Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

కాంగ్రెస్‌ నిరర్థక నినాదం!

ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కాంగ్రెస్, టీడీపీ పార్టీలు ఎంతగా తిట్టాలని చూస్తే తెలంగాణ సమాజం ఆయనను అంతగా అక్కున చేర్చుకుంటుంది. కేసీఆరే మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుతున్నారు. తెలంగాణ వస్తే చీకటే అన్నోళ్ళు ఎక్కడున్నరో ఇప్పడు కేసీఆర్ హఠావో అనేవాళ్లు ఎక్కడుంటారో సమీప భవిష్యత్‌లోనే తేలిపోతుంది.

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్ రెడ్డి ‘కేసీఅర్ హఠావో – తెలంగాణ బచావో’ అంటూ తమ పార్టీ ఎన్నికల నినాదంగా ప్రజలకు ఇచ్చారు. అదే అసెంబ్లీ ఎన్నికల్లో తమ నినాదం అని ఆయన విలేఖరుల సమావేశం పెట్టి మరీ చెప్పారు. టీఆర్‌ఎస్ పార్టీ పట్ల, ప్రభుత్వం పట్ల కంటే ముఖ్యమంత్రి కేసీఅర్ పట్ల తన అక్కసు వెళ్లగక్కుతున్నారనడానికి ఆయన ఇచ్చిన నినాదం, చేస్తున్న దుష్ప్రచారమే తిరుగులేని తార్కాణాలు. ఎవరి నుంచి రక్షణ కావాలో తెలంగాణ ప్రజలకు బాగా తెలుసు. ఈ నినాదం ఇచ్చేముందు కాంగ్రెస్ పార్టీ ఈ దేశ ప్రజలకు ఇచ్చిన నినాదాలను, వాటి పర్యవసానాలను ఉత్తమ్‌ పరిశీలిస్తే మంచిది. మాజీ ప్రధాని ఇందిరాగాంధి 1972లో ‘గరీబీ హఠావో – -దేశ్ బచావో’ నినాదం ఏమైంది? అంతకుముందు 1960వ దశకం చివరలో ఇచ్చిన ‘రోటి కపడా ఔర్ మకాన్’ నినాదం ఏమైంది? అంతెందుకు 2004 ఎన్నికల సందర్భంగా ఆమ్‌ ఆద్మి నినాదం ఏమైందో కాంగ్రెస్ పార్టీగానీ, ఈ రాష్ట్రంలో ఆ పార్టీకి నాయకత్వం వహిస్తున్న ఉత్తమ్‌ కుమార్ రెడ్డి గానీ ఒక్క సారి పరిశీలిస్తే మంచిది.

రాజకీయాల్లో, ప్రత్యేకించి ఎన్నికల సందర్భంలో ప్రజలను ఆకర్షించడానికి ఈ దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు వారి వారి విధానాలను ప్రకటించడం, వాటి పట్ల ప్రజల స్పందన కోరడం పరిపాటే. అయితే ఇక్కడ ఎప్పుడు లేనంత, విపరీత ధోరణులు అనేకంటే పెడ ధోరణులకు కాంగ్రెస్ పార్టీ ఆజ్యం పోస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తరువాత ఆ రాష్ట్ర ప్రయోజనాలకంటే కాంగ్రెస్ పార్టీ అధికారం మీద ఎక్కువ మోజు చూపిస్తున్నది. నాలుగున్నర సంవత్సరాల టీఆర్‌ఎస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు, ముఖ్యంగా సాగునీటి ప్రాజెక్టులకు అడుగడుగునా ఆటంకాలు కలిగిస్తూ ప్రగతినిరోధకులుగా, ప్రాజెక్ట్ నిర్మాణాలకు విరోధులుగా కాంగ్రెస్ పార్టీ పన్నిన కుట్రలు, కోర్టులో వేసిన కేసులే అందుకు నిదర్శనం. టీఆరెస్ పార్టీ ప్రభుత్వం ప్రజల మధ్యలో ఉండి ప్రజా సంక్షేమం కోసం తెలంగాణ భవిష్యత్ బాగుకోసం చేపట్టిన సాగు నీటి పథకాలను అడ్డుకొనేందుకు కాంగ్రెస్ పార్టీ కోర్టు పక్షిలా తయారయ్యిందనేది జగమెరిగిన సత్యం. చనిపోయిన వారి పేరు మీద చివరికి లేనివారి పేరు మీద వేలి ముద్రలు వేసి బరి తెగించిన దుర్నీతి కాంగ్రెస్ పార్టీది.

తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టికి వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాలపై ఆధారపడ్డ లక్షలాది ప్రజల జీవితాలు బాగు పడాలనీ టీఆర్‌ఎస్ ప్రభుత్వం విప్లవాత్మకంగా ప్రవేశ పెట్టిన పథకాలు ఆచరణాత్మక ఫలితాలు సాధిస్తూ ప్రజల మొహాల్లో సంతోషం వెల్లివిరుస్తుంటే కాంగ్రెస్ పార్టీ చూడలేకపోతున్నదా? లేదా అనతి కాలంలోనే అద్భుతమైన ఫలితాలు సాధిస్తూ దేశానికే మార్గ నిర్దేశనం చేస్తుంటే ఓర్వ లేక పోతున్నదా? చూసి తట్టుకోలేక పోతున్నదా? ఇక జీవితంలో తమ పార్టీ అధికారంలోకి రాదనే దిగులుతో, బెంగతో అనుమానంతో వణికిపోతుందా, అసహనంతో కాంగ్రెస్ పార్టీ నేతలు మాట్లాడుతున్నారా అనేది ప్రజలకు బాగా తెలుసు. ‘కేసీఆర్‌కు హఠావో -తెలంగాణ బచావో’ అన్న నినాదం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఎత్తుగడ అయితే కావచ్చు, కానీ కాంగ్రెస్ పార్టీ అనుకునేది ఒకటి తెలంగాణ ప్రజలు భావించేది మరొకటి. ఎందుకు ఈ నినాదం? కాంగ్రెస్ పార్టీ ఆలోచనలకు కూడా తట్టని విధంగా రాష్ట్రాన్ని పాలిస్తున్నందుకా? రైతులకు 24 గంటల విద్యుత్ ఇస్తున్నందుకా? కాంగ్రెస్ హయాంలో పరిశ్రమలకు పవర్ హాలీడే ప్రకటించి పరిశ్రమలు మూతపడే దుస్థితికి తెస్తే టీఆర్‌ఎస్ ప్రభుత్వం పరిశ్రమలకు రెప్పపాటులో కూడా కరెంటు పోకుండా చేసినందుకా? రైతు బంధు వంటి పథకాన్ని ప్రవేశపెట్టి తెలంగాణ లోని సన్న, చిన్నకారు రైతాంగాన్ని అప్పుల ఊబిలోకి నెట్టకుండా కాపాడినందుకా? అంతెందుకు రైతు కుటుంబం అకాల మరణం చెందితే ఆ కుటుంబం చిన్నాభిన్నం కాకుండా ఆదుకోవాలన్న సంకల్పంతో రైతు బీమా అమలు చేస్తున్నందుకా? ఎందుకు ఈ కేసీఆర్ హఠావో-– తెలంగాణ బచావో నినాదం? నిజమే, 2014 ఎన్నికల సందర్భంలో టీఆర్‌ఎస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాల్లో, హామీల్లో కొన్నింటికి సత్వరమే పరిష్కారం దొరక్కపోవచ్చు. కానీ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్లు, బాలికా ఆరోగ్య రక్ష, కంటి వెలుగు వంటి 76 పథకాలను మేనిఫెస్టోలో పేర్కొనకపోయినా ప్రవేశపెట్టింది టీఆర్‌ఎస్‌. వాటి ఫలాలు ఎట్లా ఉన్నయో ప్రజాక్షేత్రంలోకి పోతే కదా కాంగ్రెస్ పార్టికి తెలిసేది.

ఇవేవి పట్టిచుకోకుండా ఊరికే గాలి ముచ్చట్లు చెప్పడం ఆ పార్టీ విధాన రహిత విధానానికి పరాకాష్ఠ. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 72 ఏళ్ళు గడిచినా కనీసం తాగేందుకు స్వచ్ఛమైన మంచి నీటిని అందించలేని దుర్భర వ్యవస్థకు కారకులు కాంగ్రెస్ పార్టీ కాదా? ఆ పరిస్థితిని శాశ్వతంగా తెలంగాణలో రూపుమాపేందుకు మిషన్ భగీరథ పథకం మరి కొద్ది రోజుల్లో సంపూర్ణమవుతుంది. టీఆరెస్ పార్టీని ప్రజలు దూరం చేసుకుంటారు లేదా దూరం చేస్తామనే దమ్మూ, ధైర్యం కాంగ్రెస్ పార్టీకి ఉంటే– ‘ఎన్నికలు ఇప్పుడే ఎందుకు? ఎన్నికల్ని ఆపండి’ అంటూ కోర్టులకు వెళ్లాల్సిన ఖర్మ కాంగ్రెస్ పార్టీకి ఎందుకొచ్చింది? ప్రజాక్షేత్రంలోకి వెళ్లి తేల్చుకోవచ్చు కదా! కోర్టులకు ఎందుకు ఎక్కడం? కేసీఆర్ హఠావో – తెలంగాణ బచావో అన్న నినాదానికి ప్రజలేమని సమాధానం చెబుతారో తెలుస్తుంది. టీఆర్ఎస్ తన ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విషయాలను అమలు చేసిందా? లేదా? వాటి అమలులో ఉండే వాస్తవ పరిస్థితులు ఏమిటి? ప్రజలు ఎట్లా అర్థం చేసుకుంటున్నారు? అన్న విషయాల చూడాలి. తెలంగాణ గుణాత్మక దిశలో అడుగుపడిందా? లేదా అన్నది చూడాలి. నిజమే డబుల్ బెడ్ రూం ఇళ్లు పూర్తి కాకపోవచ్చు. కానీ ఐదేండ్లలో రెండు లక్షల కుటుంబాలకు శాశ్వతంగా పక్కా ఇళ్లు కాలనీలుగా నిర్మించి ఇస్తామని చెప్పాం. మాటలు చెప్పేవాళ్లు వారి వారి ప్రాంతాల్లో వివిధ దశల్లో ఉన్న దాదాపు రెండు లక్షల ఇళ్లను పరిశీలించి వస్తే తెలుస్తుంది. ఇందిరా ఆవాస్ యోజన, ఇందిరమ్మ పథకాల వలె కాదు తెలంగాణ ప్రభుత్వం రూపకల్పన చేసిన ఇండ్లు. ఆచరణలో కొన్ని సాంకేతిక కారణాల వల్ల, పల్లెల్లో సరిపడా స్థలం అందుబాటులో లేకపోవడం వల్ల, అన్నీ ఒక్కచోటే నిర్మించాలన్న టీఆర్ఎస్ ఆలోచనా విధానం వల్ల కొంచెం ఆలస్యం అయితే కావచ్చు కానీ ఇందిరా ఆవాస్ యోజనలా, ఇందిరమ్మ ఇంటి పథకాల్లా ఉండకూడదనేది ముఖ్యమంత్రి కేసిఆర్ ఆలోచన. నిజానికి కాంగ్రెస్ పార్టీ ఇందిరా ఆవాస్ యోజన పథకం విజయవంతం అయితే దేశవ్యాప్తంగా ఒక్క పూరిగుడిసే ఉండొద్దు. కానీ అలా జరిగిందా? నిజానికి ఇందిరా ఆవాస్ యోజన పథకం కింద అందరికీ ఇండ్లు కట్టిస్తే టీఆర్ఎస్ పార్టీ డబుల్ బెడ్ రూం ఇండ్ల పథకం తెచ్చి ఉండేదే కాదు కదా!

ఇక ఎన్నికల సందర్భంలో భావ సారూప్యత ఉన్న రాజకీయ పార్టీలు పొత్తులు పెట్టుకోవడం సహజం. ఆ పొత్తులు ఆయా పార్టీ సిద్ధాంతాల ప్రాతిపదికగా ఉండాలి. అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ, ఆ పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వం ప్రజాకంఠక విధానాలు నచ్చకపోతే ప్రజల్లో పెల్లుబుకిన నిరసన, ఆందోళన నేపథ్యంలో రాజకీయ పార్టీలు జట్టుకట్టడం అనేది కూడా సహజ పరిణామమే. తెలంగాణలో నిజానికి ఆ పరిస్థితి ఉందా? కాంగ్రెస్, టీడీపీలు పొత్తు పెట్టుకోవడాన్ని తెలంగాణ ప్రజలు ఎట్లా అర్థం చేసుకుంటారన్న కనీస ఇంగిత జ్ఞానం ఉండాలి. తెలంగాణ వెనుకబాటుతనానికి కారణమైన పార్టీలు కలిసిపోటీ చేస్తుండటం ముమ్మాటికీ టీఆర్ఎస్ పార్టీకే కాదు తెలంగాణ ప్రజలకే లాభం. ఈ కూటమి పర్యవసానాలు ఎట్లా ఉంటాయని ఎన్నికల ఫలితాలే స్పష్టం చేస్తాయి. టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాక తెలంగాణ ప్రజల్ని రాచి రంపాన పెట్టినట్టు, భావోద్వేగపు వాతావరణం నెలకొన్నట్టు కాంగ్రెస్ పార్టీ నేతలు భావిస్తున్నారు. అటువంటి వాతావరణాన్ని వారు కోరుకుంటున్నారని ఆ పార్టీల కలయికే స్పష్టం చేస్తున్నది. ఈ కూటమితో కలిసి ప్రొ.కోదండరాం ఎటువంటి సంకేతాలు ఇస్తున్నారు? టీఆర్ఎస్ పార్టీ గడువు కన్నా ముందే ఎన్నికలకు పోవడానికి మూల కారణం ఎవరు? కారకులు ఎవరు? పొత్తుల్ని వ్యతిరేకించడం లేదు. కానీ, ఆ పొత్తుల్లో ఇమిడిన కత్తుల పట్లనే ఇవ్వాళ తెలంగాణ ప్రజల ఆవేదన అంతా.

మొన్నటిదాకా తెలంగాణ సమాజం ప్రొఫెసర్ కోదండరాం అంటే గౌరవించేది. కానీ ఇప్పుడా పరిస్థితి ఉందా? దానికి కారణం ఎవరు? ఆయనే ఆలోచించుకోవాలి? 2009లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకొని, రాష్ట్రం ఇవ్వకుండా అడ్డుకున్న పార్టీల వల్లనే తెలంగాణలో చాలా మంది విద్యార్థులు, యువకులు ఆత్మహత్యలు చేసుకున్నది అన్న విషయం ఆయనకు గుర్తు చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే సందర్భం వచ్చింది కాబట్టి చెప్పకతప్పదు. కాంగ్రెస్, టీడీపీ ఈ రెండు పార్టీల వైఖరుల వల్ల తెలంగాణ యువకులు ఆత్మబలిదానాలు చేసుకునే సందర్భంలో, దాదాపు ఆత్మబలిదానం చేసుకున్న ప్రతీ ఒక్కరూ వారు రాసుకున్న మరణ వాంగ్మూలాలను ఒక్కసారి పరిశీలిస్తే తెలుస్తుంది. ‘కాంగ్రెస్ మంత్రులు రాజీనామాలు చేయాలి, నాదే చివరి చావు కావాలి. మంత్రులారా రాజీనామాలు చేయండి, చంద్రబాబు నాయుడి కబంధ హస్తాల్లోంచి తెలంగాణ నాయకులు బయటపడాలి’…. ఇలా ఎంత మంది? ఎన్ని మరణవాంగ్మూలాలు? ఇటువంటి వారితో పొత్తులా? తెలంగాణ సమాజానికి ఆయన ఏం చెప్పదలచుకున్నారో కలిసిన పార్టీలకు, వారితో చేయి కలిపిన కోదండరాం ఆలోచించుకుంటే మంచిది. విచక్షణ మరచి, విజ్ఞతను మరచి వ్యవహరించడం ఎవరికీ మంచిది కాదు.

తెలంగాణను రాకుండా అడ్డుపడి, ఇప్పటికీ తెలంగాణ అభివృద్ధిని అడుగడుగునా అడ్డుకునే శక్తులతో కూటమి కడితే ఎవరికి ప్రయోజనమో తెలంగాణ సమాజానికి బాగా తెలుసు. ఎన్నికల్లో పొత్తులు, వ్యూహాలు సహజమే. 2009లో ఇదే టీడీపీ తెలంగాణకు అనుకూలమని లేఖ ఇచ్చాకే టీఆర్ఎస్ పార్టీ ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్నది. కమ్యూనిస్టులతోనూ కలిసి పనిచేసింది. కానీ ఎందుకు తెలంగాణ ఆకాంక్షను నెరవేర్చడం కోసం. ఆ పార్టీలను తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోక తప్పని పరిస్థితి సృష్టించడం కోసం. ఆ పార్టీలను తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోకతప్పని పరిస్థితి సృష్టించడం కోసం. కానీ ఇవ్వాళ పోలవరం ప్రాజెక్టులో భాగంగా ఏడు మండలాలను ఆంధ్రలో కలుపుకున్న టీడీపీకి మద్దతు ఇవ్వడమే ఇవ్వాళ కాంగ్రెస్ పార్టీ ఎంచుకున్న లక్ష్యంగా కనిపిస్తున్నది. తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులను, విద్యుత్ ప్రాజెక్టులను అడ్డుకున్న టీడీపీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంటుంది. వీళ్లతో కోదండరాం చేతులు కలిపారు. దీన్ని ప్రజలు ఎట్లా అర్థం చేసుకుంటారో రేపు ప్రజాక్షేత్రంలో తేలుస్తుంది. కానీ ఒక్క మాట నిజం. టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కాంగ్రెస్, టీడీపీలు పార్టీలు ఎంతగా తిట్టాలని చూస్తే తెలంగాణ సమాజం ఆయనను అంతగా అక్కున చేర్చుకుంటుంది. తెలంగాణ ఉద్యమ ప్రతి సందర్భంలో కూడా అది రూఢీ అవుతూ వస్తున్నది. రేపు కూడా అదే పునరావృతం కాబోతున్నది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తొలి నాళ్లలోనే వరంగల్ లోకసభ ఉపఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ వేసిన ఎత్తులు, వ్యూహాలు ఏమయ్యాయో తెలుసు. హైదరాబాద్ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏమైందో తెలుసు. రేపు అదే తెలంగాణ అంతటా నిజమవుతుంది. నిజానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పినట్టు ‘కేసీఆర్ హఠావో తెలంగాణ బచావో కాదు. ‘కేసిఆర్ ఆగే బడో, తెలంగాణ బచావో’ అంటూ తెలంగాణ సమాజం మేల్కొని ఆయనను పిలుస్తుంది. కేసీఆరే మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుతున్నారు. తెలంగాణ వస్తే చీకటే అన్నో‍‍ళ్ళు ఎక్కడున్నరో ఇప్పడు కేసీఆర్ హఠావో అనేవాళ్లు ఎక్కడుంటారో అదీ సమీప భవిష్యత్ లోనే తేలిపోతుంది. బోయినపల్లి వినోద్ కుమార్ లోకసభ సభ్యులు, కరీంనగర్

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.