Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

కాంగ్రెస్ వస్తే చీకటే

-కాంగ్రెస్‌వాళ్లు ప్రాజెక్టు సైజును కుదిస్తరట
-బుర్ర లేదు.. నీళ్లిచ్చే తెలివి లేదు..
-ఉన్నవాడు చేస్తనంటే కానీయరు
-ఎస్సెల్బీసీని ఎందుకు ఒప్పకున్నరో చెప్పాలి
-దేవరకొండ ఎన్నికల సభలో సీఎం కేసీఆర్

పొరపాటున కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మళ్లీ చీకటి వస్తుంది జాగ్రత్త.. అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు హెచ్చరించారు. మళ్లీ కందిళ్ల్లు, ఎక్కాలు పెట్టుకోవాల్సి వస్తుందని చెప్పారు. కాంగ్రెస్‌వాళ్లకు నీళ్లిచ్చే తెలివి లేదని విమర్శించారు. పెద్దపెద్ద ప్రాజెక్టులు కడుతామంటే.. ప్రాజెక్టు సైజును కుదిస్తరట! చేసే తెలివిలేదు.. బుర్రలేదు. ఉన్నవాడు చేస్తనంటే కానీయరు అని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రాజెక్టులు పూర్తిచేసుకుంటుండటంతో నీళ్లు వచ్చినకాడ ఎకరంకాడ రెండెకరాలు, రెండెకరాలోడు నాలుగెకరాలు వేస్తున్నడు. నిలకడగా కరంటు ఉన్నది. నిజమా? కాదా? మీరు ఆలోచన చేయాలి అని కోరారు. బుధవారం దేవరకొండలో నిర్వహించిన భారీ బహిరంగసభలో సీఎం కేటీఆర్ మాట్లాడారు. ప్రసంగంలోని ముఖ్యాంశాలు.. ఆయన మాటల్లోనే..

నాగార్జునసాగర్ విషయంలో మోసంచేశారు
1969 ఉద్యమం తర్వాత ఆనాడు పెద్దలు ఒప్పందంలో భాగం గా ఒక ప్రాజెక్టును చెప్పారు. దేవరకొండ, మునుగోడు, నల్లగొండ జిల్లాలోని ఇతర ప్రాంతాలకు నీళ్లు ఇస్తమని చెప్పినరు. మునిగిపోయిందేమో నల్లగొండ. ఇదే దేవరకొండలో 33 గ్రామాలు, 60, 70 తండాలు మునిగిపోయినయి. నీళ్లు మాత్రం దేవరకొండకురావు. ఇదెక్కడి అన్యాయం? నాగార్జునసాగర్ డ్యాంను కట్టాల్సిన జాగలోనే కట్టాలి. 20 కిలోమీటర్ల పైకి కట్టాలి. అప్పుడు దండిగా నీళ్లొచ్చేవి. కానీ మోసం చేసినరు.

ఎస్సెల్బీసీ వెనుకకు పోదు.. ముందుకు రాదు..
ఇక ఎస్సెల్బీసీ! ఎన్నేండ్లయింది? ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగం.. అండ్లో మిషన్ జొరగొట్టినరు. అది తవ్వుకుంట తవ్వుకుంట బయటికెళ్లాలి తప్ప.. వెనుకకు తీసుకోలేం. ఎంత ఘోరమైన కుట్ర! దీన్ని ఒప్పుకున్నోళ్లు ఎవరు? పెట్టినవాడు ఎన్టీ రామారావు.. ఆయన ఆంధ్ర ముఖ్యమంత్రి. మనకు నీళ్లియ్యాలనే ఉద్దేశం వాళ్లకు లేదు. కానీ ఒప్పుకున్నోడెవడు? మన తెలంగాణోళ్లే. నాకంటే దొడ్డున్నరు కదా.. ఈ జిల్లాల ఉన్న ప్రతిపక్ష నాయకుడు జానారెడ్డి.. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి.. బయటికిపోయి పెద్దపెద్ద మాటలు మాట్లాడుతరు. ఏం తెలివితేటలతోటి ఒప్పుకున్నరు? ఎస్సెల్బీసీ ఒప్పుకున్ననాడు జానారెడ్డి మంత్రిగనే ఉన్నడు. మరి ఏంచేసినవు జానారెడ్డి? నీ తెలివి ఏమైంది? జిల్లా ప్రజలకు సమాధానం చెప్పాలి. ఇయ్యాల సిగ్గు లేకుండా ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నవు? ఇష్టమొచ్చినట్టు రాజకీయం చేయాలనుకుంటున్నరు. కానీ చెల్లదు.

రెండు లక్షల ఎకరాలకు నీళ్లిస్తం…
నాయిని నర్సింహారెడ్డి నాకు పెద్దన్నలాంటివాడు. సొంత ఊరు.. నేరడుగొమ్మను పట్టుబట్టి మండలకేంద్రం చేయించినడు. నేరడుగొమ్మకు నీళ్లు కావాలి.. నువ్వు ప్రకటించాలి అని ఆజ్ఞ ఇచ్చినరు. పెద్దన్న కాబట్టి వెనుకకు పోయేది లేదు. పెద్దమునిగల్ లిఫ్టు పెట్టి నేరడుగొమ్మ ప్రాంతానికి ఎంత ఖర్చయినా సరే నీళ్లిస్తం. నంబాపూర్, నక్కలగండి, డిండి, కంబాలపల్లి మరేదైనా కావ చ్చు.. కిందికో మీదికో పడి సాగర్ నుంచి దేవరకొండకు మంచినీళ్లు తెచ్చినం. 10-15 రోజుల్లో ప్రతి ఇంటికి నల్లా పెట్టి నీళ్లిస్తం. దేవరకొండలో డిండి ద్వారా, ఎస్సెల్బీసీ పూర్తిచేసి నక్కలగండి, ఇంకా అనేక లిఫ్టుల ద్వారా రెండులక్షల ఎకరాలకు నీళ్లు తెచ్చేదాకా నేను ఊరుకోను. మళ్లీ ప్రభుత్వాన్ని గెలిపించండి.. దేవరకొండ కరువుమాపి చూపిస్త.

మోదీకి హిందూ ముస్లిం.. అనే బీమారీ
ముస్లిం సోదరులకు రిజర్వేషన్లు పెంచి, అప్పజెప్పినం. ప్రధాని మోదీ వద్దకు నేను 20-30 సార్లు పోయి చెప్పిన. 50 సార్లు ఉత్తరాలు రాసినం. కానీ ఆయన పెడచెవిన పెట్టినరు. ఆయనకో బీమారి ఉంది. హిందూ ముస్లిం.. తోక తొండ అనే బీమారి ఉంది. కేసీఆర్ ఏదైనా కొసదాకా కొట్లాడతడని మీకు తెలుసు. దేవరకొండ వేదికగా తెలంగాణలోని గిరిజనులు, ముస్లిం సోదరుల బిడ్డలకు హామీ ఇస్తున్నా.. ఈ రెండు జాతుల రిజర్వేషన్లు కేంద్రం మెడలు వంచి తెచ్చిస్త. అంత పెద్ద రాకాసులతోనే కొట్లాడి తెలంగాణ తెచ్చినం. ఇది పెద్ద సమస్య కాదు.

కేంద్ర రాజకీయాలు ప్రభావితం…
ఈ ఎన్నికల తర్వాత కేంద్ర రాజకీయాల్లో జోక్యం చేసుకుంట. ఢిల్లీ పోతా అని కాదు. ఇక్కడనే ఉంటూ కేంద్ర రాజకీయాలను ప్రభావితం చేస్త. ఇది రాష్ర్టాల హక్కు. ఏ రాష్ట్రంల ఏ ప్రజలున్నరో కేంద్రానికి ఏం తెలుసు? కొత్త రాష్ట్రంగ ఏర్పడిన తర్వాత మా గిరిజనుల జనాభా పెరిగింది. మరి మా రిజర్వేషన్లు మాకు ఇయ్యమంటె నీకేం రోగం? నీ ఆలోచనలకేమన్న చెదలు పట్టిందా? రాష్ర్టాల హక్కులు వాళ్లు ఈ విధంగా హరిస్తరు. దొందూ దొందే.. బీజేపీ, కాంగ్రెస్ ఇద్దరు అన్నదమ్ములే. ఫెడరల్ ఫ్రెంట్.. నాన్ బీజేపీ, నాన్ కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో రావడానికి ఈ ఎన్నికల తర్వాత ప్రయత్నం చేద్దాం. తద్వారా మన రిజర్వేషన్లు, రాష్ర్టాల హక్కులు కాపాడేందుకు ప్రయత్నం చేస్తే మన ఒక్కళ్లకే కాదు.. యావత్ దేశానికి న్యాయం జరుగుతది.

రవీంద్రకుమార్‌కు మంచి హోదా..
ఆనాడు ఉద్యమంలో రవీంద్రకుమార్ నా వెంట ఉండి.. ఈ నియోజకవర్గంలో జెండా ఎగురవేసి పనిచేసినాడు. తప్పకుండా మంచి న్యాయం జరుగుతది.. మంచి హోదా వస్తది. రవీంద్రకుమార్ కోరినట్టు దేవరకొండకు నీళ్లిచ్చే బాధ్యతను నేను తీసుకుంటున్న. కచ్చితంగా రెండు లక్షల ఎకరాల్లో నీళ్లు పారిచ్చి మళ్లా హెలికాప్టర్ల వచ్చి, పచ్చని పొలాలను చూస్త. నేను హెలికాప్టర్‌లో నుంచి చూసిన.. ఇది దేవరకొండ నియోజకవర్గ మీటింగు లెక్క లేదు.. నల్లగొండ జిల్లా సభలా ఉంది. ఈ సభలో 60వేల మందికంటే తక్కువలేరు. రవీంద్రకుమార్ గెలుపు ఖాయమైంది. అవతలివాడు ఎన్ని గజకర్ణ గోకర్ణ టక్కుటమార విద్యలుచేసినా లాభం లేదు. కాంగ్రెస్ నాయకుల కుట్రలు చెల్లవు అని చెంపమీద కొట్టడానికి దేవరకొండ సిద్ధంగా ఉంది. తెలంగాణ తెచ్చిన. కనీవినీ ఎరుగని రీతిలో పేదల సంక్షేమం చేసుకున్నం. మహిళలను, రైతులను, గిరిజనులను ఆదుకుంటున్నం. తండాలను పంచాయతీలు చేసుకున్నం. ఇంకా ముందుకు పురోగమించాలె. ఇంకా ఆర్థికంగా పెరగాలె… పెరగాలంటే మీ మద్దతు, మీ అండదండలు కావాలె. మీరు గోల్‌మాల్ కాకుండా ఏ పద్ధతిలో జవాబు చెప్పాల్నో చెప్పి రవీంద్రకుమార్‌ను పెద్ద మెజార్టీతో గెలిపించాలి.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.