– రైతు ఆత్మహత్యల పాపం కాంగ్రెస్‌దే – పదేండ్ల పాలనలో వేలల్లో బలవన్మరణాలు: ఎంపీ వినోద్ – లెక్కలతో ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి బహిరంగ లేఖ – ఓట్ల కోసమే కిషన్‌రెడ్డి పాదయాత్రని విమర్శ

వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నిక కోసం కాంగ్రెస్, బీజేపీలు నిందారోపణలు చేస్తూ రైతులను రెచ్చగొడుతున్నాయి. రైతుల ఆత్మహత్యల పాపం కాంగ్రెస్ పార్టీదే. గోదావరిపై కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించబోతున్నామంటే దానర్థం ఆ ప్రాజెక్టు కాళేశ్వరంలో కడుతున్నట్లు కాదు. గోదావరి, ఇంద్రావతి నదులు కలిసే చోట దిగువన కంతనపల్లికి కొంచెం అటు ఇటుగా ఈ ప్రాజెక్టు ఉండబోతున్నది. పేరు మారినంత మాత్రాన ప్రభుత్వ ప్రాధాన్యం మారదు అని కరీంనగర్ ఎంపీ వినోద్‌కుమార్ స్పష్టంచేశారు. గురువారం వరంగల్‌లో ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, చల్లా ధర్మారెడ్డి, టీఆర్‌ఎస్ జిల్లా, అర్బన్ అధ్యక్షులు టీ రవీందరరావు, నన్నపునేని నరేందర్, జిల్లా ఇన్‌చార్జి పెద్ది సుదర్శన్‌రెడ్డి, పార్టీ సీనియర్ నేత కన్నెబోయిన రాజయ్యయాదవ్‌లతో కలిసి మీడియతో మాట్లాడారు.
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ రైతాంగా న్ని అన్యాయానికి గురిచేసి, అప్పులు మూటగట్టి మనోధైర్యాన్ని దెబ్బతీసేలా నిర్ణయాలు తీసుకున్నదీ కాంగ్రెస్సేనని ధ్వజమెత్తారు. రైతుల్ని మరింత రెచ్చగొట్టి మనోధైర్యాన్ని దెబ్బతీసేలా ఎవరూ ప్రవర్తించవద్దని కోరారు. కొంతకాలంగా కాంగ్రెస్, బీజేపీ నేతలు వరంగల్‌పై ప్రేమను ఒలకపోస్తున్నారని, త్వరలో వచ్చే ఎంపీ ఉప ఎన్నికల్లో ఓట్ల కోసమే ఈ ఎత్తుగడలని ఆరోపించారు. ఎన్నికలకోసం ప్రజల్ని తప్పుదారి పట్టించడం సరి కాదన్నారు. 2004 నుంచి 2014 వరకు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నదని, నేషనల్ క్రైంబ్యూరో లెక్కల ప్రకారం 23,556 మంది రైతులు ఉమ్మడి రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్నారన్నారు.
దేశంలో ఏడు రాష్ర్టాల్లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నదని, ఆ రాష్ర్టాల్లో 55.6 శాతం మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, వీటికి ఏం సమాధానం చెబుతారని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొన్నాల లక్ష్మయ్యలను నిలదీశారు. లెక్కలతో సహా పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కు బహిరంగ లేఖ విడుదల చేశారు. మహారాష్ట్రలో గోదావరిపై బాబ్లీతోపాటు రెండు వందల ప్రాజెక్టులు నిర్మించారని, రాష్ట్రంలో, కేంద్రంలో అప్పుడు కాంగ్రెస్సే అధికారంలో ఉన్నదని, మీరు ఏనాడైనా ఆలోచించారా? అని నిలదీశారు. సీఎం కేసీఆర్ ఇంకా ఉద్యమ నేతే: సీఎం కేసీఆర్ ఇప్పటికీ ఉద్యమ నేతగానే ఆలోచిస్తున్నారని ఎంపీ వినోద్ పేర్కొన్నారు.
ప్రజల అవసరాల కోసం సీఎంగా ఉన్నప్పటికీ ఉద్యమనేతగానే ఆలోచిస్తూ రాష్ర్టాన్ని సశ్యశ్యామలం చేసేందుకు ప్రాజెక్టుల రీ డిజైనింగ్ చేస్తుంటే కావాలనే ప్రభుత్వంపై ప్రతిపక్షాలు బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాయన్నారు. జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మలుచుకొని స్వయంగా మీ సీఎం, మంత్రులపై సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసిన విషయాన్ని మరచిపోయారా? అని కాంగ్రెస్‌ను ప్రశ్నించారు. మీ వల్ల ఐఏఎస్ అధికారులు కూడా జైలు పాలయ్యారన్నారు. బీజేపీ కూడా రైతుల్ని రెచ్చగొట్టేందుకు, ప్రభుత్వంపై అసత్యాలు ప్రచారం చేస్తన్నదని, కిషన్‌రెడ్డి దేవాదుల టు కంతనపల్లికి పాదయాత్ర వెనుక అసలు విషయం వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికేనని ఆరోపించారు.