-పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కేటీఆర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను ఆదినుంచీ పాలించిన కాంగ్రెస్ పాలకులు, తొమ్మిదేండ్లు రాష్ర్టాన్ని ఏలిన టీడీపీ అధినేత చంద్రబాబు వివక్ష కారణంగా తెలంగాణ వెనుకబాటుకు కురైందని రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కే తారకరామారావు విమర్శించారు. రాష్ట్రంలో ప్రస్తుత విద్యుత్ కష్టాలకు నాటి పాలకులే కారణమని విమర్శించారు. మెదక్ జిల్లా ములుగు మండలంలో సోమవారం ఆయన ఉప ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ విద్యుత్ కష్టాలు సీఎం కేసీఆర్ వల్లనే వచ్చాయన్న పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య విమర్శలను తిప్పికొట్టారు.

కాంగ్రెస్, టీడీపీ పాలనలోనే తెలంగాణ ఆగమైందన్నారు. కరీంనగర్, వరంగల్, అదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలోనే బొగ్గు గనులున్నప్పటికీ, దాని ఆధారంగా నడిచే విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను ఆంధ్రా పాలకులు విజయవాడ, రాయలసీమల్లో ఏర్పాటుచేసి తెలంగాణకు అన్యాయం చేశారని విమర్శించారు. తెలంగాణ అభివృద్ధికి ఒక్కపైసా ఇవ్వనని సాక్షాత్తూ అసెంబ్లీలోనే నాటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రకటిస్త్తే తెలంగాణ మంత్రులు ఏం చేశారని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నేతలు ప్రశాంత్‌రెడ్డి, సుధీర్‌రెడ్డి, నర్సారెడ్డి, సత్తయ్య, మహ్మద్ జహంగీర్, సురేష్‌గౌడ్, అంజిరెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, కైలాసం పాల్గొన్నారు.