Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

కాంగ్రెస్ వల్లే బలిదానాలు

ఇబ్రహీంపట్నం: తెలంగాణ ఏర్పాటుకు కాంగ్రెస్ పార్టీ తీవ్ర అడ్డంకిగా మారటం వల్లనే సుమారు పదిహేనువందల మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. తెలంగాణ కోసం ఆత్మహత్యలు చేసుకున్న అమరవీరులకు పార్లమెంట్‌లో, రాజ్యసభలో, అసెంబ్లీలో సంతాప తీర్మానం కూడా ప్రవేశపెట్టలేని కాంగ్రెస్..ఎన్నికలు రాగానే అమరుల పేరుచెప్పుకుని ఓట్లు పొందాలని చూస్తోంది అని టీఆర్‌ఎస్ సెక్రటరీ జనరల్,  రాజ్యసభ సభ్యుడు కే.కేశవరావు ధ్వజమెత్తారు.

Keshava Rao 001

– తెలంగాణ తెచ్చామని ఆ పార్టీ చెప్పుకోవటం సిగ్గుచేటు – రాష్ర్టానికి కేసీఆర్ నాయకత్వం అవసరం: కే కేశవరావు – పొన్నాల లక్ష్మయ్యా ఖబడ్దార్: నాయిని నర్సింహరెడ్డి – ఇబ్రహీంపట్నంలో టీఆర్‌ఎస్ బహిరంగ సభ సక్సెస్

శుక్రవారం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో టీఆర్‌ఎస్ ఎన్నికల ప్రచారసభలో ఆయన ప్రసంగించారు. అమరవీరుల త్యాగాల ఫలితం, కేసీఆర్ చేపట్టిన ఉద్యమాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో కాంగ్రెస్ నాయకులు, మంత్రులు అడుగడుగునా అడ్డుతగిలారని ఆరోపించారు. తెలంగాణ వద్దని రాష్ట్ర ముఖ్యమంత్రి..సోనియాగాంధీ వద్ద అడ్డుచెప్పలేదా అని ప్రశ్నించారు. రాష్ట్ర ఏర్పాటుపై లోక్‌సభ, రాజ్యసభలో చర్చ జరిగితే కాంగ్రెస్‌కే చెందిన ఎంపీలు, మంత్రులు అడ్డుకున్నారని గుర్తుచేశారు. ఇప్పుడేమో తెలంగాణ తామే తెచ్చామంటూ కాంగ్రెస్ నాయకులు ప్రచారం చేసుకోవటం దయ్యాలు వేదాలు వల్లించినట్లుందని ఎద్దేవాచేశారు.

తెలంగాణ ఉద్యమం జరిగినన్నాళ్లు పదవులను అంటిపెట్టుకుని, ఉద్యమంవైపు కన్నెత్తిచూడని కాంగ్రెస్ నాయకులు..తామే తెలంగాణ తెచ్చామని చెబుతుంటే పిచ్చెక్కుతోందన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కారణమైన కేసీఆర్ నాయకత్వం ఎంతో అవసరమన్నారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్ అధికారంలోకి రాగానే ఎన్నికల మ్యానిఫెస్టోలో పొందుపర్చిన ప్రతిఅంశాన్ని అమలుచేస్తామన్నారు. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య, వృద్ధులకు పింఛన్, బడుగు,బలహీనవర్గాలకు ఇళ్లు, అమరుల కుటుంబాలకు ఉద్యోగాలు ఇస్తామన్నారు.

తెలంగాణ ప్రజల కడుపుకొట్టిన పొన్నాల: నాయిని ఒక్కనాడు కూడా జై తెలంగాణ అనని పొన్నాల లక్ష్మయ్య టీఆర్‌ఎస్‌పై అవాకులు చెవాకులు పేలితే సహించేదిలేదు.. ఖబడ్దార్ అని టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు నాయిని నర్సింహరెడ్డి హెచ్చరించారు. సీమాంధ్ర నాయకుల మద్దతు తో టీపీసీసీ అధ్యక్షుడైన పొన్నాల లక్ష్మయ్య సీఎం అయితే తెలంగాణను ఆంధ్ర పాలకుల పాదాల వద్ద తాకట్టుపెడతారన్నారు. సీమాంధ్రులకు తొత్తుగా మారిన పొన్నాల లక్ష్మయ్య కు తెలంగాణలో ఓట్లు అడిగే నైతిక హక్కులేదన్నారు. నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు పొన్నాల లక్ష్మయ్య పోతిరెడ్డిపాడు నుంచి రాయలసీమకు నీళ్లు తీసుకెళ్లి తెలంగాణ ప్రజల కడుపుకొట్టారన్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌ను చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. అమరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మపై పోటీ నుంచి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తప్పుకుని, గెలిపించి నిజాయితీని నిరూపించుకోవాలన్నారు. తోడు దొంగలైన చంద్రబాబు, వెంకయ్యనాయుడు ఓట్ల కోసం జతకట్టారని, వారిది అపవిత్రమైన కలయికన్నారు. చంద్రబాబు ఎంగిలి మెతుకులు తినే మంచిరెడ్డి కిషన్‌రెడ్డిని చిత్తుగా ఓడించాలన్నారు. కార్యక్రమంలో భువనగిరి ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్, ఇబ్రహీంపట్నం అసెంబ్లీ టీఆర్‌ఎస్ అభ్యర్థి కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.