Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

సీఎం చేతికి పీఆర్సీ

-అనుభవజ్ఞులకు ఉద్యోగుల సర్వీస్‌రూల్స్ బాధ్యత -నాయకులతో త్వరలో కేసీఆర్ ప్రత్యేక సమావేశం.. -ఉద్యోగుల విభజనపై ఢిల్లీకి బృందం -క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రితో భేటీ అయిన ఉద్యోగ సంఘాల నేతలు -ఇది స్నేహశీల ప్రభుత్వం -ఉద్యోగులు మెచ్చే పీఆర్సీకి కసరత్తు -ఆరోగ్యకార్డుల జారీకి రంగం సిద్ధం -తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ వెల్లడి

KCR

ఉద్యోగుల సమస్యలను, సర్వీస్ నిబంధనలలో ఇబ్బందులను చర్చించడానికి త్వరలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామని ఉద్యోగసంఘాల జేఏసీ నాయకులకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చెప్పారు. ఉద్యోగుల పదోవేతన సవరణ నివేదికను తనకు వెంటనే సమర్పించాలని ఆర్థిక శాఖ ఉన్నతాధికారులను సీఎం ఆదేశించారు. అలాగే ఆరోగ్య కార్డులను వెంటనే సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. సీఎం ఆదేశాలకు అనుగుణంగా అధికారులు వెంటనే పీఆర్సీ నివేదికను ఆయనకు అందజేశారని తాజా సమాచారం.

తెలంగాణ ఉద్యోగసంఘాల జేఏసీ నాయకులు దేవీప్రసాద్, రవీందర్‌రెడ్డి, విఠల్, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ తదితరులు సోమవారం సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిశారు. పీఆర్సీ, ఆరోగ్య కార్డులు తదితర అంశాలపై సీఎంతో చర్చించారు. దీనికి స్పందించిన సీఎం ఆర్థిక శాఖ, సాధారణ పరిపాలనాశాఖ అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. పదో ఆర్థిక వేతన సవరణకు సంబంధించిన నివేదికను వెంటనే తనకు సమర్పించాలని ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి నాగిరెడ్డిని ఆదేశించారు. నివేదికలో పేర్కొన్న అంశాలను తాము కూడా ఒకసారి పరిశీలించే అవకాశమివ్వాలని ఉద్యోగసంఘాల నేతలు సీఎంను కోరారు.

ఆరోగ్య కార్డులను వెంటనే విడుదల చేయడానికి సీఎం అంగీకారం తెలిపారు. సర్వీస్ రూల్స్, జోనల్ విధానం తదితర అంశాలపై త్వరలో ఒక ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసుకుని చర్చిద్దామని సీఎం వారికి చెప్పారు. కాలం చెల్లిన సర్వీస్ రూల్స్‌ను మార్చాలని, సర్వీస్ నిబంధనలను అనుభవజ్ఞులైన ఉద్యోగులతోనే తయారు చేయించాలని ముఖ్యమంత్రి భావిస్తున్నట్లు సమాచారం. అలాగే ఉద్యోగుల విభజనను పూర్తి చేయడానికి తెలంగాణ ఎంపీలతో కూడిన బృందాన్ని కేంద్రానికి పంపించనున్నట్లు సీఎం చెప్పినట్లు తెలిసింది. తమ సమస్యల పరిష్కారానికి సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించారని ఉద్యోగసంఘాల నాయకులు సమావేశం అనంతరం చెప్పారు. పీఆర్సీ, హెల్త్‌కార్డుల విషయంలో త్వరలోనే నిర్ణయం వెలువడుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.

సమస్యలు త్వరలోనే కొలిక్కి.. పీఆర్సీ, హెల్త్‌కార్డుల అంశాలు త్వరలోనే కొలిక్కి వస్తాయని తెలంగాణ ఉద్యోగ సంఘాల నాయకులు తెలిపారు. సోమవారం సచివాలయంలో వారు మీడియాతో మాట్లాడారు. ఉద్యోగులతో రాష్ట్ర ప్రభుత్వం స్నేహశీల విధానం అనుసరిస్తున్నదని, తమ సమస్యలన్నింటినీ సీఎం సానుకూలంగా పరిశీలిస్తున్నారని చెప్పా రు. ఉద్యోగులు సంతృప్తి చెందే విధంగా పీఆర్సీని అమలు చేసేందుకు కసరత్తు నడుస్తున్నదని, త్వరలో హెల్త్‌కార్డులు కూడా జారీ కానున్నాయని తెలిపారు. ఎమ్మెల్యే, టీజీఓ వ్యవస్థాపక అధ్యక్షుడు వీ శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టే అన్ని సంక్షేమ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో సమర్థంగా అమలు జరిపేందుకు కృషి చేస్తామని ఉద్యోగుల మాటగా సీఎంకు చెప్పామని అన్నారు.

పీఆర్సీ, హెల్త్‌కార్డుల విషయమై టీఎన్జీఓ అధ్యక్షుడు దేవీప్రసాద్, ఎమ్మెల్సీలు ప్రస్తావించినపుడు స్పందించిన సీఎం, అప్పటికప్పుడు సంబంధిత ఫైళ్లను తెప్పించుకున్నారని తెలిపారు. ఉద్యోగుల కష్టాలు కేసీఆర్‌కు బాగా తెలుసునన్నారు. అలాగే ఉద్యోగుల సర్వీస్ రూల్స్‌ను రూపొందించే బాధ్యతను ఉద్యోగ సంఘాలకే అప్పగిస్తున్నారని వెల్లడించారు.

తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సీ విఠల్ మాట్లాడుతూ ఉద్యోగుల విభజనను త్వరగా పూర్తి చేయించేందుకు తెలంగాణ ఎంపీలతో కూడిన బృందాన్ని కేంద్రానికి పంపిస్తానని సీఎం హామీ ఇచ్చారని చెప్పారు. టీజీఓ అధ్యక్షురాలు మమత మాట్లాడుతూ రెండు రాష్ర్టాల అభివృద్ధికి సహకరిస్తామన్న కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని, 50 రోజుల్లోనే పూర్తి చేస్తామన్న ఉద్యోగుల విభజన ఇంకా పెండింగ్‌లోనే ఉంచారని మండిపడ్డారు. తెలంగాణ ఉపాధ్యాయ సంఘంనేత మణిపాల్‌రెడ్డి మాట్లాడుతూ ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పుడు వైద్యం చేయించుకోవడానికి చిరుద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని సీఎంకు వివరించామని తెలిపారు.

విలేకరుల సమావేశంలో ప్రభుత్వ లెక్చరర్ల సంఘం నేత మధుసూదన్‌రెడ్డి, రెవెన్యూ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం శివశంకర్, ఉపాధ్యాయ సంఘాల నేతలు మణిపాల్‌రెడ్డి, హర్షవర్ధన్, టీజీఓ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ ఎంబీ కృష్ణయాదవ్, టీఎన్జీఓ నేత ఎంఏ ముజీబ్, నాల్గో తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు జ్ఞానేశ్వర్, టీజీఓ నేతలు జీ నర్సింహులు, ఎం మోహన్‌నారాయణ, కే నిరంజన్, ఎస్టీయూ నేత ఎస్ రాజిరెడ్డి, సచివాలయ టీజీఓ అధ్యక్షుడు రాజ్‌కుమార్‌గుప్తా తదితరులు పాల్గొన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.