Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

కాంగ్రెస్ సిట్టింగులు ఔటే

-వందకుపైగా సీట్లలో గెలుపు మనదే: కేసీఆర్
-ప్రతి నియోజకవర్గంలో బహిరంగసభలో పాల్గొంటా
-బూత్‌స్థాయిపై దృష్టిపెట్టాలి.. ప్రభుత్వ లబ్ధిదారులను స్వయంగా కలువాలి
-మ్యానిఫెస్టోకు అద్భుతమైన స్పందన
-జిల్లాల్లో మంత్రులు, ఎంపీలు అభ్యర్థుల గెలుపు బాధ్యత తీసుకోవాలి
-టీఆర్‌ఎస్ అభ్యర్థుల అవగాహన సదస్సులో సీఎం కేసీఆర్
-అభ్యర్థులకు లబ్ధిదారుల వివరాలతో బుక్‌లెట్ పంపిణీ

వచ్చే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి వందకుపైగా సీట్లు గెలువబోతున్నదని, కాంగ్రెస్ సిట్టింగ్ స్థానాలను సైతం గెలుచుకుంటుందని పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. కేంద్ర సంస్థలు, స్థానిక ప్రైవేటు సంస్థలు చేసిన సర్వేలన్నింటిలోనూ ప్రజలు టీఆర్‌ఎస్‌కు బ్రహ్మరథం పడుతున్నట్టు ఫలితాలు వచ్చాయని తెలిపారు. సర్వేలన్నింటిలోనూ వందకుపైగా స్థానాల్లో గెలుస్తామని తేలిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం తెలంగాణభవన్‌లో టీఆర్‌ఎస్ అభ్యర్థులతో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి పార్టీ ఎంపీలను కూడా ప్రత్యేకంగా ఆహ్వానించారు. సమావేశంలో జహీరాబాద్, మలక్‌పేట స్థానాలకు కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించారు. రాబోయే 45 రోజులు పార్టీకి, అభ్యర్థికి చాలా కీలకమని, ఏ ఒక్కరోజూ సెలవులేకుండా ప్రచారం నిర్వహించాలని కేసీఆర్ సూచించినట్టు విశ్వసనీయంగా తెలిసింది.

నాలుగున్నరేండ్లలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలుచేసిన పథకాలతో ఒక్కో నియోజకవర్గంలో కనీసం 60వేల మంది వరకు లబ్ధిపొందారని, వీరికి రైతుబంధు లబ్ధిదారులు అదనంగా ఉన్నారని చెప్పారు. నియోజకవర్గాల లబ్ధిదారుల జాబితాను అందచేస్తున్నామని, ప్రభుత్వం నుంచి లబ్ధిపొందిన వారందరికీ ప్రభుత్వంపై కృతజ్ఞత ఉంటుందని, పార్టీ అభ్యర్థులు, నాయకులు వారిని తప్పనిసరిగా కలిసి టీఆర్‌ఎస్‌కు ఓటు వేయాలని విజ్ఞప్తి చేయాలని సూచించారు. టీఆర్‌ఎస్ మ్యానిఫెస్టోకు అద్భుతమైన స్పందన వస్తున్నదని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని, ప్రతిపక్షాలు చేసే తప్పుడు ప్రచారాన్ని ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలన్నారు. సామాజిక మాధ్యమాల్లోనూ ఎప్పటికప్పుడు స్పందిస్తూ ఉండాలని చెప్పారు. ఏ ఒక్క ఓటరును కూడా నిర్లక్ష్యం చేయవద్దని, బ్యాక్‌ఆఫీస్, ఫ్రంట్ ఆఫీసులకు చురుకైన, నమ్మకస్థులైన వారిని నియమించుకోవాలని సూచించారు.

కుల సంఘాలవారీగా సమావేశాలు
ప్రతి నియోజకవర్గంలో బహిరంగసభల్లో స్వ యంగా పాల్గొంటానని సీఎం కేసీఆర్ తెలిపారు. నియోజకవర్గాలవారీగా తేదీలను త్వరలో ఖరారు చేసి తెలుపుతామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పింఛన్లు పొందుతున్నవారు 40 లక్షల మంది ఉన్నారని, వారందరికీ ప్రస్తుతం ఇస్తున్న మొత్తాన్ని రూ.2016కు, రూ.3016కు పెంచుతున్నామని, అభ్యర్థులు స్వయంగా వారిని కలిసి ఈ విషయం వివరించాలని అన్నారు. కుల సంఘాలవారీగా సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని, ఆ సంఘాలకు ప్రభుత్వపరంగా చేసిన సాయాన్ని తెలుపాలని చెప్పారు. ఆర్యవైశ్యులు, గొల్ల కుర్మలు, మైనార్టీలు ఇలా వివిధవర్గాలతో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించి వారు టీఆర్‌ఎస్‌కు ఓటువేసే విధంగా చూసుకోవాలన్నారు. జిల్లాల్లో అభ్యర్థుల గెలుపు బాధ్యతలను జిల్లా మంత్రులు, ఎంపీలు ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవాలని సూచించారు.

వంద సీట్లు సాధించడం లక్ష్యం
టీఆర్‌ఎస్ ప్రభుత్వం రావడం ఖాయమైందని, ఇందుకు అవసరమైన సీట్లు వస్తాయని.. కానీ తన లక్ష్యం వందసీట్లు సాధించడమేనని కేసీఆర్ తెలిపారు. ఈ విషయాన్ని అభ్యర్థులంతా గుర్తుంచుకోవాలన్నారు. 2014లో టీఆర్‌ఎస్‌కు 63 సీట్లు వస్తే ప్రభుత్వాన్ని పడగొట్టడానికి టీడీపీ, కాంగ్రెస్‌లు ప్రయత్నం చేశాయని ఈ సందర్భంగా చెప్పారు. ప్రభుత్వాన్ని పడగొట్టే విషయాన్ని ఢిల్లీలో తెలుసుకున్న ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ తనకు ఫోన్‌చేసి సమాచారమిచ్చారని, టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి మద్దతిస్తామని ముందుకొచ్చారని తెలిపారు.

ఈసారి సర్వేలు వందకుపైగా సీట్లు వస్తాయని చెపుతున్నాయని, సర్వేలే చెప్పడం కాదని.. మనందరం కూడా వందసీట్లు లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. ప్రజల నుంచి స్పందన అద్భుతంగా ఉన్నదని, అసెంబ్లీ ఎన్నికల్లో వంద సీట్లు గెలుచుకోవడంతోపాటు, రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లోనూ పెద్ద ఎత్తున ఎంపీ సీట్లు కూడా గెలుచుకోబోతున్నామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో ఫెడరల్ ఫ్రంట్‌లో కీలక భూమిక పోషిస్తుందన్నారు. పార్టీకి రెండు మూడు కేంద్ర మంత్రి పదవులు కూడా లభిస్తాయని, కేంద్రం నుంచి అధిక మొత్తంలో నిధులు రాబట్టుకుని, రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుందని కేసీఆర్ తెలిపారు.

అభ్యర్థులకు లబ్ధిదారుల బుక్‌లెట్
టీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలుచేసిన పథకాలతో ప్రయోజనం పొందిన లబ్ధిదారుల వివరాలతో నియోజకవర్గాలవారీగా రూపొందించిన బుక్ లెట్లను సమావేశంలో అభ్యర్థులకు అందజేశారు. అందులో ప్రభుత్వ పథకాల సమగ్ర వివరాలను పొందుపరిచారు. ఆసరా, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్స్, సీఎంఆర్‌ఎఫ్, ఆరోగ్యశ్రీ పథకాలతోపాటు, జీతాలు పెంచడంతో లబ్ధిపొందుతున్న అంగన్‌వాడీ, ఆశ, హోంగార్డుల పేర్లు కూడా ఉన్నాయి.

అసరా లబ్ధిదారుల ఓటింగ్ ఫస్ట్
బూత్‌స్థాయిలో ప్రణాళికను రూపొందించుకోవాలని సీఎం కేసీఆర్ అభ్యర్థులకు సూచించారు. ప్రతి ఒక్క ఓటు విలువైనదేనని, ప్రతి ఓటరు యూనిట్‌గా ప్రణాళిక రూపొందించుకోవాలని చెప్పారు. అందరూ ఓటుహక్కు వినియోగించుకునేలా చూడటంతోపాటు, ఆ ఓటు టీఆర్‌ఎస్‌కు వేసేలా చూడాలని తెలిపారు. పోలింగ్ ప్రారంభంలో అసరా పింఛన్ల లబ్ధిదారులు ఓటు వేసే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. నాలుగేండ్లుగా నెలకు వెయ్యి రూపాయల పింఛన్ తీసుకుంటున్నందున వారు తప్పకుండా టీఆర్‌ఎస్‌కు ఓటువేస్తారని తెలిపారు.

ఆ తరువాత ఇతర పథకాల లబ్ధిదారులు ఓటింగ్‌లో పాల్గొనేలా చూడాలని చెప్పారు. ఇలా పార్టీకి పూర్తిగా అనుకూలంగా ఉన్నవారి ఓట్లు మొదట్లోనే వేయించేలా కార్యకర్తలు, నాయకులు సమన్వయం చేసుకోవాలని తెలిపారు. పాజిటివ్ ఓటింగ్ పూర్తి అయిన తరువాత తటస్థులు, ప్రత్యర్థి పార్టీల ఓటర్లపై దృష్టి పెట్టాలని సూచించారు. ఎన్నికల నిబంధనలపై పూర్తి అవగాహన ఏర్పాటు చేసుకుని అందుకనుగుణంగా నడుచుకోవాలని, ప్రత్యర్థి పార్టీలు ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తే వెంటనే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయాలన్నారు. సర్వేల వివరాలను అభ్యర్థులకు ఇవ్వడంతోపాటు, ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ఉన్న అనుకూలతలు, వాస్తవాలను వివరిస్తూ సీఎం కేసీఆర్ వారిలో ఉత్సాహం నింపేందుకు పలు సూచనలు చేశారు.

హాజరైన స్పీకర్ మధుసూదనాచారి
టీఆర్‌ఎస్ భూపాలపల్లి నియోజకవర్గ అభ్యర్థిగా పోటీచేస్తున్న స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి పార్టీ అభ్యర్థుల సమావేశానికి హాజరయ్యారు. స్పీకర్‌గా నియమితులయ్యాక ఆయన తెలంగాణభవన్‌కు రాలేదు. భూపాలపల్లి నుంచి టీఆర్‌ఎస్ పోటీచేస్తున్నందున పార్టీ అభ్యర్థిగా సమావేశానికి హాజరయ్యారు. ముందుగా తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలవేసి, సమావేశ మందిరంలోకి వచ్చారు. అభ్యర్థుల జాబితాలో సీఎం కేసీఆర్ సంతకం చేస్తున్న సమయంలో మధుసూదనాచారి పక్కనే ఉన్నారు. అక్కడే ఉన్న ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి స్పీకర్‌ను ఉద్దేశించి.. నాలుగున్నరేండ్ల తరువాత తెలంగాణ భవన్‌కు వచ్చారని అనడంతో.. ముఖ్యమంత్రి జోక్యం చేసుకొని తనను పార్టీ ఫ్లోర్‌లీడర్‌గా ఎన్నుకొనేందుకు ఎమ్మెల్యేగా శాసనసభాపక్ష సమావేశానికి వచ్చారని, ఈసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా హాజరయ్యారని నవ్వుతూ అన్నారు. అనంతరం కేసీఆర్.. స్పీకర్ భుజం తట్టారు.

నగేశ్, వివేకానందకు జన్మదిన శుభాకాంక్షలు
ఆదివారం జన్మదినం జరుపుకొన్న ఆదిలాబాద్ ఎంపీ నగేశ్, కుత్బుల్లాపూర్ అభ్యర్థి కేపీ వివేకానందకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. మిగిలినవారిని కూడా శుభాకాంక్షలు తెలుపాలని సూచించడంతో వారంతా చప్పట్లతో అభినందించారు.

కాంగ్రెస్ సింగిల్ డిజిట్‌కే పరిమితం
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సింగిల్ డిజిట్‌కే పరిమితం అవుతుందని, మిగిలిన అన్నిస్థానాల్లోనూ టీఆర్‌ఎస్ అభ్యర్థులు బ్రహ్మాండమైన మెజార్టీ సాధిస్తారని కేసీఆర్ అన్నారు. దేవరకద్ర నియోజకవర్గంలో 76 శాతం ప్రజలు టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా ఉన్నారని తెలిపారు. ఇతర నియోజకవర్గాల్లోనూ మంచి మెజార్టీతో టీఆర్‌ఎస్ ముందున్నదని, అయితే అభ్యర్థులు ఎక్కడా అలసత్వం వహించొద్దని చెప్పారు. ఆందోల్ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ అభ్యర్థి క్రాంతికిరణ్ లక్కీఫెలో అని సీఎం అన్నారు. అక్కడ కాంగ్రెస్ అభ్యర్థికి 35శాతం అనుకూలంగా ఉంటే.. క్రాంతికిరణ్‌కు 50శాతం అనుకూలంగా ఉన్నట్టు సర్వేలు చెపుతున్నాయని, మిగిలినవి బాబూమోహన్‌కు అనుకూలంగా ఉన్నాయని చెప్పారు. క్రాంతి గెలువబోతున్నాడంటూ సమావేశంలో చెప్పారు. నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, మెదక్ జిల్లాల్లో క్లీన్‌స్వీప్ చేయబోతున్నామని, రంగారెడ్డి జిల్లాలోనూ అనూహ్య ఫలితాలు రాబోతున్నాయని అన్నారు. హైదరాబాద్ నగర శివారు నియోజకవర్గాలన్నీ అనుకూలంగా ఉన్నాయని, ఇక్కడ టీఆర్‌ఎస్ పెద్దఎత్తున ఓటింగ్ జరుగబోతున్నదని చెప్పారు, జగిత్యాల ఈసారి టీఆర్‌ఎస్‌దేనని, నియోజకవర్గంలో 55 వేల మందికి ఆసరా పింఛన్లు అందుతున్నాయని అన్నారు. పార్టీ అభ్యర్థులకు గట్టి పోటీ ఉన్న స్థానాల్లో అవసరమైతే రెండుసార్లు ప్రచారంలో పాల్గొంటానని కేసీఆర్ చెప్పారు.

మలక్‌పేట బరిలో కార్మికనేత సతీశ్‌కుమార్
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగిగా ఉన్న సతీశ్‌కుమార్.. 1997లో స్వచ్ఛంద పదవీవిరమణ తీసుకొని ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. 1999లో టీడీపీలో చేరిన సతీశ్‌కుమార్.. టీఎన్టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడితోపాటు వివిధ హోదాల్లో పనిచేశారు. 2010లో కేసీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరి 2014 ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థిగా మలక్‌పేట నుంచి బరిలో దిగి ఓడిపోయారు. టీఆర్‌ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీగా, మధ్యంతర ఎన్నికల్లో మహబూబ్‌నగర్ నియోజకవర్గ ఇంచార్జిగా, వనపర్తి, కొల్లాపూర్ నియోజకవర్గాల్లో పల్లెబాట కార్యక్రమం ఇంచార్జిగా, ఎమ్మెల్సీ ఎన్నికల్లో కరీంనగర్ ఇంచార్జిగా పార్టీ విజయంలో కీలకపాత్ర పోషించారు. జలమండలి కామ్‌గార్ యూనియన్‌కు అధ్యక్షుడిగా రెండుసార్లు ఘనవిజయం సాధించారు. 2014 నుంచి మలక్‌పేట నియోజకవర్గ పార్టీ ఇంచార్జిగా కొనసాగుతున్నారు. మలక్‌పేట నియోజకవర్గ టీఆర్‌ఎస్ అభ్యర్థిగా సతీశ్‌కుమార్‌ను ప్రకటించడంతో సైదాబాద్‌లోని ఆయన ఇంటి వద్ద టీఆర్‌ఎస్ శ్రేణులు మిఠాయి పంచిపెట్టి, పటాకులు కాల్చి సంతోషం వ్యక్తం చేశాయి. ఈ సందర్భంగా ఆయన నమస్తే తెలంగాణతో మాట్లాడుతూ.. రానున్న ఎన్నికల్లో ఘనవిజయం సాధించి టీఆర్‌ఎస్ పార్టీ సత్తా చాటుతుందని ధీమా వ్యక్తంచేశారు. మలక్‌పేట నుంచి విజయం సాధించి సీఎం కేసీఆర్ నమ్మకాన్ని నిలబెడుతానని చెప్పారు.

జహీరాబాద్ అభ్యర్థిగా రిటైర్డ్ ఆర్టీవో మాణిక్‌రావు
రవాణాశాఖలో ఆర్టీవోగా పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన కొన్నింటి మాణిక్‌రావు.. 1953లో ఉమ్మడి మెదక్ జిల్లా ఝరాసంగంలో బాలప్ప, లక్ష్మమ్మ దంపతులకు జన్మించారు. ఎస్సీ మాదిగ సామాజికవర్గానికి చెందిన మాణిక్‌రావుకు భార్య మంజులత, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. ఉద్యోగ విరమణ తర్వాత టీఆర్‌ఎస్ పార్టీలో చేరి వివిధ హోదాల్లో సేవలందించారు. 2014 ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన మాణిక్‌రావు.. సమీప కాంగ్రెస్ అభ్యర్థి జే గీతారెడ్డి చేతిలో కేవలం 842 ఓట్ల తేడాతో ఓడిపోయారు. తనకు మరోసారి అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుత ఎన్నికల్లో ఘనవిజయం సాధించడం ఖాయమన్న ధీమాను మాణిక్‌రావు వ్యక్తం చేశారు.

నోటిఫికేషన్ వచ్చేలోగా 40 చోట్ల సభలు
వరంగల్, కరీంనగర్, ఖమ్మం ఉమ్మడి జిల్లాల్లో త్వరలో బహిరంగసభలు నిర్వహించనున్నట్టు సీఎం కేసీఆర్ తెలిపారు. వీటి తేదీలను త్వరలో ఖరారు చేస్తామని చెప్పారు. ఈ సభలతోపాటుగా వచ్చేనెల 12వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేలోగా 30 నుంచి 40 నియోజకవర్గాల్లో సభలు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు వివరించారు. ఈ సభల తేదీలు కూడా త్వరలోనే ఖరారవుతాయన్నారు. అభ్యర్థులకు తమ నియోజకవర్గాల్లో బహిరంగసభలు నిర్వహించడానికి అనువైన తేదీలను తెలుపాలని సీఎం సూచించినట్టు సమాచారం.

ప్రతి లబ్ధిదారుడికి లేఖ
టీఆర్‌ఎస్ ప్రభుత్వ పథకాలతో లబ్ధిపొందిన అందరికీ లేఖలు రాయనున్నట్టు సీఎం కేసీఆర్ తెలిపారు. దాదాపుగా కోటిన్నర మంది లబ్ధిదారులున్నారని, వారికి స్వయంగా లేఖలు రాస్తానని చెప్పారు. నేను లేఖల ద్వారా లబ్ధిదారులను టచ్‌చేస్తా.. మీరు స్వయంగా కలిసి వారిని ఓటు అడగండి అంటూ కేసీఆర్ పార్టీ అభ్యర్థులకు సూచించారు.

మరో రెండు స్థానాలకు అభ్యర్థుల ప్రకటన
జహీరాబాద్, మలక్‌పేట నియోజకవర్గాల నుంచి పార్టీ తరఫున పోటీచేసే అభ్యర్థులను టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. జహీరాబాద్ నుంచి గతంలో పోటీచేసిన మాణిక్‌రావు, మలక్‌పేట నుంచి చావా సతీశ్‌కుమార్‌ను ఖరారు చేస్తున్నట్టు తెలిపారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.