Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

సీఎం ప్రాజెక్టుల బాట

-కాళేశ్వరం పనులు పరిశీలించనున్న కేసీఆర్.. -నేటి సాయంత్రం కరీంనగర్‌కు -రేపు, ఎల్లుండి పనుల పరిశీలన.. -రామడుగు పంపుహౌజ్ వద్ద సమీక్ష.. -ఏర్పాట్లు చేస్తున్న జిల్లా అధికారులు

ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రాజెక్టులబాట పట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న కాళేశ్వరం ఎత్తిపోతల పథకం పనులను స్వయంగా పరిశీలించనున్నారు. వచ్చే ఏడాది వానకాలం సీజన్‌లోగానే గోదావరి జలాలను ఎత్తిపోయాలనే దృఢ నిశ్చయంతో ప్రభుత్వం ఉన్నందున పనులుకూడా శరవేగంగా కొనసాగుతున్నాయి. మరోవైపు ప్రాజెక్టుకు కావాల్సిన పలురకాల అనుమతులు కూడా కొన్నిరోజులుగా వరుసగా వస్తున్నాయి. ప్రాజెక్టు పనులను మొదటినుంచి సీసీ కెమెరాల ద్వారా ప్రగతిభవన్‌నుంచి పర్యవేక్షిస్తున్న ముఖ్యమంత్రి.. తాజాగా రెండ్రోజులపాటు క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు వెళుతున్నారు. ఈ మేరకు సీఎం పర్యటన షెడ్యూల్ ఖరారైంది. పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి తుపాకులగూడెం బరాజ్‌తోపాటు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లు, పంపుహౌజ్‌లు, ఎల్లంపల్లి నుంచి మిడ్‌మానేరుకు జలాల తరలింపుకోసం చేపడుతున్న పనులను పరిశీలించనున్నారు. బుధవారం సాయంత్రం హైదరాబాద్ నుంచి హెలికాప్టర్‌లో బయల్దేరి, కరీంనగర్ చేరుకోనున్న సీఎం.. తీగలగుట్టపల్లిలో బసచేయనున్నారు. గురువారం, శుక్రవారం రెండ్రోజులపాటు పూర్తిగా ప్రాజెక్టు పనులను పరిశీలించనున్నారు. ప్యాకేజీ-8లో భాగంగా చేపడుతున్న రామడుగు పంపుహౌజ్ వద్దనే అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ఈ పంపుహౌజ్‌లోనే 139 మెగావాట్ల సామర్థ్యం ఉన్న మోటరుకు ఈ నెల 15న డ్రైరన్ నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లుచేస్తున్నారు. సీఎం వెంట నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు కూడా ఉంటారు.

సీఎం పర్యటనకు అధికారుల ఏర్పాట్లు కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత పెద్దపల్లి జిల్లాకు ముఖ్యమంత్రి తొలిసారి వస్తుండటంతో ఇంచార్జి కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా అధికార యంత్రాగం అన్ని ఏర్పాట్లు చేస్తున్నది. జిల్లా ఏర్పడిన తర్వాత సాధించిన ప్రగతి, జిల్లాలో సంక్షేమ పథకాల అమలుతీరు, ప్రాజెక్ట్‌ల నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులకు చెల్లించిన పరిహారంలాంటి పూర్తి సమాచారంతోపాటు జిల్లాలో భూరికార్డుల ప్రక్షాళన వివరాలను కూడా సీఎంకు అందజేయడానికి సిద్ధంగా ఉన్నారు. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను ఇంచార్జి కలెక్టర్ పర్యవేక్షిస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం ధర్మారం మండల కేంద్రంలో హెలిప్యాడ్ స్థలాన్ని పరిశీలించారు. ప్రభుత్వ చీఫ్‌విఫ్ కొప్పుల ఈశ్వర్‌తోపాటు పెద్దపల్లి డీసీపీ విజేందర్‌రెడ్డి, పెద్దపల్లి ఏసీపీ సింధూశర్మ, కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎస్‌ఈ వెంకటేశ్వర్లు కూడా హెలిప్యాడ్ స్థలాన్ని పరిశీలించారు. ముఖ్యమంత్రికి ఘనస్వాగతం పలికేందుకు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.

కాళేశ్వరానికి త్వరలోనే పర్యావరణ అనుమతి? ముగిసిన ఈఏసీ భేటీ.. ఆశాభావంతో ఇంజినీర్లు కాళేశ్వరం ప్రాజెక్టుకు త్వరలోనే కీలకమైన పర్యావరణ అనుమతి రానుందనే ఆశాభావం వ్యక్తమవుతున్నది. కాళేశ్వరం పథకానికి పర్యావరణ అనుమతికి సంబంధించి మంగళవారం పర్యావరణ మదింపు కమిటీ (ఈఏసీ) భేటీ అయింది. పదో ఈఏసీ సమావేశంలో భాగంగా ప్రాజెక్టు పరిధిలో జాతీయ పర్యావరణ, పరిరక్షణ, శిక్షణ పరిశోధన సంస్థ (ఈపీటీఆర్‌ఐ) రూపొందించిన పర్యావరణ ప్రభావిత అంచనా నివేదికను పరిశీలించారు. ప్రాజెక్టు పనులవల్ల పర్యావరణంపై ఎలాంటి ప్రభావం ఉంటుంది? ఒకవేళ ప్రతికూల పరిస్థితులు ఉంటే వాటి నివారణకు ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? అనే అంశాలతోపాటు అసలు ప్రాజెక్టువల్ల ప్రయోజనం ఎలా ఉందనే సంపూర్ణ వివరాలను నివేదికలో పొందుపరిచినట్లు తెలిసింది. వీటిని పరిశీలించిన తర్వాత కమిటీ సభ్యులు పలు వివరాలు కోరగా.. సంబంధిత ప్రాజెక్టు అధికారులు వాటిని వెంటనే ఇచ్చినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో కాళేశ్వరంపై జరిగిన కమిటీ సమావేశంలో పూర్తిగా అనుకూల వాతావరణం ఉన్నట్టు సమాచారం. ఈ కమిటీకి సంబంధించిన మినిట్స్, నిర్ణయాలు రోజుల వ్యవధిలో వెల్లడి కానున్నాయి.

ఇదీ సీఎం పర్యటన షెడ్యూల్ బుధవారం -మధ్యాహ్నం 3.50గంటలకు ప్రగతిభవన్ నుంచి బయలుదేరి బేగంపేట ఎయిర్‌పోర్టుకు 3.55 గంటలకు చేరుకుంటారు. -4.35 గంటలకు హెలికాప్టర్ ద్వారా కరీంనగర్‌లోని తీగలగుట్టపల్లికి చేరుకుంటారు. -4.40కి తీగలగుట్టపల్లిలోని ఉత్తర తెలంగాణ భవన్‌కు చేరుకుని, రాత్రి బస చేస్తారు.

గురువారం ఉదయం -9 గంటలకు తీగలగుట్టపల్లి నుంచి హెలికాప్టర్‌లో బయల్దేరుతారు. -9.50 గంటలకు తుపాకులపల్లి బరాజ్ వద్దకు చేరుకుంటారు. -10.20 వరకు బరాజ్ పనులను పరిశీలిస్తారు. -10.40కి మేడిగడ్డ బరాజ్ వద్దకు చేరుకుంటారు. -11.00 గం. వరకు మేడిగడ్డ బరాజ్‌ను పరిశీలిస్తారు. -11.15 గంటలకు కన్నెపల్లి పంప్‌హౌస్‌కు చేరుకుంటారు. -11.45 వరకు పంపుహౌస్‌ను పరిశీలిస్తారు.

మధ్యాహ్నం -12.00 గంటలకు అన్నారం బరాజ్ వద్దకు చేరుకుంటారు. -12.20 వరకు బరాజ్‌ను పరిశీలిస్తారు. -12.40కి శ్రీపురం పంపుహౌస్ వద్దకు చేరుకుంటారు. అనంతరం భోజనం చేస్తారు. -1.30 వరకు పంపుహౌస్‌ను పరిశీలిస్తారు. -2.00కు సుందిళ్ల బరాజ్ వద్దకు చేరుకుంటారు. -2.20 వరకు సుందిళ్ల బరాజ్‌ను పరిశీలిస్తారు. -2.45కి గోలివాడ పంపుహౌస్ వద్దకు చేరుకుంటారు. -3.30 వరకు పంపుహౌస్ వద్ద పరిశీలిస్తారు. -సాయంత్రం 4.15 గంటలకు రామగుండంలోని ఎన్టీపీసీకి చేరుకుంటారు. రాత్రి అక్కడే బస.

శుక్రవారం ఉదయం -9.00 గంటలకు రామగుండం నుంచి బయలుదేరుతారు. -9.20 గంటలకు మేడారం పంపుహౌస్ వద్దకు చేరుకుంటారు. -మధ్యాహ్నం 12.00 గంటల వరకు పంపు హౌస్‌ను పరిశీలిస్తారు. -12.20గంటలకు రామడుగు మండలంలోని పంపుహౌస్ పనులను పరిశీలిస్తారు. అనంతరం అక్కడే భోజనం చేసి, అధికారులతో సమీక్షిస్తారు. -2.45 గంటలకు మల్యాల మండలం రాంపూర్‌లోని పంపుహౌస్ పనుల వద్దకు వెళ్తారు. -3.15వరకు పంపుహౌస్ పనులను పరిశీలిస్తారు. -3.40 కు మధ్య మానేరుకు చేరుకుంటారు. -3.45 వరకు మధ్యమానేరును పరిశీలిస్తారు. -సాయంత్రం 4.30 గంటలకు హైదరాబాద్ బయలుదేరి వెళ్తారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.