Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

పేదల గృహప్రవేశం..

-దేశ చరిత్రలో కొత్త అంకం.. పేదలకు ఇక అన్నీ డబుల్ బెడ్‌రూం ఇండ్లే -ఈ సంవత్సరం 60 వేల ఇండ్లు నిర్మిస్తాం -అన్నిటికీ ఐడీహెచ్ కాలనీయే ఆదర్శం -పేదలు ఆత్మగౌరవంతో బతకాలి -ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు స్పష్టీకరణ -ఐడీహెచ్ కాలనీ ప్రారంభించిన కేసీఆర్

రాష్ట్రంలో పేదలందరికీ ఇక డబుల్ బెడ్‌రూం ఇండ్లే నిర్మిస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. నిరుపేదలు ఆత్మగౌరవంతో తలెత్తుకు తిరగాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ఐడీహెచ్ కాలనీ ప్రారంభంతో దేశ చరిత్రలో కొత్త అంకం మొదలైందని అన్నారు. ప్రభుత్వాలు ఏవో అంటాయి కానీ, చేస్తాయా? నాయకులు హామీలు ఇస్తారు కానీ, అమలు చేస్తారా? అనే భావనను పటాపంచలు చేసి కొత్త చరిత్ర సృష్టించామని సీఎం అన్నారు.

ఇచ్చిన మాట ప్రకారం డబుల్‌బెడ్‌రూం ఇండ్లు కట్టించి చూపామని, ఈ స్ఫూర్థితో రాష్ట్రవ్యాప్తంగా 60 వేల ఇండ్లు నిర్మిస్తామని తెలిపారు. హైదరాబాద్ ఐడీహెచ్ కాలనీలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన డబుల్‌బెడ్‌రూం ఇండ్లను సీఎం సోమవారం లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో సీఎం మాట్లాడారు. చాలా సంతోషంగా ఉంది అంటూ ప్రసంగం ప్రారంభించిన కేసీఆర్ ముందుగా లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఇండ్లలో పేదలు సుఖశాంతులతో వర్ధిల్లాలని ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగం ఆయన మాటల్లోనే..

CM KCR at IDH colony double bedroom houses inauguration 4

ఐడీహెచ్ కాలనీతో కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టినం. అనుకున్న ప్రకారంగా ఇండ్లను నిర్మించుకున్నం. పాలు పొంగించినం. పూజా కార్యక్రమాలు కూడా చేసుకున్నం. ఇక అందరూ సంతోషంగా ఉండాలి. గతేడాది దసరా పండుగ నాడు ఇండ్లకు శంకుస్థాపన చేసుకున్నం. ఈ దసరా పండుగకు ఇవ్వడానికి రెడీ అయినయి. కానీ గుంటూరులో అమరావతి శంకుస్థాపన కార్యక్రమం కారణంగా మరో రోజు ప్రారంభోత్సవ కార్యక్రమం పెట్టుకుందామని మంత్రి శ్రీనివాసయాదవ్‌కు చెప్పిన. దీపావళి తర్వాత ఈ కార్యక్రమానికి రావడం సంతోషం. గతంలో పేదల ఇండ్లు అంటే ఊరవతల ఉండేవి. ఇల్లుకు రూ.70 వేలు ఇస్తే సరిపోదా? అనేవారు. ఒక్కరూంతో ఉండేవి.

ఇంట్లో ఆడోళ్లు బట్టలు మార్చుకునేందుకు ఇబ్బందియ్యేది. ఒక్క బంధువు వస్తే ఎక్కడ పండుకుంటండు.. అనే పరిస్థితి ఉండేది. దానిపై ఆలోచించి ఎన్నికలకు ముందు డబుల్‌బెడ్‌రూం హామీ ఇచ్చినం. పేదలంతా ఆత్మగౌరవంతో బతకాలి. అందుకే ఈ సంవత్సరం రాష్ట్రంలో 60 వేల డబుల్‌బెడ్‌రూం ఇండ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టినం. 119 నియోజకవర్గాలలో నియోజకవర్గానికి 400 చొప్పున నిర్మిస్తున్నం. మొదటి విడత రూ.4 వేల కోట్లతో ఇండ్లు నిర్మించుకుంటున్నం అని కేసీఆర్ అన్నారు.

CM KCR at IDH colony double bedroom houses inauguration 3

గవర్నర్ మెచ్చుకున్నారు.. ఇంతకాలం డబుల్‌బెడ్‌రూం ఇండ్లు అంటే ఎలా కట్టాలి అనే విషయంలో అధికారుల్లో స్పష్టత ఉండేది కాదని, కలెక్టర్లను ఐడీహెచ్ కాలనీ చూడమని చెప్పానని కేసీఆర్ అన్నారు. దానితో వారికి స్పష్టత వచ్చిందని, ఈ కాలనీయే రాష్ట్రంలో ఇండ్ల నిర్మాణాలకు రోల్ మాడల్‌గా ఉంటుందని అన్నారు. ఈ కాలనీని ఎందరెందరో సందర్శించి మెచ్చుకున్నారని, ప్రత్యేకంగా రాష్ట్ర గవర్నర్ ఎలా ఉందో చూద్దామని వచ్చారని, కాలనీని చూసిన తర్వాత ఇక్కడినుంచే గవర్నర్ తనకు ఫోన్ చేసి ఇండ్లు బాగున్నాయని చెప్పారని అన్నారు. ఢిల్లీలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల క్వార్టర్లలాగా బాగున్నయ్… నాక్కూడ ఒకటి మంజూరు చెయ్యి అన్నారని ముఖ్యమంత్రి తెలిపారు. వరంగల్‌లో ఓ బహిరంగ సభలో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు కేంద్ర ప్రభుత్వం ఒక రూం ఇండ్లను మంజూరు చేస్తే తెలంగాణ ముఖ్యమంత్రి డబుల్ బెడ్‌రూంలు కట్టించి ఇస్తున్నరని చెప్పి మెచ్చుకున్నారని అన్నారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

CM KCR at IDH colony double bedroom houses inauguration

ఇక డబ్బా ఇండ్లు ఉండవు. ఇంతకాలం గవర్నమెంటు వాళ్లు అన్నది చేస్తరా.. నాయకులు అంటరు కానీ చేస్తరా అనే అనుమానాలు ఉండేవని ఇవాళ వాటిని పటాపంచలు చేశామని ముఖ్యమంత్రి అన్నారు. రాష్ట్రంలో ఇకపై డబ్బా ఇండ్లు ఉండవు..అన్నీ డబుల్‌బెడ్‌రూంలే నిర్మిస్తామని కేసీఆర్ ప్రకటించారు. అందరికీ ఇండ్లు లక్ష్యంగా పెట్టుకుని, పేదలందరూ గౌరవప్రదంగా జీవించడమే లక్ష్యంగా ముందుకు సాగుతామని అన్నారు. ఇండ్లల్లకు పోయిన పేదలు బ్రహ్మాండంగా దావత్ ఇచ్చినారు.. సంతోషంగా ఉంది.. మీ అందరితో కలిసి అన్నం తినడం మరిచిపోలేను.. కాలనీలోని ప్రతీ తల్లికి, తండ్రికి శుభం కలుగాలని ఆ దేవున్ని ప్రార్థిస్తా అని కేసీఆర్ అన్నారు.

మాట ఇస్తే నిలబెట్టుకుంటారు.. మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ మాట ఇస్తే నిలబెట్టుకునే వ్యక్తి అని కొనియాడారు. డబుల్‌బెడ్‌రూం ఇండ్లు దానికి నిదర్శనమని అన్నారు. భారత దేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ నూతన ఒరవడికి శ్రీకారం చుట్టిందని అన్నారు. పేదల కష్టాలు తెలిసిన వ్యక్తిగా.. పేదల ఆకలి తెలిసిన మనిషిగా సీఎం కేసీఆర్ వారి సంక్షేమానికి అనేక కార్యక్రమాలు చేపట్టారని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత పింఛన్లు, హాస్టళ్లలో పేద విద్యార్థులకు సన్నబియ్యం అందిస్తున్నారని అన్నారు. పేదల కోసం జీవో 58 తెచ్చి పట్టాలు పంపిణీ చేసిన ఘనత చరిత్రలో మరెవరికీ లేదన్నారు.

రేషన్ బియ్యం లిమిట్ లేకుండా ప్రతి వ్యక్తికి 6 కిలోల చొప్పున అందించేందుకు చర్యలు తీసుకుని ఆకలి తీర్చే సీఎంగా మనముందుకు వచ్చారని అన్నారు. స్వచ్ఛ హైదరాబాద్ కోసం రూ.200 కోట్లను విడుదల చేసి ఇంటింటికీ డస్ట్‌బిన్ ఇస్తున్నారని, చెత్త తరలించే ఆటోల పంపిణీ కార్యక్రమం చేపట్టారని కొనియాడారు. హైదరాబాద్‌ను రూ.25 వేల కోట్లతో సమగ్ర అభివృద్ధి చేస్తున్నారని అన్నారు. 5 బస్తీలను కలిపి ఐడీహెచ్ కాలనీ నిర్మించినందుకు కాలనీ ప్రజల తరుపున సీఎంకు ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు జయమ్మ, నందకుమారి, లక్ష్మిబాయి, రేణుకలకు ముఖ్యమంత్రి చేతుల మీదుగా భూ యాజమాన్య పత్రాలు అందించారు. మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, మహేందర్‌రెడ్డి, పద్మారావు, మున్సిపల్‌శాఖ ముఖ్యకార్యదర్శి ఎంజీ గోపాల్, మున్సిపల్ కమిషనర్ జనార్దన్‌రెడ్డి, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ రాహుల్ బొజ్జా, ఎమ్మెల్యే కనుకారెడ్డి, ఎంపీ ఎంఏ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.CM-KCR-at-IDH-colony-double-bedroom-houses-inauguration-5

లబ్ధిదారుల ఆనందబాష్పాలు.. గుడిసెల ఉండెటోల్లం..జీవితంల ఇలాంటి ఇండ్లల్ల ఉంటమని అనుకోలేదు. అంతా మీ పుణ్యమే సారూ.. అంటూ ఐడీహెచ్ లబ్దిదారులు ఆనంద బాష్పాలు రాల్చారు. ఇండ్ల పత్రాలు అందుకుంటూ వారు ఉద్వేగంతో కంటతడిపెట్టారు. సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు…ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పాదాభివందనం చేయబోగా ఆయన వారించి సుఖ సంతోషాలతో ఉండండని దీవించారు. సోమవారం ఐడీహెచ్ కాలనీ ప్రారంభం సందర్భంగా కాలనీలో పండుగ వాతావరణం నెలకొంది. ఏండ్ల తరబడి ఇరుకు ఇరుకు గల్లీలలో అడుగు తీస్తే వేయలేని స్థితిలో పూరి గుడిసెల్లో జీవించామని వారు గుర్తు చేసుకున్నారు. ఇంతపెద్ద ఇళ్లు కట్టించి ఇవ్వడంతో మా జన్మ ధన్యమైంది అని వారు వ్యాఖ్యనించారు.

ఒకప్పుడు ఈ ప్రాంతంలోని భగత్‌నగర్, సుభాష్ చంద్రబోస్‌నగర్, పార్థీవాడ, అమ్ముగూడ హట్స్, డీహెచ్‌కాలనీ పక్కపక్కనే పూరి గుడిసెలతో ఇరుకు గల్లీలతో ఉండేవి. టూవీలర్‌తో రాలేక బస్తీ ముందు పార్కు చేయాల్సి వచ్చేది. ఇరుకు ఇండ్లలో కాళ్లు జాపితే దర్వాజకు తగిలే స్థితి ఉండేది. వరద నీరు ఇండ్లలోకి వచ్చి వానాకాలం రాత్రిళ్లు నిద్రలు కరువయ్యేవి. ఎంతో మంది వచ్చిండ్రు.. చూసిండ్రు.. వెళ్లిండ్రు.. ఓట్లయితే వేసుకున్నరు.. పక్కా ఇండ్ల మాట ఎత్తలేదు. అనుకోని విధంగా ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు మా బస్తీకి వచ్చిన పుణ్యకాలం. ఏమో గానీ మా బతుకులు మారాయి. జీవితంలో ఇంత పెద్ద ఇంట్లో ఉంటామని ఎన్నడూ ఊహించలేదని లబ్దిదారులు జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.