Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

కాంగ్రెస్ కల కల్ల

తెలంగాణలో అధికారంలోకి రావాలని కలలు కంటున్న కాంగ్రెస్‌కు భంగపాటు తప్పదని టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కే చంద్రశేఖర్‌రావు అన్నారు. కాంగ్రెస్ నేతల కలలు కల్లలుగానే మిగిలిపోతాయని తెలిపారు.

KCR Meeting in Karimnagar

– యుద్ధభేరి అలనాడే మోగించాం.. -ఆ పార్టీకి 20-30 ఎమ్మెల్యే సీట్లకు మించి రావు.. అత్యధిక స్థానాల్లో మాదే విజయం -పొన్నాలా.. అవాకులు చెవాకులు పేలితే నాలుక చీరేస్తా -నా ఆస్తులపై విచారణకు సిద్ధం -దమ్ముంటే విచారణ చేయించు -టీపీసీసీ అధ్యక్షుడిపై టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఫైర్ -మూడేళ్లలో కరెంటు కష్టాలు తీరుస్తా -టీఆర్‌ఎస్ సర్కారులో ఉప ముఖ్యమంత్రి మైనారిటీయే -మైనారిటీలకు 12% రిజర్వేషన్లు ఇచ్చి తీరుతాం -ఆర్టీసీ ఉద్యోగులకు మెరుగైన వేతనాలు -కరీంనగర్, మెదక్ జిల్లాల ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ -పది సభల్లోనూ వేల సంఖ్యలో పాల్గొన్న జనం

-టీఆర్‌ఎస్ శ్రేణుల్లో కదనోత్సాహం బంపర్ మెజారిటీతో టీఆర్‌ఎస్‌ను గెలిపించాలని తెలంగాణ ప్రజలు ఎప్పుడో నిర్ణయించుకొన్నారని, తెలంగాణలో ఏర్పడబోయే మొదటి ప్రభుత్వం టీఆర్‌ఎస్‌దేనని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీకి 20-30 సీట్లకు మించి రావని తెలిపారు. తన ఆస్తులపై విచారణ జరిపిస్తామన్న టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య వ్యాఖ్యలపై కేసీఆర్ ఘాటుగా స్పందించారు. కరీంనగర్, మెదక్ జిల్లాలో సోమవారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ తన ఆస్తులపై ఎలాంటి విచారణకైనా సిద్ధంగా ఉన్నానని, దమ్ముంటే విచారణ జరుపుకోవచ్చని సవాలు విసిరారు. అవాకులు చెవాకులు పేలితే బట్టలూడదీసి బజార్లో నిలబెడతానని హెచ్చరించారు. మూడేళ్లలో తెలంగాణలో విద్యుత్ సమస్యను పూర్తిగా రూపుమాపుతామని హామీ ఇచ్చారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి పదవిని మైనారిటీలకే కేటాయిస్తామని పునరుద్ఘాటించారు. ఎవరెన్ని అనుమానాలు వ్యక్తం చేసినా తెలంగాణలో మైనారిటీలకు 12శాతం రిజర్వేషన్లు ఇచ్చి తీరుతామని స్పష్టం చేశారు. ఆర్టీసీని అప్పుల్లోనుంచి బయటపడేసి సంస్థ ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇస్తామని హామీ ఇచ్చారు.

బంగారు  తెలంగాణను నిర్మించుకోవాలంటే ఎంపీల బలం కూడా ఎంతో ముఖ్యమని, 16 ఎంపీ స్థానాల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపిస్తే కేంద్రం మెడలువంచి నిధులు తెచ్చుకోవచ్చని తెలిపారు. ఎంపీ, ఎమ్మెల్యే ఓట్లు రెండూ టీఆర్‌ఎస్ అభ్యర్థులకే వేయాలని కేసీఆర్ విజ్ఞప్తి చేశారు.

కరీంనగర్/పెద్దపల్లి/సంగారెడ్డి :తెలంగాణలో అత్యధిక అసెంబ్లీ స్థానాల్లో గెలిచి అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ నేతలు కంటున్న కలలు కల్లలే అవుతాయని టీఆర్‌ఎస్ అధ్యక్షుడు చంద్రశేఖర్‌రావు అన్నారు. కాంగ్రెస్ పార్టీకి 20 నుంచి 30 సీట్లకు మించి ఒక్క ఎమ్మెల్యే స్థానం కూడా దక్కదని పేర్కొన్నారు. తన ఆస్తులపై దేశంలో ఏ సంస్థతోనైనా విచారణకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కేసీఆర్ ఆస్తులపై విచారణ జరిపిస్తామని టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య చేసిన ప్రకటనపై కేసీఆర్ తీవ్రంగా స్పందించారు. దమ్ముంటే విచారణ జరిపించాలని సవాలు విసిరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం కరీంనగర్ జిల్లా కోరుట్ల, జగిత్యాల, ధర్మపురి, వేములవాడ, మానకొండూరు, హుజూరాబాద్, మంథని, చొప్పదండి, పెద్దపల్లి, మెదక్ జిల్లా దుబ్బాకలో నిర్వహించిన బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగించారు. ఎన్నికల సర్వేలన్నీ తెలంగాణలో టీఆర్‌ఎస్ క్లీన్‌స్వీప్ చేస్తుందని చెపుతున్నాయని, తెలంగాణ ప్రజలు కూడా టీఆర్‌ఎస్‌కే పట్టం కట్టాలని ఎప్పుడో నిర్ణయించుకొన్నారని కేసీఆర్ తెలిపారు.

పొన్నాలా.. పిచ్చి కూతలు కూస్తే నాలుక చీరేస్తా తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ పాత్రేమీలేదని, ఉద్యమం పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడ్డారని టీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల చేసిన విమర్శలపై టీఆర్‌ఎస్ అధినేత తీవ్రంగా స్పందించారు. అడ్డగోలుగా మాట్లాడితే నాలుక చీరేస్తానని హెచ్చరించారు. పొన్నాలా.. బతుకేందో నాకు తెలుసు. తీరు మార్చుకోకపోతే అంగిలాగు విప్పి బజార్లోకూర్చోబెడుతా. మాట తప్పానంటూ మళ్లీ పిచ్చికూతలు కూస్తే నీ నాలుక చీరేస్తా.. తస్మాత్ జాగ్రత్త. కక్కులు మొరిగినట్లు మొరిగితే ఇంకా దెబ్బతింటారు అని హెచ్చరించారు. నా ఆస్తులపై విచారణకు సిద్ధం :పొన్నాల లక్ష్మయ్య నిన్న మాట్లాడిండు. కేసీఆర్ ఆస్తులపై విచారణ చేస్తామన్నారు. నేను స్వాగతం చెపుతాన్నా.

నీకు దమ్ముంటే విచారణ చెయ్యి. ఏ విచారణకైనా నేను సిద్ధమని ప్రకటిస్తున్నా. తప్పులే ఉంటే నన్ను ఇన్నాళ్లు బతకనిచ్చేవారా? చంద్రబాబే వెంట పడేవాడు, నీ దాకా రానిచ్చునా. ఎప్పుడో నన్ను జల్లెడ పట్టేవారు. నాకు తెలువాదా మీ చరిత్ర. మీ సంగంతి. ఇంకా ఓ మాట. ఎవరైనా మాట మాట్లాడితే సిగ్గుపడాలి. లజ్జ ఉండాలి. అడ్డం పొడువు మాట్లాడుడు కాదు. మాట్లాడే ముందు సోయితో మాట్లాడాలి. నిన్న పొన్నాల లక్ష్మయ్య నామీద కూసిన కూతలన్నీ మీరు చూశారు. ఏ పేపర్‌లో అయితే ఆ కూతలు వచ్చాయో అదే పత్రికలో సోమవారం ఓ వార్త వచ్చింది. గోవర్థన్‌రెడ్డి అనే కాంగ్రెస్ సీనియర్ రాజ్యసభ సభ్యుడు చెప్పిండు. పొన్నాల లక్ష్మయ్య అనేవాడు ఒక వెదవ. పీపీసీ అధ్యక్ష పదవిని కొనుక్కొని తెచ్చుకున్నడు. అదేవిధంగా టికెట్లు అమ్ముకున్నరని చెప్పిండు. ఇవి నేను చెప్పలే. కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడే చెప్పిండు. ఇదీ పొన్నాల నీ బతుకు. పొద్దుగాల లేస్తే నేను మాట తప్పానంటూ ఇటు దామోదర రాజనర్సింహ, అటు పొన్నాల లక్ష్మయ్య వద్దంటే ఓర్లుతున్నరు అని కేసీఆర్ మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తే టీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేస్తామని చెప్పి మాట తప్పారంటూ కాంగ్రెస్ నేతలు చేస్తున్న విమర్శలను కేసీఆర్ తిప్పికొట్టారు. మేం మాట తప్పిన మంటున్నారు. ఏ మాట తప్పినం మేం? మాట తప్పడం మా జన్మలోలేదు. తెలంగాణ బిల్లు రూపకల్పనలో టీఆర్‌ఎస్ పాత్ర ఏమీలేదని కరీంనగర్ సభలో సోనియాగాంధీ కూడా చెప్పారు. అలాంటప్పుడు మీకు మాకు సంబంధమేందని ప్రశ్నించారు.

తెలంగాణ వనరుల దోపిడీకి కారణం మీరు కాదా? తెలంగాణ వనరులను సీమాంధ్రులు దోచుకోవటానికి సహకరించింది తెలంగాణ కాంగ్రెస్ నేతలేనని కేసీఆర్ విమర్శించారు. వాస్తవం చెప్పాలంటే తెలంగాణ నీళ్లు ఎత్తుక పోతే జెండాలు ఊపింది మీరు కాదా? ఆంధ్రావాళ్లకు అక్రమ ప్రాజెక్టులు సాంక్షన్‌చేసిన మంత్రి పొన్నాల కాదా? రాయలసీమ మంత్రి రఘువీరారెడ్డి గాలేరి నీళ్లను అక్రమంగా తరలించుకుంటూ విజయగర్వంతో ఊగిపోతే దానికి జెండా ఊపినోడు ఈ సన్నాసి పొన్నాల లక్ష్మయ్య. అతనికి మంగళహారతి ఇచ్చింది ఎవరు.. మహబూబునగర్ జిల్లా మంత్రి డీకే అరుణ. దీనికి టీఆర్‌ఎస్‌ది ఏమైనా బాధ్యత ఉందా? ఇవన్ని జరుగుతున్నా నోరు మూసుకొని దద్దమ్మల్లా కూర్చోని కుక్కకు బొక్కవేసినట్లు పదవుల కోసం ఆశపడిన మీకు టీఆర్‌ఎస్ గురించి మాట్లాడే నైతిక హక్కులేదన్నారు.

ఉప ముఖ్యమంత్రి మైనార్టీయే.. తెలంగాణ రాష్ట్రంలో మైనార్టీలకు డిప్యూటీ సిఎం పదవి ఇస్తానని తాను గతంలో చెప్పానని, టీఆర్‌ఎస్ అధికారంలోకి రాగానే డిప్యూటీ సీఎం పదవితో పాటు రెండుమూడు మంత్రి పదవులు మైనార్టీలకు కేటాయిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్లు కేటాయిస్తామన్నారు. కొందరు 12శాతం రిజర్వేషన్లు ఎలా సాధ్యమని ప్రశ్నిస్తున్నారని, మనసుంటే మార్గం ఉంటుందన్నారు. తమిళనాడులో 64శాతం, కర్ణాటకలో 69శాతం రిజర్వేషన్లు ఉన్నాయని, అదేవిధంగా తెలంగాణలో రిజర్వేషన్ల కోసం ప్రయత్నిస్తామన్నారు. రానున్న ఎన్నికల్లో 16 లోక్‌సభ సీట్లను టీఆర్‌ఎస్ గెలవాల్సిన అవసరం ఉందన్నారు. పార్లమెంట్‌లో ఎంఐఎంతో కలిసి ముందుకు సాగుతామని కేసీఆర్ తెలిపారు.

ప్రభుత్వ ఉద్యోగులలాగే ఆర్టీసీ కార్మికులకు వేతనాలు ఆర్టీసీ ఉద్యోగులకు వేతనాలు తక్కువగా ఉన్నాయని చాలా మంది తన దృష్టికి తీసుకొచ్చారని, టీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వారికి మెరుగైన వేతనాలిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా ఆర్టీసీ ఉద్యోగులకు కూడా వేతనాలు అమలయ్యేలా చర్యలు తీసుకుంటాం. సంస్థపై ఉన్న పన్నుల భారాన్ని సైతం తగ్గించి సంస్థను కాపాడుకుందామన్నారు.

చిన్న పొరపాటు జరిగినా మళ్లీ గోస పడుతాం తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతున్న దశలో తొలిసారి జరుగుతున్న ప్రస్తుత ఎన్నికలకు అత్యంత ప్రధాన్యం ఉందని కేసీఆర్ అన్నారు. మన తలరాతను మనమే రాసుకునే అవకాశం మన చేతుల్లోనే ఉందని తెలిపారు. తెగేసి అడిగేవాళ్లు ఉంటేనే తెలంగాణకు న్యాయం జరుగుతది. సన్నాసుల చేతుల్లో అధికారం పెడితే మళ్లీ ఇబ్బందులు తప్పవు. ఏమాత్రం పొరపాటు జరిగినా మళ్లీ తరాలు తరాలే నష్టపోయే ప్రమాదం ఉంది. రెండు ఓట్లు టీఆర్‌ఎస్ అభ్యర్థులకే వేయండి. ఎమ్మెల్యేలు ఎంత అవసరమో.. ఎంపీలు గెలువడం కూడా అంతే అవసరం. ఎంపీలు మన వాళ్లు ఉంటే… కేంద్రం మెడలు వంచి కావాల్సిన నిధులు తెచ్చుకోవచ్చు అని ఉద్బోధించారు.

శ్రీరాంసాగర్ చివరి భూములకూ నీళ్లిస్తం శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ కింద ఉన్న చివరి భూములకు కూడా నీళ్లిచ్చి పంటలు సాగయ్యేలా చూస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. పెద్దపల్లిలో సభలో ఆయన మాట్లాడుతూ ప్రాజెక్టు ప్రారంభ సమయంలో కాల్వల సామర్ధ్యం 21వేల క్యూసెక్కులు కాగా ప్రస్తుతం 17వేల క్యూసెక్కుల నీరు మాత్రమే విడుదల అవుతుందని, టీఆర్‌ఎస్ ప్రభుత్వం రాగానే కరీంనగర్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ఆయకట్టు చివరి భూములకు సాగు నీరు అందిస్తామని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో పార్లమెంట్, అసెంబ్లీ స్థానాల్లో టీఆర్‌ఎస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న బాల్క సుమన్, దాసరి మనోహర్‌రెడ్డిని గెలిపించాలని కోరారు.

కేసీఆర్ వెంట నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి ఎంపీ అభ్యర్థులు కల్వకుంట్ల కవిత, బోయినిపల్లి వినోద్‌కుమార్, బాల్కసుమన్‌తోపాటు ఎమ్మెల్యే అభ్యర్థులు విద్యాసాగర్‌రావు, డాక్టర్ సంజయ్‌కుమార్, సీహెచ్ రమేశ్‌రావు, ఈటెల రాజేందర్, రసమయి బాలకిషన్, బొడిగె శోభ, మనోహర్‌రెడ్డి, పుట్టమధు, కొప్పుల ఈశ్వర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

మూడేళ్లలో కరెంటు కష్టాలు తొలగిస్తా.. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో కరెంట్ కష్టాలను పూర్తిగా తొలగిస్తామని చంద్రశేఖర్‌రావు తెలిపారు. బావులు, బోరుబావులపైనే ఆధారపడి వ్యవసాయం చేసే తెలంగాణలో విద్యుత్ అత్యంత ముఖ్యమని, దీనిని దష్టిలో ఉంచుకొనే అదనపు విద్యుత్ ఉత్పత్తికి ప్రణాళికలు రూపొందించామని కేసీఆర్ తెలిపారు. మెదక్ జిల్లా దుబ్బాక సభలో ఆయన మాట్లాడుతూ తెలంగాణలో భూగర్భజలాలు అడిగంటాయి.

పంటల సాగు కోసం రైతులు బోర్లు వేసి బోర్లా పడ్డారు. ఆ బోరుబావుల్లో నీళ్లు రాక రైతాంగం కన్నీళ్లు పెట్టుకున్నది అని ఆవేదన వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే విద్యుత్ కష్టాలు తీరుతాయని హామీ ఇచ్చారు. మేము అధికారంలోకి రాగానే 15వేల మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తికి శ్రీకారం చుడుతాం. దాని ద్వారా వేల సంఖ్యలో ఉద్యోగాలు వస్తాయి. వ్యవసాయానికి నిరంతరాయంగా విద్యుత్ సరఫరా అవుతది. ఓ ఏడాది పాటు మాత్రం కష్టాలు తప్పవు. అయినప్పటికీ వాటిని సమర్థంగా ఎదుర్కొంటాం. టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో అద్భుతాలు జరుగుతాయి. టీఆర్‌ఎస్ మ్యానిఫెస్టోలో పెట్టిన ప్రతి అంశాన్నీ తు.చ తప్పకుండా అమలు చేస్తాం కేసీఆర్ హామీ ఇచ్చారు.

దుబ్బాకతో నాది ప్రత్యేక అనుబంధం దుబ్బాకతో తన అనుబంధాన్ని కేసీఆర్ గుర్తు చేసుకొన్నారు. దుబ్బాక అంటే నాకు ప్రత్యేక అభిమానం. ఈ ప్రాంతంతో నాకు ప్రత్యేక అనుబంధం ఉంది. చిన్నతనంలో ఐదేళ్లు ఇక్కడనే చదువుకున్నా. నా మిత్రులు, చదువు చెప్పిన గురువులు ఇక్కడ ఉన్నరు. నేనిప్పుడు ఈ స్థాయిలో ఉన్నానంటే నాకు చదువు చెప్పిన గురువుల పుణ్యమే అన్నారు. మిడ్‌మానేరు నుంచి కాలువ ద్వారా దుబ్బాకకు సాగునీరందించి దుబ్బాకను కరువు నుంచి బయట పడేస్తామని చెప్పారు. టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలో సాగునీరందించి తీరుతానని ప్రతిజ్ఞ చేశారు.

సోలిపేట రామలింగారెడ్డిని దుబ్బాక నియోజకవర్గ ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వినోద్‌కుమార్, దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థి రామలింగారెడ్డి, ప్రముఖ కవి నందిని సిద్దారెడ్డి దుబ్బాక మాజీ సర్పంచ్ శ్రీరాంరవీందర్, జేఏసీ కన్వీనర్ రాజమౌళి, కో కన్వీనర్ సిద్దిరాములు తదితరులు పాల్గొన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.