Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

కాంగ్రెస్‌, బీజేపీలకు ఓటడిగే నైతిక హక్కులేదు

-తెలంగాణకు ఏం చేశారని ఆ పార్టీలు వస్తున్నాయి?
-పదేండ్లలో పదివేల ఉద్యోగాలిచ్చిన చరిత్ర కాంగ్రెస్‌ది
-ఆరేండ్లలో మేం ఇచ్చిన ఉద్యోగాలు 1.26 లక్షల పైనే
-ఐటీఐఆర్‌ను ఎత్తగొట్టి.. పిల్లల నోట్లో మట్టికొట్టిన బీజేపీ
-పునర్విభజన చట్టంలోని హామీల అమలు మాటేమిటి?
-ఉద్యోగులతోనే మేము.. మాతోనే ఉద్యోగులు
-అత్యధిక ఫిట్‌మెంట్‌ ఇచ్చింది మేమే.. త్వరలోనే పీఆర్సీ
-మిగతాపార్టీలకు ఉద్యోగుల సాధకబాధకాలేం తెలుసు
-మీడియాతో టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌

తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతున్న టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌. చిత్రంలో పార్టీ సెక్రటరీ జనరల్‌ కే కేశవరావు, ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి వాణీదేవి

ఎంతసేపు మతం పేరుమీద రాజకీయంచేయడం కాదు. జనహితం ముఖ్యం. ఏపీ పునర్విభజన చట్టంలో ఏ హామీనీ నెరవేర్చని, తెలంగాణ సమస్యలకు ఎటువంటి పరిష్కారాలు చూపని బీజేపీకి ఎన్నికల్లో ఓటు అడిగే నైతిక హక్కులేదు. ఐటీఐఆర్‌ను ఏర్పాటుచేస్తే వేలమంది పిల్లలకు ఉపాధి అవకాశాలు దొరికేవి. ఆ పిల్లల నోట్లో మట్టికొట్టింది బీజేపీ ప్రభుత్వం. ఐటీఐఆర్‌ను రద్దుచేసినందుకు తెలంగాణ యువత బీజేపీకి ఓటేయాలా? బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ పెట్టనందుకా? తెలంగాణలో ట్రైబల్‌ యూనివర్సిటీ పెట్టనందుకా? వరంగల్‌లో ఇంటిగ్రల్‌ కోచ్‌ ఫ్యాక్టరీ పెట్టనందుకా? జీడీపీ పెంచుతామన్నరు. నిజంగానే పెంచారు.. జీడీపీ అంటే గ్యాస్‌, డీజిల్‌, పెట్రోల్‌ ధరలు బ్రహ్మాండంగా పెంచారు.

-టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌

రాష్ట్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు జరిగే ఎన్నికల్లో రెండు సీట్లూ తామే గెలుస్తామని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, రాష్ట్ర పురపాలక, ఐటీశాఖల మంత్రి కే తారకరామారావు ధీమా వ్యక్తంచేశారు. కాంగ్రెస్‌, బీజేపీలకు ఓట్లు అడిగే నైతిక హక్కులేదని పేర్కొన్నారు. తెలంగాణకు ఏం మేలు చేశాయని ఆ పార్టీలు.. తెలంగాణ విద్యావంతులు, మేధావులు, ఉద్యోగులను ఓట్లు అడుగుతున్నాయని నిలదీశారు. గడిచిన ఆరేండ్లలో ఉద్యోగులు, వివిధ వర్గాల సంక్షేమానికి చిత్తశుద్ధితో పనిచేసిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై అన్ని వర్గాలు విశ్వాసంతో ఉన్నాయని పేర్కొన్నారు. రెండు స్థానాల్లోనూ టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు సురభి వాణీదేవి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థల్లో లక్షాపాతికవేలకు పైగా ఉద్యోగాలు కల్పించామని, ప్రైవేట్‌రంగంలో 14 లక్షల మందికి ఉపాధి కల్పించిన ఘనత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానిదేనని పునరుద్ఘాటించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై ఆయన హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లా మంత్రులు, ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్యనేతలతో తెలంగాణ భవన్‌లో సమావేశమయ్యారు. అనంతరం మంత్రులు తలసాని శ్రీనివాసయాదవ్‌, సబితాఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, మహమూద్‌ అలీ, టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు, ప్రభుత్వ విప్‌ బాల్కసుమన్‌ సహా పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్సీలతో మీడియాతో మాట్లాడారు. మంత్రి కేటీఆర్‌ ప్రసంగం ఆయన మాటల్లోనే..

రెండు సీట్లనూ గెలుస్తాం
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా టీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్ని కోణాల్లో ఆలోచించి హైదరాబాద్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ స్థానానికి ఉన్నత విద్యావంతురాలు, విద్యావేత్త, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుమార్తె సురభి వాణీదేవిని, వరంగల్‌, ఖమ్మం, నల్లగొండ స్థానానికి సిట్టింగ్‌ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డిని టీఆర్‌ఎస్‌ అభ్యర్థులుగా ప్రకటించారు. ఈ రెండు స్థానాలను టీఆర్‌ఎస్‌ గెలుచుకుంటుంది. విద్యావంతులు, ఉద్యోగులు, మేధావులు టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తిచేస్తున్నాం.

1.26 లక్షల ఉద్యోగాల భర్తీ
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2004 నుంచి 2014 దాకా పదేండ్ల కాలంలో ఏపీపీఎస్సీ ద్వారా ప్రభుత్వరంగంలో నింపిన కొలువులు 24 వేలు మాత్రమే. దామాషా ప్రకారం అంచనావేస్తే తెలంగాణలో భర్తీచేసింది పదివేలు మాత్రమే. పదేండ్లలో ఏడాదికి కాంగ్రెస్‌ ప్రభుత్వం భర్తీచేసిన ఉద్యోగాలు వెయ్యి మాత్రమే. అదే తెలంగాణ ప్రభుత్వం ఆరున్నరేండ్ల కాలంలో అధికారికంగా, సాధికారికంగా లక్షా 26 వేలకు పైగా ఉద్యోగాలు కల్పించింది. టీఎస్‌-ఐపాస్‌ ద్వారా 14 వేల పరిశ్రమలకు అనుమతులు ఇవ్వటం ద్వారా ప్రైవేట్‌ రంగంలో 14 లక్షల మందికి ఉపాధి కల్పించాం. ఈ లెక్కలపై చర్చించటానికి నేను సిద్ధంగా ఉన్నా. ఇందులో టీఎస్‌పీఎస్సీ ద్వారా 36 వేల పైచిలుకు ఉద్యోగాల నియామకం జరిగింది. మరో నాలుగువేల ఉద్యోగాలు కోర్టు వివాదాల్లో ఉన్నాయి. టీఎస్‌పీఎస్సీ కాకుండా పోలీస్‌, జెన్‌కో, పంచాయతీరాజ్‌ వంటి వివిధ విభాగాల్లో ఉద్యోగాలను టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం భర్తీచేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ చరిత్రలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ఉద్యోగాలను భర్తీచేసింది టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే అని బాధ్యతగల మంత్రులుగా మా అందరికీ నమ్మకం ఉన్నది. ఇవే కాకుండా కాంట్రాక్ట్‌ లెక్చరర్లు, హోంగార్డులు, ఆశావర్కర్లు, అంగన్‌వాడీ టీచర్లు, జీహెచ్‌ఎంసీ సహ ఇతర మున్సిపాలిటీల్లోని శానిటేషన్‌ సిబ్బంది కాంగ్రెస్‌ హయాంలో శ్రమదోపిడీకి గురైతే.. వారందరినీ ఆదుకొన్నది టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే. ఈ దేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వనంతగా ఉద్యోగులకు 43 శాతం ఫిట్‌మెంట్‌ను ఇచ్చింది టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే. న్యాయవాదుల సంక్షేమానికి రూ.100 కోట్లు కేటాయించి సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి ఆదుకున్నది మా ప్రభుత్వం. జర్నలిస్టులకు సంక్షేమనిధిని ఏర్పాటు చేసింది. బీజేపీ పరిపాలిత రాష్ర్టాల్లో ఎక్కడైనా న్యాయవాదులకు సంక్షేమబోర్డు ఉన్నదా?

ఉద్యోగులతోనే మేము.. మాతోనే ఉద్యోగులు
విద్యావంతులు, ఉద్యోగులు ఒక్క విషయాన్ని గమనంలోకి తీసుకోవాలి. విభజన చిక్కులు ఇంకా వీడలేదు. జోనల్‌ సమస్య పరిష్కారం కావలసి ఉన్నది. అయినా సరే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో సాధ్యమైనంతవరకు ఉద్యోగాలు భర్తీ చేసుకుంటున్నం. ఇంకా భర్తీ కావలసి ఉన్నది. ఉద్యమంలో ఉద్యోగులు మాతో.. మేము వారితో కలిసి పనిచేసినం. ఇవ్వాళ ముసలి కన్నీరు కారుస్తున్న కాంగ్రెస్‌, బీజేపీల కంటే ఉద్యోగులు మాకు అత్యంత సన్నిహితులు. మాది ఎంప్లాయీస్‌ ఫ్రెండ్లీ గవర్నమెంట్‌. ఉద్యమంలో ఉద్యోగులతో కలిసి నడిచింది టీఆర్‌ఎస్‌ పార్టీ. ఉద్యోగులను కంటికి రెప్పలా కాపాడుకునేదీ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే. అది వాళ్లకు తెలుసు. మాకూ తెలుసు. ఉద్యోగులపై టెంపరరీ ప్రేమను కనపరచటం కాంగ్రెస్‌, బీజేపీకి చెల్లుతది. మాకు చెల్లదు. నూటికి నూరుశాతం ఉద్యోగులకు ముఖ్యమంత్రి న్యాయం చేస్తరనే నమ్మకం వారికున్నది. మాకూ ఉన్నది. పీఆర్‌సీ బరాబర్‌ ఇస్తం. దానికోసం కమిటీ పనిచేస్తున్నది. తాత్కాలికంగా కొంతమందికి ఈ సమస్య త్వరగా పరిష్కారం కావాలని అనిపించొచ్చు. అంతమాత్రంచేత ఏదో జరిగిపోయినట్టు కాదు. చిన్నచిన్న సమస్యలుంటే తప్పకుండా పరిష్కరించుకుంటాం. ఎన్నోరకాల ఉద్యోగ సమస్యలను పరిష్కరించుకున్నాం. ఇంకా చేసుకోవాల్సినవి ఎన్నో ఉన్నాయి. వాటిని త్రికరణశుద్ధిగా పరిష్కరించే శక్తి, యుక్తీ టీఆర్‌ఎస్‌కు ఉన్నది. ఈ విషయంలో వాళ్లకు క్లారిటీ ఉన్నది. మాకు క్లారిటీ ఉన్నది.

ప్రత్యర్థులు సైతం వాణీదేవి వ్యక్తిత్వాన్ని గౌరవిస్తున్నరు
మా పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సురభి వాణీదేవిని ప్రకటించగానే మా ప్రత్యర్థులు, బరిలో పోటీచేసేవాళ్లు ఆమె వ్యక్తిత్వాన్ని, అభ్యర్థిత్వాన్ని గౌరవిస్తున్నారు. ఆమె ఉన్నతమైన పదవికి అర్హురాలని స్టేట్‌మెంట్లు ఇస్తున్నారు. వారి అభిప్రాయాలను స్వాగతిస్తున్నాం. ప్రత్యర్థులు సైతం ఆమోదించే అభ్యర్థిని ఎంపికచేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పార్టీ పక్షాన కృతజ్ఞతలు. రాష్ట్రంలో 131 మున్సిపాలిటీలుంటే 123 గెలిచింది మేము. 32 జడ్పీలను గెలిచాం. 12,800 గ్రామ పంచాయతీలుంటే 10 వేల గ్రామాల్లో గెలిచింది టీఆర్‌ఎస్‌. ఒక్క దుబ్బాకల ఐదువందల ఓట్లతోని, జీహెచ్‌ఎంసీల కొన్ని వార్డులు గెలిచినంత మాత్రాన గంతగనం ఎగిరిపడుతున్నరు.

పీవీ సద్గుణాలన్నీ వాణిలో ఉన్నాయి: కేకే
మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావులోని సద్గుణాలన్నీ సురభి వాణీదేవిలోనూ ఉన్నాయని టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు అన్నారు. విద్యావేత్తగా, ఎటువంటి వివాదాలులేని వ్యక్తిగా, అందరికీ చిరపరిచితమైన వ్యక్తిగా సురభి వాణీదేవికి మద్దతుగా నిలవాలని విజ్ఞప్తిచేశారు. విద్యావంతులు, మేధావులు, పీవీ అభిమానులు అన్ని వర్గాల ప్రజలు వాణీదేవికి మద్దతివ్వాలని ఆయన విజ్ఞప్తిచేశారు. టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు కష్టపడి పనిచేయటానికి ఉత్సాహంగా ఉన్నారని పేర్కొన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.