Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

కాంగ్రెస్, బీజేపీకి డిపాజిట్లు దక్కొద్దు

– మెదక్ ఉప పోరులో పంతం నెగ్గాలి – టీఆర్‌ఎస్ గెలుపు ఎంత ముఖ్యమో.. – జగ్గారెడ్డి, సునితారెడ్డి డిపాజిట్ల గల్లంతు అంత ముఖ్యం – టీఆర్‌ఎస్ శ్రేణులకు మంత్రి హరీశ్‌రావు పిలుపు – టీఆర్‌ఎస్‌లోకి కాంగ్రెస్,బీజేపీ కార్యకర్తలు

Harish-Rao-01

మెదక్ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డిని బంపర్ మెజారిటీతో గెలిపించుకొని పంతం నెగ్గించుకోవాలని రాష్ట్ర భారీ నీటిపారుదలశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఓటర్లకు పిలుపునిచ్చారు. బీజేపీకి అభ్యర్థి దిక్కులేకనే తెలంగాణ ద్రోహి జగ్గారెడ్డికి టికెట్ కేటాయించారని, దానికి టీడీపీ అధినేత చంద్రబాబు మద్దతు తెలుపడం విడ్డూరంగా ఉందని విమర్శించారు.

మెదక్ జిల్లా ములుగు, వర్గల్ మండలాల్లో సోమవారం నిర్వహించిన టీఆర్‌ఎస్ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇద్దరు నాయుడులు కలసి హైదరాబాద్‌పై గవర్నర్ పెత్తనం ముసుగులో అధికారం చెలాయించాలనుకుంటున్నారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ తెలంగాణకు వ్యతిరేకంగానే వ్యవహరిస్తున్నదని దుయ్యబట్టారు. మెదక్ ఉపపోరును ప్రతి ఒక్కరు ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని ప్రభాకర్‌రెడ్డి విజయం కోసం కృషిచేయాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మంత్రిగా పనిచేసిన సునీతలక్ష్మారెడ్డి,ప్రభుత్వ విప్‌గా ఉన్న జగ్గారెడ్డి జిల్లా అభివృద్ధిపై శ్రద్ధ చూపలేదని విమర్శించారు. ఉద్యమ సమయంలో టీఆర్‌ఎస్‌కు ఉప ఎన్నికలు కొత్తకాదని, ప్రస్తుత ఉపఎన్నికల్లో ప్రభాకర్‌రెడ్డిని గెలిపించడం ఎంత ముఖ్యమో జగ్గారెడ్డి, సునితాలకా్ష్మరెడ్డికి డిపాజిట్లు రాకుండా చేయటం అంతకంటే ముఖ్యమని కార్యకర్తలకు సూచించారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సుపరిపాలనతో బంగారు తెలంగాణ నిర్మాణమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారని తెలిపారు. రైతు రుణమాఫీపై అన్నదాతలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రతి కుటుంబానికి రూ.లక్ష వరకు రుణం మాఫీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు.

రూ. 19వేల కోట్ల రుణాన్ని త్వరలోనే మాఫీ చేయనున్నామని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఆడపడుచులకు వివాహ సమయంలో రూ.51వేలు అందించేందుకు రూపొందించిన కల్యాణలక్ష్మి పథకంతో ఆడపడుచులకు ధీమా లభించనుందన్నారు. గతంలో కురిసిన అకాల వర్షాలకు పంటలు నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి రూ.490కోట్లు చేశారని గుర్తు చేశారు. ఈ సమావేశంలో మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే కనకారెడ్డి, మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, బీసీసెల్ జిల్లా అధ్యక్షుడు సురేశ్‌గౌడ్, ములుగు, వర్గల్ మండల టీఆర్‌ఎస్ అధ్యక్షులు మహ్మద్ జహంగీర్, పిట్ల సత్యనారాయణ, పార్టీ యువత విభాగం అధ్యక్షుడు అంజిరెడ్డి, జహంగీర్‌యాదవ్, జడ్పీటీసీ సింగం సత్తయ్య, గజ్వేల్ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, సీనియర్ నాయకులు మడుపు భూంరెడ్డి, కాంతారావు, రఘుపతిరావు, ఎ లక్ష్మణ్‌రెడ్డి, యాదవరెడ్డి పాల్గొన్నారు.

టీఆర్‌ఎస్‌లో చేరిన 300 మంది కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు సంగారెడ్డి నియోజవర్గంలో కాంగ్రెస్, బీజేపీకి చెందిన దాదాపు 300 మంది కార్యకర్తలు హరీశ్‌రావు సమక్షంలో సోమవారం టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ గెలుపు లాంఛనమేనని, గత ఫలితాల కంటే అధిక మెజార్టీ కోసం ప్రయత్నిస్తున్నామన్నారు. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతు కావటం ఖాయమన్నారు. కార్యక్రమంలో జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, ఎమ్మెల్యే బాబుమోహన్, మాజీ ఎమ్మెల్యేలు హరీశ్వర్‌రెడ్డి, రత్నం, నర్సారెడ్డి, సంగారెడ్డి జడ్పీటీసీ మనోహర్‌గౌడ్, సంగారెడ్డి, కొండాపూర్, సదాశివపేట మండలాల ఎంపీపీలు బాలమణి, మ్యాకం విఠల్, రవీందర్, పేట మున్సిపల్ చైర్మన్ విజయలక్ష్మి సుభాష్, కౌన్సిలర్లు వెంకటేశం, ప్రదీప్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.