Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

సీఎం కేసీఆర్

-సంబురాల తెలంగాణలో కొలువుదీరిన గులాబీ క్యాబినెట్ – రాజ్‌భవన్‌లో తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఘనంగా ప్రమాణ స్వీకారం -ఆయనతో పాటు 11 మంది మంత్రుల ప్రమాణం.. -పలు పార్టీల నేతలు, తెలంగాణవాదులు హాజరు -పరేడ్ గ్రౌండ్స్‌లో ఆవిర్భావ ఉత్సవాల్లో జెండా ఎగురేసిన సీఎం.. -రాజకీయ అవినీతిని అంతమొందిస్తానని ప్రతిన -మధ్యాహ్నం 12.57కు పదవీ బాధ్యతల స్వీకరణ.. -తొలి మంత్రివర్గ భేటీలో సహచరులకు దిశానిర్దేశం -9 నుంచి 14వ తేదీ వరకు అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు నిర్ణయం -మూడు లేదా నాలుగో వారంలో మంత్రివర్గ విస్తరణకు సంకేతాలు

KCR 012

స్వరాష్ట్రం ఆవిర్భవించిన రోజే తెలంగాణలో తొలి ప్రభుత్వం గద్దెనెక్కింది. రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా టీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సోమవారం ప్రమాణం చేశారు. ఆయనతో పాటు రాష్ట్ర క్యాబినెట్ మంత్రులుగా 11మంది కూడా ప్రమాణం స్వీకరించారు. రాజ్‌భవన్‌లో వేడుకగా జరిగిన కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ సరిగ్గా 8.15 గంటలకు కేసీఆర్‌తో ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణం చేయించారు. కేసీఆర్ దైవసాక్షిగా ప్రమాణం చేశారు. అనంతరం గవర్నర్ ఆయనకు బొకేను అందించి అభినందనలు తెలిపారు. ఆ తరువాత 11 మంది మంత్రులు ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి తెలంగాణవాదులు భారీగా తరలివచ్చారు. వివిధ పార్టీల సీనియర్ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతకుముందు కేసీఆర్ అసెంబ్లీ ఎదుట ఉన్న గన్‌పార్క్‌లోని అమరవీరుల స్తూపం వద్ద రాష్ట్ర సాధనలో ప్రాణాలు అర్పించిన అమరవీరులకు నివాళులు అర్పించారు. అక్కడినుంచి రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు. సోమవారం ఉదయం కేంద్ర హోం శాఖ తెలంగాణలో రాష్ట్రపతి పాలనను ఎత్తివేస్తూ నోటిఫికేషన్ విడుదల చేయడంతో నూతన ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. తెలంగాణ రాష్ర్టానికి గవర్నర్‌గా నియమితులైన ఈఎస్‌ఎల్ నరసింహన్ ఉదయం 6.15 గంటలకు ప్రమాణ స్వీకారం చేసి పదవి చేపట్టారు. ఆ తర్వాత తెలంగాణ తొలి ప్రభుత్వ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొని ప్రమాణాలు చేయించారు.

ఆవిర్భావ వేడుకల్లో జెండా ఎగరేసిన సీఎం: ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన అనంతరం సికిందరాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో జరుగుతున్న రాష్ట్ర అవతరణ ఉత్సవాల్లో కేసీఆర్ పాల్గొన్నారు. ఉదయం 10.57 గంటలకు పరేడ్ గ్రౌండ్‌కు చేరుకున్న కేసీఆర్ ముఖ్యమంత్రి హోదాలో జాతీయ జెండా ఎగురవేశారు. అనంతరం వివిధ పోలీసు దళాలు అందించిన గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి ఆయన ప్రసంగిస్తూ తమ ప్రభుత్వ లక్ష్యాలు, కార్యక్రమాలను వివరించారు. ప్రగతి సాధనకు అవరోధంగా మారిన రాజకీయ అవినీతిని కూకటి వేళ్లతో పెకిలించి వేస్తామని కేసీఆర్ ఈ సందర్భంగా ప్రకటించారు. రాజకీయ అవినీతికి పాల్పడే వారు ఎంతటివాడైనా కఠినాతికఠినంగా శిక్షిస్తామని చెప్పారు. రైతులకు లక్ష రూపాయల వరకు రుణమాఫీ అతి త్వరలో అమలు చేస్తామని చెప్పారు. తెలంగాణను సీడ్ బౌల్ ఆఫ్ ఇండియాగా తీర్చి దిద్దుతామని, గ్రీన్‌హౌస్ కల్చర్‌ను ప్రోత్సహిస్తామని చెప్పారు. తమ ప్రభుత్వం సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని దళిత, మైనారిటీ, బీసీల అభ్యున్నతికి వచ్చే ఐదేళ్లలో లక్ష కోట్లు వెచ్చిస్తామని చెప్పారు. వృద్ధులు, వితంతువులకు వెయ్యి, వికలాంగులకు 1500 రూపాయలు చొప్పున పింఛన్లు ఇస్తామని, బీడీ కార్మికులకు నెలకు వెయ్యిరూపాయల భృతి కల్పిస్తామని చెప్పారు. భారత దేశం అబ్బురపడే రీతిలో బలహీన వర్గాలకు రెండు బెడ్‌రూంల ఇండ్లు నిర్మిస్తామని చెప్పారు. ఉద్యోగుల పట్ల తమ ప్రభుత్వం స్నేహశీల స్వభావం కలిగి ఉంటుందని చెప్పారు. వారికి తెలంగాణ ప్రత్యేక ఇంక్రిమెంట్ ఇస్తామని, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు వర్తింపజేయడంతో పాటు పీఆర్‌సీని సత్వరం అమలు చేస్తామని చెప్పారు. పోలీసులకు వారాంతపు సెలవు అమలు చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. ఆ శాఖలో ఖాళీలను భర్తీ చేస్తామని, వాహన శ్రేణిని సమకూర్చుతామని చెప్పారు.

పదవీ బాధ్యతల స్వీకారం..: అనంతరం సచివాలయానికి చేరుకున్న ముఖ్యమంత్రికి అక్కడ ఉద్యోగులు బ్రహ్మరథం పట్టారు. ఎర్రతీవాచీ పరిచి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సచివాలయ ప్రాంగణంలోని నల్లపోచమ్మ దేవాలయంలో సీఎం ప్రత్యేక పూజలు జరిపారు. తర్వాత అక్కడ ఉద్యోగులు ఏర్పాటు చేసిన సన్మాన సభలో పాల్గొన్నారు. ఉద్యోగులు ఆయనను పూలమాలలు బోకేలతో ముంచెత్తారు. ఈ సందర్భంగా ఉద్యోగులనుద్దేశించి మాట్లాడిన కేసీఆర్ తెలంగాణ సాధనలో ఉద్యోగుల పాత్ర చిరస్మరణీయమని ప్రశంసించారు. ఏ ప్రభుత్వమైనా ఆశించిన ప్రగతి సాధించాలంటే అవి ఎంప్లాయిస్ ఫ్రెండ్లీగా ఉండాలన్నారు. గత ప్రభుత్వాలు జెనెటికల్‌గా ఉద్యోగులకు వ్యతిరేకంగా ఉండేవని చెప్పారు. ఉద్యోగులు సమాజంలో భాగమేనని ఆయన అన్నారు. సచివాలయాన్ని ఆధునాతన హంగులతో తీర్చిదిద్దుతామని ఆయన చెప్పారు. ఉద్యోగులకు ఇబ్బందికరంగా మారిన సర్వీస్ రూల్స్‌ను సరళీకతం చేస్తామని చెప్పారు. తాను ముఖ్యమంత్రి పదవి చేపట్టినప్పటికీ గతంలోమాదిరిగానే ఏ సమస్య వచ్చినా తనను నేరుగా కలుసుకోవచ్చునని ఆయన చెప్పారు. సమ్మెలు, ఆందోళనలు అవసరం లేదని అన్ని సమస్యలు కూర్చుని చర్చించుకుని పరిష్కరించుకుందామని పిలుపునిచ్చారు. తర్వాత సరిగ్గా 12.57 గంటలకు సచివాలయంలోని సమత బ్లాక్ ఆరోఫ్లోర్‌లోని సీఎం కార్యాలయంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మంత్రివర్గ తొలిసమావేశం జరిగింది. సహచరులకు తన ప్రాధాన్యతలను ఆయన వివరించారు. సమావేశంలో ఆమోదించిన ప్రభుత్వ ప్రభుత్వ లోగా, శాసన సభ సమావేశాల నిర్వహణ ఫైళ్ల మీద ఆయన సంతకాలు చేశారు. సాయంత్రం రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కల్యాణ్‌సేన్ గుప్తాను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.

మూడోవారంలో క్యాబినెట్ విస్తరణ: తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్‌ను ఈ నెల మూడోవారం లేదా నాలుగోవారం ప్రథమార్థంలో విస్తరించనున్నట్లు సమాచారం. మంత్రివర్గంలోకి మొత్తం 17మందిని తీసుకోవడానికి అవకాశం ఉన్నందున మరో ఆరుగురికి అవకాశం దక్కనున్నట్లు తెలుస్తోంది. మొదటి విడత అవకాశం దక్కని ధర్మపురి ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్‌కు స్పీకర్ పదవి ఇవ్వాలని పార్టీ యోచిస్తున్నట్టు సమాచారం. దానికి ఆయన ఆసక్తి చూపకుంటే చందూలాల్, మధుసూదనాచారిలో ఒక్కరికి ఈ అవకాశం దక్కవచ్చు. వీరి ముగ్గురిలోనే ఒకరు స్పీకర్ అయితే మరొకరు మంత్రి అయ్యే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఇక ఈ నెల 9 నుంచి 14వ తేదీ వరకు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నందున అప్పుడే స్పీకర్, చీప్‌విప్, విప్‌లను నియమించనున్నట్లు సమాచారం. ఈ అసెంబ్లీ సమావేశాలు ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం, స్పీకర్ ఎన్నిక, పార్టీ విప్‌ల నియామకం తదితర కార్యక్రమాల నిర్వహణకే సరిపోనుంది.

మంత్రులు.. శాఖలు కే చంద్రశేఖర్‌రావు: సాధారణ పరిపాలన, విద్యుత్, ముఖ్యమంత్రి మున్సిపల్-పట్టణాభివృద్ధి, బొగ్గు, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ శాఖలతోపాటు మంత్రులకు కేటాయించని ఇతర శాఖలు ఎండీ మహ్మద్ అలీ : రెవిన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, ఉప ముఖ్యమంత్రి సహాయ పునరావాస, అర్బన్ లాండ్ సీలింగ్ టీ రాజయ్య: వైద్యం, ఆరోగ్యం ఉప ముఖ్యమంత్రి నాయిని నర్సింహారెడ్డి: హోం, జైళ్ళు, ఫైర్ సర్వీస్‌లు, సైనిక సంక్షేమం, కార్మిక, ఉపాధికల్పన ఈటెల రాజేందర్: ఆర్థిక, ప్రణాళిక, చిన్నమొత్తాల పొదుపు, పౌరసరఫరాలు పోచారం శ్రీనివాసరెడ్డి: వ్యవసాయం, దాని అనుబంధ శాఖలు టీ హరీష్‌రావు: భారీ నీటిపారుదల, శాసనసభా వ్యవహారాలు, మార్కెటింగ్ కేటీ రామారావు: పంచాయతీరాజ్, ఐటీ పీ మహేందర్ రెడ్డి: రవాణా జోగు రామన్న: అడవులు, పర్యావరణం జీ జగదీశ్‌రెడ్డి: విద్య టీ పద్మారావు: ఎక్సైజ్, మద్య నియంత్రణ

l కేసీఆర్ బిజీ బిజీ 6:00 గంటలకు కేసీఆర్ నివాసం నుంచి బయలుదేరి రాజ్‌భవన్‌కు.. రాష్ట్ర గవర్నర్‌గా నరసింహన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు.. 7:30 గన్‌పార్క్ వద్ద తెలంగాణ అమరవీరులకు నివాళులు.. 8:05 గన్‌పార్కు నుంచి రాజ్‌భవన్‌కు.. 8:15 రాజ్‌భవన్‌లో ముఖ్యమంత్రిగా ప్రమాణం.. 10:55 పరేడ్‌గ్రౌండ్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించి, పోలీసుల గౌరవ వందనం స్వీకరణ. 12:12 తెలంగాణ సచివాలయానికి.. 12:15 నల్లపోచమ్మ దేవాలయంలో పూజలు 12:20 సచివాలయం ఉద్యోగులతో భేటీ 12:57 ముఖ్యమంత్రిగా సమతాబ్లాక్ (సీ)లో పదవీ బాధ్యతలు స్వీకరణ.. 1:15 మంత్రివర్గ సహచరులతో భేటీ.. 2:05 ఐసీటీఐ ప్రతినిధులతో ప్రత్యేక భేటీ 6:50 హైకోర్టు చీఫ్ జస్టిస్‌తో మర్యాదపూర్వక భేటీ

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.