-నగదు రహితానికి చర్యలు తీసుకోండి -అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశం -రేపటి కలెక్టర్ల సదస్సులో టీ వ్యాలెట్ లోగో ఆవిష్కరణ

నగదు రహిత లావాదేవీలను పెంచడానికి, ప్రోత్సహించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. నోట్ల రద్దు నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ సమీక్షించారు. నగదురహిత లావాదేవీల కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకురానున్న టీ వ్యాలెట్ లోగోను బుధవారం జరిగే కలెక్టర్ల సదస్సులో ఆవిష్కరించనున్నారని తెలుస్తున్నది. నగదురహిత లావాదేవీల రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తున్నది. ఇందుకోసం తీసుకురానున్న టీ వ్యాలెట్ లోగోను ఈ నెల 14న జరిగే కలెక్టర్ల సదస్సులో ఆవిష్కరించనున్నారు. నగదురహిత లావాదేవీలను పెంచేందుకు, ప్రోత్సహించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. సిద్దిపేట నియోజకవర్గంలోని ఇబ్రహీంపూర్.. నగదురహిత గ్రామంగా ఏర్పడి రాష్ట్రంలో ఆదర్శంగా నిలిచిందన్నారు. అలాగే సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గం కూడా త్వరలోనే ఈ ఘనత సాధిస్తుందని సీఎం చెప్పారు. ఇదే స్ఫూర్తితో రాష్ట్రంలో నగదురహిత లావాదేవీలు జరుగాలని సీఎం కోరారు. పెద్దనోట్ల రద్దుతోపాటు ఆర్థిక అంశాలపై కేంద్రం అనేక నిర్ణయాలు తీసుకుంటున్న నేపథ్యంలో రాష్ట్రంలో అనుసరించాల్సిన వ్యూహంపై సీఎం కేసీఆర్ సోమవారం ప్రగతిభవన్‌లో సమీక్ష నిర్వహించారు. మంత్రి హరీశ్‌రావు, అధికారులు నర్సింగ్‌రావు, రామకృష్ణారావు, నవీన్‌మిట్టల్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొని ప్రస్తుత పరిస్థితిని సీఎంకు వివరించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ కరెన్సీ నిర్వహణ కేంద్రం పరిధిలోని అంశమని, దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం రాష్ట్ర ప్రభుత్వాలకు లేదని చెప్పారు. ఈ నిర్ణయం ప్రభావం మాత్రం రాష్ట్రంపైన, ప్రజలపైన పడుతుందని అన్నారు. ఈ సమయంలో ప్రేక్షక పాత్ర పోషించలేం కనుక రాష్ట్రంలో ప్రతికూల పరిస్థితులు ఏర్పడకుండా, ప్రజలు ఇబ్బంది పడకుండా మన పరిధిలో మనం ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఆలోచించాలని చెప్పారు. నగదు లావాదేవీలను కనిష్ఠ స్థాయికి తేవడం కేంద్రం ఉద్దేశంగా కనిపిస్తున్నది. కరెన్సీ కూడా పెద్దమొత్తంలో అందుబాటులో లేదు. ఈ పరిస్థితిని మనం ఎదుర్కోవాలి. ప్రజలు కూడా సిద్ధం కావాలి. ప్రజలను నగదురహిత లావాదేవీలు జరిపేలా ప్రోత్సహించాలి. మొబైల్ యాప్‌లు, ఏటీఎం కార్డులు, స్వైప్ మిషన్లు, ఆన్లైన్ చెల్లింపులు జరిపేలా ప్రజలను ప్రోత్సహించాలి. బ్యాంకులు కూడా తమ సేవలను విస్తరించాలి.
సర్వర్లను డెవలప్ చేసుకోవాలి. బ్యాంకర్లతో అధికారులు ఎప్పటికప్పుడు మాట్లాడి తగిన చర్యలు తీసుకోవాలి. ఇంటర్నెట్ సౌకర్యం లేకున్నా లావాదేవీలు నిర్వహించే మొబైల్ యాప్‌లు వచ్చాయి. ఇంకా అనేకరకాల సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉంది. వీటిపై ప్రజలకు అవగాహన కల్పించాలి అని అధికారులకు సీఎం తెలిపారు. సిద్దిపేట నియోజకవర్గాన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకున్నందున అక్కడ అవసరమైన స్వైప్ మిషన్లు, ఏటీఏం కార్డులు అందుబాటులో ఉంచాలని అధికారులకు కేసీఆర్ స్పష్టంచేశారు. నగదురహిత లావాదేవీలు నిర్వహించే క్రమంలో తలెత్తే ఇబ్బందులు ఎప్పటికప్పుడు తెలుసుకొని పరిష్కారాలు వెతకాలని కోరారు.