-మీకు అండగా నేనున్నా -సంతోష్ బాబు భార్య సంతోషికి 4 కోట్లు.. గ్రూప్ 1 ఉద్యోగం -బంజారాహిల్స్‌లో 711 గజాల స్థలం -తల్లిదండ్రులకు కోటి నగదు అందజేత -ప్రగతిభవన్‌కు ఆహ్వానించిన సీఎం -ఏ అవసరమొచ్చినా ఆదుకొంటాం -సంతోష్‌బాబు మరణం కలచివేసింది -దేశరక్షణ కోసం అమరుడయ్యారు -తన కుటుంబానికి ఎంతచేసినా తక్కువే -కర్నల్ సంతోష్ కుటుంబసభ్యులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆత్మీయ ఓదార్పు
భారత్, చైనా సరిహద్దుల్లోని గల్వాన్ దగ్గర జరిగిన ఘర్షణలో వీరమరణం పొందిన కర్నల్ బిక్కుమళ్ల సంతోష్‌బాబు కుటుంబానికి ఎంత చేసినా తక్కువేనని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. సంతోష్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా తమను సంప్రదించాలన్నారు. సంతోష్ కుటుంబం బాగోగులను చూసుకోవాలని మంత్రి జగదీశ్‌రెడ్డిని ఆదేశించారు. సోమవారం మధ్యా హ్నం ఎర్రవల్లి వ్యవసాయక్షేత్రం నుంచి రోడ్డుమార్గంలో బయల్దేరి 3.40 గంటలకు సూర్యాపేటలోని కర్నల్ ఇంటికి వెళ్లిన ముఖ్యమం త్రి కేసీఆర్ ముందుగా సంతోష్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు.

అనంతరం అమరవీరుడి భార్య సంతోషి, తల్లిదండ్రులు మంజుల, ఉపేందర్, సోదరి శ్రుతిని ఓదార్చారు. సంతోష్ పిల్లలు అభిజ్ఞ, అనిరుధ్‌తేజను పలుకరించారు. దేశ రక్షణకోసం సంతోష్ ప్రాణత్యాగంచేశారని కొనియాడారు. సంతోష్ మరణం తనను ఎంతో కలచివేసిందంటూ భావోద్వేగానికి గురయ్యారు. అనంతరం ఇద్దరు పిల్లల కోసం సంతోష్ భార్య సంతోషికి ఆమె పేరిట రూ.4 కోట్ల చెక్కును ముఖ్యమంత్రి అందించారు. గ్రూప్-1 ఉద్యోగ నియామక పత్రాన్ని, హైదరాబాద్ బంజారాహిల్స్‌లో ఇల్లుజాగ పత్రాన్ని కూడా ఇచ్చారు. సంతోష్ తల్లిదండ్రులకు కోటిరూపాయల చెక్కును అందించారు. ముఖ్యమంత్రి వెంట మంత్రులు జగదీశ్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, సీఎస్ సోమేశ్‌కుమార్, ఎంపీలు సంతోష్‌కుమార్, బడుగుల లింగయ్యయాదవ్, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, ఎమ్మెల్యేలు గాదరి కిశోర్, బొల్లం మల్లయ్యయాదవ్, శానంపూడి సైదిరెడ్డి, చిరుమర్తి లిం గయ్య, భూపాల్‌రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్ దీపికా యుగంధర్‌రావు, మున్సిపల్ చైర్‌పర్సన్ అన్నపూర్ణ, డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి తక్కళ్లపల్లి రవీందర్‌రావు, కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి, ఎస్పీ భాస్కరన్, ఆర్డీవో మోహన్‌రావు ఉన్నారు..

పిల్లలకు మంచి భవిష్యత్తునివ్వండి: ముఖ్యమంత్రి కేసీఆర్ సారీ అమ్మా.. సంతోష్ లేని లోటును ఎవరూ తీర్చలేరు. కర్నల్ సంతోష్‌బాబు దేశ రక్షణ కోసం ప్రాణత్యాగంచేశారు. ఆయన మరణం నన్ను ఎంతో కలచివేసింది. మీ కుటుంబానికి ఎంతచేసినా తక్కువే. మీరు ధైర్యంగా ఉండాలి. ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుంది. ఎప్పుడు ఏ సమస్య వచ్చినా మేముంటాం. ఇక్కడ జగదీశ్‌రెడ్డి ఉంటారు. ఆయనకు చెప్పండి. సంతోష్ బాబును తెచ్చివ్వలేం కానీ చెప్పిన ప్రకారం ఉద్యోగం, ప్లాట్, నగదుకు సంబంధించిన పత్రాలు ఇప్పుడు ఇస్తున్నాం. పిల్లలకు మీరు మంచి భవిష్యత్‌ను ఇవ్వాలి.
సూర్యాపేటలో సంతోష్ కాంస్య విగ్రహం: మంత్రి జగదీశ్‌రెడ్డి సూర్యాపేటలో కర్నల్ సంతోష్‌బాబు కాంస్య విగ్రహాన్ని ఏర్పాటుచేస్తామని మంత్రి జగదీశ్‌రెడ్డి చెప్పారు. కోర్టు జంక్షన్‌కు సంతోష్‌బాబు పేరు పెట్టబోతున్నట్టు ప్రకటించారు. కర్నల్ సంతోష్‌బాబు కుటుంబంతోపాటు దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన సైనిక అమరవీరులకు కూడా కేసీఆర్ ఆర్థికసాయం ప్రకటించి ఔదార్యాన్ని చాటుకున్నారని కొనియాడారు. కర్నల్ కుటుంబసభ్యులను కేసీఆర్ తన ఇంటికి భోజనానికి కూడా ఆహ్వానించి పెద్ద మనసును చాటుకొన్నారని పేర్కొన్నారు.
కేసీఆర్ నిర్ణయం దేశానికే ఆదర్శం ‘కర్నల్ సంతోష్‌బాబు భార్య గ్రూప్-1 అధికారిగా నియమితులు కావడం హర్షణీయం. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చూపిన చొరవను కేంద్ర ప్రభుత్వం, మిగతా రాష్ర్టాలు ఆదర్శంగా తీసుకోవాలి. సంతోష్ మరణంతో తల్లడిల్లుతున్న ఆ కుటుంబానికి అండగా నిలిచేందుకు ఆయన సత్వరం చర్యలు తీసుకున్నారు. అందరూ దీనినో ఉదాహరణగా తీసుకోవాలి’
– కాంగ్రెస్ నేత సింఘ్వీ