Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

కామన్ మ్యాన్ సర్కార్ గా కాకుండా కార్పొరేట్ల సర్కార్ గా వ్యవహరిస్తున్న మోడీ ప్రభుత్వం

-కేంద్రం సెస్సులు తగ్గిస్తే 70కే పెట్రోల్‌
-ఆ పని చెయ్యలేక రాష్ట్రాలపై దుష్ప్రచారమా?
-సెస్సుల ముసుగులో 30 లక్షల కోట్ల దోపిడీ
-ఆయిల్‌ కంపెనీల విండ్‌ఫాల్‌ ట్యాక్స్‌ తగ్గిస్తరా?
-పెట్రో ధరలు తగ్గించి ఉపశమనం కలిగించాలి
-కేంద్రం తీరుపై విరుచుకుపడిన మంత్రి కేటీఆర్‌

కేంద్రంలో ఉన్నది కామన్‌మ్యాన్‌ ప్రభుత్వం కాదని, కార్పొరేట్ల ప్రభుత్వమని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు విమర్శించారు. ప్రజలపై భారాలు మోపుతూ, కార్పొరేట్‌ కంపెనీలను మేపుతున్నదని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అడ్డగోలుగా పెంచిన ఎక్సైజ్‌ డ్యూటీలు, సెస్సులు, పన్నులతో దేశ ప్రజానీకానికి భారంగా మారిన పెట్రోల్‌ ధరలు తగ్గించేందుకు చేతులు రాని బీజేపీ ప్రభుత్వం.. ఆయిల్‌ కంపెనీలకు మాత్రం విండ్‌ఫాల్‌ ట్యాక్సులు తగ్గించడం ఏమిటని మండిపడ్డారు. ప్రధాని మోదీ కార్పొరేట్‌ మిత్రులకు చెందిన రెండు కంపెనీలకు లబ్ధి చేకూర్చేందుకే విండ్‌ఫాల్‌ ట్యాక్స్‌ని కేంద్రం తగ్గించిందని కేటీఆర్‌ విమర్శించారు.

మోదీ ప్రభుత్వం భారీగా పెంచిన సెస్సుల ఫలితంగానే పెట్రో రేట్లు విపరీతంగా పెరుగుతున్నాయని చెప్పారు. కేంద్రం సుంకాలను తగ్గిస్తే పెట్రోల్‌ 70 రూపాయలకు, డీజిల్‌ 60 రూపాయలకే ప్రజలకు అందించవచ్చని తెలిపారు. 2014 నుంచి సెస్సులను అడ్డగోలుగా పెంచుతూ దేశ ప్రజల నుంచి 30 లక్షల కోట్లను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దోచుకుందని ధ్వజమెత్తారు. ఎన్డీయే సర్కారు ఎన్పీయే (నిరర్థక ఆస్తి)గా మారిందని, పెట్రోల్‌ ధరలు తగ్గించడం చేతగాక రాష్ట్రాలపై దుష్ప్రచారం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసిన కేటీఆర్‌.. సెస్సులను రద్దుచేసి, ప్రజలకు పెట్రో ధరల నుంచి ఉపశమనం కలిగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

కేంద్రానివి దుర్మార్గపు ఆర్థిక విధానాలు
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి దేశ ప్రజల ఆర్థిక ఇబ్బందులు కనిపించడం లేదని, కేవలం కార్పొరేట్‌ కంపెనీల ప్రయోజనం కోసమే అది పనిచేస్తున్నదని కేటీఆర్‌ విమర్శించారు. ఒకవైపు సెస్సులు, సుంకాల పేరుతో పెట్రో ధరలను భారీగా పెంచిన కేంద్రం.. పెట్రోభారం నుంచి ఉపశమనం కావాలని ప్రజలు కోరితే ఏమాత్రం పట్టించుకోకుండా కార్పొరేట్‌ ఆయిల్‌ కంపెనీలకు విండ్‌ఫాల్‌ ట్యాక్సును తగ్గించి తన దుర్మార్గపు ఆర్థిక విధానాలను మరోసారి బయటపెట్టుకుందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కార్పొరేట్లకు వరాలిస్తూ, సామాన్యులపై భారం మోపడం.. చమురు కంపెనీలకు లాభాలు వచ్చేలా చూస్తూ, జనం జేబులకు చిల్లులు పెట్టడం బీజేపీ ప్రభుత్వ విధానంగా మారిందని ఆయన ధ్వజమెత్తారు. ఈ కార్పొరేట్‌ కంపెనీలు సంపాదించిన చమురు సొమ్ములు ఎవరి జేబుల్లోకి వెళ్తున్నాయో ప్రజలందరికీ తెలుసునని అన్నారు.

ఆ ఇంధనం విదేశాలకు ఎగుమతి
దేశంలో పెట్రోల్‌ ధరల పెరుగుదలకు రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధాన్ని బూచిగా చూపించిన బీజేపీ ప్రభుత్వం.. సామాన్య ప్రజలను దోచుకుందని మంత్రి కేటీఆర్‌ విమర్శించారు. పెట్రో ధరలు తగ్గించేందుకు రష్యా నుంచి తకువ రేటుకు ముడిచమురు కొంటున్నామని గప్పాలు కొట్టుకున్న మోదీ ప్రభుత్వం.. అందులోనూ కార్పొరేట్‌ ప్రయోజనాలనే కోరుకున్నదని చెప్పారు. ఆ ఇంధనాన్ని దేశీయ అవసరాలకు వాడకుండా ఇతర దేశాలకు ఎగుమతి చేసేందుకు కార్పొరేట్‌ ఆయిల్‌ కంపెనీలకు ఎందుకు అనుమతించిందో చెప్పాలని ఆయన నిలదీశారు. రష్యా నుంచి దిగుమతి చేసుకున్న ముడిచమరులో 3/4 వంతును శుద్ధిచేసిన కార్పొరేట్‌ ఆయిల్‌ కంపెనీలు ఆ ఇంధనాన్ని దేశంలో అమ్మకుండా విదేశాలకు ఎగుమతి చేసుకున్నాయని తెలిపారు. అలా రష్యా నుంచి తక్కువ ధరకు కొని, ఇతర దేశాలకు భారీగా ఎగుమతి చేసి ఆయిల్‌ కంపెనీలు అడ్డగోలు లాభాలు ఆర్జిస్తే.. ఆ లాభాలపైనా ట్యాక్స్‌ తగ్గించడంలో కేంద్ర ప్రభుత్వ ఆంతర్యం ఏమిటని కేటీఆర్‌ ప్రశ్నించారు. ప్రధాని మోదీ కార్పొరేట్‌ మిత్రులకు చెందిన రెండు కంపెనీలకు లబ్ధి చేకూర్చేందుకే విండ్‌ఫాల్‌ ట్యాక్స్‌ని తగ్గించిందని విమర్శించారు. ఈ మొత్తం వ్యవహారంలో సాధారణ ప్రజలకు పైసా లాభం కలుగలేదని చెప్పారు. తక్కువ రేటుకు రష్యానుంచి ప్రభుత్వమే ముడిచమురును కొనడం ద్వారా దేశానికి రూ.35వేల కోట్ల భారం తగ్గిందని చెప్పిన కేంద్రం.. ఆ మేరకు ప్రజలకు లబ్ధి చేకూర్చడంలో ఎందుకు విఫలమైందని ఆయన ప్రశ్నించారు. ఆ 35 వేల కోట్లను ఒకటీరెండు కంపెనీలే లాభాలుగా మార్చుకున్నయో, లేదో కేంద్రం వెల్లడించాలని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. విండ్‌ఫాల్‌ ట్యాక్స్‌ తగ్గింపుతో కార్పొరేట్‌ కంపెనీలు జాక్‌పాట్‌ కొట్టాయని, దేశ ప్రజలు మాత్రం విపరీతమైన పన్నుల భారాన్ని మోస్తూ కేంద్రానికి నిలువు దోపిడీ సమర్పించుకుంటున్నారని అన్నారు.

సంక్షేమం పట్టదు.. ప్రజలంటే గిట్టదు
దేశ ప్రగతి, ప్రయోజనాలను ఏ మాత్రం పట్టించుకోకుండా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం క్షుద్ర రాజకీయాలతో కాలం గడుపుతున్నదని మంత్రి కేటీఆర్‌ విమర్శించారు. పెట్రో ధరలను తగ్గించే విషయంలో సంకుచిత రాజకీయ ప్రయోజనాలను పకనపెట్టి ప్రజలకు ఊరటనిచ్చే నిర్ణయం తీసుకోవాలని హితపు పలికారు. కార్పొరేట్‌ కంపెనీల కోసం, బడా పారిశ్రామికవేత్తల ప్రయోజనాల కోసం మాత్రమే పనిచేయడం మోదీ సర్కారు అలవాటుగా మార్చుకున్నదని దుయ్యబట్టారు.

రాష్ట్రాల పన్నుల వాటాకు కేంద్రం ఎసరు
తెలంగాణ లాంటి రాష్ట్రాలు 2014 నుంచి వ్యాట్‌ను ఏమాత్రం పెంచకున్నా.. వ్యాట్‌ తగ్గించడం లేదని పార్లమెంటు సాక్షి గా దేశ ప్రజలను మోదీ ప్రభుత్వం తప్పుదోవ పట్టించిందని మంత్రి కేటీఆర్‌ విమర్శించారు. సెస్సుల పేరుతో ఇప్పటివరకు ప్రజల నుంచి రూ.30 లక్షల కోట్లు కొల్లగొట్టి, రాష్ట్రాల పన్నుల వాటాకు ఎసరుపెట్టిన కేం ద్ర ప్రభుత్వం.. ఉల్టా రాష్ట్రాల పైనే నిందలు వేస్తున్నదని ఆయన మండిపడ్డారు. దేశంలో పెట్రోల్‌ ధరలు పెరగడానికి రాష్ట్రాల వ్యాట్‌ పెంపు కారణం కాదని ఆయన స్పష్టంచేశారు. మోదీ ప్రభుత్వం భారీగా పెంచిన సెస్సుల ఫలితంగానే పెట్రో రేట్లు విపరీతంగా పెరుగుతున్నాయని చెప్పారు. కేంద్రం సుంకాలను తగ్గిస్తే పెట్రోల్‌ 70 రూపాయలకు, డీజిల్‌ 60 రూపాయలకే ప్రజలకు అందించవచ్చునని తెలిపారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.