Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

కాంగ్రెస్ బతుకే కమీషన్లు!

-పిచ్చి ప్రాజెక్టులు కడితే మేం రీడిజైన్ చేశాం
-సొల్లు ఆరోపణలు కాదు.. చర్చకు వస్తవా?
-కాంగ్రెస్ అధ్యక్షుడిపై సీఎం కేసీఆర్ నిప్పులు
-చంద్రబాబు మళ్లీ టోపీ పెట్టేందుకు వచ్చాడు
-ఢిల్లీకి గులాంలు తెలంగాణ కాంగ్రెస్ నేతలు
-ఇందిరాగాంధీ నుంచి చెప్పుడేతప్ప చేసిందిలేదు
-ఇది బానిసల తెలంగాణ కాదు.. పోరాటాల గడ్డ
-ప్రధానిలాంటి వ్యక్తి అబద్ధాలు చెప్తాడా?
-బీజేపీ అధికారంలో ఉన్న పందొమ్మిది రాష్ట్రాల్లో రైతులకోసం ఒక్క పథకమైనా ఉన్నదా?
-సింగరేణి ఆధ్వర్యంలో బయ్యారం ఉక్కు
-కొత్తగూడెంలో మైనింగ్ వర్సిటీ..మినీ ఏరోడ్రం ఏర్పాటుకు కృషి
-ఇల్లెందులో అండర్‌గ్రౌండ్ మైన్
-జనవరికల్లా జిల్లాగా ములుగు
-19 టీఎంసీలతో రోళ్లపాడు ప్రాజెక్టు
-ప్రజా ఆశీర్వాదసభల్లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు
-మకిలి వెకిలి సర్వేలను పట్టించుకోవద్దని సూచన
-జనమా.. ప్రభంజనమా!

ప్రాజెక్టుల నిర్మాణంలో కమీషన్లు తీసుకున్నారంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ చేసిన ఆరోపణలపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నిప్పులు చెరిగారు. కమీషన్లు తీసుకునే బతుకు కాంగ్రెస్‌దేనంటూ ధ్వజమెత్తారు. దమ్ముంటే ప్రాజెక్టుల మీద చర్చించేందుకు రావాలని రాహుల్‌కు సవాలు విసిరారు. నేషనల్ హెరాల్డ్ పేపర్ నిధులు ఎవరు మింగారో చెప్పాలన్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్‌గాంధీ బెయిల్ తీసుకుని తిరుగుతున్నారని చెప్పారు. చంద్రబాబు మళ్లీ టోపీ పెట్టేందుకు వచ్చారని, అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రధాని స్థాయిలోని వ్యక్తి అబద్ధాలు చెప్తున్నారని, బీజేపీకి ఒక్క సీటు కూడా రాకుండా బుద్ధి చెప్పాలని అన్నారు. కొంతమంది సన్నాసులు పిచ్చి సర్వేలు విడుదల చేస్తున్నారని, వాటిని పట్టించుకోవద్దని ప్రజలకు సూచించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం ఇల్లెందు, కొత్తగూడెం, మణుగూరు, ములుగు, భూపాలపల్లి, మంథని, పెద్దపల్లిలో నిర్వహించిన ప్రజాఆశీర్వాద సభల్లో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, ప్రధాని నరేంద్రమోదీ, ఏపీ సీఎం చంద్రబాబు వైఖరిని ఎండగట్టారు. దశాబ్దాల పాటు పాలించిన నేతలు సమస్యలను పరిష్కరించడంలో విఫలమయ్యారని, అందుకే నాన్ కాంగ్రెస్, నాన్ బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుకావాలని తాను ప్రతిపాదించానని చెప్పారు. తెలంగాణలో వందకంటే ఎక్కువ సీట్లు టీఆర్‌ఎస్ గెలుస్తుందని సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తంచేశారు. ఎన్నికల ప్రక్రియ మొదలైన దగ్గర నుంచి డజనుకుపైగా సర్వేలు ఇదే విషయం స్పష్టంచేశాయని గుర్తుచేశారు.

కోటి ఎకరాల ఆకుపచ్చ కావాలని, ప్రతి ఒక్కరూ చిరునవ్వుతో ఉండే తెలంగాణ కావాలని చెప్పారు. మరోసారి అధికారం ఇస్తే.. కలలు సాకారం చేసి.. బంగారు తెలంగాణను ప్రజలకు అప్పగిస్తానని హామీ ఇచ్చారు. గిరిజనులకు ఇందిరాగాంధీ కాలం నుంచి చెప్పడమేతప్ప.. చేసిందేమీలేదని కేసీఆర్ విమర్శించారు. తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పోడు భూముల సమస్యలు మీ ఊరికే వచ్చి పరిష్కరిస్తానని చెప్పారు. కొంతమంది సన్నాసులు, తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు శాపాలు పెట్టినోళ్లు కొన్ని మకిలి వెకిలి పిచ్చి సర్వేలు రిలీజ్ చేస్తున్నారని, దాన్ని ప్రజలు పట్టించుకోవద్దని సీఎం అన్నారు. అటువంటి సర్వేలకు ఈ సభలే జవాబులని చెప్పారు. కేంద్రంలో ఫెడరల్ ప్రభుత్వం వచ్చే విధంగా పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అన్ని స్థానాల్లో టీఆర్‌ఎస్‌ను గెలిపించాలని, అప్పుడే జాతీయ పార్టీల అహంకారం దిగుతుందని అన్నారు.

ఏ రాష్ర్టానికి పోయినా స్థానిక గొప్పవాళ్ల పేర్లు కనిపిస్తాయని, మన దగ్గర మాత్రం ప్రతిదానికీ నెహ్రూ, రాజీవ్‌గాంధీ, ఇందిరాగాంధీ పేర్లు పెట్టారని సీఎం విమర్శించారు. మన గొప్పవాళ్ల పేర్లు ఉండవని, మన కుమ్రం భీం పేరు ఉండదని ఆవేదన వ్యక్తంచేశారు. ఆనాడు అంగన్‌వాడీలు జీతాలు అడిగితే గుర్రాలతో తొక్కించారని సీఎం గుర్తుచేశారు. అంగన్‌వాడీల జీతాలు మునుపెట్లా ఉండే? ఇప్పుడెట్లా ఉన్నయి? ఆశ వర్కర్ల జీతాలు ఎంత పెరిగినయి? కరంటు అప్పుడు ఎలా ఉంది? ఇప్పుడెలా ఉంది? అవన్నీ మీకు తెలుసునని అన్నారు. విద్యుత్‌రంగంలో పనిచేసే.. 25 వేల మంది టెంపరరీ ఉద్యోగస్తులను పర్మినెంట్ చేశామని చెప్పారు. హోంగార్డులకు ఇండియాలో అధిక జీతాలు ఇచ్చే రాష్ట్రం తెలంగాణే అన్నారు. ఏదిచూసినా అన్ని రాష్ట్రాల కంటే మెరుగ్గా ఉన్నామని తెలిపారు. దేశంలోనే ఏ రాష్టంలోనూ లేనంత స్థాయిలో ముస్లింల సంక్షేమానికి కృషిచేస్తున్నామని చెప్పారు. మీరు ఆలోచిస్తే.. మీ ఊర్లోనే ఉన్నది. మీ ముందు ఉన్నది. మీరు చూస్తా ఉన్నరు. మీ అనుభవంలో ఉన్నవి. కాబట్టి మీరు ఆలోచన చేసి తీర్పు ఇవ్వాలి అని కోరారు. వివిధ అంశాలపై సీఎం ఏమన్నారో.. ఆయన మాటల్లోనే..

రాహుల్‌గాంధీ దద్దమ్మ.. జోకర్
రాహుల్‌గాంధీకి భగవంతుడు తెలివి ఇచ్చిండో లేదో! జోకర్‌లాగ మాట్లాడుతడు. ఆయనకు ఏమి తెలుస్తదో ఏమి తెలువదో.. ఎవ్వడు రాసిస్తడో తెల్వదు! మేం కమీషన్ కోసం ప్రాజెక్టులను రీడిజైన్ చేసినమట. వస్తవా రాహుల్‌గాంధీ? నీకు దమ్ముందా? పోదమా రుద్రంకోట కాడికి? రాజీవ్‌సాగర్, ఇందిరాసాగర్ ఎట్లుంటదో చూద్దామా? దేవాదులకాడికి పోయి అప్పుడెట్లుందో.. ఇప్పుడెట్లుందో చూద్దామా? నేనే తోలుకపోత.. రా దమ్ముంటే! ఎటువడితే అటు ఇష్టంవచ్చినట్టు కుళ్లు, సొల్లు ఆరోపణలు చేయడం కాదు. రీడిజైన్‌చేసి సీతారామ చేసుకున్నం. సీతారామచంద్రులు జిల్లాలో ఉన్నరు కాబట్టి, ఆ భగవంతుడి పేరు పెట్టాం. తెలంగాణ కాంగ్రెస్ దద్దమ్మలు, మీ గులాంలు.. మీరు ఏదిచెప్తే అదివిని పిచ్చి ప్రాజెక్టులు పెట్టారు కాబట్టి, వాటిని పీకి అవతలపడేసి, మాకు అవసరం ఉన్న ప్రాజెక్టులను కట్టుకుంటున్నం.

మీకు తెలివిలేక.. దాన్ని కమీషన్ కోసం మార్చిర్రు అని ఆరోపిస్తరు. మీ బతుకు కమిషన్ కాబట్టి అందరూ అట్లనే ఉన్నరని మీరనుకుంటరు. మాకు కావాలా కమీషన్? నీకు కమీషన్ కావాలంటే నేను ఇస్త దా! ఎవడికి కావాలె కమీషన్? మీలాగ మాది కమీషన్ల బతుకు కాదు. పోరాటం చేసే బతుకు మాది. 15 ఏండ్లు పేగులు తెగేదాక కొట్లాడినం. ఎవడు కమీషన్ ఇచ్చిండు మాకు? అన్నం తిన్నమో, అటుకులు తిన్నమో, ఉపాసం ఉన్నమో.. 2000 సంవత్సరం నుంచి కొట్లాడినం. మాకు ఆనాడు కమీషన్ ఎవరు ఇచ్చినాడు? మమ్ముల్ని జైళ్ల వేశారు.. పోలీసులు పట్టుకపోయిర్రు! భయపడకుండా కొట్లాడినం. మీ కుర్చీ గుంజే ప్రయత్నం చేసినం కాబట్టి మీరు తెలంగాణ ఇచ్చారు. ఇది వాస్తవం కాదా? నేషనల్ హెరాల్డ్ కేసులో బెయిల్‌పై బయట తిరుగుతున్న నువ్వా మాట్లాడేది?

ఏపీలో కలిపిన కాంగ్రెస్ దద్దమ్మలు.. మొద్దన్నలు..
బూర్గుల రామకృష్ణారావు నుంచి మొదలుకొంటే నేటివరకు కూడా ఇక్కడున్న కాంగ్రెస్ నాయకులు మొద్దన్నల్లాగా, దద్దన్నల్లాగా ఢిల్లీకి గులాంలుగా ఉన్నరు. వాళ్ల బతుకు వాళ్ల చేతిలోనే ఉండదు. టికెట్లు కూడా ఇక్కడ ఇయ్యరు.. ఢిల్లీకి పోవాలె. ఒకవేళ గులాంలు కాకపోతే 1956లో నెహ్రూ తెలంగాణను ఆంధ్రల కలుపుతే ఎట్ల ఊకున్నరు? అప్పట్లో ఢిల్లీ నుంచి బేగంపేట ఎయిర్‌పోర్టులో దిగిన బూర్గుల.. ఏం చెప్తం.. నెహ్రూగారు కలుపుత అన్నడు.. ఆ పెద్ద మనిషి ముంగట ఏం మాట్లడుతం! మాట్లాడలేదు అన్నడు. ఎందుకంటే బానిస. ఈ రోజుకు కూడా కాంగ్రెస్ నేతలు బానిసలే. రాహుల్‌గాంధీ వస్తే భుజాల మీద వేసుకొని ఊరేగుతరు. సొంత వెన్నెముక లేదు. ఎంతసేపు ఢిల్లీవోడు వస్తనే లేస్తరు. లేకపోతే లేదు. ఈ బానిసలు కావాల్నా మనకు? నిన్నమొన్నటిదాకా తెలంగాణ గతి శంకరగిరి మాన్యాలు పట్టించింది ఎవరు? పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతరు ఇప్పుడు! నిలదీసి అడిగేవాడు లేకనా? వాస్తవాలు కావా ఇవి? తెలంగాణకు ఈ గతి పట్టించింది ఎవరు? కరంట్ లేదు, మంచినీళ్లు లేవు. భయంకరమైన కరువు పరిస్థితి. ఇవన్నీ ఎవరు తెచ్చారు? ఇవన్నీచేసి మళ్ల ఇప్పుడు మేము ఇంత పొడుగు, అంత పొడుగు, మహా మేధావులం, ఘనాపాటిలం అంటరు. ఇన్నేండ్లు ఎక్కడవాయే మీ ఘనాపాటితనం?

ప్రధాని అడ్డగోలుగా మాట్లాడటమా?
దేశానికి ప్రధానిగా ఉన్న వ్యక్తి కూడ పచ్చి అబద్ధాలు మాట్లాడవచ్చునా? నరేంద్రమోదీ మొన్న నిజామాబాద్‌కు వచ్చిండు.. తెలంగాణల కరంటు మంచిగ లేదంటే నేనేం చేయాలి? రౌతు తీసుకొని నెత్తిన కొట్టుకోవాల్నా? మోదీ ధైర్యం ఉంటే ఆడనే ఉండు.. నా కరంటు మంత్రిని కూడ వెంటేసుకొని హెలికాప్టర్‌లో గంటలో నిజామాబాద్‌కు వస్త.. ప్రజల ముందే పెడత నీ కథ, నా కథ అని అడిగిన! ఆయన ఉండలే. నేను ప్రధానమంత్రిని.. ఏమి మాట్లాడినా చెల్తది.. అంటే ఇది దేశమా.. ఇది ప్రజలా.. ప్రజాస్వామ్యమా? దీనికేమన్న అర్థం పర్థం ఉన్నదా.. అడ్డగోలుగా మాట్లాడవచ్చునా? నరేంద్రమోదీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నడు.. ఈ దేశంలో 19 రాష్ర్టాలలో బీజేపీ అధికారంలో ఉన్నది.. ఒక్క రాష్ట్రంలోనన్న పేదవాళ్లకు రూ.1000 పెన్షన్ ఇస్తున్నరా? కల్యాణలక్ష్మి, రైతుబంధు వంటి పథకాలు అమలులో ఉన్నయా? వ్యవసాయానికి 24 గంటలు ఉచితంగా కరంటు ఇచ్చే ఒక్క రాష్ట్రమైన ఉందా? ఈడికి నీవు వచ్చి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే మీము హౌలా పోషిగాళ్లమా? బేవకూఫ్‌గాళ్ల లెక్క ఓటేయాల్నా? ఇది పులి లాంటి తెలంగాణ.. ఉద్యమాల గడ్డ.. దేశానికి దారి చూపించే తెలంగాణను పట్టుకుని అవాకులు చెవాకులు మాట్లాడితే ప్రజలే బుద్ధిచెప్తరు. ఒక్క సీటు కూడా రాదు బీజేపీకి. జాతీయ పార్టీలం.. ఏం మాట్లాడినా చెల్లుతదనుకుంటరు. దేశాన్ని చరబట్టినం.. మా గుప్పిట్ల ఉంటదనే గర్వం దిగాలి. దిగాలంటే దేశంలో ఫెడరల్ ఫ్రంట్ రావాలి.

చంద్రబాబు టోపీ పెడుతడు..
కూటమి.. గూటమి. అన్నం పెడుతయా గీ కూటాలు? చంద్రబాబు బంగారం కిరీటం పెడుతడా మనకు! చంద్రబాబు టోపీ పెట్టి పోయిండుతప్ప ఏమన్న చేసిండా? ఈ టోపీగాన్ని నమ్మితే మల్ల టోపీయే. ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ ఎన్నిక మన తలరాతనుమార్చుతది. మోసపోయి ఓటేస్తే ఆగమైపోతం.

సింగరేణి ఆధ్వర్యంలో బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ..
ఉక్కు ఫ్యాక్టరీ వాని తాత జేజమ్మ మెడ వంచి తెచ్చే బాధ్యత నాది. ఎవన్ని బిచ్చం ఎత్తుకోం. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ పెట్టుమని మోదీకి, ఉక్కు మంత్రికి 30 దరఖాస్తులు ఇచ్చిన. ఇగవాడు మేనల్లుడి కంటే ఎక్కువ. ఈ రాయితీ ఇయ్యాలే, ఆ రాయితీ ఇయ్యాలే అన్నరు. ఈ రాయితీలు మేమే ఇచ్చుకుంటే మంచిది కదా! అందుకే కేంద్రం గీంద్రం జాంతా నై.. సింగరేణి ఆధ్వర్యంలో మైనింగ్ చేపించి, అవసరమైతే ఫ్యాక్టరీ కూడా మన రాష్ట్రం ఆధ్వర్యంలోనే ప్రారంభిస్తం. వదిలే ప్రసక్తే లేదు. మనకున్న వనరులన్నింటినీ బ్రహ్మాండంగా వాడుకుంటం. అదానీ అనే పారిశ్రామికవేత్త మొత్తం ఇండియాకు నేనే బొగ్గు సైప్లె చేస్తున్న అన్నడు. నువ్వెట్ల చేస్తవ్‌రా బై? అంటే.. నాకు ఆస్ట్రేలియాల, ఇండోనేషియాలో మైన్స్ ఉన్నయి.

మీ సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయీసే 90% మా ఉద్యోగులు అన్నడు. నేను వెంటనే సింగరేణి సీఎండీ శ్రీధర్‌ను పిలిచి మన ఎంప్లాయీసే ఇండోనేషియాకు పోయి బొగ్గుగనులు సంపాదిస్తే.. మనం ఎందుకు సంపాదించట్లేదు? కమాన్ శ్రీధర్.. ఆస్ట్రేలియా, ఇండోనేషియాకు పో.. అని చెప్పిన. ఆయన పోయినారు. ఎక్స్‌ప్లోర్ చేశారు. నేను ఆ పనిలోనే ఉన్నా. సింగరేణికి ఉన్న మైనింగ్ నైపుణ్యం ఈ దేశంలో ఎవరికీ లేదు. కోలిండియాకంటే పాత సంస్థ.. సింగరేణి. మీరు అద్భుతంగా సింగరేణి సంస్థను నిలబెట్టారు. కష్టపడ్డారు. తప్పకుండా మీ వెంట కేసీఆర్ ఉంటడు. మీ డిపెండెంట్ ఉద్యోగాలు, ఇతర అన్ని విషయాలు చేస్తం. గతంలో ఉద్యమంలో ఎట్లయితే అండగా ఉన్నరో.. అట్లానే ఈ ప్రభుత్వానికి కూడా అండగా ఉండండి. మనం గొప్పగా ముందుకు పోదాం.

వెకిలి సర్వేలను పట్టించుకోవద్దు
కొంతమంది సన్నాసులు, తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు కూడా శాపాలు పెట్టినోళ్లు కొన్ని వెకిలి, మకిలి, పిచ్చి సర్వేలు విడుదల చేస్తరు. వాటిని పట్టించుకోవద్దు. ఆ సర్వేలను చూసి టీఆర్‌ఎస్ కార్యకర్తలు, అభిమానులు ఆందోళన చెందొద్దు.

రాహుల్ దమ్ముందా?..
రాహుల్‌గాంధీ ఓ దద్దమ్మ.. జోకర్. ఆయన బతుకంతా కమీషన్లే.. నేషనల్ హెరాల్డ్‌లో నిధులు మింగిందెవరు?.. మేం కమీషన్ కోసం ప్రాజె క్టులను రీడిజైన్ చేసినమట. వస్తవా రాహుల్‌గాంధీ? నీకు దమ్ముందా? పోదమా రుద్రంకోట కాడికి? రాజీవ్ సాగర్, ఇందిరాసాగర్ ఎట్లుంటదో చూద్దామా? నేనే తోలుకపోత.. రా దమ్ముంటే! అవి పిచ్చి ప్రాజెక్టులు కాబట్టి, వాటిని పీకి అవతలపడేసి, మాకు అవసరం ఉన్న ప్రాజెక్టులను కట్టుకుంటున్నం. మీకు తెలివిలేక.. దాన్ని కమీషన్ కోసం మార్చిర్రు అని ఆరోపిస్తున్నరు. మీ బతుకు కమీషన్ కాబట్టి అందరూ అట్లనే ఉన్నరని మీరనుకుంటరు. ఎటువడితే అటు ఇష్టం వచ్చినట్టు కుళ్లు, సొల్లు ఆరోపణలు చేయడం కాదు.
– ముఖ్యమంత్రి కే సీఆర్

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.