Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

కాంగ్రెస్ కోటలకు బీటలే

-వంద స్థానాలు గెలిచి సెంచరీ కొడుతాం
-లక్షల మందితో ప్రగతి సభ విజయవంతం : మంత్రి కేటీఆర్
-సన్నాసులు, దద్దమ్మలని సీఎం కేసీఆర్ అనలేదనే బాధలో కాంగ్రెస్ నాయకులు.. మంత్రి కే తారకరామారావు ఎద్దేవా
-కామారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఖాళీ
-మంత్రి సమక్షంలో టీఆర్‌ఎస్‌లోకి చేరికలు

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ కంచు కోటలు బద్దలు కొడుతామని, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఆయన భార్య పద్మావతి ప్రాతినిధ్యం వహిస్తున్న హూజూర్‌నగర్, కోదాడ నియోజవర్గాల్లో గులాబీ జెండా ఎగురటం ఖాయమని మంత్రి కే తారకరామారావు ధీమా వ్యక్తంచేశారు. టీఆర్‌ఎస్ పూర్తి మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని, మరోసారి సీఎంగా కేసీఆర్ ఉంటారని చెప్పారు. వంద స్థానాల్లో గెలిచి సెంచరీ కొడుతామని తెలిపారు. ఈ విషయం రాహుల్‌గాంధీ నుంచి కాంగ్రెస్ ప్రముఖ నాయకులందరికీ తెలుసన్నారు. సీఎం కావాలన్న ఆశతో డజను మంది కాంగ్రెస్ నేతలు పగటికలలు కంటున్నారని ఎద్దేవాచేశారు. మంగళవారం హైదరాబాద్‌లో తెలంగాణభవన్‌లో కామారెడ్డి జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో టీఆర్‌ఎస్‌లో చేరారు. వీరికి మంత్రి కేటీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించి మాట్లాడారు. టీఆర్‌ఎస్‌ను గతంలో వీడినవారు తిరిగి సొంతగూటికే చేరుకోవడం సంతోషకరమని వ్యాఖ్యానించారు. ప్రగతి నివేదన సభ విజయవంతంతో కాంగ్రెస్ నేతలు పోటీపడి సత్తువలేని ప్రసంగాలు చేస్తున్నారని విమర్శించారు.

కాంగ్రెస్ నేతల ప్రస్తావన తేకపోవటం, దద్దమ్మలు, సన్నాసులు అని సీఎం కేసీఆర్ తిట్టనందుకు వారు మథనపడుతున్నారని ఎద్దేవా చేశారు. సభకు లక్షలమంది వచ్చారని, కాంగ్రెస్ నేతలతోపాటు ప్రజలు టీవీల్లో ఈ కార్యక్రమాన్ని వీక్షించారని గుర్తుచేశారు. నాలుగున్నరేండ్లలో జరిగిన అభివృద్ధిని నివేదించేందుకు సభ నిర్వహించామని, ఎవరినో తిట్టడానికి కాదన్నారు. కాంగ్రెస్ నేతలను తిడితేనే సభ సక్సెస్ అయినట్టా? అని ప్రశ్నించారు. ఉద్యమంలో పనిచేసినప్పుడు ప్రశ్నించలేదేం?నాలుగేండ్లలో తెలంగాణలో జరిగిన ప్రతి ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ భారీ మెజార్టీతో గెలిచిందని, ప్రజా సంక్షేమ కార్యక్రమాలతోనే విజయం సాధ్యమైందని మంత్రి కేటీఆర్ చెప్పారు. మెదక్, వరంగల్ ఉప ఎన్నికలతోపాటు జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బంపర్ మెజార్టీతో గెలిచిన విషయాన్ని గుర్తుచేశారు. నారాయణ్‌ఖేడ్, పాలేరు ఉప ఎన్నికల్లో సానుభూతి పవనాలను సైతం ఎదుర్కొని గులాబీ జెండా ఎగురవేశామని చెప్పారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో వంద సీట్లు గెలుస్తామని చెప్తే, సీపీఐ నేత నారాయణ చెవి కోసుకుంటానన్నారని, కానీ ఫలితాలు వచ్చాక కనిపించలేదని చెప్పారు.

మెడ, తొడ కోసుకుంటామన్న కాంగ్రెసోళ్లు సైతం, గెలుపును చూసి తోక ముడిచారని అన్నారు. కాంగ్రెస్‌లో అందరి కుటుంబాలు రాజకీయాల్లో ఉంటే తప్పులేదు గానీ, సీఎం కేసీఆర్ కుటుంబం ఉంటే తప్పా? అని ప్రశ్నించారు. ఉద్యమంలో పనిచేసినప్పుడు కుటుంబం గురించి ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు తెలంగాణకు ఒక్క రూపాయి ఇవ్వనంటే అప్పటి కాంగ్రెస్ మంత్రులు ముసిముసిగా నవ్వారే తప్ప, ఎందుకు ఖండించలేదని నిలదీశారు. ఎవరి తత్వం ఏమిటో ప్రజలకు స్పష్టత ఉన్నందునే సీఎం కేసీఆర్ చేతుల్లో రాష్ర్టాన్ని పెట్టారని, వచ్చే ఎన్నికల్లో అదే పునరావృతమవుతుందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో ముఖ్యనేతలుగా చెప్పుకునే కాంగ్రెస్ నాయకులు గల్లంతవుతారని చెప్పారు. వాళ్లు ఓడిపోయే పరిస్థితులు ఉన్నాయన్నారు. సీఎం కేసీఆర్‌ను గద్దె దించడమే లక్ష్యమని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారని, ఎందుకు గద్దె దించాలనుకుంటున్నారో చెప్పాలని నిలదీశారు. నిజామాబాద్ జైలులో దాశరథి నా తెంగాణ కోటి రతనాల వీణ అని రాస్తే, సీఎం కేసీఆర్ తెలంగాణను కోటి ఎకరాల మాగాణిగా మార్చేందుకు కంకణం కట్టుకున్నారని తెలిపారు.

సిరిసిల్ల తరహాలో కామారెడ్డి అభివృద్ధి ముఖ్యమంత్రి కేసీఆర్ అమలుచేస్తున్న పథకాలను చూసి పెద్దమొత్తంలో టీఆర్‌ఎస్‌లోకి మిగతా పార్టీల నేతలు చేరుతున్నారని మంత్రి కేటీఆర్ చెప్పారు. రాహుల్‌గాంధీకి భయపడే వాళ్లు ఎవరూలేరని, ఆయన ప్రాతినిథ్యం వహించే అమేథీ నియోజవర్గం పరిధిలోని మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయిందనే విషయాన్ని ఆ పార్టీ నేతలు గుర్తించాలని సూచించారు. కామారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ ఖాళీ అయ్యిందని, మాచారెడ్డిలో షబ్బీర్‌అలీ తన జెండాలు తానే కట్టుకోవాలని సూచించారు. వచ్చే ఎన్నికల్లో గంప గోవర్ధన్‌ను మరోసారి భారీ మెజార్టీతో గెలిపిస్తే సిరిసిల్ల మాదిరిగా అభివృద్ధి చేస్తానని హామీఇచ్చారు. కామారెడ్డితో తనకు అనుబంధం ఉన్నదని, అన్ని గ్రామాల గురించి తెలుసు అన్నారు. ఇప్పటికే కామారెడ్డిని అభివృద్ధి చేసే బాధ్యత ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్నారని, గోదావరి జలాలతో సస్యశ్యామలం చేయాలన్నదే లక్ష్యమని తెలిపారు. పార్టీలో చేరిన వారిలో కామారెడ్డి కాంగ్రెస్ సీనియర్ నేతలు నర్సింగరావు, మామిండ్ల అంజయ్యతదితరులు ఉన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.