-2001లోనే కరీంనగర్‌లో బలంగా తెలంగాణవాదం -రాజేందర్‌కు సీఎం కేసీఆర్ అనేక అవకాశాలిచ్చారు -కాంగ్రెస్‌తో పొత్తులోనూ కమలాపూర్‌ను వదలలేదు -రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్ -సీఎం కేసీఆర్‌ను సవాల్ చేస్తారా?

ఈటల రాజేందర్ పార్టీలోకి రాకముందే ఉత్తర తెలంగాణలో.. ప్రత్యేకించి కరీంనగర్‌లో టీఆర్‌ఎస్ బలంగా విస్తరించి ఉన్నదని రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్‌కుమార్ అన్నారు. 2004 ఎన్నికల్లో ఎంతమంది పోటీ పడుతున్నా కాదని పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ బంగారు పళ్లెంలాంటి కమలాపూర్ నియోజకవర్గాన్ని ఈటల చేతుల్లో పెట్టారని చెప్పారు. మంగళవారం తెలంగాణభవన్‌లో వినోద్‌కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. ఈటలకు టీఆర్‌ఎస్, ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక ఉన్నతమైన అవకాశాలిచ్చారని గుర్తుచేశారు. ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీలో పార్టీ ఫ్లోర్‌లీడర్‌ను చేసి ఉన్నతమైన గౌరవం ఇచ్చారని పేర్కొన్నారు. ప్రభుత్వంలో ఉంటూ పార్టీని, ముఖ్యమంత్రిని చాలెంజ్ చేసి మాట్లాడటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్ ఆవిర్భావానికి ఏడాదికి ముందే తెలంగాణ కోసం చర్చలు జరుపుతున్న సమయం నుంచే అన్నింటికీ తాను ప్రత్యక్ష సాక్షినని చెప్పారు. తెలంగాణ ప్రాంతమంతా అలజడిగా ఉండేదని, నీళ్లు, కరెంట్ లేక రైతు ఆత్మహత్యలు, అటు నక్సల్స్, ఇటు పోలీసుల చేతుల్లో నిత్యం యువకుల ఎన్‌కౌంటర్లు జరుగుతుండేవని తెలిపారు.
తెలంగాణ ఏర్పాటే ఈ సమస్యలన్నింటికీ పరిష్కారమంటూ టీఆర్‌ఎస్ ఆవిర్భవించిన కాలంలో తాను కమలాపూర్‌కు బ్రిగేడియర్‌గా వెళ్లానని గుర్తుచేశారు. తెలంగాణవాదంతో కూడిన ఆ ప్రాంతంలో టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా బీజాలు పడ్డాయని వివరించారు. తెలంగాణవాదాన్ని, టీఆర్‌ఎస్‌ను మొగ్గలోనే తుంచివేయాలని చూసి చంద్రబాబు కుట్రపూరితంగా ఎన్నికలు తెస్తే 2001లో గులాబీ జెండాతో రైతునాగలి గుర్తుతో గెలిచామని వివరించారు. ఈటల రాజేందర్ 2003లో టీఆర్‌ఎస్‌లో చేరారని.. అప్పటికే ఉత్తర తెలంగాణలో పార్టీ బలంగా వ్యాప్తి చెంది ఉన్నదని అన్నారు. టీఆర్‌ఎస్‌కు బలమైన నియోజకవర్గంగా ఉన్న కమలాపూర్‌లో ఎంతోమంది నాయకులు సిద్ధంగా ఉన్నప్పటికీ.. యువకుడైన ఈటలను బీసీ నేతగా తీర్చిదిద్దాలనే ఆలోచనతో కేసీఆర్ ఆయనకు టికెట్ ఇచ్చారని చెప్పారు. 2004లో పొత్తులో భాగంగా కమలాపూర్ తమకు కావాలని కాంగ్రెస్ కోరినప్పటికీ ఇవ్వలేదని గుర్తుచేశారు.
సీఎం కేసీఆర్‌ను సవాల్ చేస్తారా? -హుజూరాబాద్ కేంద్రంగానే రైతుబంధు సీఎం కేసీఆర్‌కు ఈటల అంటే ప్రత్యేక అభిమానం ఉన్నదని వినోద్‌కుమార్ తెలిపారు. దేశానికే ఆదర్శం గా నిలిచిన రైతుబంధు పథకాన్నీ హుజూరాబాద్ వేదికగా ప్రారంభించారని.. ఆ విషయాన్ని మర్చిపోయిన ఈటల ప్రభుత్వ పథకాలకు వ్యతిరేకంగా మాట్లాడటం సరికాదనిఅన్నారు. అభివృద్ధి, సంక్షేమపథకాలు ఎంతో గొప్పగా ఉన్నాయని చెప్పిన వ్యక్తి ఈరోజు వాటిని చిన్నవి చేసి మాట్లాడటంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. బీసీ వర్గాల నుంచి ఎదిగి వచ్చిన వ్యక్తి ఆవర్గాలను అవమానపరిచేలా వ్యవహరించ టం, మాట్లాడటం నాయకుడి లక్షణం కాదని హితవు పలికారు. మీడియా సమావేశంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాఎమ్మెల్యేలు కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, డాక్టర్ సంజయ్, సుంకె రవిశంకర్, రసమయి బాలకిషన్, కోరుకంటి చందర్, వొడితెల సతీష్‌కుమార్, ఎమ్మెల్సీలు నారదాసు లక్ష్మణ్‌రావు, శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్‌ఎస్వీఅధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు.
2004 ఎన్నికల్లో ఎంతమంది పోటీ పడుతున్నా కాదని పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ బంగారు పల్లెంలాంటి కమలాపూర్ నియోజకవర్గాన్ని ఈటల చేతుల్లో పెట్టారు. ఈటలకు సీఎం కేసీఆర్ అనేక అవకాశాలిచ్చారు. ప్రభుత్వంలో ఉంటూ పార్టీని, సీఎంను చాలెంజ్ చేసి మాట్లాడటం ఎంతవరకు సమంజసం? అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఎంతో గొప్పగా ఉన్నాయని చెప్పినవ్యక్తి ఈరోజు వాటిని చిన్నవిచేసి మాట్లాడటంలో ఆంతర్యం ఏమిటి? -రాష్ట్ర ప్రణాళికాసంఘం, ఉపాధ్యక్షుడు బీ వినోద్‌కుమార్