Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

కాంగ్రెస్‌కు ఓటేస్తే..దొంగలకు సద్ది

– తెలంగాణకు మోడీ ప్రధాన శత్రువు – ఆయనకు తెలంగాణ ఉద్యమం తెలియదు – నరరూప రాక్షసుడు చంద్రబాబు.. ఇప్పుడు బీజేపీ రూపంలో వస్తున్నాడు – టీఆర్‌ఎస్ ప్రభుత్వ ఏర్పాటు మీ బాధ్యతే – మన తలరాత మనమే రాసుకోవాలి – మనది కొత్త రాష్ట్రం.. అందరూ చేరి ఆగమాగం జేయాలని చూసున్నారు – నల్లగొండ జిల్లా సభల్లో కేసీఆర్

KCR in Nalgaonda 24-04-14 నల్లగొండ: కాంగ్రెస్‌వాళ్లకు ఓటేస్తే దొంగలకు సద్దికడతారని టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కే చంద్రశేఖర్‌రావు చెప్పారు. రాయలసీమకు నీరు తీసుకెళ్తుంటే నల్లగొండ మంత్రులు సామంతుల్లా, సిపాయిల్లా ఉండిపోయారని ఆరోపించారు. హంద్రీనీవా కోసం రఘువీరారెడ్డి పాదయాత్ర చేస్తే.. పొన్నాల జెండా ఊపుతారు.. డీకే అరుణ మంగళహారతి పడతారు. మీరు దొంగలకు సద్దికట్టారు అని మండిపడ్డారు. నరరూప రాక్షసుడైన చంద్రబాబు.. ఇప్పుడు బీజేపీ రూపంలో వస్తున్నాడని ఆరోపించారు. మోడీ వస్తే అరెస్టు చేస్తానన్న బాబు..

ఇప్పుడు అదే మోడీ సంకలో చేరారని ఎద్దేవా చేశారు. మోడీ తెలివి తక్కువ మాటలు మాట్లాడుతున్నారన్న కేసీఆర్.. ఆయనకు తెలంగాణ గురించి తెలియదని చెప్పారు. బిడ్డ పుట్టింది.. తల్లి చనిపోయిందని మోడీ మాట్లాడటం చూస్తే ఆయన సోయి ఉండి మాట్లాడుతున్నాడో లేదో తెలియడం లేదని అన్నారు. తెలంగాణకు మోడీ ప్రధాన శత్రువుగా మారాడనిచెప్పారు. బీజేపీ మతతత్వ పార్టీ అన్నారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో అందరూ చేరి, ఆగమాగం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. కొత్తకుండలో ఈగజొచ్చినట్లుందని చెప్పారు.

మన తలరాత మనమే రాసుకోవాలన్న కేసీఆర్.. టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చే బాధ్యత మీదేనని అన్నారు. నల్లగొండ జిల్లాలో బుధవారం ఆయన సుడిగాలి పర్యటన చేశారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు సుమారు 10 గంటల పాటు 9 నియోజకవర్గాల్లో పర్యటించారు. కోదాడ, నాగార్జునసాగర్ (హాలియా), దేవరకొండ, మునుగోడు(చండూరు), నకిరేకల్, తుంగతుర్తి (తిరుమలగిరి), హుజూర్‌నగర్, మిర్యాలగూడ, సూర్యాపేట బహిరంగ సభల్లో పాల్గొని ప్రసంగించారు. ఆయా సభల్లో ఆయన వివిధ అంశాలపై ఏమన్నారంటే..

నాగార్జునసాగర్ తొలి ప్రతిపాదన ప్రకారం 19 కి.మీ. పైభాగాన ఏలేశ్వరంవద్ద నిర్మించాల్సిఉండగా సీమాంధ్రులు అప్పుడే దోపిడీకి పునాదులువేసి కిందకుతెచ్చి డ్యాంనిర్మించారు. దీంతో తెలంగాణకు కృష్ణానీరు అందకుండాపోయింది. 1955లో నెహ్రూ శంకుస్థాపనకు వచ్చి 132టీఎంసీల చొప్పున కుడి, ఎడమ కాల్వలకు కేటాయించారు. దానికీ గండిపెట్టి కృష్ణాజిల్లా నందిగామ, జగ్గయ్యపేటకు 25 టీఎంసీలు తరలించారు. తెలంగాణకు 60 టీఎంసీలుకూడా రావడంలేదు. ఉద్యోగులు, ఉపాధి, భూములు ఇలా అన్ని రంగాల్లో తెలంగాణకు అన్యాయం జరిగింది. వీటన్నిటికీ 60 ఏళ్లుగా రాష్ర్టాన్ని పాలించిన కాంగ్రెస్, టీడీపీలే కారకులు కాదా?

మాకు పదవులు గడ్డిపోచతో సమానం.. ఎస్‌ఎల్‌బీసీ 40 ఏళ్లు పెండింగ్ ఉన్నా.. కాంగ్రెస్ నాయకులు ఏం ముఖం పెట్టుకుని ఓట్లు అడిగేందుకు వస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం మేం తెచ్చామని అనటానికి కాంగ్రెసోళ్లకు సిగ్గుండాలి. ఒక్కనాడూ మంత్రి పదవికి రాజీనామా చేయలేదు. పోలీస్ స్టేషన్‌కు వెళ్లలేదు. ఉద్యమాలు చేయలేదు. మాది అధికార దాహం అని జైపాల్‌రెడ్డి, టీడీపీ వారు అంటున్నారు. మీ పార్టీలు అధికారం కోసం నిలబడలేదా? వాళ్లు చేసిన నిర్వాకానికి రోకలితో కొట్టాలి. నేను ఎన్నిసార్లు పదవులను గడ్డిపోచలా వదిలేశాను? అప్పుడు టీ కాంగ్రెస్ కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులతోపాటు ఎవరైనా రాజీనామాలు చేశారా? నేను రాజీనామాలు చేస్తే మంత్రి పదవులు పట్టుకొని వేలాడింది మీరే కాదా? మీరు కూడా రాజీనామాలు చేస్తే 1200 చావులు ఆగేవి కాదా? కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రచార సభలు పెడుతున్నారు. సోనియా సభకు 20 వేలు, రాహుల్ సభకు 10 వేలమంది వస్తున్నారు. నేను పాల్గొనే ఒక్క సభకు హాజరయ్యే జనంలో సగం కూడా మీ సభలన్నీ కలిపి ఉండడం లేదు.

పోతిరెడ్డిపాడుకు పొన్నాల అనుమతులు టీ పీసీసీ చీఫ్ పొన్నాల ఖాళీ పోరంబోకు మాటలు మాట్లాడుతున్నాడు. వైఎస్ హయాంలో పోతిరెడ్డిపాడు కాల్వ తవ్వి శ్రీశైలం గండి కొట్టి అక్రమంగా నీరు తీసుకెళ్లేందుకు పొన్నాల లైసెన్స్ ఇచ్చారు. పోతిరెడ్డిపాడుకు కేటాయింపులు లేవు. ఆంధ్రా, రాయలసీమకు నీరు తీసుకెళ్తుంటే నల్లగొండ మంత్రులు సామంతుల్లా ఉండిపోయారు. హంద్రీనీవా కోసం రఘువీరారెడ్డి పాదయాత్ర చేస్తే.. పొన్నాల జెండా ఊపుతారు.. డీకే అరుణ మంగళహారతి పడతారు. మీరు దొంగలకు సద్దికట్టారు. అందుకే తెలంగాణ ప్రజలు ఇన్ని బాధలు పడ్డారు. అలాంటి వారు ఎన్నికల్లో మీ ముందుకు వస్తే మీకు ఓటు ఎందుకు వేయాలని నిలదీసి ఇంటికి పంపించాల్సిన బాధ్యత మీదే. ఈ ప్రాంతం ఫ్లోరైడ్‌తో గోస పడుతోంది. హిరోషిమా, నాగసాకిపై బాంబుదాడులకంటే భారీ విధ్వంసం ఇక్కడ జరిగింది. లక్షపైచిలుకు చందమామలాంటి పిల్లలు 30 ఏళ్లకే ముసలివారుగా హీనమైన స్థితిలో ఉన్నారు. పాలమూరులో కరువు ఎంతతీవ్రమో.. నల్లగొండలో ఫ్లోరైడ్‌ను అంతే తీవ్రంగా చూడాలి. కాంగ్రెస్ దొంగలు ఏం చేశారు? వారిని మళ్లీ నమ్మితే మోసపోతం. టీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చాక తొలి ప్రాధాన్యతగా ఫ్లోరైడ్ సమస్య పరిష్కారానికి కృషి చేస్తాం.

తెలంగాణ తెచ్చిన కీర్తి చాలు తెలంగాణ సాధించిన నాకు తరతరాలుగా సువర్ణాక్షరాలతో పేరు నిలిచిపోతుంది. రాష్ట్ర సాధన నాకు వెయ్యి జన్మలకు సంతృప్తి ఇస్తుంది. ఎన్నికల్లో పోటీ చేయవద్దని అనుకున్నా. కొందరు మేధావులు తెలంగాణ అభివృద్ధి కోసం బరిలో ఉండాలని ఒత్తిడి చేశారు. 4,5 ఏళ్లు కష్టపడి అభివృద్ధి చేస్తే అదే గాడిన పడుతుంది. తెలంగాణ అభివృద్ధి టీఆర్‌ఎస్‌తోనే సాధ్యం. నేను మహామొండి. ఇచ్చిన మాటకు కట్టుబడి పని చేస్తా.

చంద్రబాబు, నరేంద్రమోడీపై నిప్పులు చంద్రబాబు మూర్ఖుడు.నక్కజిత్తులమారి.నీచుడు. రంగులు మార్చే ఊసరవెల్లి. తెలంగాణ ద్రోహి. మాయావి. నరరూప రాక్షసుడు. గోతికాడి నక్కలా అధికారం కోసం కాచుకు కూచున్నాడు. ఆయనంత విషపు పురుగు ప్రపంచంలోనే లేదు. కిరణ్ సర్కారుపై అవిశ్వాసం పెడితే కాపాడారు. తెలంగాణను ఆఖరి వరకు అడ్డుకునే యత్నంచేశారు. హైదరాబాద్‌కు మోడీ వస్తానంటే చంద్రబాబు అరెస్టు చేయిస్తామన్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకోనని చెప్పిన బాబు మోడీతో చేతులు కలిపి ఆయన సంకన చేరారు. అలాంటి బాబు పచ్చి అవకాశవాది. బీజేపీ ముసుగులో మళ్లీ వస్తున్నారు. బీజేపీ మతతత్వ పార్టీ. బీజేపీకి ఓటు వేస్తే బాబుకే పోతుంది. బాబు, మోడీ దగా చేస్తున్నారు. తెలంగాణపై ప్రేమ నటిస్తున్నారు. బాబు మనసు ఆంధ్రా వైపే ఉంది. ఆయనకు తెలంగాణలో ఏం పని? టీడీపీ ఆంధ్రా పార్టీ. తెలంగాణను దోపిడీ చేసిన పార్టీ. మన రాష్ట్రంలో మన జెండా ఉండాలి. మన తలరాత మనమే రాసుకోవాలి. టీఆర్‌ఎస్ సెక్యులర్ పార్టీ. తెలంగాణ కూడా సెక్యులర్ రాష్ట్రమే. మోడీ తెలివి తక్కువ మాటలు మాట్లాడుతున్నారు. ఆయన తెలంగాణకు వ్యతిరేకం. తెలంగాణ గురించి మోడీకి ఏం తెలుసు? ఉద్యమ గోస ఆయనకు తెలియదు. పిల్ల పుట్టింది.. తల్లి చచ్చిందని అంటున్నారు. కనీసం తెలంగాణ వచ్చినందుకు శుభాకాంక్షలు చెప్పలేదు.

టీఆర్‌ఎస్‌తోనే తెలంగాణ అభివృద్ధి తెలంగాణ ఏర్పాటు అనంతరం మొదటి ఎన్నికలు వస్తున్నాయి. మళ్లీ ఆ రెండు పార్టీలే వచ్చి, మళ్లీ దోపిడీ కొనసాగిస్తారనే నేను ఇంకా రాజకీయాల్లో ఉండి, అదీ ఒంటరిగా బరిలోకి వస్తున్నాం. ఏమరుపాటుగా ఉంటే మళ్లీ అవే పార్టీలు వస్తాయి. ఇప్పటి వరకు దోపిడీకి పాల్పడిన వారికి సహకరించిన దొంగలే అధికారంలోకి వచ్చి మనకి వెలగబెట్టేది ఏమీ ఉండదు. ప్రస్ఫుటమైన ఆలోచనా విధానం, అభివృద్ధి ఆకాంక్ష, మనకు జరిగిన దోపిడీకి అడ్డుకట్ట వేయాలనే తపనతో వస్తున్న టీఆర్‌ఎస్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలి.

కేసీఆర్ అందరికీ బ్రహ్మరాక్షసుడు మోడీతో సహా అన్ని రాజకీయ పార్టీల నాయకులు నన్ను బ్రహ్మరాక్షసుడిలా చూస్తున్నారు. ఆంధ్రోళ్లు కూడా ఉద్యమ సమయంలో నా దిష్టిబొమ్మలనే తగులబెట్టారు. మన హక్కుల కోసం ప్రజల పక్షాన నిలబడి కొట్లాడుతుండడంతో ప్రతిపక్షాలకు ఏం చేయాలో తోచక నన్ను బ్రహ్మరాక్షసునిలా చూస్తూ అర్థంపర్థం లేని మాటలు మాట్లాడుతూ ప్రజల్లో మరింత పలుచనవుతున్నారు.

జగదీష్‌రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపిస్తే మంత్రిని చేస్తా సూర్యాపేటలో గుంటకండ్ల జగదీష్‌రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపిస్తే ప్రధాన పోర్టుఫోలియోతో మంత్రిని చేసి బహుమతిగా ఇస్తా. సూర్యాపేటను జిల్లా కేంద్రంగా మారుస్తా.

బుద్ధుడు తిరిగిన చోట.. బుద్ధిహీనులు – అందుకే సూర్యాపేట అభివృద్ధి నోచుకోలేదు.. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి జగదీష్‌రెడ్డి సూర్యాపేట అర్బన్: నల్లగొండ జిల్లా సూర్యాపేటతోపాటు పరిసర ప్రాంతాలైన ఫణిగిరిలో గౌతమ బుద్ధుడు సంచరించి, పావనం చేశారని, కానీ.. ఈ ప్రాంతాన్ని బుద్ధిహీనులు పాలించడం వల్ల అధోగతి పాలై అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందని టీఆర్‌ఎస్ సూర్యాపేట అసెంబ్లీ అభ్యర్థి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు. బుధవారం రాత్రి సూర్యాపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరిగిన బహిరంగ సభలో జగదీష్‌రెడ్డి మాట్లాడారు. 52 ఏళ్ల క్రితం సూర్యాపేటతోపాటు ఏర్పాటైన మున్సిపాల్టీలు కార్పొరేషన్ స్థాయికి ఎదిగాయని, ఇది మాత్రం అభివృద్ధికి ఆమడదూరంలో ఉందన్నారు. దీనికి కారణం ఇప్పటిదాకా గెలిచిన కాంగ్రెస్, టీడీపీ నేతలేనని చెప్పారు. సూర్యాపేటను అభివృద్ధి చేయడంలో విఫలమైన ఆంధ్రా పార్టీలను ఆంధ్రాకే పంపించాలన్నారు. ఎమ్మెల్యే దామోదర్‌రెడ్డి అభివృద్ధిని మరచి దోపిడీ, సిండికేట్ వ్యాపారాలను ప్రోత్సహిస్తూ అనుచరులకు కొల్లగొట్టి పెట్టాడని విమర్శించారు. సూర్యాపేటకు జిల్లా స్థాయి సైన్స్‌ల్యాబ్ మంజూరు కాగా దామోదర్‌రెడ్డి అడ్డుకున్నారని ఆరోపించారు.

ఉండ్రుగొండను పర్యాటక ప్రాంతంగా మార్చేందుకు జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో రూ.50 లక్షలు మంజూరు చేయిస్తే ఆర్డీఆర్ అడ్డుకున్నారని పేర్కొన్నారు. దోసపాడు వద్ద కృష్ణా ఎడమ కాలువపై ఉన్న బ్రిడ్జి కూలిపోతే ఐదేళ్లు గడిచినా నిర్మించలేదని విమర్శించారు. ఇంకా కాంగ్రెస్ జెండాలు పట్టుకొని సిగ్గులేకుండా ఎలా తిరుగుతున్నారని ప్రశ్నించారు. రెండు సంవత్సరాల పాటు ఎమ్మెల్యే నిధులను వినియోగించని ఏకైక ఎమ్మెల్యే దామోదర్‌రెడ్డి అనేదివాస్తవంకాదా? అని సవాలు చేశారు. టీడీపీ నాయకులు తెలంగాణలో ఆ పార్టీని గెలిపించి బాబు కాళ్లకాడ పెట్టాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సూర్యాపేట అభివృద్ధిఫై తనకు స్పష్టమైన అవగాహన ఉందని, పరిసర ప్రాంతాల్లో ఉన్న పిల్లలమర్రి, నాగులపాటి అన్నారం, ఉండ్రుగొండ, దురాజ్‌పల్లి, మూసీనదిని పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దుతానని హామీనిచ్చారు. ఈ సందర్భంగా కేసీఆర్ సమక్షంలో ప్రముఖ న్యాయవాది నంద్యాల దయాకర్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు కాకి దయాకర్‌రెడ్డి, కట్కూరి గన్నారెడ్డి, వై భరత్‌కుమార్, డాక్టర్ కరుణాకర్‌రెడ్డి, తూముల ఇంద్రసేనారావు, ఒంటెద్దు నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.