ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం నల్లగొండ జిల్లాలో పర్యటించనున్నారు. ప్రతి ఇంటికీ తాగునీరు అందించాలనే లక్ష్యంతో రూపొందించిన వాటర్ గ్రిడ్ పైలాన్‌ను చౌటుప్పలో, దామరచర్ల మండలం వీర్లపాలెం సమీపంలో నిర్మించనున్న యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ పైలాన్ ఆవిష్కరించనున్నారు. అనంతరం జిల్లా కేంద్రంలో నిర్వహించే భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఇందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాటు పూర్తి చేసింది. సాయంత్రం 4.10 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో బయల్దేరనున్న సీఎం కేసీఆర్ 4.30 గంటలకు చౌటుప్పల్ చేరుకుంటారు.
-వాటర్ గ్రిడ్, యాదాద్రి పవర్ ప్లాంట్ పైలాన్ల ఆవిష్కరణ -జిల్లా కేంద్రంలో భారీ బహిరంగ సభ -ఏర్పాట్లు పూర్తి చేసిన జిల్లా యంత్రాంగం
అనంతరం వాటర్ గ్రిడ్ పైలాన్‌ను మంత్రులు కేటీఆర్, జగదీశ్‌రెడ్డితో కలిసి ఆవిష్కరిస్తారు. ఇప్పటికే అన్ని ప్రతిపాదనలు సైతం సిద్ధమైన వాటర్ గ్రిడ్ పథకం ఈ ప్రారంభ కార్యక్రమంతో పనులు కొనసాగించనున్నది. చౌటుప్పల్ నుంచి 5.05గంటలకు హెలికాప్టర్‌లో బయల్దేరి 5.50 గంటలకు దామరచర్ల మండలంలోని వీర్లపాలెం సీఎం కేసీఆర్ చేరుకుంటారు. అక్కడ నిర్మించనున్న యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ పైలాన్‌ను ఆవిష్కరిస్తారు. 5 యూనిట్లలో 4వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో నిర్మిస్తున్న ఈ పవర్ ప్లాంట్‌ను ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని కేవలం నెల రోజుల వ్యవధిలోనే పర్యావరణ అనుమతులు, భూసేకరణను పూర్తి చేసిన సంగతి తెలిసిందే.

అక్కడి నుంచి 6.20 బయల్దేరి 7.30 గంటలకు నల్లగొండలోని ఎన్జీ కాలేజీ మైదానంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ సభను జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి, టీఆర్‌ఎస్ నాయకులు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. సుమారు లక్షన్నర మంది బహిరంగ సభకు తరలిరానున్నారనే అంచనాతో ఆ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆదివారం చౌటుప్పల్, దామరచర్లతోపాటు జిల్లా కేంద్రంలోని సభాస్థలాన్ని మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, వేముల వీరేశం, కలెక్టర్ సత్యనారాయణరెడ్డి ఏర్పాట్లను పరిశీలించారు. సభ ముగిసిన తర్వాత సీఎం కేసీఆర్ రాత్రి 9.30 గంటలకు రోడ్డు మార్గంలో హైదరాబాద్‌కు వెళ్లనున్నారు.
జాతీయ రికార్డుగా యాదాద్రి పవర్ ప్లాంట్ రాష్ట్ర ప్రభుత్వవిద్యుత్‌రంగం(స్టేట్ పవర్ సెక్టార్)లో తొలి 4వేల మెగావాట్ల అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్టు(యూఎంపీపీ)గా యాదాద్రి పవర్ ప్లాంట్ జాతీయస్థాయిలో రికార్డును నమోదుచేసుకోనున్నది. నల్లగొండ జిల్లాలో సోమవారం ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రి ప్లాంటుకు శంకుస్థాన చేయనున్నారు. 800 మెగావాట్ల సామర్థ్యంతో ఐదు యూనిట్లు, విద్యుత్ ఉద్యోగుల నివాస ప్రాంగణాలు, ఇతర మౌలికసదుపాయాలన్నీ కలిపి దాదాపు రూ.24,300కోట్ల వ్యయంతో చేపడుతున్న ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులు 2019 మే నెలాఖరు(48 నెలలు)కు మొత్తంగా పూర్తి అవుతాయి. మొత్తం ఐదు యూనిట్లలో తొలి రెండు యూనిట్లు(2×800) మూడేండ్లల్లో పూర్తికానున్నాయి. మిగతా మూడు యూనిట్లు(3×800) నాలుగు నెలలకు ఒకటి చొప్పున పూర్తి అవుతాయి.
యాదాద్రి విద్యుత్ ఉత్పత్తి వ్యయం ఒక్క మెగావాట్‌కు రూ.6.04కోట్ల మేరకు ఖర్చు అయ్యే అవకాశాలున్నాయి. సీఎం కేసీఆర్ ఆదేశాలకు లోబడి తెలంగాణ తొలి ఏడాది పూర్తి అయ్యే నాటికి జెన్‌కో ఆధ్వర్యంలో అదనంగా 6 వేల మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణ పనులు ఖరారు కావడం గమనార్హం. పవర్ ప్రాజెక్టుల నిర్మాణంలో పారదర్శకంగా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం జెన్‌కో కొత్త థర్మల్ పవర్ ప్రాజెక్టులన్నీ కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ భారత్ హెవీఎలక్ట్రికల్ లిమిటెడ్(బీహెచ్‌ఈఎల్)కు అప్పగించడం విశేషం. దశాబ్దాలుగా వెనుకబాటుకు గురైన నల్లగొండ జిల్లాను అగ్రభాగాన నిలిపే ఆలోచనలో భాగంగా సీఎం కేసీఆర్ యాదాద్రి ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. జిల్లాకు చెందిన విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి ఈ ప్రాజెక్టు ఏర్పాటుకు అవసరమైన చర్యలు చేపట్టగా, జెన్‌కో సీఎండీ డీ ప్రభాకర్‌రావు ప్రాజెక్టు సాంకేతిక అంశాలపై దృష్టిసారించి అనతికాలంలోనే యాదాద్రి ప్రాజెక్టు అంకురార్పణకు మార్గం సుగమం చేశారు.
పవర్ ప్రాజెక్టులో అత్యంత కీలకమైన బాయిలర్ల విషయంలో యాదాద్రి కొత్తపోకడలను అనుసరిస్తున్నది. స్వదేశీ బొగ్గు(ఇండిజీనియస్ కోల్), విదేశీ బొగ్గు(ఇంపోర్ట్ కోల్)లలో ఏ బొగ్గు ఎంత మోతాదులోనైనా కలుపుకుని(మిక్సింగ్) విద్యుత్ ఉత్పత్తి చేసే వెసలుబాటుతో యాదాద్రి కోసం ప్రత్యేకంగా బీహెచ్‌ఈఎల్ బాయిలర్ డిజైన్లను రూపొందించనున్నది.
ఈ ప్రక్రియ కూడా అరుదైన రికార్డుగా విద్యుత్ నిపుణులు పేర్కొంటున్నారు. స్వదేశీ బొగ్గు కొరత ఏర్పడితే వంద శాతం విదేశీ బొగ్గుతో విద్యుత్ ఉత్పత్తికి యాదాద్రి బాయిలర్లు అనుకూలంగా ఉంటాయి. యాదాద్రి పక్కనే కృష్ణానది పారుతుండడం, విదేశీ బొగ్గు వినియోగం కోసం 180 కిలోమీటర్ల దూరంలో బందరు పోర్టు, 250 కిలోమీటర్ల దూరంలో కృష్ణపట్నం పోర్టులు అందుబాటులో ఉండడం యాదాద్రి ప్రత్యేక అంశాలుగా చెప్పుకోవచ్చు.