– వారికి ఓటు వేస్తే తెలంగాణను ఢిల్లీకో..గుంటూరుకో తెగనమ్ముతారు -టీ కాంగ్రెస్‌ది శకుని పాత్ర .. వెనుకబాటుకు మాజీ మంత్రులే కారణం – పాలమూరులో బయటపడ్డ చంద్రబాబు సమైక్యబుద్ధి ..క్షమాపణ చెప్పాలి -చీమూనెత్తురు ఉంటే టీడీపీ టీ నేతలు పార్టీ నుంచి బయటకు రావాలి – దళిత సీఎం హామీకి టీఆర్ఎస్ కట్టుబడే ఉంది: హరీశ్‌రావు

సంగారెడ్డి: తెలంగాణ పాలిట దుష్టశక్తులైన కాంగ్రెస్, టీడీపీలను ఈ ప్రాంతం నుంచి సాగనంపాలని టీఆర్ఎస్ఎల్పీ ఉపనేత హరీశ్‌రావు పిలుపునిచ్చారు. ఆ రెండు పార్టీలకు ఓటేస్తే తెలంగాణను ఒకరు ఢిల్లీకి, మరొకరు గుంటూరుకు తెగనమ్ముకుంటరన్నారు. బుధవారం మెదక్ జిల్లా సంగారెడ్డిలో ఆయన మాట్లాడారు. ఈ ప్రాంత వెనుకబాటుకు కారకులైన మాజీ మంత్రులు, తామే తెలంగాణ తెచ్చామని సంకలు గుద్దుకుంటున్నారని మండిపడ్డారు. టీఆర్ఎస్ అధికారంలోకి రావద్దనే ఉద్దేశంతోనే కేసీఆర్ టీఆర్ఎస్పై విమర్శలు చేస్తున్నారన్నారు. టీఆర్ఎస్ వస్తే పోలవరం కట్టడం సాధ్యం కాదని, ముంపు మండలాలను ఆంధ్రలో కలపడం వీలుపడదు, ఉద్యోగాలు, నీళ్లు, నిధుల్లో దోపిడీ సాగదన్నారు. అందుకే టీఆర్ఎస్ను విమర్శిస్తున్నారని ఆరోపించారు.
టీఆర్ఎస్, ప్రజలు కోరుకున్నట్లుగా రాష్ర్టాన్ని కాంగ్రెస్ ఏర్పాటు చేయలేదన్నారు. సీమాంధ్రకు ప్రత్యేక హాదా, పోలవరానికి జాతీయా హోదా ఇచ్చి తెలంగాణ ఏమీ ఇవ్వలేదని, ఆంక్షలు విధించారని అందుకే టీఆర్ఎస్ను విలీనం చేయలేదన్నారు.పాలమూరు వేదిక సాక్షిగా చంద్రబాబు జై సమైక్యాంధ్ర అంటే టీడీపీ టీ నేతలు నోళ్లు వెళ్లబెట్టారని విమర్శించారు. చంద్రబాబు తిరిగి మాటమార్చి జై తెలంగాణ అన్నప్పటికీ, తెలంగాణ ప్రజలకు భేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. చీమూనెత్తురు ఉంటే తక్షణమే టీడీపీ నుంచి తెలంగాణ నేతలు బయటకు రావాలన్నారు.
తెలంగాణలో బీసీలకే సీఎం పదవి ఇస్తానంటున్న చంద్రబాబు, సీమాంధ్రలోనూ ఇవ్వాలన్నారు. తెలంగాణను అన్నిరంగాల్లో నాశనం చేసిన బాబు, టీడీపీతోనే అభివద్ధి సాధ్యమనడం హాస్యాస్పదమన్నారు. ఆయన హయాంలో 10 వేల మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారని, చేనేత కార్మికుల ఆకలిచావులు, ఉద్యమించిన అంగన్వాడీలను గుర్రాలతో తొక్కించారని, కల్లు నిషేధంతో 50 వేల మంది గీత కార్మికులు రోడ్డున పడ్డారని, కరెంట్ అడిగితే కాల్చి చంపారని విమర్శించారు. దళిత సీఎం విషయంలో టీఆర్ఎస్ ఇప్పటికీ కట్టుబడే ఉందని, ఎన్నికల తర్వాత ఎమ్మెల్యేలు ఆ విషయంపై నిర్ణయం తీసుకుంటారన్నారు.