Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

కాంగ్రెస్ నేతలకు అవగాహన లేదు

-మీరా పదేండ్లు ప్రభుత్వాన్ని నడిపింది? -సీడబ్ల్యూసీలో ఉన్నవే 18 డైరెక్టరేట్లు.. 36 అనుమతులెట్ల వస్తయి? -తుమ్మిడిహట్టి వద్ద నీళ్లులేవని సీడబ్ల్యూసీయే తేల్చింది -పోలవరానికి జాతీయ హోదా ఇస్తుంటే ఏంచేశారు? -కాంగ్రెస్ నేతలపై మండిపడిన మంత్రి హరీశ్ -సమగ్ర వివరాలతో పత్రికాప్రకటన విడుదల

Harish Rao

కేంద్ర జల సంఘంలో 18 డైరెక్టరేట్లు ఉంటే.. ప్రాణహిత-చేవెళ్లకు 36 అనుమతులు వచ్చినయని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడటం ఈ ప్రాజెక్టుపై ఆయన అవగాహన లేమికి అద్దపడుతున్నదని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి టీ హరీశ్‌రావు అన్నారు. కనీస పరిజ్ఞానం లేకుండా కాంగ్రెస్ నేతలు అబద్ధాలతో ప్రజలను గందరగోళపరుస్తున్నారని మండిపడ్డారు. తుమ్మిడిహట్టి బ్యారేజీకి భూసేకరణ పూర్తయిందని ఐదేండ్లు నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిన సుదర్శన్‌రెడ్డి చెప్పడం మరో విడ్డూరమన్నారు. ఈ బ్యారేజీ నిర్మాణానికి ఒక్క ఎకరా కూడా సేకరించలేదని మంత్రి స్పష్టంచేశారు.

ఏమీ తెలియకుండా మాట్లాడుతున్న ఈ నేతల తీరు చూస్తుంటే.. అసలు పదేండ్లపాటు ప్రభుత్వాన్ని నడిపింది వీరేనా? అనే అనుమానం కలుగుతున్నదని ఎద్దేవాచేశారు. గురువారం ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన గాంధీభవన్‌లో ప్రాణహిత-చేవెళ్ల ఎత్తిపోతల పథకంపై జరిగిన అవగాహన సదస్సులో అవగాహన లేమితో అబద్ధాలతో ఆ పార్టీ నేతలు చేసిన వాఖ్యలపై మంత్రి హరీశ్ తీవ్రంగా స్పందించారు. ఈ మేరకు శుక్రవారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి..

ఏమీ చేయని అసమర్థులు మీరు కాదా? రాష్ట్రంలో పదేండ్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఈ కాలంలో కేంద్రంలో, మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా కూడా మహారాష్ట్రతో 152 మీటర్ల ఎఫ్‌ఆర్‌ఎల్‌కు ఒప్పించలేకపోవడం మీ వైఫల్యం కాదా? మీ ప్రభుత్వమే పంపిన డీపీఆర్‌కు సీడబ్ల్యూసీతో అనుమతి ఇప్పించలేకపోయిన అసమర్థత మీది కాదా? తెలంగాణ ఇచ్చామని జబ్బలు చరుచుకుంటున్న మీరు విభజన చట్టంలో ప్రాణహితకు జాతీయ ప్రాజెక్టు హోదాను ఇప్పించలేకపోయారు? మరోవైపు ఖమ్మం జిల్లా ఆదివాసులను గోదావరిలో ముంచి చంపుతున్న పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కట్టబెడుతుంటే చేష్టలుడిగి చూస్తూ కూర్చున్నది మీరు కాదా? ప్రాజెక్టును సమస్యల వలయంలో పడేసిపోయింది మీరు. కాంట్రాక్టర్ల నుంచి ముడుపులు బొక్కింది మీరు. ఇప్పుడు ప్రాజెక్టులోని చిక్కుముడులు విప్పి, సమస్యలను పరిష్కరించి నిర్దేశిత ఆయకట్టుకు నీరందించేందుకు కృషి చేస్తుంటే… అపోహలతో ప్రజలను గందరగోళపరిచేందుకు ప్రయత్నించడం భావ్యమా?

ప్రాణహితకు 36 అనుమతులు వచ్చినట్లుగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అంటున్నడు. ఐదేండ్లు మంత్రిగా పనిచేసిన ఆయనకు ప్రాజెక్టుపై ఏ మాత్రం అవగాహన లేదని స్పష్టమవుతున్నది. అనుమతులు ఎన్ని ఉంటాయో కూడా ఆయనకు అవగాహన లేదు. సీడబ్ల్యూసీలో ఉన్నవి 18 డైరెక్టరేట్లు. ప్రాజెక్టుకు 36 అనుమతులు వచ్చాయని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెబుతున్నరు. ఇప్పటిదాకా సీడబ్ల్యూసీనుంచి వచ్చిన అనుమతులు ఆరు మాత్రమే. ముఖ్యమైన పర్యావరణ, అటవీ, మోటా అనుమతులు రానేలేదు. బ్యారేజీ ఎఫ్‌ఆర్‌ఎల్ నిర్థారణ అయితే తప్ప అవి సాధ్యంకాదు. అందుకు మహారాష్ట్ర అనుమతి కావాలి. మహారాష్ట్ర 148 మీటర్లకు మించి ఒప్పుకునే ప్రసక్తే లేదంటున్నది.

తుమ్మిడిహట్టి దగ్గర నీటి లభ్యత లేదు తుమ్మిడిహట్టి వద్ద 273 టీఎంసీల నీటి లభ్యతలేదని, అక్కడ బ్యారేజీ నిర్మిస్తే గరిష్ఠంగా 120 టీఎంసీలకుమించి నీటి లభ్యత ఉండే అవకాశమే లేదని కేంద్ర జలసంఘమే స్పష్టంచేసింది. గత ప్రభుత్వం ప్రతిపాదించిన 160 టీఎంసీల తరలింపు సాధ్యంకాదని తేల్చిచెప్పింది. 152మీటర్ల ఎఫ్‌ఆర్‌ఎల్‌ వద్ద 120టీఎంసీల నీటితరలింపు మాత్రమే సాధ్యమని లెక్కించారు. 160 టీఎంసీల నీటిని తరలించే లక్ష్యంతోనే ఇప్పటికే పనులు పురోగతిలో ఉన్నందున.. అంతమేరలో నీటి లభ్యత ఉన్నచోట బ్యారేజీని నిర్మించడం ప్రభుత్వానికి అనివార్యం. అది గోదావరిపై కాళేశ్వరానికి 20 కి.మీ. దిగువన మేడిగడ్డ వద్ద సాధ్యమని వ్యాప్కోస్ ప్రాథమిక అధ్యయనంలో తేలింది.

ఆదిలాబాద్‌లో 1.50 లక్షల ఎకరాలకు సాగునీరు ముడుపుల కోసమే ప్రాణహిత బ్యారేజీని తుమ్మిడిహట్టి నుంచి కాళేశ్వరంకు మారుస్తున్నట్లు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అంటున్నడు. ఇది ఆయన అవగాహనలేమికి అద్దం పడుతుంది. ప్రభుత్వం ఈ అంశంపై ప్రజలకు స్పష్టంగా చెప్పింది. తుమ్మిడిహట్టి బ్యారేజీని రద్దు చేయలేదు. కాళేశ్వరంవద్ద అదనపు బ్యారేజీ నిర్మిస్తున్నమని ఇదివరకే స్పష్టంచేసినా.. ఆయన ప్రభుత్వంపై దుమ్మెత్తిపోయడమే లక్ష్యంగా మాట్లాడుతున్నరు. తుమ్మిడిహట్టి వద్ద 148 మీటర్ల ఎఫ్‌ఆర్‌ఎల్ వద్ద బ్యారేజీ నిర్మించి ఆదిలాబాద్ తూర్పు జిల్లాలో 1.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని ప్రభుత్వం భావిస్తున్నది.

ఇప్పటివరకు తవ్విన కాలువలను ఉపయోగించుకోవచ్చని ఇంజినీర్లు చెబుతున్నరు. ఆదిలాబాద్ జిల్లాకు అవసరమయ్యే నీటిని తుమ్మిడిహట్టినుంచే ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించినా జిల్లాకు అన్యాయం జరుగుతుందని వాదించడం ప్రజలను తప్పుదోవ పట్టించడమే. ఈ జిల్లాలో ఇంతకుముందు ప్రతిపాదించిన పథకంలోకంటే ఎక్కువ ఆయకట్టు సాగులోకి వస్తుంది. అయినా దీన్ని వివాదం ఎందుకు చేస్తున్నారో కాంగ్రెస్ నాయకులకే తెల్వాలి.

వారి భావ దారిద్య్రాన్ని చూసి నవ్వొస్తున్నది. ఆరోపణల్లో పసలేక, తెల్ల ముఖాలు వేయాల్సి వస్తదనే వాస్తవాన్ని గ్రహిస్తే ఇప్పటికైనా మంచిది. ఇకపోతే ఆదిలాబాద్ జిల్లా తర్వాత నిజామాబాద్, కరీంనగర్, మెదక్, నల్లగొండ, వరంగల్, రంగారెడ్డి జిల్లాలకు నీరు అందించేందుకు కాళేశ్వరం దిగువన మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మించాలని ప్రభుత్వం భావిస్తున్నది. డీపీఆర్‌ను తయారీకి కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ వ్యాప్కోస్‌ను ఆదేశించాం. మేడిగడ్డవద్ద మరో బ్యారేజీ అవసరం ఎందుకో ఇప్పటికే ప్రభుత్వం ప్రజలకు వివరణ ఇచ్చింది. అది ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జానారెడ్డి, సుదర్శన్‌రెడ్డి, ఇతర కాంగ్రెస్ నాయకులకు తెల్వకపోతే ఆ తప్పు మాది కాదు.

ఎవరిని నమ్మించడానికి ఈ గోబెల్స్ ప్రచారం? తుమ్మిడిహట్టివద్ద అధిక విద్యుత్ ఉత్పత్తి చేయొచ్చని కొందరు పదేపదే చెబుతున్నరు. దాన్ని ఉత్తమ్, ఇతర నాయకులు నమ్మడం విచిత్రంగా ఉంది. తుమ్మిడిహట్టి వద్ద 152 మీటర్ల బ్యారేజీ నిర్మాణ డిజైన్‌లో ఒక్క మెగావాట్ కరెంటు ఉత్పత్తి ప్రతిపాదనలు కూడా లేవు. మరి విద్యుత్ కోల్పోతున్నట్లు గోబెల్స్ ప్రచారం ఎవరిని మోసం చేయడానికి? తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రాజెక్టుల అంతర్ రాష్ట్ర వివాదాలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది. నేను మహారాష్ట్ర సాగునీటి మంత్రితో జులై, 2014లో సమావేశమై, లెండి, పెన్‌గంగ, ప్రాణహిత వివాదాలపై చర్చిచాను. వారు అప్పుడు కూడా తుమ్మిడిహట్టి ఎత్తు తగ్గించాలని కోరారు.

మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం ఏర్పడగానే ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు స్వయంగా ఫిబ్రవరి, 2015లో ముంబై వెళ్లి మహారాష్ట్ర కొత్త సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ను కలిశారు. ఆయన 160 టీఎంసీల నీటిని తెలంగాణ ప్రభుత్వం తరలించుకుపోవడంలో తమకెలాంటి అభ్యంతరం లేదని స్పష్టంచేశారు. అయితే తమ భూభాగంలో ముంపును ఎట్టి పరిస్థితుల్లో అనుమతించేదిలేదని చెప్పారు.

కమీషన్ల సంస్కృతి మీది ఏపీ ప్రభుత్వం ఏకపక్షంగా 152 మీటర్ల ఎఫ్‌ఆర్‌ఎల్ వద్ద తుమ్మిడిహట్టి బ్యారేజీని ప్రతిపాదించి, ఆ ప్రకారం కాల్వల తవ్వకం చేపట్టడం పట్ల మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నపుడే అప్పటి సీఎం పృధ్వీరాజ్ చౌహాన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అక్టోబర్, 2013లో ఏపీ ప్రభుత్వానికి లేఖ రాశారు. ప్రాజెక్టుపై పెట్టే ఖర్చంతా వృథా అవుతుందని పేర్కొన్నారు. కానీ అప్పటి మీ కాంగ్రెస్ ప్రభుత్వం బేఖాతరు చేసి ప్రాజెక్టు పనులు కొనసాగించింది.

సాగునీటి మంత్రిగా ఐదేండ్లు పనిచేసిన సుదర్శన్‌రెడ్డి తుమ్మిడిహట్టి ప్రాజెక్టు నిర్మాణానికి భూసేకరణ పూర్తయిందనడం విడ్డూరం. ఆయన ఇలాంటి మాటలు మాట్లాతున్నారంటే.. అసలు ప్రభుత్వాన్ని నడిపింది వీళ్లేనా అనే అనుమానం వస్తున్నది. వాస్తవంగా తుమ్మిడిహట్టి దగ్గర ఒక్క ఎకరం భూసేకరణ కూడా జరపలేదు. ఎల్‌పీ షెడ్యూల్ తయారు చేయలేదు. మహారాష్ట్ర ప్రభుత్వం అనుమతిలేనిదే భూసేకరణ సాధ్యం కాదు. కాంగ్రెస్ హయాంలో బ్యారేజీ పనులకు సంబంధించి టెండర్లు పిలిచారు. కాంట్రాక్టర్లకు అడ్వాన్సులు చెల్లించి.. కమీషన్లు బొక్కారు. కానీ అసలు బ్యారేజీ పనులే మొదలు కాలేదు. అయినా సుదర్శన్‌రెడ్డి మాత్రం 60% పనులు పూర్తయ్యాక, బ్యారేజీ ప్రతిపాదిత స్థలాన్ని మార్చి ప్రజలను కష్టాల్లోకి నెట్టేస్తున్నారని అంటున్నరు. ఈ అబద్ధాలతో ఎవరిని మభ్యపెట్టాలనుకుంటున్నరు?

ఇప్పటికైనా కళ్లు తెరిచి.. అభివృద్ధికి పాటుపడండి ప్రాజెక్టు వ్యవహారం సీఎం కేసీఆర్ సొంత ఇంటి విషయం కాదు. ఎవరితో చర్చించకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిని ఆడిపోసుకుంటున్నరు. ప్రాణహితపై చర్చించేందుకు ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం, సంకోచం లేదు. అసెంబ్లీలోనూ చర్చించేందుకు సిద్ధం. ఇంజినీరింగ్ నిపుణులతో, అనువజ్ఞులైన రిటైర్డ్ ఇంజినీర్లతో, వ్యాప్కోస్‌తో రోజుల తరబడి చర్చించి, సర్వే ఆఫ్ ఇండియా మ్యాపులు, గూగుల్ ఎర్త్ సాఫ్ట్‌వేర్ సహాయంతో అధ్యయనం జరిపిన తర్వాతనే మేడిగడ్డ వద్ద మరో బ్యారేజీ నిర్మాణానికి ప్రభుత్వం పూనుకుంది. మేడిగడ్డ బ్యారేజీ అలైన్‌మెంట్, మేడిగడ్డ బ్యారేజీనుంచి ఎల్లంపల్లి బ్యారేజీవరకు కాలువ అలైన్‌మెంట్‌పై వ్యాప్కోస్ సర్వే జరుపుతున్నది.

ఆధునిక లైడార్ సర్వే జరపాలనీ నిర్ణయించాం. సమగ్ర సర్వే తర్వాతనే ముంపు ఎంత? గ్రావిటీ చానల్ పొడవు ఎంత? సొరంగాల పొడవు ఎంత? ఎంత ఎత్తుకు నీటిని ఎత్తిపోయాలి? కరెంటు ఎంత అవసరం? అనే వివరాలు తెలుస్తయి. అంతే తప్ప ఎవరో మిడిమిడి జ్ఞానంతో ఇచ్చిన సమాచారాన్ని పట్టుకొని, పదేండ్లు ప్రభుత్వాన్ని నడిపిన కాంగ్రెస్ నాయకులు ఇలా మాట్లాడటం విజ్ఞత అనిపించుకోదు. ఉత్తమ్ పేర్కొన్నట్లు.. ముఖ్యమంత్రి ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయం కాదని సమస్త తెలంగాణ ప్రజానీకానికి తెలియజేస్తున్న.

ఇప్పటికైనా వాస్తవాలని అర్థం చేసుకొని, తెలంగాణ అభివృద్ధిలో కలిసి రావాలని కోరుతున్నం. ప్రభుత్వంపై పనిగట్టుకొని విష ప్రచారం చేస్తున్న మిమ్మల్ని ప్రజలు నమ్మే పరిస్థితి, ప్రసక్తే లేదు. తుమ్మిడిహట్టి బ్యారేజీ, మేడిగడ్డ బ్యారేజీ, మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి వరకు కాలువ వివరాలు నిర్థారణ అయిన తర్వాత అసెంబ్లీ వేదికగా శాసనసభ్యులు, తద్వారా ప్రజలకు అన్ని వివరాలు అందిస్తాం. అంతదాకా ఈ రకమైన గోబెల్స్ ప్రచారానికిలోనూ గందరగోళానికి గురికావద్దని ప్రజలకు మనవి చేస్తున్నా.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.