Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

కాంగ్రెస్, బీజేపీ ఉత్తరభారత పార్టీలు

-దక్షిణాదిలో పట్టుమని పదిసీట్లు కూడా రావు
-16 మంది ఎంపీలతో ఢిల్లీలో నిర్ణయాత్మకశక్తిగా టీఆర్‌ఎస్
-మహేశ్వరం, ఎల్బీనగర్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో కేటీఆర్ ప్రచారం

కాంగ్రెస్, బీజేపీలు జాతీయపార్టీలు కావని.. ఉత్తరభారతదేశానికి చెందిన పార్టీలు మాత్రమేనని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు అన్నారు. దక్షిణ భారతదేశంలోని తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, పాండిచ్చేరిలో 130 లోక్‌సభ స్థానాలుంటే ఆ రెండుపార్టీలకు పట్టుమని పదిసీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదని తెలిపారు. ఆ రెండు జాతికి ద్రోహంచేసిన పార్టీలు అని మండిపడ్డారు. సోమవారం చేవెళ్ల, మల్కాజిగిరి లోక్‌సభ టీఆర్‌ఎస్ అభ్యర్థులు గడ్డం రంజిత్‌రెడ్డి, మర్రి రాజశేఖర్‌రెడ్డికి మద్దతుగా మహేశ్వరం, ఎల్బీనగర్ నియోజకవర్గాల పరిధిలో కేటీఆర్ రోడ్‌షో నిర్వహించారు. ఆయాచోట్ల మాట్లాడుతూ మతం, మందిరం అంటూ ఒకరు.. గరీబీ హఠావో అంటూ మరొకరి చెప్తున్న మాటల గారడీలో ప్రజలు మోసపోవద్దని సూచించారు. దేశంలో విద్య, వైద్యం ఎట్ల ఉండాలె, ప్రతి ఇంటికి నీరు, కొత్త కొలువులు , పరిశ్రమలపై కాకుండా.. గల్లీలో చిల్లర పంచాయతీల్లాగా వాళ్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బడితే ఉన్నవారిదే బర్రె అనే రీతిన కేంద్రంలో పాలన సాగుతున్నదని విమర్శించారు.

ఇద్దరు ఎంపీలతో తెలంగాణ సాధించి కేసీఆర్.. ఆదే 16 ఎంపీలను చేతిలో పెడితే ఏం చేస్తారో ప్రజలకు తెలుసునన్నారు. ఐదేండ్ల క్రితం రాష్ట్రం ఎట్ల ఉండే.. ఇప్పుడెలా అభివృద్ధి జరిగిందో గమనించాలని సూచించారు. నాడు కరంట్ ఎప్పుడు ఉంటదో.. పోతదో తెలియని పరిస్థితి అని.. నేడు 24 గంటలు కరంట్ ఉండే పరిస్థితి అని చెప్పారు. తెలంగాణ నుంచి కాంగ్రెస్ ఎంపీలు గెలిస్తే రాహుల్‌గాంధీకి లాభం, బీజేపీ ఎంపీలు గెలిస్తే మోదీకి లాభంమని.. కానీ టీఆర్‌ఎస్ ఎంపీలు గెలిస్తే తెలంగాణ రాష్ర్టానికి ప్రయోజనమని చెప్పారు. రాష్ర్టానికి రావాల్సిన హక్కులు, పథకాలు, ప్రాజెక్టులు, నిధులు తేచ్చుకోవాలంటే ఢిల్లీలో టీఆర్‌ఎస్ ఎంపీలు ఉండాల్సిన అవసరం ఉన్నదన్నారు. రాష్ట్రంలో రెండు కీలకప్రాజెక్టులు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, కాశేశ్వరం జాతీయ హోదా ఇవ్వమని కోరినా మోదీ స్పందించలేదని మండిపడ్డారు. ఈ ఎన్నికకు కేసీఆర్‌కు సంబంధం లేదని.. రాహుల్‌గాంధీ, నరేంద్రమోదీకే సంబంధం ఉందంటూ కాంగ్రెస్, బీజేపీ నేతలు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని.. కానీ ఈ ఎన్నికల్లో సీఎం కేసీఆర్‌కు కొత్తగా వచ్చే పదవి లేకపోవచ్చు కానీ కేంద్రం మెడలు వంచే శక్తి మాత్రం ఉన్నదని చెప్పారు.

సారు.. కారు.. పదహారు.. ఢిల్లీలో సర్కారు అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని శ్రేణులకు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. మహేశ్వరం నియోజకవర్గంలో కొత్త కొలువులను సృష్టించే కంపెనీలు తీసుకువస్తున్నట్టు కేటీఆర్ తెలిపారు. కందుకూరు, ముచ్చర్లలో ఫార్మా సిటీ వస్తున్నదని, తద్వారా స్థానికులు పెద్దఎత్తున ఉద్యోగ అవకాశాలు దక్కుతాయని వివరించారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయహోదా, సకాలంలో నిర్మాణం పూర్తికావాలంటే టీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్‌రెడ్డిని గెలిపించాలని పిలుపునిచ్చారు. ఎల్బీనగర్, నాగోల్, బీఎన్‌రెడ్డినగర్‌లో రిజిస్ట్రేషన్ల సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయని,. మూడు, నాలుగు నెలల్లో క్యాబినెట్ ఆమోదంతో ఆ సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని హామీఇచ్చారు. డబ్బుల కట్టలతో అడ్డంగా దొరికిన అభ్యర్థి కావాలా? విద్యావేత్త మర్రి రాజశేఖర్‌రెడ్డి కావాలా? నేరస్తుడివైపు ఉందామా? క్లీన్ ఇమేజ్ ఉన్న రాజశేఖర్‌రెడ్డి వైపు ఉందామా? తేల్చుకోవాలని మల్కాజిగిరి ఓటర్లకు సూచించారు. బాలాపూర్ చౌరస్తాలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్, కార్తీక్‌రెడ్డి, కొత్త మనోహర్‌రెడ్డి, పీ అండ్ టీ కాలనీలో జరిగిన రోడ్‌షోలో మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, ఎమ్మెల్సీ యెగ్గె మల్లేశం, రామ్మోహన్‌గౌడ్, కట్టెల శ్రీనివాస్‌యాదవ్ పాల్గొన్నారు.

నేడు ఉప్పల్, మల్కాజిగిరిలో కేటీఆర్ రోడ్‌షో
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు దూసుకుపోతున్నారు. సోమవారం మహేశ్వరం, ఎల్బీనగర్ నియోజకవర్గాల్లో చేపట్టిన రోడ్‌షోలకు ప్రజల నుంచి విశేష ఆదరణ లభించింది. మంగళవారం ఉప్పల్, మల్కాజిగిరి నియోజకవర్గాల్లో రోడ్‌షోలు నిర్వహించనున్నారు. ఇం దుకు సంబంధించిన ఏర్పాట్లను స్థానిక ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి, మైనంపల్లి హన్మంతరావు పర్యవేక్షించారు. ఉప్పల్ చౌరస్తాలో సాయంత్రం 5.30 గంటలకు రోడ్‌షో ప్రారంభమై హబ్సిగూడ, మల్లాపూర్, ఈసీఐఎల్‌ల మీదుగా సాగుతుంది. మల్కాజిగిరికి సాయంత్రం 7.30 గంటలకు కేటీఆర్ చేరుకుంటారు. నేరేడ్‌మెంట్ చౌరస్తా, సఫిల్‌గూడ, మిర్జాలగూడ, అనుటెక్స్ వద్ద రోడ్‌షోల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థి తరఫున ప్రచారం చేస్తారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.