-ఆ పార్టీకి ప్రజలు ఓటేయరు.. -హుజూర్‌నగర్‌లో మాదే గెలుపు.. -నిన్న కలిసి పోటీచేసి.. -నేడు కలబడుతున్న విపక్షాలు -నియోజకవర్గ అభివృద్ధిపై ఉత్తమ్ అబద్ధాలు -ఐదేండ్లలో అభివృద్ధి పనులకోసం -ఒక్క లేఖ కూడా రాయని ఉత్తమ్ -హుజూర్నగర్ ప్రచార ఇంచార్జీలతో -టెలికాన్ఫరెన్స్‌లో మంత్రి కేటీఆర్

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మునుగుతున్న పడవ అని.. అలాంటి పార్టీకి ప్రజలు ఓటేయరని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు. హుజూర్నగర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ ప్రచారం ఉధృతంగా సాగుతున్నదని, ప్రజల నుంచి తమ పార్టీకి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తున్నదని చెప్పారు. మంగళవారం హుజూర్నగర్ టీఆర్ఎస్ పార్టీ ఇంచార్జీలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన కేటీఆర్.. టీఆర్ఎస్ పార్టీ హుజూర్నగర్ నియోజకవర్గంలో తొలిసారి గులాబీ జెండా ఎగురవేయడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు.
హుజూర్నగర్ నుంచి క్షేత్రస్థాయిలో వస్తున్న నివేదికలు అద్భుతంగా ఉన్నాయని.. తమ పార్టీ వందశాతం గౌరవప్రదమైన మెజార్టీతో గెలుస్తుందన్నారు. గత ఎన్నికల్లో కలసి పోటీచేసి ఘోర పరాభవాన్ని మూటగట్టుకొన్న విపక్షాలు ఈ రోజు ఎవరికి వారే కలబడుతున్న తీరును ప్రజలు తప్పకుండా గుర్తిస్తారని తెలిపారు. కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో లేని కాంగ్రెస్ పార్టీ గెలువడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని, ప్రభుత్వంలో లేనివారు నియోజకవర్గాన్ని ఎలా అభివృద్ధిచేస్తారో ప్రజలు అర్థం చేసుకోగలరని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీతోపాటు పోటీలో ఉన్న టీడీపీ, బీజేపీకి ప్రజలనుంచి పెద్ద మద్దతు ఉండకపోవచ్చన్నారు.
ఉత్తమ్ వాదన శుద్ధ తప్పు గత ఐదేండ్లలో హుజూర్‌నగర్‌లో అభివృద్ధి జరుగలేదని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చేస్తున్న వాదన శుద్ధ తప్పని మంత్రి కేటీఆర్ అన్నారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, రైతుబంధు, రైతుబీమా, ఆసరా పెన్షన్లు.. ఇలా అన్ని రకాల ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు దిగ్విజయంగా కొనసాగుతున్నాయని, ఇవేవీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి కనిపించడంలేదని, తమ ప్రభుత్వం నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలే ఈసారి టీఆర్ఎస్కు విజయాన్ని అందిస్తాయని చెప్పారు. ప్రతిపక్ష శాసనసభ్యుడిగా ఉన్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నియోజకవర్గంపై ఎలాంటి వివక్ష చూపకుండా, రాష్ట్రంలోని అన్ని ఇతర నియోజకవర్గాలతో సమానంగా ప్రభుత్వ కార్యక్రమాలను, అభివృద్ధి పనుల్ని హుజూర్‌నగర్‌లో కూడా చేపట్టామన్నారు. కానీ, గత ఐదేండ్లలో ఎమ్మెల్యేగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఒక్కటంటే ఒక్క లేఖను తన నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రభుత్వానికి రాయలేదని విమర్శించారు. ఇదే హుజూర్నగర్ స్థానంపట్ల ఆయనకున్న నిబద్ధతను తెలియజేస్తుందని వ్యాఖ్యానించారు.
ప్రజల్లో వందశాతం సంతృప్తి ఐదేండ్లలో తెరాస ప్రభుత్వంచేసిన అభివృద్ధిని అక్కడి ప్రజలకు వివరించాలని పార్టీ ప్రచార ఇంచార్జీలను కేటీఆర్ ఆదేశించారు. టీఆర్ఎస్ పాలన పట్ల ప్రజలు వందశాతం సంతృప్తితో ఉన్నారని, ఈ 15 రోజులపాటు విసృ్తతంగా ప్రచారం కొనసాగించాలని పార్టీ శ్రేణులను కోరారు. తాను స్వయంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానన్నారు. ఈనెల 4 వ తేదీతోపాటు పండుగ తర్వాత ఒకట్రెండు రోజులు హుజూర్‌నగర్‌లో ప్రచారం చేస్తానని చెప్పారు. ప్రస్తుతం అక్కడ జరుగుతున్న ప్రచారశైలిని, ప్రజల స్పందనను టెలి కాన్ఫరెన్స్ ద్వారా నాయకులను అడిగి తెలుసుకున్నారు. పార్టీ ఎన్నికల ఇంచార్జీ, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఇతర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నాయకులు కేటీఆర్‌కు క్షేత్రస్థాయికి సంబంధించిన వాస్తవ పరిస్థితులను వివరించారు.