Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

కాంగ్రెస్, బీజేపీల్లో రైతుబంధు భయం

-వ్యవసాయం లాభసాటి అయ్యేవరకు రైతుబంధు -ఇది సీఎం కేసీఆర్ లక్ష్యమన్న మంత్రి కేటీఆర్ -50 ఏండ్లలో రైతులను కాంగ్రెస్ ఎందుకు ఆదుకోలేదు? -పాలమూరు గోసకు కాంగ్రెస్, టీడీపీలే కారణం -భూత్పూర్ రైతుబంధులో కేటీఆర్ వ్యాఖ్యలు -వ్యవసాయం లాభసాటి అయ్యేవరకు రైతుబంధు -ఇది సీఎం కేసీఆర్ లక్ష్యమన్న మంత్రి కేటీఆర్ -ఏడాది కిందే రైతుబంధు పురుడు పోసుకుంది -50 ఏండ్లలో రైతులను కాంగ్రెస్ ఎందుకు ఆదుకోలేదు? -పాలమూరు గోసకు కాంగ్రెస్, టీడీపీలే కారణం -భూత్పూర్ రైతుబంధులో కేటీఆర్ మంత్రి శ్రీ వ్యాఖ్యలు

తెలంగాణలో సేద్యం లాభసాటి అయ్యేవరకు రైతుబంధు పథకాన్ని అమలుచేయాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఉన్నారని రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌శాఖల మంత్రి కే తారకరామారావు చెప్పారు. దేశంలో హరిత విప్లవానికి తెలంగాణ కేంద్ర బిందువుగా నిలువబోతున్నదని అన్నారు. సోమవారం మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ మండలకేంద్రంలో జరిగిన రైతుబంధు కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత నాలుగేండ్లుగా రాష్ట్రంలో జరుగుతున్న వివిధ పథకాలపై ఆయా రాష్ర్టాల ప్రజలు ప్రత్యేక దృష్టితో చూస్తున్నారని చెప్పారు. దేశంలో 70% ప్రజలు వ్యవసాయరంగంపై ఆధారపడ్డారని, వారంతా తెలంగాణలో అమలుచేస్తున్న రైతుబంధుపై ఆసక్తిచూపుతున్నారని అన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ రైతుబంధు పథకం అమలుచేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. జాతీయ పార్టీలుగా చెప్పుకుంటున్న కాంగ్రెస్, బీజేపీలకు ఇప్పటికే రైతుబంధు పథకం భయం పట్టుకుందన్నారు. విజయవంతంగా అమలవుతున్న ఈ పథకంపై ఆ రెండు పార్టీలు ఈర్ష, ద్వేషాన్ని వెదజల్లుతున్నాయని విమర్శించారు.

తెలంగాణ రైతులంతా రుణ విముక్తులుకావాలంటే ప్రభుత్వం ప్రోత్సాహం అందివ్వాల్సి ఉందన్నారు. ఇందులో భాగంగానే టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే రూ.17వేల కోట్ల రైతుల బ్యాంకు రుణాలను మాఫీచేశామని చెప్పారు. సేద్యానికి 24 గంటల కరంటు అందివ్వడంతోపాటు ఎరువులు, విత్తనాల సమస్యను లేకుండా చేశామన్నారు. రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న నకిలీ విత్తనాల సమస్యపైన ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తూ, పీడీ చట్టాన్ని కూడా అమలుచేస్తుందని మంత్రి గుర్తుచేశారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం రైతుబంధు పేరిట రాష్ట్రంలో 58 లక్షల మంది రైతుల పంట సాయం అందిస్తున్నదని చెప్పారు. రాష్ట్రంలో 98.2% మేర చిన్న, సన్నకారు రైతులుండగా, 1.8% మాత్రమే పెద్ద రైతులున్నారని, వీరిలోనూ కొందరు పంట సాయాన్ని స్వచ్ఛందంగా వదులుకుంటున్నారని తెలిపారు.

కయ్యాలు పెడుతున్న కాంగ్రెస్ కౌలురైతులకు, పట్టాదారులకు కయ్యం పెట్టేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నదని మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. రైతులపై నిజమైన ప్రేమ ఉంటే అధికారంలో ఉన్న 50 ఏండ్లలో ఏనాడైనా రైతులకు నాలుగు రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారా? అని ప్రశ్నించారు. చెడగొట్టే ఆలోచనలో కాంగ్రెస్ ముందుంటుందని ఎద్దేవాచేశారు. అధికారం లేనప్పుడు మాత్రమే ఆ పార్టీకి రైతులు, ప్రజలు గుర్తుకొస్తారని చురకలంటించారు. సీఎం స్వయంగా రైతు అయినందున నేడు రాష్ట్రంలో రైతులందరికీ వివిధ పథకాలద్వారా అండగా నిలుస్తున్నారని అన్నారు. తమ కుటుంబం వివిధ ప్రాజెక్టుల కింద కోల్పోయిన భూముల వివరాలు తెలిపిన కేటీఆర్.. కాంగ్రెస్ నేతలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జానారెడ్డి, డీకే అరుణ, చిన్నారెడ్డిల భూములు ప్రాజెక్టుల్లో పోలేదని, వారికి భూసేకరణపై ఎలాంటి అవగాహన లేదని చెప్పారు.

ఏడాది క్రితమే రైతుబంధు ఆలోచన ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని రైతుబంధు పథకాన్ని టీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలుచేస్తున్నదని కొందరు తప్పుడు ప్రచారాలు లేవనెత్తుతున్నారని దుయ్యబట్టిన మంత్రి.. రుణమాఫీ పథకం అనంతరం మరొక గొప్ప పథకాన్ని రైతుల కోసం అమలు చేయబోతున్నట్టు ఏడాది క్రితమే సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. నాలుగైదు నెలలపాటు భూ రికార్డుల ప్రక్షాళన జరిపి, నేడు రైతుబంధును పకడ్బందీగా అమలుచేస్తున్నామని చెప్పారు. ఎన్నికల జిమ్మిక్కులు టీఆర్‌ఎస్‌కు అవసరం లేదని, ఇన్నాళ్లు రైతులతో కాంగ్రెస్ అదే వైఖరిని అవలంభించిందని కేటీఆర్ పేర్కొన్నారు. రాష్ర్టాన్ని 50 ఏండ్లు పాలించిన కాంగ్రెస్.. రైతులకు ఏం ఒరగబెట్టిందని ప్రశ్నించారు.

పాలమూరు కష్టాలకు కాంగ్రెస్సే కారణం సమైక్య రాష్ట్రంలో అత్యధికంగా నష్టపోయింది ఉమ్మడి పాలమూరు జిల్లా అని, ఇందుకు కాంగ్రెస్, టీడీపీలే కారణమని మంత్రి కేటీఆర్ అన్నారు. వలసలకు నిలయంగా మారిన పాలమూరును టీఆర్‌ఎస్ ప్రభుత్వం సస్యశ్యామలం చేస్తున్నదని చెప్పారు. నాలుగు పెండింగ్ ప్రాజెక్టులతోపాటు పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తిచేసే పనులకు ప్రాధాన్యం ఇస్తున్నట్టు తెలిపారు. 50 ఏండ్లలో కాంగ్రెస్ లక్ష ఎకరాలకు నీళ్లు ఇస్తే.. ఈ నాలుగేండ్లలోనే ఏడు లక్షల ఎకరాలకు సాగునీరు అందించిన ఘనచరిత్ర టీఆర్‌ఎస్ ప్రభుత్వానిదని చెప్పారు. మోసపూరిత కుట్రలతో పాలమూరు రైతాంగానికి తీరని నష్టాన్ని కలిగించిన కాంగ్రెస్.. ఇప్పటికీ ఈ ప్రాంతం అభివృద్ధిపథంలోకి వెళ్లకుండా అడ్డుపడుతూనే ఉందని విమర్శించారు. పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టును కోర్టు కేసులతో అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నదన్నారు. కాంగ్రెస్ కుట్రలకు తాము భయపడబోమని, ప్రాజెక్టులను పూర్తిచేసి తీరుతామని మంత్రి కేటీఆర్ తేల్చిచెప్పారు. ఎంపీ జితేందర్‌రెడ్డి మాట్లాడుతూ సీఏం కేసీఆర్ రైతుకు బాసటగా నిలిచారన్నారు.

బంగారు తెలంగాణ సాధన దిశలో సీఎం చేపట్టిన ప్రతి కార్యక్రమం విజయవంతంగా అమలవుతున్నదని చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ వివిధ గ్రామాల రైతులకు చెక్కులను అందజేశారు. రైతుబంధు పథకంపై రైతులతో నిర్వహించిన మాటా-మంతీ సభలో ఆసక్తిగా నిలిచింది. దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రి కేటీఆర్‌తోపాటు జెడ్పీ చైర్మన్ బండారి భాస్కర్, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్, కలెక్టర్ రోనాల్డ్ రోస్, జేడీఏ సుచరిత, ఆర్డీవో లక్ష్మీనారాయణచారి, జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు బస్వరాజ్‌గౌడ్, ఎంపీపీ సుకన్య, జెడ్పీటీసీ చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు. సభ అనంతరం మండలంలోని ఎల్కిచర్లలో సబ్‌స్టేషన్, హస్నాపూర్‌లో బీటీ రోడ్డు నిర్మాణానికి మంత్రి కేటీఆర్ శంకుస్థాపనచేశారు.

చేనేతకు అండగా నిలువాలి చేనేత వస్ర్తాలు ధరించిన ఇంతియాజ్ ఇసాక్‌కు మంత్రి కేటీఆర్ అభినందన చేనేతరంగానికి ప్రజాప్రతినిధులు, ప్రజలు మరింత అండగా నిలువాలని మంత్రి కేటీఆర్ అన్నారు. చేనేత కుటుంబాలను ఆదుకునేందుకుగాను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే వివిధ కార్యక్రమాలను చేపట్టిందన్నారు. భూత్పూర్ మండలకేంద్రంలో జరిగిన రైతుబంధు సమావేశంలో చేనేత వస్ర్తాలను ధరించిన టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి ఇంతియాజ్ ఇసాక్‌ను మంత్రి కేటీఆర్ అభినందిస్తూ.. ప్రతిఒక్కరు చేనేత వస్ర్తాలను ధరించడం వల్ల ఆ రంగంలోని కార్మికులను మరింత తోడ్పాటును అందించినట్టు అవుతుందన్నారు. వారంలో ప్రతి ఒక్కరు ఒక్కరోజైనా చేనేత వస్ర్తాలు ధరించాలని కోరారు. సమావేశానికి చేనేత వస్ర్తాలను ధరించి వచ్చిన వారందర్నీ కేటీఆర్ ప్రత్యేకంగా అభిందించారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.