Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

కాంగ్రెస్ ముందస్తు ఓటమి

-సవాలు విసిరిన నేతలు పారిపోయారు
-కాంగ్రెస్‌ను ఎండగట్టేందుకే ముందస్తు
-ఎన్నికల నాటికి అన్ని ఇండ్లకు నల్లా నీరు
-స్టేషన్‌ఘన్‌పూర్ సమావేశంలో మంత్రి కేటీఆర్

కాంగ్రెస్ నాయకుల చిల్లర మల్లర ప్రయత్నాలు, దగుల్బాజీ వ్యవహారాలను ప్రజాకోర్టులోనే ఎండగట్టేందుకే ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ముందస్తు ఎన్నికలకు సిద్ధమయ్యారని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు చెప్పారు. జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌లోని విద్యాజ్యోతి డిగ్రీ కళాశాల ఆవరణలో మంగళవారం సాయంత్రం నియోజకవర్గ పార్టీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి కేటీఆర్.. కాంగ్రెస్ నేతల తీరును తూర్పారబట్టారు. అప్పటిదాకా ఎన్నికలు రేపొచ్చినా రెడీ, అర్ధరాత్రి వచ్చినా రెడీ, తెల్లరొచ్చినా రెడీ.. అంటూ డైలాగులు కొట్టిన కాంగ్రెసోళ్లు ఇప్పుడు గోడలు గీకుతున్నారు. ఒకడు ఆకాశంకేసి పిచ్చి చూపులు చూస్తున్నడు. ఇంకొకడు ఎన్నికల కమిషన్ చుట్టు తిరుగుతున్నడు. ఓటర్ల నమోదు సరిగా లేదని, అసలు ముందస్తు ఎన్నికలకు వెళ్లడం రాజ్యంగ విరుద్ధమని మరొకడు కోర్టుల చుట్టూ తిరుగుతూ.. వాళ్ల ముందస్తు ఓటమి కోసం సాకులు వెతుకుతున్నారు అని ఎద్దేవాచేశారు. కష్టాలు, కన్నీళ్లు, త్యాగాల పునాదుల మీద నిర్మించుకున్న రాష్ర్టాన్ని రాజకీయాలకతీతంగా, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధిచేద్దామని సీఎం కేసీఆర్ ప్రణాళిక రూపొందించారని చెప్పారు. ఒకరోజు శాసనసభలో ప్రతిపక్ష నేత జానారెడ్డి లేచి.. కొత్త రాష్ట్రంలో పాత సంస్కృతికి స్వస్తి పలికి, కొత్త విధానాన్ని ప్రవేశపెట్టాలని, అధికార, ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు అనే తేడా లేకుండా సమానంగా నిధులు కేటాయించాలని కోరారు.

ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా అప్పటిదాకా కోటిన్నర ఉన్న నియోజకవర్గ అభివృద్ధి నిధిని మూడుకోట్లకు పెంచిన గొప్ప నాయకుడు కేసీఆర్ అని చెప్పారు. కానీ కుసంస్కారం, దౌర్భాగ్యులైన కాంగ్రెస్ నాయకులు చనిపోయినవారి పేరుతోనూ 200 పైగా కేసులు వేసి ప్రాజెక్టులు అడ్డుకునే కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు రూ.70, రూ.200 పింఛన్లు ఇస్తే.. సీఎం కేసీఆర్ ఆసరా పథకం కింద రూ.1000, 1500 ఇస్తున్నారని చెప్పారు. ఈ మధ్య విలేకరులు ఏ ఊరికెళ్లి వృద్ధులను అడిగినా టీఆర్‌ఎస్‌కే ఓటు వేస్తామంటున్నారని అన్నారు. అవతలి పార్టీవారు పదివేలు, లక్ష ఇచ్చినా వెయ్యమంటున్నారని, అది వారికి పింఛన్ రూపంలో కేసీఆర్ ఇచ్చిన ఆత్మగౌరవానికి ప్రతీక అని చెప్పారు. అందుకే ఈసారి అధికారంలోకి రాగానే రూ.2016, రూ.3016 చొప్పున పింఛన్లు ఇస్తామని కేసీఆర్ ప్రకటించారని తెలిపారు. మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి నల్లాల ద్వారా నీళ్లిచ్చే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలో నాలుగు మండలాలకు నీళ్లు వస్తున్నాయని, ఎన్నికలకు పోయేనాటికి మిగతా ప్రాంతాలకు కూడా నీళ్లిస్తామని ఆయన స్పష్టం చేశారు.

కాంగ్రెస్ దౌర్భాగ్యపు పార్టీ
కాంగ్రెస్ దుర్మార్గపు, దౌర్భాగ్యపు పార్టీ అని కేటీఆర్ అభివర్ణించారు. కాంగ్రెస్ అంటేనే మహాసముద్రం. ఆ పార్టీలో ఎవరుంటారో.. ఎవరు ఉండరో తెలియదు. మేం గెలిస్తే మొదటి సంతకం దీనిపై పెడతాం, దానిపై పెడతాం అని ఎవరికివారు చెప్తున్నారు. అసలు ఒక పార్టీలో ఎంతమంది ముఖ్యమంత్రులు ఉంటారు? టీఆర్‌ఎస్ మళ్లీ గెలిస్తే మా పార్టీ తరఫున ముఖ్యమంత్రి కేసీఆర్ అని మేం కుల్ల చెప్తున్నం. వాళ్లకు అలా ఎవరిపేరైనా చెప్పే దమ్ముందా? అని కేటీఆర్ ప్రశ్నించారు. పొరపాటునో, గ్రహపాటునో వాళ్లు అధికారంలోకి వస్తే.. ముఖ్యమంత్రి పదవికోసం కుర్చీలాట తప్పదని ఎద్దేవాచేశారు. అది కూడా ఢిల్లీ నుంచి వచ్చే సీల్డ్‌కవర్ డిసైడ్ చేస్తుందని చెప్పారు. మీకు సీల్డ్ కవర్ సీఎం కావాలా? తెలంగాణ మట్టిలో పుట్టిన సింహంలాంటి సీఎం కావాల్నా? అని ప్రశ్నించారు. మీరు ఆ గట్టున ఉంటారా? ఈ గట్టున ఉంటారా? బషీర్‌బాగ్, ముదిగొండ కాల్పుల్లో రైతులను పొట్టన పెట్టుకున్న రైతులపాలిటి రాబందులా పక్షమా? పంట పెట్టుబడి సాయం అందిస్తున్న రైతుబంధు పక్షమా? తేల్చుకోవాలి అని మంత్రి కేటీఆర్ కోరారు.

అదో దగా కూటమి : డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి
తెలంగాణ బాహుబలి కేసీఆర్‌ను ఎన్నికల్లో ఒంటరిగా ఎదుర్కొనే శక్తిలేక టీడీపీ, టీజేఎస్, సీపీఐతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుందని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి విమర్శించారు. అది మహాకూటమా? దగా కూటమా? మోసం చేసే కూటమా? అని ప్రశ్నించారు. తెలంగాణ ద్రోహులంతా మహాకూటమిలో చేరారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కోదండరాం ఒకప్పుడు టీడీపీని తెలంగాణ ద్రోహుల పార్టీగా పేర్కొన్నారని గుర్తుచేసిన కడియం.. ఇప్పుడు ఆయన ఆ పార్టీతో ఏ విధంగా పొత్తు పెట్టుకున్నారని నిలదీశారు. కేసీఆర్ నాయకత్వంలో రాజయ్య, తాను అన్నదమ్ముల్లాగా కలిసి పనిచేస్తామని చెప్పారు. రాజయ్యను భారీ మెజార్టీతో గెలిపించి కేసీఆర్‌కు కానుక ఇస్తామని ప్రకటించారు. సభలో రాజ్యసభ సభ్యుడు బండా ప్రకాశ్, వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, టీఎస్‌ఐఐసీ చైర్మన్, టీఆర్‌ఎస్ వరంగల్ ఉమ్మడి జిల్లా ఇంచార్జి గ్యాదరి బాలమల్లు, టీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బస్వరాజు సారయ్య, గిరిజన సహకార సంస్థ చైర్మన్ మోహన్‌గాంధీనాయక్, వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ కే వాసుదేవరెడ్డి, కొమురవెల్లి ఆలయ చైర్మన్ సేవెల్లి సంపత్, కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి, రాష్ట్ర రైతు రుణ విమోచన చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు, మాజీ ఎమ్మెల్యే మాలోత్ కవిత తదితరులు పాల్గొన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.