాబాద్ బైసైకిలింగ్ (హెచ్‌బీసీ) క్లబ్ సూచన మేరకు ఔటర్ రింగ్‌రోడ్ నుంచి సర్వీస్ రోడ్డు మధ్యన సైకిల్ స్టేషన్, జాగింగ్ వే ఏర్పాటు చేసేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తామని చెప్పారు. నగరాన్ని క్లీన్ అండ్ గ్రీన్, ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ సిటీగా మార్చేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ ప్రీతీమీనా, హెచ్‌బీసీ అధ్యక్షుడు మనోహర్ తదితరులు పాల్గొన్నారు.